స్పందన
=====
ఆ మధ్య ఎక్కడో చదివిన గుర్తు. ‘తెలుగు కవిత్వంలో స్ర్తివాదం వెనకబడిపోయింది. కాలక్రమంగా అది కనుమరుగైపోతోంద’ని. అయితే 18-02-2013 నాటి ‘సాహితి’లో మహెజబీన్ కవిత ‘‘వెజైనా మోనోలాగ్’’ ఈ మాటలన్నవాడికి చెంపపెట్టు.
‘చేరా’ అన్నట్లు జబీన్‌ది లిరికల్ వాయిస్. కానీ ఈ తాజా కవితతో ఆమె గొంతు మారింది. కవిత్వం రంగూ మారింది. కమ్మగా పాటపాడే కోయిల గొంతెందుకు మార్చింది. లాలిత్యం వుట్టిపడే గొంతు పాషాణంలా ఎందుకు మారింది? ప్రేమ పురస్కారాలకు నెలవైన జబీన్ అక్షరాలు ఎందుకిలా తిరస్కారాలై అగ్గిని కురిపించాయి. ఒక్క క్షణం ఆలోచిస్తే... ఇటీవల ఢిల్లీలో ‘నిర్భయ’పై మృగాళ్లు జరిపిన సామూహిక అత్యాచారం కళ్లముందు కదలాడింది. బాధ ఎవరిదైనా బాధే. కానీ ఎవరి బాధ వారి గొంతులో వింటేనే దాని తీవ్రత తెలుస్తుంది. సాటి స్ర్తికి జరిగిన అన్యాయం జబీన్ గొంతులో లావాలా ఉబికొచ్చింది. నిందితుల సంగతి సరే, చిన్న వెజైనాను కూడా కాపాడలేని ఈ ప్రభుత్వానికి రక్షణ వ్యవస్థకు ఆమె సూటిగా విసిరిన సవాలు సామాన్యమైంది కాదు. సభ్య సమాజం, మన సోకాల్డ్ ప్రభుత్వం సిగ్గుతో తల బాదుకుని చావవలసిన పరిస్థితి. భావ వ్యక్తీకరణ కవిత్యానికి ఆయువుపట్టు లాంటిది. సమస్య తీవ్రతను బట్టి వ్యక్తీకరణ ఎంత ధాటిగా వుంటే పాఠకుడి గుండెకు అంత సూటిగా గుచ్చుకుంటుంది. కవిత్వపు చెమ్మ గుండెను తడిపి పాఠకుడ్ని తనతో పాటు మమేకం చేసుకుంటుంది. జబీన్ కవిత కూడా అదే చేసింది. ఈ కవిత పాఠకుడ్ని ఆలోచనలో ముంచెత్తి కళ్లు ఎర్రబారేలా చేస్తాయి. ఫెమినిజం తాలూకు తీవ్రతతోపాటు తనను హింసించే ఈ వ్యవస్థను నిలదీసే ‘తెగువ’ ఈ కవితను ఎంతో ఎత్తుకు తీసుకుపోయింది.
‘‘ఈ వ్యవస్థ ముఖంమీద / నా సిగ్గుబిళ్లను విసిరేసి వెళ్తున్నాను/ అత్యాచారాల చరిత్ర పేజి లేని నేలమీద / మళ్లీ వెజైనాతో పుట్టాలని వుంది / మళ్లీ... మళ్లీ... స్ర్తిగానే!
- అంటుంది గుండెలనిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకొన్న జబీన్. రక్షణ కల్పించాల్సిన రాజ్యాన్ని, రాజ్యాంగాన్ని నిలదీసి ‘‘నువ్వూ నీ సెక్యూరిటీ కలిసి / ఒక చిన్న వెజైనాను రక్షించలేకపోయాయి / డ్ద్ఘౄళ యశ క్యఖ’’ అంటూ ఈసడించిన విధానం ఎంతో ఆలోచనాత్మకంగా వుంది. ఇనుప కచ్చడాల నుండి బికినీ దాకా / సాగిన నాగరిక ప్రయాణంలో లైంగిక దోపిడీ తప్ప మరింకేమీ లేదని వ్యవస్థమీద తుపుక్కున ఉమ్మేసిన జబీన్ ఫెమినిస్టు కవిత్వానికి ఈ దశాబ్దపు మరో వాగ్దానంగా నిలిచింది. సమాజంలో లైంగిక అత్యాచారాలకు గురవుతున్న స్ర్తిల బాధను ఓ కదలాడే చిత్రంగా సజీవంగా మన కళ్లముందు నిలిపింది జబీన్. (నాకైతే త్వమేవాహమ్ కావ్యంలో రజాకార్లచేత చెరచబడిన స్ర్తి బాధను ఆరుద్ర ఆవిష్కరించిన తీరు గుర్తొచ్చింది).
‘నేను మనిషిగా కాక అవయవంగా కనిపించాను / నా శరీరం వాళ్లకు వెజైనాగా కనిపించింది’ అనడంలోనే స్ర్తి పట్ల సమాజానికున్న చిన్నచూపు అర్థమవుతుంది. అత్యాచారానికి గురవుతున్నప్పుడు కూడా అబలగా బేలపడకుండా సబలగా తిరుగుబాటు చేయాలన్న ఆత్మవిశ్వాసాన్ని జబీన్ ఆవిష్కరించిన తీరు కొత్తగా వుంది. ‘నామీద లైంగిక దాడి జరుగుతున్న క్షణాన / నేను తుమ్మ ముల్లునై / వాళ్లకు గుచ్చుకోవాలని అనుకున్నాను / విషకన్యను కానందుకు చింతించాను / నా వెజైనా మీద హింస పరాకాష్ఠకు చేరుకున్న / ఆ అవాంఛిత విషాద సమయంలో / నేను అస్తిత్వం కోసం ప్రతిఘటించాను / పోరాడి గాయపడి, చివరికి ముగిసిపోయాను’ అంటుంది. ఈ కవితలో సరికొత్త జబీన్‌ను చూశాను. ఫెమినిజంలో చివరి పాఠాన్ని ఈరోజే చదివిన అనుభూతిని పొందాను.
ఫెమినిస్టుల కవిత్వంలో ఇటువంటి తెగింపు కొత్తేమీ కాదు. రేవతీదేవి స్ర్తి హృదయాన్ని ‘రసజ్వలిత దాహంతో వెచ్చగా విచ్చుకున్న నెత్తురు పువ్వుతో వర్ణిస్తే... చింతల నెమలి (1997 ఆగస్టు)లో జయప్రభ ఎన్నో అడుగులు ముందుకేసి స్ర్తి జననాంగాన్ని మృదుపుష్పంతో, ఆల్చిప్పతో, అత్తిపండుతో, ముఖమల్ వస్త్రంతో పోల్చారు. ‘అది నా నల్లచిరుత / కొమ్ముల దుప్పి / కుందేటి పిల్ల / అది రతీదేవి / దాన్ని రెచ్చగొట్టకు / ముకుళించుకు పోగలదు సుమా / దాన్ని బాధ పెట్టకు’’ అంటూ జయప్రభ ఆనాడే హెచ్చరించింది.
రాక్షస సంచారమో / రక్త ఝరీ ప్రవాహమో / ప్రణయ కావ్యమో / ప్రాచీ రాగమో / ఈ దేహం / అనుభవ వేదమో / అజ్ఞాన తిమిరమో / ఆచంద్ర తారార్కమో దేహం? అంటూ స్ర్తి దేహభాష (ఱ్యజూక జ్ఘశఖ్ఘ్ళ)ను కూఢా ప్రకటించింది. స్ర్తిలపై అత్యాచారాలు జరిపే నరహంతకుల అంగాల్ని తెగనరకాలంటుంది జయప్రభ (ది పబ్ ఆఫ్ వైజాగ్ పట్నం - శత్రువు చేయి) ‘సామూహిక బలాత్కారాలకు ఎర అయి లైంగిక హింస పడిన స్ర్తిల మనశ్శరీరాల క్షోభనూహించగలరా? అంగాన్ని ఆయుధంగా చేసుకున్న నర పశువుల అంగాల్ని - తెగనరకాలని మాకుంటే హింసకి ప్రతిహింస ఎలా తప్పవుతుందిరా?’ అని ప్రశ్నిస్తుంది. ‘ఒకే ఒక జయప్రభ’. స్ర్తిలపై జరుగుతున్న హింసను ఎదుర్కోవాల్సింది కూడా స్ర్తిలే అన్నది జయప్రభ అభిప్రాయం.
గర్భంలో జరిగే శిశుదశ నుంచి ఆడతనంపై అత్యాచారం... హత్యాచారం అలవాటుగా మారిన ఈ సమాజంపై జయప్రభ యుద్ధం ప్రకటించింది. ‘ద్వాపరం నాటి వస్త్రాపహరణం సభ / ఈనాడు పునరావృతమగుట వ్యథ’ అంటూ అనసూయ కూడా శృతి కలిపింది. అందమైన దోపిడీకి / పవిత్రమైన హింసకు న్యాయమైన దాస్యానికి / బలైపోయిన నేను భారత స్ర్తినంటూ ఓల్గా పడిన ఆవేదనలో వ్యవస్థ పట్ల ఛీత్కారింపూ ఉంది. స్ర్తి స్వేచ్ఛ కోసం, రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం లేదు. ముందు మన ఆలోచనల్లో మార్పు రావాలి. స్ర్తిని స్ర్తిగా చూడగలగాలన్నది ఫెమినిస్టుల వాదన.
ఒకపక్క కుటుంబంలో మరోపక్క బయట జరిగే అణచివేత, అత్యాచారం జుగల్బందీగా స్ర్తి జీవితాల్ని దుర్భరం చేస్తున్నాయి. రక్షించాల్సిన ప్రభుత్వాలు, న్యాయం చెప్పాల్సిన వ్యవస్థలు నిస్సహాయంగా న్యాయాన్ని నీరుగారుస్తున్నాయి. నిజానికి స్ర్తిలపై జరిగే అన్యాయాలకి, అత్యాచారాలకి స్ర్తి బాధ్యతేమీ లేదు. నిన్నటి మధుర, రమీజాబి, మాయాత్యాగి, నేటి నిర్భయ యిందుకు సాక్ష్యం. మధుర కన్య కాదని, రేప్‌కు ప్రతిఘటించలేదనే కారణాలు చూపి ఈ కేసులో శిక్షలు పడిన పోలీసులు నిర్దోషులుగా బయటపడ్డారు. అలాగే రమీజాబీపై ‘వేశ్య’ అనే ముద్రవేసి నిందితులు తప్పించుకున్నారు.
తాజాగా సూర్యనెల్లి గ్యాంగ్ రేప్ బాధితురాలిని వేశ్య అంటూ ఓ పార్లమెంటు సభ్యుడు వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే మాయాత్యాగికి బందిపోట్లతో సహవాసం వుందన్న సాకు చూపి దోషులు శిక్షకు దూరమయ్యారు. ఢిల్లీ రేప్ కేసు బాధితురాలు నిర్భయ కూడా అత్యాచార సమయంలో ప్రతిఘటించి వుండాల్సిందన్న వ్యాఖ్యలూ వినిపించాయి. ఇప్పుడు ఆమె చనిపోయింది. కేసు విచారణలో వుంది. నిందితులకు ఏ శిక్ష పడుతుందో తెలీదు.
ఒకప్పుడు స్ర్తిలు తమ భావాల్ని వెల్లడి చేయడానికి తగిన పరిస్థితులు లేవు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చింది. చైతన్యంతో స్ర్తి ముందడుగు వేస్తోంది. ఇన్నాళ్లుగా గొంతు విప్పని స్ర్తి నేడు స్వేచ్ఛగా, నిర్భీతిగా గొంతు విప్పి తన మనోభావాల్ని ప్రకటిస్తోంది. ఫెమినిస్టుల భావ వ్యక్తీకరణలో భాష పచ్చిగా వుండొచ్చు. ‘సంస్కారవంతులకు’ అభ్యంతరకరంగా వుండొచ్చు. కానీ ఆ భాషలోని బాధ తీవ్రతను అర్థం చేసుకుంటే వ్యక్తీకరణలోని నిజాయితీ అర్థమవుతుంది.
స్పందన
english title:
spandana
Date:
Monday, February 25, 2013