Clik here to view.

ఐ పోలవరం, ఫిబ్రవరి 18: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో జరుగుతున్న అతిరుద్రం ఉత్కృష్ట మహాయాగంలో భాగంగా సోమవారం సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. యాగకర్తల్లో ముఖ్యుడు కేశాప్రగడ రాజశేఖరశర్మ రుష్యశృంగమహర్షి ప్రతిమను యాగశాల నుండి ఊరేగింపుగా రుద్రయంత్ర ప్రస్థానానికి తీసుకువచ్చారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రుష్యశృంగముని విగ్రహ ప్రతిష్ఠగావించి ఘటాభిషేకం క్రతువు నిర్వహించారు. ఎనిమిది దిక్కుల్లో ఉన్న భవదేవుడు, సర్వ, ఈశాన్య, పశుపతి, రుద్ర, ఉగ్ర, భామ, మహాదేవుళ్లను ఆవాహనచేసి లక్ష్మీశ్వర, యాగేశ్వర, కామేశ్వర దేవతలతో పాటు వీరేశ్వరస్వామిని మధ్యలో ఉంచి ఆవాహన చేశారు. మొత్తం 12క్రతువుల్లో ఒకొక్క భాగంలో 108 ఘటాల చొప్పున ఉంచి, పంచజన్య శాంతి హోమం జరిపారు. ఘటాలలో పంచామృతం, గో మయం, గో మూత్రం, గంగా, గోదావరి, కావేరీ, తుంగభద్ర, కృష్ణా నదులకు చెందిన పంచ గంగలు, ఆర్కిటిక్, అంటార్కిటికా ఫసిపిక్, హిందూ తదితర మహా సముద్ర జలాల్ని ఉంచారు. అష్టమృత్తికలు, వట్టివేళ్లు నవరత్నాలు, పంచ శకలాలు, భస్మం, అష్ట గంధములు, రెండు దర్భలతో కుచ్చా వేసి కలశ ద్రవ్యములు తయారుచేశారు. ప్రతీ ఘటంలో ఎండుకర్జూరం వినియోగించారు. సహస్ర ఘటాభిషేకం చేయటం వల్ల సమవృష్టి కలిగి పంటలు సమృద్దిగా పండి దేశం సస్యశ్యామలంగా ఉంటుందని యాగకర్తలు వివరించారు. పంచజన్య శాంతి మంత్ర పఠన సమయంలో గరుడపక్షి రుద్రయంత్ర ప్రస్థానంపై మూడుసార్లు ప్రదక్షిణలు చేయటంతో భక్తులు ఆనందంతో పరవశించిపోయారు. రుద్రయంత్ర ప్రస్థానం నుండి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి దేవాలయానికి శోభాయాన యాత్రగా సాగింది. 1296 ఘట్టాలతో స్వామి అమ్మవార్లకు నిర్వహించిన అభిషేకం తిలకించడానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. (చిత్రం) రుష్యశృంగుని విగ్రహం ముందు సహస్ర ఘటాలతో పూజలు నిర్వహిస్తున్న దృశ్యం. అతిరుద్రం మహాయాగ స్థలంలో బారులు తీరిన భక్తులు