తిరుపతి, ఫిబ్రవరి 20: కార్మిక చట్టాలను అమలు చేయాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని, నిత్యావసర ధరలను తగ్గించాలన్న 10 డిమాండ్లతో గుర్తింపు పొందిన 11 కార్మిక సంఘాలు తలపెట్టిన 48 గంటల దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె తొలిరోజు బుధవారం చిత్తూరు జిల్లాలో విజయవంతమైంది. ఎఐటియుసి, సిఐటియు, ఐఎన్‌టియుసి, టిఎన్‌టియుసి, బిఎంఎస్, హెచ్‌ఎంఎస్, యుటియుసి, ఎస్‌సిడబ్ల్యుఎ, ఎపిఎన్‌జిఓ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. ఈ 11 కార్మిక సంఘాలకు మద్దతుగా దేశ వ్యాప్తంగా 5వేల అనుబంధ సంఘాలు, సంస్థలు సమ్మెలో పాల్గొన్నాయి. జిల్లాలో ప్రధానంగా తిరుపతిలో సమ్మె ఉద్ధృతంగా కనిపించింది. బ్యాంకులు, ఇన్సూరెన్స్, టెలికం, పోస్టల్, రైల్వే, టీచర్స్, అంగన్‌వాడీలు, హమాలీలు, అటవీ కార్మికులు, టిటిడి సత్రాలు, అతిథిగృహాల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు, తోపుడు బండ్లు, ఎద్దులబండ్లు, అటోకార్మికులు తదితర కార్మికులు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట, తిలక్‌రోడ్డులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, టిటిడి పరిపాలనా భవనం, ఎస్వీయూ, నరసింహతీర్థంరోడ్డులోని ఇన్సూరెన్స్ కార్యాలయం వద్ద, తిరుపతి ప్రాంతీయ టెలికం, ప్రాంతీయ పోస్టల్ కార్యాలయం, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో కార్మికులు ధర్నాకు దిగారు. ఎఐటియుసి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు, ఐఎన్‌టియుసి, టిఎన్‌టియుసి ఆధ్వర్యంలో స్థానిక టిటిడి పరిపాలనా భవనం నుండి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరశిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కార్మికుల కడుపుకొట్టే పాలకులకు పతనం తప్పదు
- తులసేంద్ర, రామానాయుడు
కార్మికుల కడుపుకొట్టే పాలకులకు పతనం తప్పదని ఎఐటియుసి రాష్ట్ర నేత, సిపిఐ జిల్లా కార్యదర్శి తులసేంద్ర, రామానాయుడులు హెచ్చరించారు. ఎఐటియుసి ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడ నుండి అంబేద్కర్ విగ్రహం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తులసేంద్ర, రామానాయుడులు మాట్లాడుతూ కార్మికులు, కర్షకులు ఉత్పత్తిదారులన్నారు. వీరి కృషి ఫలితంగానే దేశాభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ప్రభుత్వం ఈ కార్మికవర్గాల సంక్షేమాన్ని విస్మరించి, వారి హక్కులను కాలరాస్తూ పబ్బం గడుపుతోందని ఆరోపించారు. ప్రతి కార్మికుడికి ఇల్లు, పిఎఫ్, ఇఎస్‌ఐ, బోనస్‌లు చెల్లించి కార్మికుల పిల్లలకు, కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం ఉద్యోగ, ఆహార భద్రత కల్పించాల్సిన అవసరం వుందన్నారు. ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జె రామచంద్రయ్య, నగర కార్యదర్శి పెంచలయ్య, ఎఐటియుసి నగర కార్యదర్శి మురళి, హమాలీ వర్కర్స్ యూనియన్ నేత ఎన్‌డి రవిలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక న్యాయం కల్పించాలని, శ్రామిక మహిళా హక్కుల ప్రకారం వివక్ష విడనాడాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని, కరెంటు చార్జీల భారం మోపరాదని, నిత్యావసర ధరలను అదుపులో వుంచాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఎఐటియుసి, సిపిఐ నేతలు ఆర్ వెంకయ్య, రాయపనేని హరికృష్ణ, టి శ్రీధర్, శ్రావణ్, గురవయ్య, తనికాచలం, చిన్నకాళయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈజిప్టు తరహా ఉద్యమాలు తప్పవు
- ఎమ్మెల్సీ విఠపు, యండ్లపల్లి
యూపిఎ -2 ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తే దేశంలో ఈజిప్టు తరహా ఉద్యమాలు తప్పవని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, యండ్లపల్లి శ్రీనివాసులరెడ్డి హెచ్చరించారు. స్థానిక టిటిడి పరిపాలనా భవనం నుండి సిఐటియుసి ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు, తోపుడుబండ్లు, ఇన్సూరెన్స్, మెడికల్, ఫారెస్టు, టిటిడి సత్రాల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు, ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. సిఐటియుకు మద్దతుగా టిఎన్‌టియుసి, ఐఎన్‌టియుసి, బిఎంఎస్ కార్మిక సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు యండ్లపల్లి, విఠపు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన అనంతరం దేశంలో ఎన్నడూ లేనివిధంగా అవినీతి, అరాచకం, అక్రమాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వసం చేస్తూ దేశంలో పేద, సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులు, బ్యాంకు, పోస్టల్, టెలికం, రైల్వేలు, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగాలను ప్రభుత్వం పీకనులిమి చంపేస్తుందని నిప్పులు చెరిగారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి అజేయ్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో 10 కోట్ల మంది, రాష్ట్రంలో కోటి మంది పాల్గొంటున్న చారిత్రాత్మక సమ్మె అని అభివర్ణించారు. ధరల తగ్గింపుకై విద్యుత్ చార్జీల తగ్గింపుకై తాము పోరాడుతున్నామన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ప్రసంగిస్తూ జిల్లాలోని 66 మండలాలు, 8 మున్సిపల్ ప్రాంతాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జరుగుతుందని వివరించారు. ఈ సమ్మెలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు, మధ్యహ్నభోజన కార్మికులు, ఆశా, సంఘమిత్ర కార్మికులు నూరుశాతం పాల్గొన్నారన్నారు.
కార్మికులకు అన్యాయం జరిగితే ఆందోళనలు తప్పదు - రత్నకుమార్
తాము ప్రభుత్వంలో ఉన్నా కార్మికులకు అన్యాయం జరిగితే క్షమించే ప్రసక్తే లేదని, ఆందోళనలు తప్పవని ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు ఎల్ రత్నకుమార్ హెచ్చరించారు. టిటిడి పరిపాలనా భవనం ఎదుట ధర్నా, ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఐఎన్‌టియుసి కూడా కీలకభూమిక పోషిస్తుందన్నారు. తిరుపతిలో రుయా ఎదుట నాల్గవ తరగతి ఉద్యోగులతో ధర్నా చేసినట్లు చెప్పారు. తాము ప్రభుత్వానికి అనుబంధ సంస్థ అయినా కార్మికులపక్షాన నిలిచి పోరాడతామని హెచ్చరించారు.
కనీసవేతనాలు అమలు చేసేంత వరకూ ఉద్యమిస్తాం
- అంబూరి సింధుజ
దేశంలో అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షురాలు అంబూరి సింధుజ డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి మద్దతు పలికిన ఆమె తమ కార్మికులతో కలిసి టిటిడి పరిపాలనా భవనం ఎదుట ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మిక చట్టాలను కాలరాస్తున్న యుపిఏకి గుణపాఠం చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. టిడిపి అధినేత పాదయాత్రకు ప్రజలు బహ్మరథం పడుతున్నారని, తమ పాలనవస్తే కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. ఈ ధర్నాలో సిపిఎం నగర కార్యదర్శి వందవాసి నాగరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, నగర అధ్యక్షుడు ప్రసాద్, కుమారమ్మ, గంగరాజు, చంద్రశేఖర్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, గజేంద్ర, కుమారమ్మ, ముని, లక్ష్మి, గజేంద్ర, విజయలక్ష్మి, కృష్ణారెడ్డి, అరుణ, యశోద, నాగభూషణమ్మ తదితరులు పాల్గొన్నారు.
సమ్మెకు మద్దతుగా మున్సిపల్ ఉద్యోగులు
- కెఎల్ వర్మ
సార్వత్రిక సమ్మెకు మున్సిపల్ కార్మికులు కూడా మద్దతు పలికామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ మినిస్ట్రీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కెఎల్ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎఐటియుసి నిర్వహించిన భారీ ర్యాలీకి మద్దతు పలుకుతూ కార్మిక, ఉద్యోగుల సంక్షేమానికి ఎంతటి పోరాటాలకైనా సిద్ధమన్నారు.
-- పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన --
జిల్లాలో మందుల కొరత
* రక్తపోటు, డయాబెటిస్‌కు సైతం మాత్రలు కరవు
* ప్రభుత్వ దవాకాణాల్లో పడకేసిన వైద్య చికిత్సలు
* లబోదిబో మంటున్న పేదలు
చిత్తూరు, ఫిబ్రవరి 20: ప్రభుత్వ దవాకాణాల్లో మందులు లేకపోవడంతో పేద ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు, అనంతపురం, రంగారెడ్డి జిల్లాలను ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఈ మూడు జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల మందులను పేద ప్రజలకు అందిస్తామని ప్రకటించి సంవత్సర కాలం అవుతున్నా ఇంతవరకు పేదప్రజలకు గతంలో అందుతున్న కనీస మందులు కూడా అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు రక్తపోటు, డయాబెటిస్‌కు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుష్కలంగా మందులు లబించేవి. నేడు అలాంటి రోగులకు కూడా ప్రతినిత్యం వచ్చే రోగుల వలే రెండు మాత్రలు ఇచ్చి చేతులు దులుపుకొనే పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రిల్లో నెలకొంది. మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండే ఫార్మసిస్టులకు సెల్‌పోన్లు ఇచ్చి అందులో మందుల వివరాలను ప్రతిరోజు నమోదు చేయాలని కొత్త పద్ధతి పెట్టారు. అయితే వచ్చే రోగులకు ప్రతినిత్యం ఇచ్చే మందులు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతుంటే కొత్తగా కావాల్సిన మందుల వివరాలను తాము ఫీడ్‌చేసి పంపినా అందువల్ల వరిగేదేమి లేదని వారు బాహాటంగా విమర్శిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే మందులు సైతం సజావుగా అదండంలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నేడు డిస్పోజబుల్ సిరంజులు కూడా కరవై ఒకే సిరింజికి నీడిల్ మార్చుకొని మందులు వేస్తున్న దుస్థితి నెలకొంది. ఈ విషయం బయటకు పొక్కితే ఎక్కడ జరిగిందో తెలిస్తే వారినే శిక్షించే విధంగా అధికారులు ఉండడంతో ఈ విషయమై బాహాటంగా చర్చించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న సిబ్బంది వెనుకాడుతున్నారు. మరోవైపు 104 ద్వారా అందించే సేవలు సైతం అంతంత మాత్రంగానే ఉంది. వారి వద్ద ఏలాంటి మందులు లేవన్నది జగమెరిగిన సత్యం. ప్యారాసిట్మాల్, వాంతులు, విరోచనాలకు పురంటోజల్, చిన్నపిల్లలకు ఫ్యారాసిట్మాల్ సిరప్, దగ్గుమందు, ఐరన్ మాత్రలు మినహా ఏ ఇతర మాత్రలు వారికి అందుబాటులో లేవు. ఈ విషయమంతా తెలిసినా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తమ శాఖ ద్వారా అన్ని సేవలు అందిస్తున్నామంటూ భుజాలెగరేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళే నర్సులకు బిపి, షుగర్ మాత్రలు అందించడం లేదు. ఈ మాత్రల కోసం బస్సు జార్జీల వెచ్చించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తే తమకు రెండు, మూడు మాత్రలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారని రోగులు ఆరోపిస్తున్నారు.
డిఎంహెచ్‌ఓ వివరణ
ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధిరి డాక్టర్ ఎన్.దశరధరామయ్యను వివరణ కోరగా తాను డిఎంహెచ్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి అన్ని మందులు అందుబాటులో ఉన్నట్లు వివరించారు.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఫిబ్రవరి 20: శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి వారికి మార్చి 1 నుండి నిర్వహించ తలపెట్టిన సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం టిటిడి పరిపాలన భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఉత్సవాలను తిలకించడానికి వస్తున్న భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో టిటిడి అధికారులు అన్ని విధాలా కృషి చేస్తున్నారని తెలిపారు. మార్చి 1న శుక్రవారం బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికంగా ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మార్చి 9వ తేదీన చక్రస్నానంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రత్యేక రథాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. భజన బృందాల ద్వారా ప్రతి గ్రామంలో పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, కరపత్రాలను పంపిణీ చేస్తున్నామని, ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తూ ఆహ్వానించే ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రతి రోజూ ఉదయం, రాత్రి రెండు వాహనాలు ఉంటాయన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.
క్షురకులు, మంగళ వాయిద్య కారులకు న్యాయం చేయండి
టిటిడి ఇఓకు శాసనమండలి హక్కుల కమిటీ చైర్మన్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఫిబ్రవరి 20: టిటిడిలో పనిచేస్తున్న క్షురకులు, మంగళ వాయిద్య కారులు తమను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని కోరుతున్నారని, ఈ అంశాన్ని పరిశీలించి తగిన న్యాయం చేయాలని ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యంను రాష్ట్ర శాసన మండలి హక్కుల కమిటీ చైర్మన్ టివిజి కృష్ణారెడ్డి ఆదేశించారు. బుధవారం స్థానిక పద్మావతి అతిథి గృహంలో జిల్లా అధికారులు, టిటిడి అధికారులతో కమిటీ చైర్మన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకునేందుకు అడ్డంకులు తొలగిపోయాయని, పనులు ఇక ఊపందుకుంటాయని తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనులు పూర్తవుతాయన్నారు. గొల్లమండపం శిథిలావస్థలో ఉందని, దానిని పునర్నిర్మాణం చేయాలని నిపుణుల కమిటీ టిటిడికి సూచించిందని ఇఓ తెలిపారన్నారు. ఇందుకు గాను గొల్లమండపం వంశీకులను పిలిచి వారితో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. పలమనేరులో స్థాపించదలచిన గోసంరక్షణశాలపై విస్తృత చర్చ జరిగిందన్నారు. పశు సంవర్ధక విశ్వ విద్యాలయానికి మొత్తం 300 ఎకరాలు కావాలని కోరుతున్నారని, ఇందుకు విసి, టిటిడి ఇఓ సమావేశం నిర్వహించి ఈ నెలాఖరులోపు మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికే కాక దేశానికే ప్రతిష్టాత్మకమైనదని తెలిపారు. దీనిని త్వరలో మొదలు పెట్టాలన్నారు. తక్కువ ఖర్చుతో అధిక పాల దిగుబడిని సాధించడమే కాక, స్వామి వారికి అవసరమైన నెయ్యిని ఇక్కడే సమకూర్చుకోవచ్చన్నారు. అంతే కాకుండా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచవచ్చన్నారు. ఇది రైతులకు మేలు చేయడమే కాకుండా, వ్యవసాయ ఉత్పత్తులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. పశుసంవర్థక శాఖ మాజీ ఉప కులపతిపై వచ్చిన అభియోగాలపై విచారణ జరిపిన నివేదిక ప్రస్తుత గవర్నర్ దగ్గర ఉండటంతో దీనిపై చర్చ ఇంతటితో ముగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎన్ రాజలింగం, ఐలాపురం వెంకయ్య, విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఎస్ ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం, జిల్లాకలెక్టర్ ఎస్ సాల్మన్ ఆరోగ్యరాజ్, జాయింట్ కలెక్టరు వినయ్‌చంద్, మదనపల్లె సబ్ కలెక్టర్ హరికిరణ్, వెటర్నరీ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ సుదర్శనరెడ్డి, విమానాశ్రయం డైరెక్టర్ పట్ట్భారెడ్డి, తిరుపతి ఆర్డీవో రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరుగుదొడ్ల నిర్మాణాలు 20లోగా పూర్తి చేయాలి
* జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఫిబ్రవరి 20: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను మార్చి 20లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆదేశించారు. బుధవారం స్థానిక జీవనోపాధుల వనులు కేంద్రం (డ్వామా కార్యాలయం)లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, తాగునీరు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం తదితర అంశాలపై తిరుపతి డివిజన్‌తోపాటు వెదురుకుప్పం, రామచంద్రాపురం, చిన్నగొట్టిగల్లు, పెనుమూరు, ఎర్రావారిపాళెం మండలం అభివృద్ధి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా జరుగుతున్న కార్యక్రమాలను, వాటి పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాలలో కూలీల సంఖ్యను పెంచాలన్నారు. వారికి తగిన పనిని తప్పక కల్పించాలన్నారు. ఎటువంటి పనులు చేయించాలి అనే దానిపై ప్రతి శనివారం నిర్ణయం తీసుకోవాలన్నారు. అర్హులైన వారిని గుర్తించి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ఆవశ్యకతను వివరించాలన్నారు. పనులు వెంటనే మొదలుపెట్టి వచ్చే మార్చి 20 నాటికి నిర్మాణాలను పూర్తిచేయాలన్నారు. ప్రతి పంచాయతీకి మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీలో ఉపాధి హామీపథకంలో 150 మంది కూలీలకు తక్కువ కాకుండా పనిని కల్పించాలన్నారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి బోరు బావి దగ్గర ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీరు సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. అందుకు అవసరమైన చర్యలు ఇప్పటి నుండే తీసుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్, సెట్విన్ నుండి ఎస్సీ ఎస్టీ బీసీ లబ్ధిదారులకు యూనిట్స్ మంజూరు ఎంత వరకు వచ్చిందని అధికారులను ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రాంచి మేనేజర్లతో వెంటనే మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి చంద్రవౌళి, జడ్పీ సిఇఓ నాగేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఇడి చరణ్‌దాస్, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ శ్రీనివాసులు, ఇఇ, డిఇలు, ఎపిఓలు పాల్గొన్నారు.
తెప్పపై ఊరేగిన రుక్మిణీ సత్యభామ సమేత పార్థసారథి స్వామి
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఫిబ్రవరి 20: తిరుపతిలోని గోవిందరాజస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామి తెప్పపై విహరించి భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 10.30 గంటల నుండి 11.30 గంటల వరకు స్థపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా రుక్మిణీ సత్యభామ సమేత పార్థసారథి స్వామి వారి ఉత్సవ మూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పళ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6గంటలకు శ్రీగోవిందరాజస్వామి ఆలయం వద్ద గల నీరాట మండపానికి ఉత్సవ మూర్తులను వేంచేయించ్చారు. సాయంత్రం 6.30గంటలకు అత్యంత వైభవంగా విద్యుత్తు దీపాలతో అలంకరించిన తెప్పపై స్వామి ఆమ్మవార్లు ఐదు చుట్లు పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం రాత్రి 8 నుండి రాత్రి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఉత్సవ మూర్తులు ఊరేగారు.
ఎర్రచందనం సహా పది మంది అరెస్ట్
గుడిపాల, ఫిబ్రవరి 20: ఆంధ్ర నుంచి తమిళనాడుకు అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న పది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 166కిలోల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రమేష్‌రుద్ర బుధవారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా, పోలూరు, వేలూరు జిల్లాకు చెందిన కుప్పన్, చిన్నపయ్య, వెంకటేశన్, మణి, శరవణ, జయరామన్, సురేష్, షణ్ముగం, పాండు, వెంకటేశన్, రమేష్ తిరుపతి శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను సుమోలో తమిళనాడుకు తరలిస్తుండగా మండల పరిధిలోని బొమ్మసముద్రం క్రాస్ రోడ్డు సమీపంలో మరమ్మతులకు గురైంది. దీంతో వాహనంలోని ఎర్రచందనం దుంగలను కిందకు దింపి రోడ్డుపక్కన భద్రపర్చి సుమోను రిపేరు చేయించి తీసుకురావడానికి రమేష్ అనే వ్యక్తి వెళ్లిపోయాడు. ఎర్రచందనం ఉందన్న సమాచారం తెలిసిన వెంటనే ఎస్సై రమేష్‌రుద్ర తన సిబ్బందితోపాటు హుటాహుటిన అక్కడికి వెళ్లి పది మంది సహా 166కిలోల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సుమోతో పరారైన వ్యక్తిని పట్టుకొనేందుకు గాలింపులు జరుపుతున్నట్లు తెలిపారు.
నూతన తరహాలో రాష్ట్ర బడ్జెట్
* మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడి
ఏర్పేడు, ఫిబ్రవరి 20: అసెంబ్లీలో నూతన తరహాలో బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల నిరుపేదలను అన్ని విధాలా ఆదుకోవడానికి అవకాశం ఉంటుందని ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. బుధవారం శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయానికి ఆయన కుటుంబ సమేతంగా వచ్చి రాహు కేతు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరలతో మాట్లాడుతూ పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్న పార్లమెంట్ బడ్జెట్ విధంగా ఈ ఏడాది నుంచి మన రాష్ట్రంలో కూడా ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొన్నారు. లక్షా 45వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రణాళికను ప్రవేశ పెడుతున్నట్లు వివరించారురు. ప్రతి పక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా గతంలో పనులు చేపట్టలేదని ఆరోపించారు. ఇప్పటికీ ప్రజలు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మడం లేదని, తమ పార్టీ చెప్పిందే చేస్తుందన్నారు. ఆలయానికి వచ్చిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు.
తెలుగుభాష ఔన్నత్యాన్ని భావితరాలకు అందించండి: డిఇఓ
తిరుపతి, ఫిబ్రవరి 20: తెలుగుభాష తియ్యదనాన్ని, గొప్పతనాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అధ్యాపకులదేనని జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎస్వీ హైస్కూల్లో జరిగిన హెచ్‌ఎంలు, ఎంఇఓల సమావేశానికి విచ్చేసిన ఆయన గురువారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తికి చెందిన ఎస్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి యువశ్రీ మురళి రూపొందించిన ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ ప్రపంచ తెలుగుమహాసభల స్ఫూర్తిని ప్రతి అధ్యాపకుడు గుండెల నిండా నింపుకుని తెలుగుభాషాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రతి సోమవారం తప్పనిసరిగా అధ్యాపకులు సాంప్రదాయ దుస్తుల్లో పాఠశాలలకు వెళ్లాలని, మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి పాఠశాలలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. పాఠశాలల్లో విద్యార్థుల్లో తెలుగుభాషపై జిజ్ఞాసను పెంపొందించాలన్నారు. కవితలు, కథలు రాయించి పిల్లలకు భాషపై పట్టు సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఉప విద్యాశాఖాధికారులు చంద్రయ్య, వి శేఖర్, జిల్లా సైన్స్ అధికారి మధుసూదన్‌రెడ్డి, ఎస్‌టియు రాష్ట్ర సహా అధ్యక్షులు గాజుల నాగేశ్వర్‌రావు, ధనంజయుల నాయుడు, మునికృష్ణమనాయుడు, రామచంద్రారెడ్డి, వెంకటేష్, హెచ్‌ఎం కృష్ణమూర్తి పాల్గొన్నారు.