ఖమ్మం, ఫిబ్రవరి 20: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన మువ్వా విజయబాబు ఎన్నికయ్యారు. బుధవారం ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీకే చెందిన తుళ్ళూరి బ్రహ్మయ్యపై ఏడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. 21మంది డిసిసిబి డైరెక్టర్లలో తెలుగుదేశం, సిపిఐ కూటమికి 15, కాంగ్రెస్‌కు ఆరుగురు డైరెక్టర్లు ఉన్నారు. ఉదయం కో ఆప్షన్ ఎన్నికలో సిపిఐకి చెందిన బోయినపల్లి వెంకటరమణ, కందుల ప్రమీల, కాంగ్రెస్‌కు చెందిన నూకల మాణిక్యం, ఆంతోటి విజయలు పోటీపడగా, టిడిపి, సిపిఐ బలపర్చిన వెంకటరమణ, ప్రమీలకు 13ఓట్లు రాగా,కాంగ్రెస్ అభ్యర్థులైన మాణిక్యం, విజయలకు 6ఓట్లు వచ్చాయి. దీంతో వెంకటరమణయ్య, ప్రమీలలను గెలిచినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఈసాల నాగేశ్వరరావు, టిడిపి అభ్యర్థులుగా మువ్వా విజయబాబు, తుళ్ళూరి బ్రహ్మయ్యలు అధ్యక్ష స్థానానికి, ఉపాధ్యక్ష స్థానానికి బాగం హేమంతరావు, మేకల మల్లిబాబులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య బోడేపూడి రమేష్‌బాబు నామినేషన్ వేయకుండా వెళ్ళిపోయారు. టిడిపి అధిష్ఠానం ముందుగా ముగ్గురిని నామినేషన్లు వేయాలని సూచించగా రమేష్ బాబు తన పేరును నేరుగా సూచించలేదనే సాకుతో నామినేషన్ వేయలేదు. నామినేషన్ల ఉపసంహరణ సమయానికి టిడిపి నాయకుడైన తుళ్ళూరి బ్రహ్మయ్యను నామినేషన్ ఉపసంహరించుకోవాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించినప్పటికీ ఆయన నామినేషన్ ఉపసంహరించుకోకుండా కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఈసాల నాగేశ్వరరావు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీ అనివార్యమైంది. అయితే ఇరువురు టిడిపి అభ్యర్థుల మధ్య జరిగిన పోటీలో టిడిపి అధికారిక అభ్యర్థి అయిన మువ్వా విజయబాబు కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉన్న తుళ్ళూరి బ్రహ్మయ్యపై 14-7ఓట్ల తేడాతో విజయం సాధించారు. టిడిపి, సిపిఐ కూటమి నుంచి ఒక్క ఓటు కూడా క్రాస్ కాకపోవటం విశేషం. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి కూడా ఒక్క ఓటు కూడా టిడిపి అభ్యర్థికి పడలేదు. అయితే పోటీ నుంచి విరమించుకొని వెళ్ళిపోయిన బోడేపూడి రమేష్‌బాబు సైతం ఆఖరి నిమిషంలోవచ్చి పార్టీ అభ్యర్థికే ఓటు వేశారు. మరో వైపు ఉపాధ్యక్ష స్థానానికి సైతం టిడిపి, సిపిఐ బలపర్చిన బాగం హేమంతరావుకు 14ఓట్లు రాగా,కాంగ్రెస్ అభ్యర్థి మల్లిబాబుకు 7ఓట్లు వచ్చాయి. దీంతో విజయబాబు, బాగం హేమంతరావులు విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
పార్టీ నిర్ణయమే శిరోధార్యం
డిసిసిబి అధ్యక్షస్థానానానికి పార్టీ నిర్ణయించిన ప్రకారమే పార్టీ అభ్యర్థిని గెలిపించామని, తాను పదవుల కోసం పోటీపడలేదని టిడిపికి చెందిన బోడేపూడి రమేష్‌బాబు ప్రకటించారు. నామినేషన్ వేసేందుకు సిద్ధమైన ఆయన అధిష్ఠానం తన పేరు నేరుగా సూచించకపోవటంతో నిరాశకు గురై బయటకు వెళ్ళిపోయారు. ఆయన ఓటు వేస్తారా అనే అంశంపై కూడా తీవ్ర చర్చ జరిగింది. అయితే ఆయన పార్టీ నిర్ణయమే శిరోధార్యమంటూ పార్టీ అభ్యర్థికి ఓటు వేయటం విశేషం. తాను పార్టీని మారే ప్రసక్తే లేదని, తమ నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగానే పని చేస్తామని స్పష్టం చేశారు. కొంతమంది జిల్లా నాయకులు చంద్రబాబుకు తప్పుడు సూచనలు చేస్తున్నారని, దాని వల్ల పార్టీ నష్టపోతుందని, దానిని గమనించి వాస్తవిక పరిస్థితిని అధినేతకు వివరించాలని సూచించారు.
కార్పొరేటు విధానాలకు నిరసన : బ్రహ్మయ్య
తెలుగుదేశం పార్టీ కార్పొరేటు విధానాలకు నిరసన వ్యక్తం చేస్తూ తాను నామినేషన్ వేసినట్లు తుళ్ళూరి బ్రహ్మయ్య తెలిపారు. టిడిపి డైరెక్టర్లు తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ వారితో ప్రమాణం చేయించి మానసిక వత్తిడికి గురి చేసి గెలిచారని, తెలుగుదేశంలో డబ్బున్న వారికే ప్రాధాన్యతనిస్తున్నారని, పార్టీ నాయకులు పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తిస్తే మంచిదని విజ్ఞప్తి చేశారు. తాను తన అనుయాయులతో మాట్లాడిన తర్వాతే తన భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తానని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన కొందరు టిడిపి నాయకులు తప్పుడు విధానాలు అవలంబిస్తున్నారని, పార్టీ కార్యకర్తలకు అది తప్పుడు సంకేతాలు ఇస్తుందని పేర్కొన్నారు. టిడిపి ప్రస్తుతం అచేతన స్థితిలో ఉందని, కష్టపడేవారిని గుర్తించాలని పేర్కొన్నారు. నాయకుల తప్పుడు విధానాల వల్లే ఈ పరిస్థితి నెలకొంటోందని స్పష్టం చేశారు. వాస్తవంగా తనకు మద్దతు ఉన్నప్పటికీ డైరెక్టర్లను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు వేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
భారీ ప్రదర్శన
తెలుగుదేశం, సిపిఐ కూటమి డిసిసిబి, డిసిఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను గెలుచుకోవటంతో ఇరుపార్టీల నాయుకలు,కార్యకర్తలు భారీ ప్రదర్శనను నిర్వహించారు. డిసిసిబి కార్యాలయం నుంచి ఆయా పార్టీల కార్యాలయాల వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి, సిపిఐ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కూనంనేని సాంబశివరావులు మాట్లాడుతూ ప్రజలే తమను గెలిపించారని, వారి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతామన్నారు. దేశానికి వెన్నుముకలా ఉన్న రైతును అభివృద్ధి పథంలో పయనింపచేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.
సమ్మె ప్రశాంతం
ఖానాపురం హవేలి, ఫిబ్రవరి 20: కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కార్మికులకు కనీస వేతనాలను ఇవ్వాలని కోరుతూ తలపెట్టిన సార్వత్రిక సమ్మె బుధవారం ఖమ్మంలో ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం నగరంలో ఇఫ్టూ, సిఐటియు, టిఎన్‌టియుసి, ఐఎన్‌టియుసి, ఏఐటియుసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీగా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, అనుబంధ కార్మిక సంఘాల నాయకులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, బాగం హేమంతరావు, పోతినేని సుదర్శన్, పోటు రంగారావు, శింగు నర్సింహారావు, కల్యాణం వెంకటేశ్వరరావు, ఎజె రమేష్, జి రామయ్య, సురేష్, ఆడెపు రామారావు తదితరులు మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవటం పట్లనే తాము ఈ సమ్మెకు పూనుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ప్రపంచీకరణ విధానాలను నిరసిస్తున్నట్లు తెలిపారు. ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయని, కార్మికులకు మాత్రం కనీస స్థాయిలో వేతనాలు ఉండటం లేదన్నారు. కార్మికులు కేవలం ఉత్పత్తిలో భాగస్వాములు కావటమే తప్ప హక్కులు, సౌకర్యాలు అడగవద్దంటూ ప్రభుత్వం, యజమాన్యాలు పేర్కొంటున్నాయన్నారు. కార్మిక వర్గం సృష్టించిన సంపద దేశంలోని కొద్దిమంది చేతుల్లోనే ఉందన్నారు. గత ఆరు నెలల క్రితమే సమ్మెలోకి వెళ్ళనున్నట్లు ప్రకటించినప్పటికీ ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆరోపించారు. సమ్మె ఏర్పాట్లు చేసిన తర్వాత రెండు రోజుల క్రితం చర్చలకు పిలిచి పరిశీలిస్తామనటం సమ్మెను నీరుగార్చటానికే తప్ప సమస్యలు పరిష్కరించేందుకు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేకుంటే రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటివ్ యూనియన్ ఆధ్వర్యంలో సైతం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మురళీ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులకు సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పట్టణ ప్రింటింగ్ ప్రెస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీగా ప్రదర్శనలు నిర్వహించి గురువారం జరిగే సమ్మెను కూడా విజయవంతం చేయాలని కోరారు.
కాగా డివైఎఫ్‌ఐ, పివైఎల్, ఏఐవైఎఫ్ సంఘాల నాయకులు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్, టిఎన్జీవోస్ నాయకులు నరేంద్ర, వల్లోజీ శ్రీను, సాగర్, రమణయ్య, నాగండ్ల శ్రీను, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు మనోహర్, ఉపేందర్ తదితరులు సమ్మెకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో కల్యాణం వెంకటేశ్వరరావు, పోటు ప్రసాద్, విష్ణు, రంగయ్య, గిరి, అబ్రహం, వెంకటేశ్వర్లు, భుక్యా శ్రీను, మేకల శ్రీను, సీతా మహాలక్ష్మి, జానయ్య, చంద్రశేఖర్, జనార్థన్, నర్సింహారావు, రాజు, వెంకటేశ్వర్లు, సాంబశివరావు, మాధవరావు, రమేష్, సుధాకర్, శ్యామ్‌సుందర్‌రావు, పారుపల్లి వెంకటేశ్వరరావు, పడిగల నాగేశ్వరరావు, నర్సింహారావు, నెమలి కిషోర్, బొడ్డు రవి, నగేష్, ఉపేంద్రాచారి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మెకు మద్దతుగా బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు, ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రదర్శనలు నిర్వహించారు. సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఉపేందర్, సిహెచ్ రమేష్, ప్రదీప్, విప్లవ్‌కుమార్, శివరామకృష్ణ, మన్మథరావులు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచటంలో ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. రానున్న బడ్జెట్‌లో కార్మికుల అవసరాలకు తగిన విధంగా నిధులను పెంచాలని కోరారు. సమస్యలను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో జరిగే ఉద్యమాలకు సంపూర్థ మద్దతునిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సైదులు, లక్ష్మణ్, సలిత, రజిని, కిరణ్, వంశీ, వౌనిక, రవీందర్, శ్రీను, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఏకగ్రీవంగా డిసిఎంఎస్ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక
ఖమ్మం(గాంధీచౌక్), ఏప్రిల్ 20: డిసిఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైంది. బుధవారం డిసిఎంఎస్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన పగ్గిడి అంజయ్య, బోయినపల్లి సుధాకర్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో బుధవారం స్థానిక డిసిఎంఎస్ కార్యాలయంలో ఎన్నికల అధికారి క్రిష్టల్‌బెల్ సమక్షంలో నామినేషన్లు దాఖలు చేయగా, టిడిపికి చెందిన పగ్గిడి అంజయ్యను డిసిఎంఎస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా టిడిపి డైరెక్టర్‌గా ఉన్న బోయినపల్లి సుధాకర్‌ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తామన్నారు. మధిరలో ఉన్న స్థలాన్ని విక్రయించి డిసిఎంఎస్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, అదే విధంగా రేడియేషన్ ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేకల సంగయ్య, మదార్ సాహెబ్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనకు
కార్మికులు సహకరించాలి
కొత్తగూడెం, ఫిబ్రవరి 20: పెరుగుతున్న బొగ్గు అవసరాల నేపథ్యంలో సింగరేణి సంస్థ నిర్ధేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడం కోసం కార్మికులు సహకరించాలని సింగరేణి జిఎం (పర్సనల్) ఇవి పురుషోత్తం విజ్ఞప్తి చేశారు. బుధవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మె మొదటిరోజు పాక్షికంగా జరిగినట్లు చెప్పారు. బుధవారం మొదటిషిఫ్ట్ హాజరు 25 శాతం ఉందని తెలిపారు. రెండవ, రాత్రి షిఫ్ట్‌లకు హాజరుశాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రతిరోజు 1.80 నుండి 2 లక్షల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి చేస్తామని, సమ్మె పాక్షికంగా జరుగుతున్న కారణంగా సుమారు 60వేల టన్నుల వరకు బుధవారం రాత్రి షిఫ్ట్ ముగిసే సమయానికి చేసే అవకాశం ఉందని తెలిపారు. ఓపెన్‌కాస్ట్ గనుల్లో ఉత్పత్తి కొంతమేరకు జరుగుతుందని తెలిపారు. ఇతర ప్రభుత్వరంగ సంస్థలైన కోలిండియాలో 50శాతం, ఆర్టీసిలో 80శాతం, బిహెచ్‌ఇఎల్, ఎన్‌ఎండిసి, ఎపిజెన్‌కో తదితర సంస్థలలో హాజరుశాతం మెరుగ్గా ఉందని తెలిపారు. పారిశ్రామిక రంగంలో బొగ్గు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా కార్మికులు తమ నిరసన కార్యక్రమాలు నిర్వహించి సహకరించాలని కోరారు. విలేఖరుల సమావేశంలో ఎజిఎం (పర్సనల్) వై వెంకటేశ్వరరావు, ఎజిఎం (వెల్ఫేర్) బాబుసత్యసాగర్, డివైపిఎం బుచ్చిప్రసాద్, పిఆర్‌ఎ కెవి రమణ తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో ఛత్తీస్‌గఢ్ ఆదివాసీలు
చర్ల, ఫిబ్రవరి 20: చర్ల పోలీసులు 13 మంది గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు చత్తీస్‌గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లా కృష్టారం పోలీసు స్టేషన్ పరిధిలోని ఎలకలగూడెం గ్రామానికి చెందిన 13మంది ఆదివాసీలు చర్లకు వచ్చారు. స్థానిక స్టేట్ బ్యాంక్‌లో వారికి వచ్చిన తునికాకు బోనస్ డబ్బులు రూ. 70వేల డ్రా చేసుకున్నారు. ఈ క్రమంలో చర్ల పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చర్లకు వచ్చిన తమ బంధువులు రెండు రోజులు అవుతున్నా ఇంటికి రాకపోవటంతో ఎలకలగూడెం ఆదివాసీలు కొందరు బుధవారం చర్లకు వచ్చారు. స్టేషన్‌కు వచ్చి సిబ్బందిని అడుగగా సిఐ, ఎస్‌ఐలు అందుబాటులో లేరని, వచ్చిన తరువాత విచారించి విడిచిపెడతామని సమాధానం ఇచ్చారు. మరికొంత మంది ఆదివాసీలను దుమ్ముగూడెం ఎస్‌ఐ విడిచిపెట్టమని చెబితే విడిపిస్తామని పలువురు పోలీసులు తమతో చెప్పారని ఆదివాసీలు విలేఖరులకు తెలిపారు. పోలీసుల అదుపులో వున్న వారిలో 16 ఏళ్ల మైనర్ బాలుడుతోపాటు తునికాక కార్మికులు 12 మంది వున్నారని తెలిపారు.
నాటకీయంగా సాగిన డిసిసిబి ఎన్నికలు
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, ఫిబ్రవరి 20: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎన్నికలు నాటకీయ పరిణామాల మధ్య ఉత్కంఠభరితంగా సాగాయి. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీ జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ మెజార్టీ సాధించినప్పటికీ పార్టీ అభ్యర్థులను సమన్వయం చేయటంలో లోపం కారణంగా అదే పార్టీకి చెందిన ఇరువురు అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఉదయం నుంచి పార్టీ అధిష్ఠానం బోడేపుడి రమేష్, మువ్వా విజయబాబు, తుళ్ళూరి బ్రహ్మయ్యల పేర్లలో ఒక్కొ సారి ఒక్కొక్క పేరును సూచిస్తుందని ప్రచారం జరిగింది. దీంతో ఎవరికీ వారు చైర్మన్ స్థానం తమదే అన్నట్లుగా ధీమా వ్యక్తం చేశారు.
అయితే చివరకు విజయబాబుకు అది ఖాయం కావటంతో మిగిలిన ఇద్దరు నిరాశకు గురయ్యారు. రమేష్‌బాబు ఎన్నికల కేంద్రం నుంచి వెళ్ళిపోగా, బ్రహ్మయ్య మాత్రం నామినేషన్ వేసి కాంగ్రెస్ సభ్యుల మద్దతును తీసుకున్నారు. ఈ సమయంలో టిడిపికి చెందిన కొందరు సభ్యులు ఓటు వేస్తారని ప్రచారం జరగటంతో ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జిల్లా పరిశీలకుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో టిడిపి, సిపిఐ సభ్యులకు విజయబాబుకు ఓటు వేయాలని దిశానిర్దేశం చేశారు. ముందుగా అనుకున్నట్లుగానే తెలుగుదేశంపార్టీ విజయం సాధించినప్పటికీ ఆ పార్టీ నాయకుల మధ్య ఏర్పడిన చీలిక కార్యకర్తల్లో బాధను మిగిల్చింది.
అలజడి సృష్టించిన కాంగ్రెస్: టిడిపి సభ్యుల్లో ఏర్పడిన విభేధాల ద్వారా లబ్ధిపొందేందుకు కాంగ్రెస్ నాయకులు కొంత ప్రయత్నం చేశారు. రాష్టమ్రంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి స్వయంగా అక్కడే ఉండి టిడిపి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తుళ్ళూరి బ్రహ్మయ్యను తనవైపు తిప్పుకోవటంతో పాటు ఇతర సభ్యులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.