ఒంగోలు, ఫిబ్రవరి 20: జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డిసిఎంఎస్) అధ్యక్షుడిగా బీరం వెంకటేశ్వరరెడ్డి ఏకగ్రీవం ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎన్ ఇందిరాదేవి బుధవారం ప్రకటించారు. స్థానిక డిసిఎంఎస్ కార్యాలయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నామినేషన్ల ప్రక్రియ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాగా 11 గంటలకు బీరం వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షుడిగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్‌ను బలపరుస్తూ డైరక్టర్ దర్శి రామకృష్ణారావు సంతకం చేశారు. అధ్యక్ష పదవికి వేరేవారి ప్రతిపాదనలను రాకపోవటంతో బీరంను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిసిఎంఎస్ ఉపాధ్యక్ష పదవికి కనకం శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేయగా డైరెక్టర్ గంగవరపుమీరమ్మ ప్రతిపాదించగా మరో డైరక్టర్ శింగేటి నాగులు బలపర్చారు. ఉపాధ్యక్ష పదవికి ఇతరులెవరి ప్రతిపాదనలు రాకపోవటంతో ఉపాధ్యక్షుడిగా కనకం శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా సెంగేటి నాగులు, గంగవరపు మీరమ్మ, దర్శి రామకృష్ణారావు, మాగులూరి శ్రీనివాసరావులు ఉన్నారు. ముందుగా కో ఆప్షన్ సభ్యులుగా సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని ఈదుమూడి సొసైటీ అధ్యక్షుడిగా సెంగెటి నాగులును నియమించారు. ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల చేత ఎన్నికల అధికారి ఎన్ ఇందిరాదేవి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది నాగేశ్వరావు, డి వేణుగోపాల్, ఎం నరేష్‌కుమార్, అద్దంకి మాజీ శాసనసభ్యుడు జాగర్లమూడి రాఘవరావు, కనిగిరి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్‌గా బీరం వెంకటేశ్వరరెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా కనిగిరి, సంతనూతలపాడు, చీరాల శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, బిఎన్ విజయకుమార్, ఆమంచి కృష్ణమోహన్ తదితరులు వెంకటేశ్వరరెడ్డికి అభినందనలు తెలిపారు.
జిల్లాలో కార్మిక, ఉద్యోగుల
సమ్మె విజయవంతం
స్తంభించిన బ్యాంకు, ఇన్సూరెన్స్ కార్యకలాపాలు
ఇబ్బందులుపడ్డ ఖాతాదారులు
రోడ్లెక్కని 167 ఆర్టీసీ బస్సులు
కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఫిబ్రవరి 20: దేశవ్యాప్తసమ్మెలో భాగంగా జిల్లాలో కార్మికులు, ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. జిల్లాలో కార్మికులు, ఉద్యోగులు నిర్వహించిన సమ్మె బుధవారం విజయవంతమైంది. జిల్లావ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగులు ఎక్కడికక్కడ ప్రదర్శనలు నిర్వహించి ప్రభుత్వ విధానాలను నిరసించారు. ప్రధానంగా బ్యాంకు, ఇన్సూరెన్స్, పోస్టల్ ఉద్యోగుల కార్యకలాపాలు స్తంభించటంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులు లేక బ్యాంకు, ఇన్సూరెన్స్ కార్యాలయాలు వెలవెలబోయాయి. జిల్లాకేంద్రమైన కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ఉద్యోగులు సమ్మెలో పాల్గొనటంతో కార్యక్రమాలు స్తంభించిపోయాయి. జిల్లావ్యాప్తంగా 636 ఆర్‌టిసి బస్సులు నడవాల్సి ఉండగా 469 బస్సులు నడిచాయి. 167 బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. అసలే కష్టాల కడలిలో ఉన్న ఆర్‌టిసికి ఈ సమ్మె పెనుభారం మోపింది. ఆర్‌టిసి బస్సులు సక్రమంగా రాకపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి శ్రీనివాసులు, చీకటి శ్రీనివాసులు, ఎఐటియుసి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌డి సర్దార్, రవీంద్రానాధ్, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు రామస్వామి తదితరులు మాట్లాడుతూ పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగుపర్చి ఆహార భద్రతకు గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి, ఉద్యోగావకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్మిక, ఉద్యోగ వర్గాలకు, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర సాంఘిక భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కాంట్రాక్టుకార్మికులను రెగ్యులర్ చేయాలని, జీతాల చెల్లింపుల ఎగవేతల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్మికుల పిఎఫ్‌పై వడ్డీరేటును 12 శాతానికి తగ్గకుండా ఇవ్వాలని, పిఎఫ్, ఇఎస్‌ఐలను ఆంక్షలు లేకుండా మెరుగుపర్చాలని వారు కోరారు. మహిళా కార్మికులపై లైంగిక వేధింపుల నివారణకు ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రప్రభుత్వం పెంచిన విద్యుత్‌చార్జీలను వెంటనే తగ్గించాలని కోరారు. మునిసిపల్ ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులందరికి కనీస వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలని వారు కోరారు. అన్నివర్గాల ప్రజల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే నిరవధిక ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. పర్మినెంట్ కార్మికుల స్థానంలో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ను అమలుచేస్తున్నారని వారు ఆందోళన వ్యక్తంచేశారు. శాసనసభ్యులు, ఎంపిలు ఐదు సంవత్సరాలు పనిచేసి జీవింతాంతం పెన్షన్ పొందుతున్నారని, కాని 25 నుండి 30 సంవత్సరాలు పనిచేసిన ఉద్యోగులు, కార్మికులకు పెన్షన్ సౌకర్యాన్ని రద్దుచేశారని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్, హెచ్‌ఎంఎస్, టిఎన్‌టియుసి, ఎల్‌ఐసి, ఆర్‌టిసి, అంగన్‌వాడీ, మెడికల్ రిప్రంజేటివ్, బిఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్, జిఐసి, మునిసిపాలిటీ కార్మిక సంఘాల నేతలు సిహెచ్ శోభన్‌బాబు, నరసింహం, బి కోటేశ్వరరావు, బాలకోటయ్య, బి వెంకయ్య, మల్లికార్జున్, కె వెంకటేశ్వర్లు, మోహన్‌రావు, రాంబాబు, కిశోర్, శేషారావు, అయ్యపరెడ్డి, బివి రావు తదితరులు పాల్గొన్నారు.
పొగాకు విక్రయాలను సజావుగా సాగించండి
బోర్డు ఆర్‌ఎం మిత్ర సూచన
పొదిలి, ఫిబ్రవరి 20: పొగాకు విక్రయాలను సజావుగా సాగించేందుకు కృషి చేయాలని గుంటూరు పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ మిత్ర కోరారు. బుధవారం స్థానిక పొగాకు బోర్డులో 1, 2 వేలం కేంద్రాలకు చెందిన అధికారులు రైతుల సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మిత్ర మాట్లాడుతూ పొదిలి 1, 2 ప్లాట్‌ఫారాలలో మొత్తం 2,070 బ్యారన్‌లలో 8,000 మందికి పైగా రైతులు పొగాకు పండించారన్నారు. ఇతర ప్రాంతాలకంటే పొదిలి ప్రాంతంలో పొగాకు ఉత్పత్తి తక్కువగా ఉంటుందన్నారు. ప్రకృతి ప్రతికూల వాతావరణంతోపాటు వర్షాభావం కూడా కారణంగా ఉంటుందన్నారు. ఇతర ప్రాంతాలో బ్యారన్‌కు 6 క్వింటాళ్ళ పొగాకు దిగుబడి అవుతుందని, పొదిలి ప్రాతంలో మాత్రం 4 క్వింటాళ్ళ దిగుబడి కంటే ఎక్కువగా రావడం లేదన్నారు. ఏదిఏమైన పొదిలి ప్రాంత పొగాకు నాణ్యతాపరంగా మంచి పేరు ఉందని అయన తెలిపారు. ఇటువంటి పరిస్థితులను గుర్తుంచుకొని వ్యాపారులు కూడా పొగాకు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 28న కందుకూరు వేలం కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తున్నామన్నారు. కర్ణాటకలో 93 మిలియన్ల పొగాకు విక్రయించాల్సి ఉండగా ఇంతవరకు 72 మిలియన్ల పొగాకు విక్రయాలు జరిగాయన్నారు. వేలం నిర్వహణలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఉండేందుకు ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా విక్రయాల వేలం నిర్వహణ జరుగుతుందన్నారు. కర్ణాటకలో ఈ విధానాన్ని ప్రశేశపెట్టామని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలం నిర్వహణాధికారులు ఎన్ బాబూరావు, సుధాకర్‌లతోపాటు పొగాకు రైతుల సంఘం నాయకులు సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు గునుపూడి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి
విద్యార్థులకు కలెక్టర్ ఉద్బోధ
సంతనూతలపాడు, ఫిబ్రవరి 20: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు తొలిమెట్టు పదోతరగతేనని జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం మండలంలోని ఎండ్లూరుడొంక వద్దగల ఎస్‌ఎస్‌ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో వచ్చే నెలలో పదవ తరగతి పరీక్షలు రాయనున్న సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల హాస్టల్ విద్యార్థుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాడు అంబేద్కర్ చదువుకునేటప్పడు ఇన్ని వసతులు లేక ఎన్నో వ్యయప్రయాసలకోర్చి అత్యున్నత చదువును చదివి ఉన్నతస్థాయికి ఎదిగారన్నారు. అంబేద్కర్ కల్పించిన హక్కులను అందిపుచ్చుకొని మీరంతా రాబోవు రోజుల్లో మీ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలన్నారు. విద్యార్థులకు 10వ తరగతి కీలకమైనదని, మీరంతా బాగా చదువుకొని మంచి మార్కులు సాధించి తద్వారా ఉన్నత చదువులు చదువుకొని సమాజానికి, తల్లిదండ్రులకు మంచి పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన కోరారు. పదవ తరగతి పరీక్షల సమయం ఆసన్నమవుతున్నందున సులభమైన రీతిలో ఎలా చదువుకోవాలనే అంశాలను విద్యార్థులకు వివరించే సమయాభావం తక్కువగా ఉన్నందున ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని కోరారు. కళాశాల చైర్మన్ వై రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు అనేక వసతులు కల్పించిందన్నారు. గతంలో సౌకర్యాలు లేక చదువుకోవాలంటే అనేక అవస్థలు పడిన సందర్భాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కాని నేడు ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకోసం అనేక సదుపాయాలు కల్పిస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకొని భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ అవగాహన సదస్సుకు దాదాపు 550 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ ఎస్‌ఎం మురళి, స్థానిక తహశీల్దార్ ఎం గాంధీ, మండల విద్యాశాఖాధికారి ఎంసిహెచ్ వస్త్రం నాయక్, వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
16మంది జూనియర్ లైన్‌మెన్లకు షోకాజ్ నోటీసులు
మార్కాపురం, ఫిబ్రవరి 20: విద్యుత్‌శాఖ నిర్వహించిన ఇంటర్వ్యూలలో ఉద్యోగం పొంది విధులు నిర్వర్తిస్తున్న 16మంది జూనియర్ లైన్‌మేన్లకు న్యాయస్థానం ఆదేశాలతో షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ప్రధానంగా ఇంటర్వ్యూలు నిర్వహించిన సమయంలో ఉన్నఖాళీల కన్నా అదనంగా పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని, అదేవిధంగా తాత్కాలిక ఉద్యో