స్పందన
=====
‘సాహితి’లో 11.02.2013న ‘ఉదాత్త రచనతో సాహిత్య ధర్మం’ శీర్షికన ఓల్గా కవిత్వంపై ఎం.నారాయణశర్మగారి విశే్లషణను చదివాక నా స్పందన. ఫెమినిస్టు కవయిత్రులకు పురుషాధిక్య సమాజం పై కసి, కోపమూ వుంటాయి. ఈ లక్షణాలు వారి కవితల్లో స్పష్టంగా కనిపిస్తాయి. అయితే వీళ్లు తమ కవితల్లో కసిని, కోపాన్ని మాత్రమే కూరితే సరిపోతుందా? కవితలన్నాక వాటిలో కవిత్వం కూడా వుండాలి కదా! ఓల్గా వెలువరించిన ఏకైక కవితా సంపుటి ‘కొన్ని కవితలు’ చదివినపుడు వాటిలో కవిత్వం పాలుకంటే కసి, కోపాల తీవ్రతే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కవితల్లో ‘పురుషాహంకారపు పెద్దపులి’పై స్వారీ చేయాలన్న తపనలో కవిత్వం కాస్తా పలచబడిపోయింది.
1972 నుండి 2009 వరకు అంటే 37 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఓల్గా అప్పుడప్పుడు జరిగిన సంఘటనలకు స్పందించి రాసినవి, అలవోకగా అల్లినవీ, స్ర్తివాద ఉద్యమకారిణిగా ఎలుగెత్తినవీ అన్నీ కలిపి 48 కవితల్ని యేర్చి కూర్చి సంపుటిగా తెచ్చారు. అందరూ హర్షించవలసిన ప్రయత్నం యిది. అయితే ఓల్గా కవితా ప్రస్థానాన్ని పరిశీలిస్తే కవయిత్రిగా ఆమె ఇంకా ఉనికిని చాటుకునే ప్రయత్నంలోనే వున్నారనిపిస్తోంది. ఈ కవితా సంపుటిలో మనసును తాకేవి చాలా తక్కువగా వున్నాయి. కొన్ని కవితల్లో అక్కడక్కడా ‘మెరుపుల్ని’, మరికొన్నిటిలో అయితే జీర్ణించుకోలేని ‘మరకల్ని’ కూడా చూడొచ్చు. ఇంకొన్నయితే మరీ సాదాసీదాగా వున్నాయి. వచనం నడ్డి విరగ్గొట్టి కవితా పాదాలుగా పేర్చిన కవితలు కూడా తక్కువేం కాదు. మొత్తానికి ఈ సంపుటిలో భద్రంగా దాచుకోవాల్సిన కవితల కంటే చదవగానే మరిచిపోయేవి చాలానే వున్నాయి. ఓల్గా ఫెమినిస్టుగా స్ర్తివాద ఉద్యమంలోకి వచ్చి నాలుగు దశాబ్దాలు దాటుతున్నాయి. కథ, నవలా రచయిత్రిగా ఇప్పటికే ఆమె తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇక యిప్పుడు కవయిత్రిగా నిలబడటానికి ఈ కవితా సంపుటి ఏమాత్రం ఉపయోగపడుతుందో కాలమే చెప్పాలి. ఫెమినిస్టు రచయిత్రిగా పురుషాధిక్య సమాజంపై కనె్నర్ర చేసి నిప్పులు కురిపించడం ఓల్గాకు కొత్తేమీ కాదు. అదే ధోరణి ఈ కవితల్లో కూడా కొనసాగింది. అందువల్లనే ఏమో కవితల్లో కవిత్వం కంటే ‘ఫెమినిజమే’ డామినేట్ చేసింది. ‘నేను పతివ్రతా తల్లిని కాను/ ప్రబంధ కన్యను కాను/ పంచదార చిలకను కాను/ ఫ్యాషన్ పెరేడ్ బొమ్మను కాను’ అన్నపుడు ఓల్గా వకాల్తా పుచ్చుకున్న స్ర్తి ఉద్యమకారిణిగా కనబడతారు.
స్ర్తి, పురుషుల మధ్య మోహం లేని ప్రేమవృధా అంటాడు చలం. ఓల్గా కూడా చలం చిటికిన వేలు పట్టుకొని ముందుకు నడిచినట్లుంది. ‘రాత్రంటే నీకు నిద్రావస్థ/ నాకు భగ్న స్వప్నం’ అంటూ ఉస్సురంటుంది. ‘ఇది కలలు లేని/ కటిక నిజాల రాత్రి’ అన్నపుడు ఓల్గా వేడి నిట్టూర్పు సెగ పాఠకుడ్ని తాకుతుంది. వామపక్ష ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ఓల్గా తొలినాళ్ల కవితల్లో ఎక్కువగా నినాదాలే కనిపిస్తాయి, వినిపిస్తాయి. కానీ నారాయణశర్మ గారికి ఓల్గా కవిత్వంలో నినాదాల కంటే విధానాలే ఎక్కువగా కనిపించడం ఆశ్చర్యంగా వుంది. పాఠకుడు ఏ కవిత్వం చదివినా అందులోని వెళ్లి పోవాలన్న శర్మగారి మాటలు ఓల్గా కవిత్వానికి వర్తించడం కష్టమే. ‘పాటలూ నినాదాలు నింపుకున్న/ వెయ్యి రేకుల పుష్పం నా గొంతు’ అంటూ ఓల్గానే స్వయంగా చెప్పుకున్నారు. ‘మనిషిని కాను అష్టమభోగాన్ని’ ‘వెలి వేయబడ్డ చీకటి బ్రతుకుని’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తారు ఓల్గా. ఇక పచ్చిగా రాయడం ఫెమినిస్టు లక్షణం అన్న నానుడికి తాను కూడా ఏమాత్రం తీసిపోనన్నట్లుగా అక్షరాలకు వేడిపుట్టించే ప్రయత్నం చేస్తారు. ఇక చలి కాచుకోవడం పాఠకుల వంతు. ఫెమినిస్టుగా ఓల్గా నిబద్ధతను శంకించడం సాహసమే అవుతుంది. ఓల్గా నవలలు, కథలు చదివితే ఫెమినిజం ఆమెలో ఎంతగా జీర్ణించుకుపోయిందో ఇట్టే అర్థమవుతుంది. అయితే తాను నమ్మిన విధానాన్ని కవిత్వంలో ఇమడ్చడం ఎంత కష్టమైనదో కవయిత్రి ఓల్గాకు బాగా తెలిసొచ్చి వుండాలి. నాదాలు, నినాదాలు, విధానాలు ముడిపదార్థాల వంటివి. వాటితో అందమైన కవిత్వనగ చేయబూనడం దుస్సాహసమే. ఎంతో చేయి తిరిగిన కవులకు గానీ ఈ ఫీటు అలవడదు. ఈ విషయంలో ఓల్గా ఇంకా అక్షరాభ్యాస దశలోనే వున్నారని ఆమె కవిత్వం చదివిన వారెవరికైనా అర్థమవుతుంది.
ఫెమినిస్టు యాక్టివిస్టుగా తానుపడే యాతనను, ‘సహజీవనం’లోని రాత్రుల మాధుర్యం, అలాగే చిన్ననాటి రాత్రుల వేదన వ్యవసాయ కూలి రోదనకు కవిత్వ పూత పూయాలనే ప్రయత్నం చేశారు. ‘మెహందీ స్ర్తిల విజ్ఞప్తి’లో ‘చావటానికి మా దగ్గరకు రాకండి/ బతకటానికి నానా చావూ చస్తున్నవాళ్లం’ అన్న మాటలు పాఠకుల్ని ఆలోచింపజేస్తాయి. మొత్తంమీద ఓల్గా కవిత్వంలో పెద్దగా చెప్పుకోదగ్గ విశేషం ఏమీలేదు. కానీ ముప్ఫయ్ ఏడేళ్ల సుదీర్ఘ సామాజిక జీవనయాత్రలో జరిగిన వివిధ సంఘటనల పట్ల ఓల్గా స్పందనగా ఆమె కవిత్వాన్ని చూడాలి. అంతే.
స్పందన
english title:
spandana
Date:
Monday, February 25, 2013