రాజమండ్రి, ఫిబ్రవరి 20: సహకార ఎన్నికల్లో విజయం సాధించటం పట్ల ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆనందంగా కనిపించారు. మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడి వివాహం సందర్భంగా మంగళవారం అమలాపురంలో జరిగిన రిసెప్షన్ కార్యక్రమానికి హాజరైన సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాజమండ్రి చేరుకుని, రాత్రికి ఆర్‌అండ్‌బి అతిథిగృహంలోనే మకాం చేసిన సంగతి విదితమే. బుధవారం ఉదయం 9గంటలు దాటిన తరువాత తనను మర్యాదపూరకంగా కలుసుకునేందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు, ఇతర ముఖ్యనాయకులతో సిఎం సరదాగా కబుర్లు చెప్పారు. ఉభయగోదావరి జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నందువల్ల గోదావరి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దాంతో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, సమీక్షలు ఏర్పాటుచేయలేదు. మరోపక్క మధురపూడి విమానాశ్రయం నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానం వాతావరణం అనుకూలించకపోవటంతో దాదాపు గంట ఆలస్యమయింది. ఈ పరిస్థితుల్లో అతిథిగృహంలోనే 11.15గంటల వరకు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ గడిపారు. అందులోనూ సిఎం జిల్లాలో ఉన్న రోజునే డిసిసిబి, డిసిఎంఎస్ ఎన్నికలు జరగటం, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్ధులే విజయం సాధించటం తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో మెజారిటీ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను కైవసం చేసుకోవటంతో బుధవారం రాజమండ్రి ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆనందంగా కనిపించారు. నాయకులతో మాట్లాడిన రెండు గంటల్లో ఎక్కువ సేపు సహకార విజయానికి సంబంధించిన అంశాలపైనే చర్చ జరిగింది. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధులు విజయం సాధించటానికి కారణాలు, ప్రభుత్వ నిర్ణయాలు తదితర అంశాలను ఈ సందర్భంగా సిఎం వివరించినట్టు తెలిసింది. మరో పక్క స్థానిక సంస్థల ఎన్నికల అంశం చర్చకు వచ్చినపుడు, జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు ఇతర నాయకులు నీటి సంఘాల ఎన్నికలు ముందుగా జరిపించి, తరువాత పంచాయతీ ఎన్నికలనే జరపాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధిస్తారని, జనంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ ఉందని ఈ సందర్భంగా సిఎం ధీమా వ్యక్తంచేసారు. జిల్లాలోని వివిధ అంశాలను కొంత మంది ఎమ్మెల్యేలు సిఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటి అయిన వారిలో మంత్రులు పితాని సత్యనారాయణ, తోట నరసింహం, ఎంపిలు ఉండవల్లి అరుణ్‌కుమార్, టి రత్నాభాయి, ఎమ్మెల్సీలు కందుల దుర్గేష్, రుద్రరాజు పద్మరాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి శేషారెడ్డి, పాముల రాజేశ్వరీదేవి, కె కన్నబాబు, కొత్తపల్లి సుబ్బారాయుడు, రాజమండ్రి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నక్కా శ్రీనగేష్, ఏఎంసి చైర్మన్ చెరుకూరి రామారావు, డిసిసిబి అధ్యక్షుడు వరుపుల రాజా, డిసిఎంఎస్ అధ్యక్షుడు కెవి సత్యనారాయణరెడ్డి, ఏపిఐఐసి మాజీ చైర్మన్ ఎస్ శివరామసుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.
సార్వత్రికసమ్మె సంపూర్ణం
రాజమండ్రి, ఫిబ్రవరి 20: యుపిఏ ప్రభుత్వ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన రెండు రోజుల సమ్మె పిలుపు మేరకు బుధవారం రాజమండ్రిలో సార్వత్రిక సమ్మె సంపూర్ణంగా జరిగింది. తొలిరోజు సమ్మెకు అన్ని కార్మిక సంఘాలతో పాటు చాంబర్ ఆఫ్‌కామర్స్, బ్యాంకు ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. సమ్మెలో భాగంగా రాజమండ్రిలోని దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, బీమా సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు పాక్షికంగా నడిచాయి. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, యునైటెడ్ వర్కర్స్ యూనియన్లకు చెందిన కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో బస్సులు పాక్షికంగా నడిచాయి. ఓఎన్జీసి, హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొనడంతో ఆయా సంస్థల్లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పేపరుమిల్లు కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. పెట్రోలియం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఓఎన్జీసి బేస్‌కాంప్లెక్స్, ధవళేశ్వరం వర్క్‌షాపు, డ్రిల్లింగ్ ప్రదేశాల్లో కార్మికులు సమ్మెలో పాల్గొన్నట్లు యూనియన్ ప్రధాన కార్యదర్శి డివి కృష్ణంరాజు తెలియజేశారు. సమ్మె నుంచి పాలు, కూరగాయలు, మెడికల్, హోటల్ వ్యాపారాలకు మినహాయింపునిచ్చారు. ఎఐటియుసి, సిఐటియు, టిఎన్‌టియుసి, బిఎంఎస్, ఐఎన్‌టియుసి తదితర కార్మిక సంఘాల, వాటి అనుబంధ సంఘాల కార్మికులు, ఉద్యోగులు, నాయకులు కోటిపల్లిబస్టాండ్ నుంచి కోటగుమ్మం వరకు ర్యాలీ నిర్వహించారు. నక్కా చిట్టిబాబు ఆధ్వర్యంలో టిఎన్‌టియుసి నాయకులు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ధర్నా నిర్వహించారు. ఇఫ్టూ ఆధ్వర్యంలో అనుబంధ కార్మిక సంఘాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఇఫ్టూ కార్యాలయం నుంచి గోకవరం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం
కలెక్టర్, ఎన్నికల అధికారి నీతూప్రసాద్
కాకినాడ సిటీ, ఫిబ్రవరి 20: ఉభయ గోదావరి జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్ట్భద్రుల నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. కాకినాడ డివిజన్‌కు సంబంధించి స్థానిక మెక్లారిన్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని బుధవారం పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల నుండి పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్స్‌లు, అవసరమైన పోలింగ్ సామాగ్రితో వారి వారి పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో తరలిస్తున్నట్లు చెప్పారు. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె పేర్కొన్నారు. గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఈ ఎన్నికలలో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న రెండు లక్షల 1763 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో లక్ష 9 వేల 133 మంది ఓటర్ల ఉండగా వారిలో 77 వేల 470 మంది పురుషులు, 31 వేల 663 మంది మహిళా ఓటర్లు ఉన్నారని కలెక్టర్ చెప్పారు. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 92 వేల 630 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో పోలింగ్ నిర్వాహణకు 160 సాధారణ, 5 అక్సిలరీ పోలింగ్ కేంద్రాలతో కలిపి మొత్తం 165 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దీని కోసం 165 మంది ప్రిసైడింగ్ అధికారులు, 165 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 351 మంది పోలింగ్ అధికారులు, 133 మంది పోలింగ్ సిబ్బంది నియమించినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రానికి ఒకరు వంతున 165 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు కలెక్టర్ తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల వారీ ప్రాధాన్యత ఓటును తాము ఎంచుకున్న అభ్యర్థికి వేసేందుకు పోలింగ్ కేంద్రాలలో సరఫరా చేసే వైలెట్ స్కెచ్ పెన్నును వినియోగించి ఓటును వేయాల్సి ఉంటుందని రిటర్నింగ్ అధికారి నీతూప్రసాద్ స్పష్టం చేశారు. మరేతర పెన్నులు, పెన్సిల్స్ ఉపయోగించి ఓట్లు వేస్తే అవి చెల్లవని స్పష్టం చేశారు. ఓటర్లు వారికి నచ్చిన వ్యక్తికి వేసే ప్రాధాన్యత ఓటును కేవలం అంకె రూపంలో మాత్రమ వేయాలని అక్షరాల్లో రాయకూడదని సూచించారు. ప్రతీ ఓటరు తప్పకుండా ఒకటి ప్రాధాన్యత అంకెను ఏదోక అభ్యర్థికి వేసిన అనంతరమే మిగిలిన ప్రాధాన్యత ఓటును వేయాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్ వెంట వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమీషనర్ పౌసమీబసు, కాకినాడ ఆర్డీఓ జవహర్‌లాల్‌నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సుదర్శన హోమాలు
ఐ పోలవరం, ఫిబ్రవరి 20: దృష్టి సంబంధ దోషాలకు రక్షాకవచమైన శ్రీమహావిష్ణువు సుదర్శన హోమాలు బుధవారం అతిరుద్ర యాగశాలలో ఘనంగా జరిగాయి. 121 మంది రుత్వికులు రుద్రం, చమక పారాయణాల వేదఘోషలో ఉత్కృష్ట మహాయాగం భక్తులను కనువిందు చేసింది. కృష్ణాయ, గోవిందాయ, గోపిజన వల్లభాయ అనే మంత్రంతో సుదర్శన హోమం ప్రారంభమైంది. వేయి బాహువులు కలిగిన కార్యవీర్యార్జునుడు సుదర్శన హోమం చేసి దత్తాత్రేయ అంశతో మహావిష్ణువు వద్దకు చేరినట్లు కథ ప్రాచుర్యంలో ఉంది. శత చండీసహిత అతిరుద్ర మహాయాగంలో లక్ష సార్లు సుదర్శన మంత్రం జపించారు. విష్ణువుకు ప్రీతికరమైన తులసి, మారేడు పత్రాలతో పాటు ఉత్తరేణి సమిధలు, చక్కెర పొంగళి హోమద్రవ్యంగా వినియోగించి నివేదన జరిపారు. శివాయ, విష్ణురూపాయ, శివుడు విష్ణువు ఏకరూపులు కావడం వల్ల బుధవారం నిర్వహించిన మహావిష్ణువు సుదర్శన హోమానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని అతిరుద్ర యాగకర్తలో ముఖ్యుడైన కేశాప్రగడ రాజశేఖరశర్మ అన్నారు. యాగశాల ప్రాంగణంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఈశాన్యంలో విష్ణుమూర్తి ఉంటాడని, విష్ణుపాంచాయనంలో మాత్రం శివుడు ఈశాన్యంలో ఉంటాడు కాబట్టి ఎక్కడ హోమం జరిగినా రుద్రం లేకుండా పూర్ణాహుతి ఉండదన్నారు. విష్ణువు సంసార కారుకుడైనందున సంసారమనే సాగరాన్ని దాటడానికి విష్ణు ఆరాధన ముఖ్యమన్నార