కర్నూలు, ఫిబ్రవరి 19: అంధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో కామాంధుడికి జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. తన స్నేహితుడి సోదరి (19) పై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనలో జె.జమాల్‌కు జైలుశిక్ష పడింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన జమాల్ వలీ(30) 2011 మార్చి 3న తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఆ సమయానికి అంధురాలైన స్నేహితుడి సోదరి మాత్రమే ఇంట్లో ఉంది. ఇదే అదనుగా భావించిన జమాల్ తలుపులు వేసి ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు తలుపులు బద్దలు కొట్టి యువతిని కాపాడారు. జమాల్‌ను బంధించి పోలీసులకు అప్పగించారు. అంధురాలు ఎస్సీ కావడంలో నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టంతో పాటు అత్యాచారయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసులో వాదనలు విన్న ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి నిందితుడైన జమాల్‌కు జీవిత ఖైదు, రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున రామచంద్రారెడ్డి కేసు వాదించారు.
కామాంధుడికి జీవిత ఖైదు
english title:
life term
Date:
Wednesday, February 20, 2013