Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రంగనాథ రామాయణం - 153

$
0
0

రామలక్ష్మణులు పంపా తీరానికి రావడం ఏమిటికి? సుగ్రీవుడి చెంతకు ఆ దాశరథులు ఏ తెంచడం ఎందుకు? సుగ్రీవుడు అతని సఖ్యాన్ని కోరడం ఎందుకు? రాముడు వాలిని సంహరించడం ఏమిటి? కపి సేనలు రావడం ఎందుకు? కపిరాజ మనలను ఇక్కడికి పంపించడం దేనికి? మనకి ఈ పాట్లు కల్గడం ఏమిటి? ప్రాణాలు ఊరక విడిచిపుచ్చడం ఎందుకు? అక్కటా? కైకేయి వరం మనువు వంశంతోపాటు మన వానర జాతిని అణచడం ఎందుకు?’’ అని శోకిస్తూ వుండిపోయాడు.
అంగదాదులు
సంపాతిని చూచుట
ఆ సమయంలో సంపాతి అను ఖగరాజు విశాల శరీరుడు, అత్యంతమూ వృద్ధుడు, పక్షాలు, ప్రాయం, బలిమి లేమి ఆ కొండ గుహ నుంచి మెల్ల మెల్లిగా వచ్చి, మరణింపకోరి ధరణిపై త్రెళ్లిపడి యున్న వనచరనాథులను వీక్షించాడు. ఈ రోజున దైవం నన్ను దయతలచాడు. తనకు ఆహారం లభించిందని వానరుల దగ్గరికి అరుదెంచాడు.
అప్పుడు ఆంజనేయుడితో యువరాజు అంగదుడు ‘‘ఇది పక్షి కాదు. మమ్ములనందరిని సంహరించడం కోసం యమధర్మరాజు ఈ రూపం తాల్చి వచ్చాడు. శ్రీరాముడి భార్యను జానకిని రావణాసురుడు అపహరించుకొనిపోయే ఈ సమయంలో జటాయువు ఆ రక్కసుణ్ణి ఎదిరించి, పోరాడి అతడి ఖడ్గ్ధారి హతికి మరణించి దివ్య పదం పొందడా? రాముడి కార్యం నెరవేర్ప వచ్చి మనం ప్రాణాలను ఈ మహాఖగానికి ధారపోయడం లగు’’ అనే వాక్కులు సంపాతి ఆలకించాడు. శోకంతో గద్గదఖిన్న కంఠుడు అయాడు. కపి నాయకులను సమీపించాడు.
‘‘ఓ వానరులారా! ఎక్కడ నుంచి వచ్చారు? ఆ జటాయువు నా అనుగు తమ్ముడు. నేను, జటాయువు సూర్యపుత్రులం. జటాయువుని నిశిత నఖుడు. దశరథ సఖుడు, సత్యధనుడు. అతను ఎందుకు మరణించాడు?’’ అని అడిగాడు.
అంగదుడు ఈ విషయం అంతా తెలిసికొన్నాడు. ఎంతో శోకించాడు. కపులు సంపాతిని మోసికొనిపోయి చేరువనున్న సముద్రానికి కొనిపోయాడు. సంపాతి ఆ జలధిలో స్నానమాడాడు. విపుల శోకంతో ఆ సంపాతి కపులతో తన పూర్వ కథ ఈ రీతిని చెప్పసాగాడు.
‘‘జటాయువు, నేను కైలాసగిరి పయిని జతగూడి వుండగా, జవసత్త్వాలతో మేము ఇరువురమూ మత్సరం పూని ఉదయవేళ ఆకాశ మండలంలోకి ఎగిసిపోయాము. మధ్యాహ్న వేళదాకా విహరించాము. తీక్షణమయిన సూర్య రస్ములు తాకి జటాయువు కాలిపోతూ వుండడం గమనించాను. తమ్ముణ్ణి రక్షించాలని నా పక్షాలతో వాడిని పదిలంగా పొదువుకొన్నాను. నా పక్షాలు కాలిపోయాయి. నా ఎరకలు రాలిపోయి, సత్త్వం కోల్పోయి, వచ్చి ఈ ఆశ్రమంలో పడిపోయాను. జటాయువు ఎటు ఎగిరిపోయాడో ఏమయిపోయాడో ఎరుగను. అతని మరణవార్త మీవల్ల విన్నాను. హీనబలుడిని, పక్షాలు లేనివాడని, పూర్వమట్లు నాకు రెక్కలువుంటే దక్షతతో నా సోదరుడి పగ తీర్చి, మగటిమితో శ్రీరామభద్రుడి దేవేరిని తేనేర్చేవాడిని. మాటలకేమి?’’ అని విచారగ్రస్తుడు అయినాడు.
అంత భల్లూక వల్లభుడు జాంబవంతుడు హనుమంతుడూ, అంగదుడూ హర్షంతో ఉప్పొంగ ‘‘సంపాతీ? నీకు జటాయువు తమ్ముడు. ఈ జగత్తులన్నింటిలో నీకు ఎదురు ఎక్కడ? నువ్వు చూడని యెడలు, నువ్వు ఎరుగని తావులు వుండవు. రావణుడి శ్రీరామవిభుడి దేవిని ఎక్కడ దాచినాడో నీవెరింగిన తెలియచెప్పవలసింది’’ అని అడిగాడు. అంత సంపాతి సందేహం తీరిపోయే విధంగా ఈ పగిది వచించాడు.
‘‘దుర్దమ పరాక్రమడు, ఘనుడు ‘సుపార్శ్వుడు’ నా తనూభవుడు.
-ఇంకాఉంది

రామలక్ష్మణులు పంపా తీరానికి రావడం ఏమిటికి?
english title: 
ranganatha
source: 
శ్రీపాద కృష్ణమూర్తి

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles