మనిషిలో వచ్చిన మానసిక అనుభూతులు, అనుభవాలు, సంఘర్షణలను అక్షర రూపంలో అందంగా చెబితే కవిత్వమవుతుంది. లయబద్ధంగా చెబితే పాట అవుతుంది. అయితే కవిత్వం వ్యక్తిగతం... పాట సామూహికం. కవిత్వాన్ని ఉమ్మడిగా వ్యక్తీకరించుకోవచ్చు కాని అది అనివార్యత కాదు. పాట దాని అంతః సంబంధం రీత్యా పాడితేనే దానిలోని అందాలు ద్విగుణీకృతమవుతాయి. అయితే పాడకపోతే పాటలను చదవలేమా అంటే చదువుకోవచ్చు. కాని పాడినప్పుడు దానితో ఉండే అందాలు చదువుకున్నప్పుడు కనిపించవు, వినిపించవు. సినీ కవులు ఆత్రేయ, నారాయణరెడ్డి, కృష్ణశాస్ర్తీ లాంటి వారు రాసిన పాటలను విన్నప్పుడు పండితులు, పామరులు ఎంత ఆనందానుభూతికి లోనవుతారో, పాటలను చదివినప్పుడు కూడా కవిత్వాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ అంతే ఆనందానికి లోనవుతారు. ఎందుకంటే వారి పాటల్లో వాడిన భావచిత్రాలు, ప్రతీకలు, లయబద్ధమైన పదవిన్యాసం, మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఒకసారి పాటను పాడాలంటే, అప్పుడు గాయకుడు, వాయిద్యకారుడు, వంతపాడేవారు (కోరస్ ఇచ్చేవారు) తెరమీదకు వస్తారు. బాగా పాడితే ఆ గాయకునికి వచ్చే పేరు రచయితకూ రావాలని లేదు. వినేవారికి రాసినవారి పేరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
సాహితి ప్రక్రియల్లో భాగమైన కవిత, కథ, పద్యం, నాటకం, పాటల్లో ఏరకంగా చూసినా మానవ పరిణామ క్రమంలో ముందుగా వచ్చింది పాటే. ఏ ప్రక్రియకుండే అదనపు సౌకర్యాలు, కష్టసుఖాలు దానికున్నాయి. మానవ మనుగడలో భాగంగా తరాలనుండి అనంతంగా సాగుతున్న పాట సాహితీ రూపాన్ని, నేడు రాష్ట్రంలో వస్తున్న దినపత్రికలు, వారపత్రికలు, సాహితీ పత్రికల్లో పాటకిస్తున్న స్థానాన్ని పరిశీలించాల్సిన అవసరముంది.
నేడు పలు దినపత్రికల్లో సోమవారం వస్తున్న సాహితీ పేజీల్లో, సాహిత్యం కోసమే వస్తున్న సాహితీ పత్రికల్లో కవిత్వం, కవితా సంపుటాలపై అనేక విమర్శనా వ్యాసాలు వస్తున్నాయి. ఎప్పుడు చూసినా, ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరి పేరు మీద కవితల పోటీలు, వాటికోసం అవార్డులు, కవితా సంపుటాలకు పురస్కార ప్రదానోత్సవాలు జరుగుతాయి. కవితల పోటీల నిర్వహణపై కొన్ని ప్రమాణాలు ఏర్పరచుకొని ఎంతో కొంత నూతన రచయితలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇస్తున్న బహుమతులపై అక్కడక్కడ కొన్ని అభ్యంతరాలున్నా ఎంతో కొంత ఆ కవితలు, కవితా సంపుటాలు ప్రాచుర్యంలోకి రావడానికి ఆ పోటీలు ఉపయోగపడుతున్నాయి. అందుకే బహుమతులు కానీ, అవార్డులు కానీ వచ్చిన కవులు జన బాహుళ్యంలోకి పోవడానికి వారి పేర్లు ప్రాచుర్యంలోకి రావడానికి పోటీలు నిర్వహిస్తున్నవారు కారకులవుతున్నారు. ఇక్కడే పాట గురించి చర్చించాలి. సాహితీ ప్రక్రియలో భాగమైన అన్ని అంశాలపై రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట పోటీలు నిర్వహిస్తున్నారు. కాని ఒక్క పాటల రచనలపై పోటీలు నిర్వహించడం ఇప్పటివరకు లేదు. టీవీల్లో జానపద పాటల పోటీలు నిర్వహించినప్పుడు కూడా పాడిన గాయకుడే ప్రాచుర్యంలోకి వస్తాడు. అయితే జానపద పాటల విషయంలో పాటల రచయితలు ఉండరు కనుక ఈ చర్చ వీటికి వర్తించకపోవచ్చు. కాని నేడు రాష్ట్రంలో అనేక అంశాలపై కొన్ని వందల పాటలు వస్తున్నాయి. పాటల పుస్తకాలు వస్తున్నాయి. నిరంతరం రోజువారీ సమస్యలపై పాటలు రాసే వారున్నారు. అయితే ఈ పాటలపై పత్రికా ముఖంగా విమర్శనా వ్యాసాలు నేటివరకు లేవు. ఒక అంశంపై పాటల రచనల పోటీ నిర్వహించి, వచ్చిన పాటల్లో సాహిత్యపరమైన అందాలను, భావ చిత్రాలను, శిల్ప సౌందర్యాన్ని, ప్రతీకలను చూసి ప్రోత్సహించవచ్చు. ప్రాచుర్యంలోకి ఎలా పోవడమన్నది వేరే అంశం. దానికి అనేక అంశాలు కారణమవుతాయి.
ఉదాహరణకు పుచ్చలపల్లి సుందరయ్య నిర్వహించిన పాటల పోటీల్లో ఎన్నికయిన వేములపల్లి శ్రీకృష్ణ రాసిన ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా’ పాట ప్రచురించి నాటినుండి కాపాడారు కనుకనే నలభయ్యేళ్ళ తర్వాత ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా ఆ పాటే రాష్టమ్రంతటా మార్మోగిపోయింది. అందుకే రచనలు వేరు, ప్రాచుర్యం వేరు. ప్రాచుర్యం అంశాన్ని వేరేచోట చర్చించుకోవచ్చు కాని పాటల రచనల అంశాన్ని ప్రస్తావించుకున్నప్పుడు కారణాలు ఏవైనా, నేడొస్తున్న దిన, వార, సాహితీ పత్రికల్లోని సాహిత్య పేజీల్లో పాటలను ప్రచురించడం కాని పాటల పోటీలు పెట్టి ప్రోత్సహించడం లేనేలేదు. కవితలను కవితా సంపుటాలను పత్రికల్లో ప్రోత్సహించిన రీతిలోనే సాహితీ అభిమానులు, విమర్శకులు పాటల రచనల పోటీలు నిర్వహించడం, పాటల రచయితలను ప్రాచుర్యంలోకి రావడానికి అవకాశాలు కల్పించిన అవసరం ఉంది.
నేటికి కవిత్వంపై వచ్చిన విమర్శనా వ్యాసాలను పోల్చుకున్నప్పుడు పాటలపై అలాంటి ప్రయత్నాలు జరిగిన అనుభవాలు నేటికీ రాష్ట్రంలో లేవు. తెలుగు నాట పాటలపై, వాటి మంచిచెడ్డలపై నిరంతరం చర్చించే విమర్శకులు లేకపోవడం తెలుగు సాహిత్యం, అందులో పాట ప్రక్రియ చాలా కోల్పోయింది. అయితే పాట అన్నప్పుడు జానపద సాహిత్యంపై తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో అనేక పుస్తకాలు వచ్చాయి. ఇది మంచి ప్రయత్నమే. బిరుదురాజు రామరాజు, ఆర్వీఎస్ సుందరం లాంటివారు అనేకమైన పుస్తకాలు రాశారు. ఈ మేరకు జానపద సంపద రికార్డు కావడానికి కారకులయ్యారు. ఆ స్థాయిలో నేడు వస్తున్న పాటలపై చర్చ జరగలేదు. నేడు రాష్ట్రంలో ఎన్ని కవితా సంపుటాలు సంవత్సరానికి విడుదలవుతున్నాయో సుమారుగా లెక్కించవచ్చేమో గానీ, ఎన్ని పాటల పుస్తకాలు వచ్చాయన్నదానికి మాత్రం ఏ రికార్డూ లేదు. ఏ వ్యాసాలు లేవు. మానవ సమాజ పరిణామ క్రమంలో అన్ని సాహితీ ప్రక్రియలకు తల్లివంటిది పాటే! జీవితపు ప్రతి మలుపులో మనిషి చుట్టూ అల్లుకున్నది పాటే. తరాలనుండి నేటి వరకు జీవన సంఘర్షణలు చాలావరకు లిఖిత సాహిత్య రూపేణా కావచ్చు, వౌఖిక సాహిత్య రూపేణా కావచ్చు. పాటలోనే అమూల్యమైన చరిత్ర సంపద దొరుకుతుంది. సాహితీ ప్రపంచంలో ఇంత బలమైన పాటల సాహితీ ప్రక్రియను ఆ రచనలు నేడొస్తున్న పత్రికలు ప్రోత్సహించకపోవడం ఒక విషాదం. తెలుగునాట విస్తరిస్తున్న ప్రపంచీకరణ చేదు ఫలాలు సాంస్కృతిక కాలుష్యాన్ని తరిమేసే క్రమంలో పాట ప్రాముఖ్యతను గుర్తించి, పాటలను, రాస్తున్న కవులకు సాహిత్య పేజీల్లో ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరముంది.
మనిషిలో వచ్చిన మానసిక అనుభూతులు
english title:
sahityam
Date:
Monday, February 25, 2013