విశాలాక్షినగర్, ఫిబ్రవరి 25: మార్గశిరమాసం పౌర్ణమి సోమవారం శుభఘడియలు రావడంతో భక్తులు సముద్రస్నానాలు ఆచరించారు. వేకువజామున సాగరతీరానికి చేరుకొని సూర్యనమస్కారాలు ఆచదించి పూజలు నిర్వహించారు. మార్గశిర మాసంలో సూర్యభగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తోంది. హిందూధర్మ శాస్త్రం అపకారం మాఘమాసంలోని పౌర్ణమినాడు పితృదేవతలకు తర్పణం విడువడం, పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా భావిస్తారు. వేలాది మంది కుటుంబాలు తమ పితృదేవతలకు తర్పణం విడిచి పూజలు చేపట్టారు. అదే విధంగా మంత్రోపదేశాలు జరిగాయి. అనంతరం సముద్రస్నానం ఆచరించి దేవాలయాలకు వెళ్ళి తమ ఇష్టదేవతలకు పూజలు చేశారు. వేలాది మంది భక్తులు రాకతో సాగరతీరం భక్త్భివంతో తొణికిసలాడింది.
విశాఖను ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలి
విశాలాక్షినగర్, ఫిబ్రవరి 25: పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టబోయే రైల్వేబడ్జెట్‌లో విశాఖను ప్రత్యేక రైల్వేజోన్‌గా ప్రకటించాలని కోరుతూ రైల్వేస్టేషన్ ఎదుట పోలిటికల్ జెఎసి ప్రతినిధులు వినూత్న నిరసన చేపట్టారు. సోమవారం రైల్వేస్టేషన్ ఎదుట కోడిగుడ్లు, టమాటాలను చూపుతూ వినూత్న నిరసన చేపట్టి స్థానిక పార్లమెంట్ ప్రతినిధులు పోరాడి రైల్వేజోన్ సాధించాలంటూ విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా పొలిటికిల్ జెఎసి రాష్ట్ర కన్వీనర్ జెటి.రామారావు మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్ కోట్లాది రూపాయలు లాభాలు ఆర్జిస్తున్నా అభివృద్ధి అంతంత మాత్రమేనని ఆవేదన వ్యక్తపరిచారు. విశాఖ రైల్వేజోన్ రానున్న బడ్జెట్ సమావేశంలో ప్రకటించకపోతే స్థానిక పార్లమెంట్ సభ్యులకు కోడిగుడ్లు, టమాటాలతో స్వాగతం పలికి నిరసన తెలియజేయక తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కె.రామారావు, బి.శ్రీనివాసులునాయుడు, నిమ్మకాయల శ్రీను, గొలగాని లక్ష్మి, శకుంతల తదితరులు పాల్గొన్నారు.