కలం దించకు కవీ
కలకలం ఎంత రేగినా కర్తవ్యం ముగిసేదాకా
గర్భంలోనే ఆడ పిల్లల ఆగమనాన్ని నిషేధిస్తూ
నిర్గమనాన్ని నిర్దేశించే రాక్షస కృత్యాలతో
స్ర్తిని రక్షించలేని
వీరుడొక్కడూ లేని విఫలతనీ
అనంతమైన ఆకాశాన్ని
చూపుల్లోనే ఇముడ్చుకున్న మాతృదేవతల్నీ
అక్షరాల ఆలంబనతో ధర్మ పతాక విజయాన్నీ
కరుణాస్పర్శతో స్పృశించకుండా
కలం దించకు కవీ
కలకలం ఎంత రేగినా కర్తవ్యం ముగిసేదాకా
మానవ సహజ గుణాలు నశించి
వెలుతురు నిటారుగా మారి
నీడలు కుంచించుకుపోతున్నట్లు
ప్రళయ కాలపు నిగూఢ రహస్యాలు
అశుభ సమాచారాల దావానలమై
రగులుతున్నప్పుడు
గతించిన కాలానికి
ఒక బరువైన చరిత్రగా బతకాలని
అలవాటుపడనియ్యకు
కలకల నవ్వుల కేరింతల
వెనె్నల కన్నుల నెలబాలుని
సొగసుల హృదయపు కోవెల తోటలోకి
పూరేకుల రెక్కలు తొడిగి
విత్తు నుంచి వచ్చే చిన్నారి మొలక
అంతరంగాన్ని చీల్చుకుని ఆవిర్భవించే
జ్ఞానదీపిక అని ‘తట్టి’ చెప్పు.
లక్క పిడతంత నోటితో
విశ్వమంతా చిలిపి నవ్వుల్ని చిందించే
పసిడి అందాల
చిగురుకొమ్మల తీపి బొమ్మలకి
కష్టాల్ని కలిగించే తమ ఇష్టాల్ని
రద్దుచేసుకుంటున్నామని వాపోతున్న
తల్లుల గుండెల దగ్గర మాంసాన్ని లాగి పెకిలిస్తుంటే
వందలకొద్దీ భయాందోళిత అశ్రువులు
నిశ్శబ్దంగా రాలిపడి
జలపాతాలై హోరెత్తుతున్న విధ్వంసాల్ని ఒరుసుకుంటూ
కార్చిచ్చులా వ్యాపించకముందే -
కలాన్ని సంధించు.
చిర పరిచిత చిహ్నాల్లా
ఇళ్ళ ద్వారాలకి
లేత మామిడాకు తోరణాలు వెలిగించు.