కర్నూలు , ఫిబ్రవరి 19: రెవెన్యూ అధికారులు కోనేరు రంగారా వు కమిటీ సిఫార్సులను పూర్తిస్థాయి లో అమలు చేయాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మంగళవారం కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, విఆర్‌ఓలకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోనేరు నివేదికలోని 104 సిఫార్సులలో ప్రభు త్వం 90 సిఫార్సులను నిర్ధేశించి అమ లు చేయుటకు సూచించిందన్నారు. ముఖ్యంగా రెవెన్యూ సిబ్బంది క్షేత్ర పర్యటనలు చేసి ప్రభుత్వ భూములు, ఇతర భూములపై పూర్తి వివరాలు సేకరించి కంప్యూటర్‌లో నమోదు చేయాలన్నారు. అలాగే అడంగల్‌లో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నమోదు చేయాలని తెలిపారు. అలాగే పేదలకు ఒక్కొకరికి రెండెకరాల ఒట్టి భూమి, ఎకరా తడి భూమి పంపిణీ చేయాలని తెలిపారు. ఈ సిఫార్సులను 4 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అడంగల్‌లో అటవీ భూమి, దేవదాయశాఖ భూమి, ప్రభుత్వ భూములు ఎక్కడ ఎంత ఉన్నాయో నివేదిక ఇవ్వాలన్నారు. అనంతరం జెసి కన్నబాబు మాట్లాడుతూ పేదలకు కమిటీ సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. రెవెన్యూ అధికారులు ఈ శిక్షణలో అన్ని అంశాలను విని అవగాహన పొంది బాధ్యతగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, కెఆర్‌సిపి అధికారి ఓబులేసు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
వీరబ్రహ్మేంద్ర స్వామిని కించపరిచే రచనలు తగదు
ఆత్మకూరు, ఫిబ్రవరి 19: హిందువులు ఆరాధించే దైవం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని కించ పరుస్తూ రాతలు రాసిన రచయిత వెంకట నర్సింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఆయనకు ఇచ్చిన డాక్టరేట్‌ను రద్దు చేయాలని బిసి సెల్ ఆత్మకూరు డివిజన్ ఉపాధ్యక్షుడు మోహనాచారి డిమాండ్ చేశారు. స్థానిక ఆర్‌అండ్‌బిఅతిథి గృహంలో మంగళవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆయన కుటుంబాన్ని కించపరుస్తూ వెంకట నర్సింహారెడ్డి రచించిన గ్రంథాన్ని వెంటనే నిషేధించాలని, లేనిపక్షంలో హిందువులంతా కలిసి ఉద్యమిస్తారన్నారు. 400 ఏళ్ల క్రితమే వీరబ్రహ్మేంద్రస్వామి సమసమాజం కోసం పాటుపడ్డారన్నారు. కులమతాలకు అతీతంగా అధ్వైత మత సాధనకు కృషి చేయాలన్నారు. ఇటీవల జరిగిన తెలుగు మహాసభల్లో ఆవిష్కరించిన వీర బ్రహ్మేంద్రస్వామి లఘు గ్రంథంలో పొందుపరిచిన కొన్ని విషయాలు భక్తులు మనోభావాలను దెబ్బతీసే విధంగా వున్నాయన్నారు. గ్రంథాన్ని రచించిన వెంకట నర్సింహారెడ్డి పత్రికాముఖంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అఖిల భారత విశ్వకర్మ పరిషత్ జిల్లా నాయకులు సహదేవాచారి, విశ్వరూపాచారి, చంద్రమోహనాచారి పాల్గొన్నారు.
ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయండి
కల్లూరు, ఫిబ్రవరి 19: ఆధార్ కార్డు ల ప్రక్రియ నిలిచిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని న గరంలో ఆధార్ కార్డుల కేంద్రాలు ఏర్పాటు చేయాలని బిజెపి జిల్లా కార్యదర్శి దుర్గస్వామి ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జాయింట్ కలెక్టర్ కన్నబాబును ఆయ న కార్యాలయంలో కలిసి ఆధార్ సెం టర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరం లో కేవలం 20 శాతం మందికి కూడా ఆధార్ కార్డులు అందలేదని, కొన్నిచోట్ల డబ్బు తీసుకుని ఆధార్ కార్డులు ఇచ్చారని కార్డుల కోసం డబ్బు చెల్లించిన పేదలు 80 శాతం వున్నారని వీరిని దృష్టిలో పెట్టుకుని ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. మార్చి లోపు అందరికీ ఆధార్ కార్డులు అందజేస్తామని ప్రభుత్వం చెప్పిందని, అయితే గడువు ముగుస్తున్నా జిల్లా పౌర సరఫరా, రెవెన్యూ అధికారులు ఆధార్ ప్రక్రియపై చలనం లేకపోవడం బాధ్యతారహితమేనన్నారు. ఇకపోతే ఆధార్ బదులు ఎన్‌పిఆర్ తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నా ఈ ప్రాజెక్టు ఏ ప్రభుత్వ శాఖ ద్వారా అమలవుతుందో తెలియక ప్రజలు అయోమయ స్థితిలో వున్నారన్నారు. ఆధార్, ఎన్‌పిఆర్ గు రించి ప్రచార సాధనాల ద్వారా ముమ్మ ర ప్రచారం చేయాలని కోరారు. జెసిని కలిసిన వారిలో బిజెపి జిల్లా ప్ర ధాన కార్యదర్శి కాలింగ నర్సింహవర్మ, కోశాధికారి ఉమామహేశ్వరప్ప, మాజీ కార్పొరేటర్ రంగస్వామి ఉన్నారు.
పోలీసుల అదుపులో అనుమానితులు
* నాటు తుపాకులు ఉన్నట్లు సమాచారం
మహానంది, ఫిబ్రవరి 19:మహానంది మండలం బసాపురం, గాజులపల్లె గ్రామాలకు చెందిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. వీరి వద్ద నాటు తుపాకులు ఉన్నట్లు అనుమానించి కర్నూలు ఫ్యాక్షన్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని మహానంది పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నట్లు సమాచారం.
అక్రమాలకు పాల్పడితే చర్యలు..
* రేషన్ డీలర్లకు కలెక్టర్ హెచ్చరిక
కర్నూలు, ఫిబ్రవరి 19 : ప్రభుత్వ చౌక దుకాణాల డీలర్లు నిత్యావసరాలను సక్రమంగా పంపిణీ చేస్తే సన్మానిస్తామని, పంపిణీలో అక్రమాలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో మంగళవారం జిల్లా ఆహార సలహా సంఘం సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు చౌకదుకాణాల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం, చక్కెర, కందిపప్పు, ఆయిల్, గోధుమలు తదితరాలను చౌక డిపోల వారీగా అలాట్‌మెంట్ ఎంత ఇస్తున్నామనే వివరాలను ఆహార సలహా కమీటి సభ్యులకు అందజేస్తామన్నారు. అలాగే జిల్లా, డివిజన్, మండల, గ్రామ పంచాయతీల్లో కూడా ఏ షాప్‌కు ఎంత సరుకులు అలాట్ చేస్తున్న వివరాలను గ్రామ పంచాయతీతో పాటు మండల అధికారుల నోటీసు బోర్డులో ఏర్పటు చేయాలన్నారు. అలాగే డీలర్లు కల్తీ, ధర, తూకాలు తదితర విషయాలపై పర్యవేక్షణతో పాటు 2 నెలలకు ఒకసారి రెండవ సోమవారం జిల్లా ఆహార సలహా కమిటీ సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకుని ప్రజలకు సరుకులు సక్రమంగా అందేలా పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు సరుకులు అమ్మే చౌక డీలర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని, ఓర్వకల్లు మండలం పాలకొల్లు గ్రామ డీలర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, జెసిలను కోరారు. సస్పెండ్ అయిన డీలర్ స్టాకును మరో డీలర్‌కు ఇచ్చేటప్పుడు ఊరులో లేని వాళ్లు, చనిపోయిన వారి కార్డుల రేషన్, బోగస్ కార్డులు ఎన్ని ఉన్నాయనే విషయాలపై పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. గడివేముల మండలం కరిమద్ది గ్రామంలో డీలర్ దగ్గర వున్న బోగస్ కార్డులు పరిశీలించి అర్హులకు ఇవ్వాలని, చౌకడిలనులు ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేయాలని కోరారు. జాయింట్ కలెక్టర్ కన్నబాబు మాట్లాడుతూ చౌకడిపోల డీలర్లపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తేవాటికి ప్రాధాన్యత ఇచ్చి పారదర్శకంగా విచారణ చేసి డీలర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. మీసేవ కేంద్రాల ద్వారా రాబోయేకాలంలో 160 సర్వీసు సేవలు ప్రజలకు అందే అవకాశం ఉందని, అక్రమాలకు పాల్పడే మీ సేవ నిర్వాహకుల 79 సెంటర్లకు షోకాజ్ ఇచ్చి 28 సెంటర్లను రద్దు చేశామన్నారు. సమావేశంలో సివిల్ సప్లయ్ డిఎం వెంకటకృష్ణ, జడ్పీ సిఇఓ సూర్యప్రకాష్, డిఎస్‌ఓ బహుదూర్‌సాహెబ్, సిపిఐ నాయకులు జగన్నాథం, రసూల్, బిజెపి నేతలు నాగరాజు, వన్నూరుబాషా, సభ్యులు పాల్గొన్నారు.