మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని పురాణాలు చెబుతున్నాయి. తల్లిని మించిన దైవం లేదని కూడా చెబుతున్నాయి. నవమాసాలు బిడ్డను తన కడుపున మోసి, తాను తీసుకున్న ఆహారాన్ని తన కడుపులోని శిశువుకు అందించి, బిడ్డను కనేటపుడు పునర్జన్మను పొందుతుంది అమ్మ. కన్న తరువాత కంటికి రెప్పలాగా కాపాడుతూ పెంచి పెద్ద చేసి ఆలనా పాలనా చూసుకుంటోంది. సంఘానికి ప్రయోజకుడుగా పెంచాలని పరితపిస్తుంది. తండ్రి తిట్టినా, దండించినా బిడ్డను సావధానపరచి బుజ్జగించేది అమ్మ. అలాంటి అమ్మ ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. మనకు ఎన్నో ఋణాలు ఉన్నాయి- దేవఋణం, ఋషి ఋణం, మాతృఋణం, పితృఋణం, దారాఋణం. తల్లిదండ్రుల ఋణం తీర్చకుంటే ఏ పని నెరవేరదు! ‘యా దేవీ సర్వ భూతేషు మాతృ రూపేణ సంస్ధితా’ అని చండీ స్తోత్రంలో ఉంది. కాబట్టి తల్లిలో జగన్మాతను దర్శించాలి. స్ర్తిలందరూ దేవీ స్వరూపిణులే. కొందరు శ్లోకాలను వల్లిస్తారు. పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తారు. కాని తల్లి పట్ల ప్రవర్తన తద్విరుద్ధం. వృద్ధురాలైన అతడి తల్లికి తినడానికి తిండి లేదు. తల్లి సేవను విస్మరించి సాధువులకు, జీయర్లకుసేవ చేస్తే సమంజసమా?
తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితులో త్యజించరాదు. తల్లిదండ్రులంటే సామాన్యులుకారు. వారు ప్రసన్నం కాకపోతే జీవితంలో ఏదీ ఫలవంతం కాదు. నీ తల్లిదండ్రులు నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేశారు. ఇప్పుడు నీకు పిల్లలున్నారు. ఈ స్థితిలో భార్యను తోడ్కొని ఇల్లువిడిచి బయటకు వచ్చావు. తల్లిదండ్రులను మోసం చేసి, వంటరి వారిని చేసి, భార్య పిల్లలను పిలుచుకొని వచ్చి ఏదో గొప్ప మహాత్ముడిగా భావిస్తున్నావు. విఘ్నరాజు వినాయకుడంతటివారు ‘తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలను, పుణ్యతీర్థాలను చుట్టి వచ్చిన ఫలితం లభిస్తుంది అనే ధర్మసూక్ష్మాన్ని గ్రహించి పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి గాణాధిపతిగా భక్తుల చేత పూజలనందుకుంటున్నాడు. పూర్వం పురుషోత్తమపురి అనే గ్రామంలో నరసింహాచార్య అనే ఒక వైష్ణవుడు వేణుగోపాలస్వామి దేవాలయంలో పూజారిగా ఉండేవాడు. అతడు సంగీత సాహిత్యాలలో అపార నైపుణ్యం కలవాడు. నిత్యం స్వామి భక్తికై అనేక కీర్తనలు వ్రాసి, గానం చేసేవాడు. ద్రావిడ వేద పారాయణాలతో స్వామిని కీర్తించెడివాడు. అతనికి ఐదుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. మగ పిల్లలకు అందరికీ విష్ణునామాలను పేర్లుగా పెట్టుకొని పిలుచుకొనేవాడు. అందరికి క్రమంగా విద్యాబుద్ధులు నేర్పించి, ప్రయోజకులుగా చేసి, తనకున్న మాగాణి పొలాన్ని అందరూ సమానంగా పంచుకోమని చెప్పి కన్నుమూశాడు. తండ్రి మరణంతో దిక్కుతోచని సంతానమంతా తల్లి బాగోగుల కోసం పరితపించారు. కాని మగపిల్లలలో 3వ సంతానమైన రామకృష్ణ మాత్రం మొదటినుండి అమ్మా, నాన్నల బాగోగులను పట్టించుకొనేవాడు కాదు. ఎంతసేపు తాను, తన సంపాదనమీదే ధ్యాస తప్ప ప్రేమాభిమానాలు గాని, మంచి చెడులను గాని పట్టించుకునే వాడు కాదు. తండ్రి చనిపోయిన సంవత్సరంలోపే ఆస్తిని పంచమని తగాదా పెట్టాడు. దానితో బాధపడిన మిగతా సోదరులు తండ్రి ఇచ్చిన పొలాన్ని అమ్మి రామకృష్ణ వాటా అతనికి ఇచ్చారు. ఇక దానితో రామకృష్ణ సంతోషం చెంది మహానగరానికి బయలుదేరాడు. అతని ఇద్దరు కుమారులు యుక్త వయస్సుకు వచ్చారు. రామకృష్ణ తన ఇద్దరు పిల్లలకు వివాహాలు చేశాడు. కోడళ్ళతో, మనుమలు, మనుమరాళ్ళతో హాయిగా కాలం గడుపుదామనుకున్నాడు. కాని కర్మ ఫలితం అనుభవించక తప్పదు కదా! అయినా రామకృష్ణ స్వార్థ చింతన మానుకోలేదు. కానిచేసుకున్న పాపానికి రామకృష్ణ వీధిపాలైనాడు. అప్పుడు అతనికి గతం గుర్తుకు వచ్చింది.. పరుగు పరుగున పురుషోత్తమపురికి వచ్చాడు. అక్కడ మంచంలో ఉన్న తల్లి పాదాలపై పడి కన్నీరు కార్చాడు. అప్పుడు 90 ఏళ్ళ ఆ తల్లి విషయం తెలుసుకొని అక్కున చేర్చుకుంది. మిగతా సోదరులను పిలిపించింది. అందరికీ భోజనాలు పెట్టించి జీవితంలో తల్లి ప్రేమ, సోదర ప్రేమే శాశ్వతమని అందరూ కలిసి జీవించమని చెప్పింది.
మంచిమాట
english title:
manchi maata
Date:
Monday, February 25, 2013