కర్నూలు, ఫిబ్రవరి 19: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎవరి పరిధిలో వారు ప్రణాళిక రుపొందించుకోవాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక వ్యాస్ ఆడిటోరియంలో మంగళవారం ఎస్పీ పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న మట్కా, పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాల నివారణకై చర్యలు తీసుకోవాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో వున్న కేసులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రాబోతున్నందున స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా వుంచాలన్నారు. కిరాయి హంతకులు, బాంబు తయారీదారులు, రౌడీ షీటర్లను గుర్తించి కౌనె్సలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సమస్య ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. అలాగే ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి సమాచారం అందించాలని సూచించారు. పోలీసు స్టేషన్ల పరిధిలో ఆయుధాల అనుమతి వున్న వ్యక్తులను విచారణ చేయాలని, అనుమానం వున్న వ్యక్తుల నుంచి తుపాకులు స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఫ్యాక్షన్, సమస్యత్మాక గ్రామాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి గ్రామాల్లో ఇరువర్గాల వారికి కౌనె్సలింగ్ నిర్వహించాలన్నారు. జిల్లాలోని మద్యం బెల్టు షాపులను గుర్తించి వాటిని మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం నగరంలో ఆస్తి తగాదా కేసులు ఎక్కువైనందున వాటిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే చోరీలు జరగకుండా గట్టి నిఘా వుంచాలన్నారు. సమావేశంలో ఎఎస్పీ వెంకటరత్నం, ఆదోని ఎఎస్పీ శిమోషి, డీఎస్పీలు అమర్‌నాథ్‌నాయుడు, రామకృష్ణ, పిఎన్‌బాబు, తిరుమలేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసులు, సిఐలు పాల్గొన్నారు.
మహిళల రక్షణ పొదుపులక్ష్మి సంఘాలదే..
బనగానపల్లె, ఫిబ్రవరి 19: దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని, భ్రూణ హత్యల శాతం కూడా పెరిగిపోతుందని వీటిని నివారించేందుకు గ్రామ స్థాయిలోనే ‘నా గ్రామం- నా భద్రత’ పేరిట వారి రక్షణ బాధ్యత గ్రామసంఘాలకే అప్పగించనున్నట్లు ఈఓఆర్‌డి మధుసూధనరెడ్డి తెలిపారు. స్థానిక పొదుపు భవనంలో మంగళవారం పొదుపులక్ష్మీ గ్రూపుల మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబాల్లో జరిగే హింసను ఆపివేయడం, సమాజంలో మార్పు తీసుకురావడం, మహిళలకు భద్రత కల్పించడం వంటి అంశాలే ఈ కార్యక్రమం లక్ష్యం అని తెలిపారు. చిన్న సంఘాల్లో 15 నిమిషాలు, గ్రామ సంఘాల్లో 45 నిమిషాలు, మండల సమాఖ్య సంఘాల్లో ఒక గంట సమయం మహిళలపై జరుగుతున్న హింసలు, వాటిని ఆపేందుకు చేస్తున్న కృషి గురించి చర్చించాలన్నారు. ప్రతి సమావేశంలో పొదుపులక్ష్మి మహిళలు తొలుత మహిళల రక్షణ గురించే చర్చించాలన్నారు. ఆడపిల్లకు ధైర్యం చెప్పడం, కట్నాల సంస్కృతికి చరమగీతం పాడడం, లిం గవివక్ష చూపరాదని, కుటుంబ సభ్యు లు తప్పు చేస్తే వాటిని సమర్థించరాదని, గ్రామాల్లో మహిళలు ఎదురయ్యే సమస్యలను గ్రామ పొదుపులక్ష్మి సం ఘాలు తెలుసుకుని బాధితులకు సహకారం అందించాలని సూచించారు. అవసరమైతే పోలీసు రక్షణ కూడా ఇస్తారని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో జరిగే సమావేశాల్లో ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు అందరూ పాల్గొనే లా చూడాలన్నారు. సమావేశంలో ఎపిఎంలు వసంతకుమారి, శ్రీనివాసులు, మండల సమాఖ్య అధ్యక్షులు జుబేదాబేగం, కార్యదర్శి ఉశేన్‌బీ, సిసి లు, హైమవతి, జమాలమ్మ పాల్గొన్నారు.