ఉగ్రవాదుల మృత్యుక్రీడలో మరో 16 మంది బలయ్యారు. 119 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 21న జరిగిన బాంబు పేలుళ్లు హైదరాబాద్ చరిత్రలో మరో విషాదకరమైన రోజు. ఈ ఘోరకలికి బాధ్యులెవరు ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బాంబు దాడులకు పాల్పడిన దోషులకు సంబంధించి పోలీసులకు బలమైన ఆధారాలు ఇంకా లభించలేదు. ఉగ్రవాదులు దాడి చేయవచ్చుననే హెచ్చరికలు ఉన్నా, ప్రమాదాన్ని నివారించ లేకపోయారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి దిల్‌సుఖ్‌నగర్‌లో ఫిబ్రవరి 21న బాంబుపేలుళ్ల సంఘటనను పోలీసులు అప్రమత్తంగా ఉంటే నివారించదగిన సంఘటనగా చాలా మంది భద్రతా నిపుణులు భావిస్తున్నారు. ఈ ఘోరకలి జరగడానికి నిఘా విభాగం వైఫల్యమే అన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. తాము అప్రమత్తంగానే ఉన్నామని పోలీసులు సమర్థించుకున్నా, నిఘా వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. అదే సమయంలో ప్రజల బాధ్యతను కూడా మనం విస్మరించరాదు. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే దేశంలో ఉగ్రవాదులు తెగబడే అవకాశం ఉందని అన్ని శాఖలను, ప్రభుత్వాలను హెచ్చరించామని, ప్రత్యేకంగా కొన్ని నగరాలకు హెచ్చరికలు పంపామని చెప్పారు. ఫలానా సమయంలో ఫలానా చోట దాడులు జరుగుతాయని చెప్పలేమని, కాని ముందస్తుగా అప్రమత్తం కావాలంటూ హెచ్చరిక జారీ చేశామని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆర్‌పి సింగ్ కూడా అఫ్జల్‌గురు, కసబ్‌లకు ఉరిశిక్షను అమలు చేసిన నేపథ్యంలో పేలుళ్లకు ఉగ్రవాదులు పాల్పడవచ్చనే నిఘా సమాచారం తమ వద్ద ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, డిజిపి వి దినేష్‌రెడ్డి వేరువేరుగా నిర్వహించిన విలేఖర్ల సమావేశాల్లోమాట్లాడుతూ తమకు జనరల్ అలర్ట్‌లు మాత్రమే వచ్చాయన్నారు.
ఢిల్లీ పోలీసులు గత ఏడాది అక్టోబర్ నెలలో ఉగ్రవాది మక్బూల్‌ను అరెస్టు చేశారు. అతనిని విచారించిన తర్వాత పోలీసులు రాష్ట్ర పోలీసు శాఖకు ఒక నివేదిక పంపించారు. హైదరాబాద్‌లో బేగంబజార్, దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబుపేలుళ్లకు కుట్ర పన్నానని మక్బూల్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమై ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా దిల్‌సుఖ్‌నగర్‌పై ఉగ్రవాదుల గురి ఎప్పటినుంచో ఉంది. 2002లో ఇక్కడ స్కూటర్ బాంబు పేలింది. 2007లో ఇదే ప్రాంతంలో ఫుట్ ఓవర్ వంతెన వద్ద ఒక పేలని బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా అదే ప్రాంతంలో జంట బాంబులు పేలి 16 మంది బలయ్యారు. మొదటి నుంచి దిల్‌సుఖ్‌నగర్ ఉగ్రవాదుల లక్ష్యంలో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో నిరంతరం పర్యవేక్షణ చేసి ఉండాల్సిందన్న భావన వ్యక్తమవుతోంది. నిఘా విభాగం ఇక్కడే విఫలమైంది. నిఘా విభాగం పనితీరు తెలుసుకోవాలంటే ఇజ్రాయేల్, అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాల గురించి ప్రస్తావించుకోవాలి. మన పోలీసులు పేలుళ్లు జరిగినప్పుడు చాలా హడావుడి చేసి వారం రోజుల తర్వాత రొటీన్‌లో పడిపోతారు. కాని ఆ దేశాల్లో ఒక ఉగ్రవాది కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తారు. అలుపు సొలుపు ఉండదు. కొన్ని వందల రాత్రులు, పగళ్లు వృథాగా పోయాయని భావించరు. కానీ ఏదో ఒకరోజు ఆ నిందితుడిని పట్టుకుంటారు. లేదా మంచి క్లూ సాధించి పేలుళ్ల సంఘటనలను నివారిస్తారు. ఆ దీక్ష, పట్టుదల మన పోలీసు శాఖలో లేదనే విమర్శ వినిపిస్తోంది. దీనికి పోలీసు శాఖను మాత్రమే నిందించి లాభం లేదు. మన రాజకీయ వ్యవస్థలో మొదటి నుంచి నిఘా వ్యవస్థను రాజకీయ నిఘా కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇదే మన పాలిట శాపంగా మారింది. సున్నిత అంశాలతో ముడిపడి ఉన్న హైదరాబాద్ లాంటి నగరంలో నిఘా విభాగం నిరంతరం పని చేయాలి. మత ఉగ్రవాద సంస్థల కదలికలను కనిపెట్టే నిఘా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఉండాలి. వారికి వేరే ఏ పనీ అప్పగించరాదు. కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం దాదాపు నిర్వీర్యమైంది. 2007 బాంబు పేలుళ్లలో 55 మంది మరణించారు. అనంతరం అప్పటి ప్రభుత్వం ఆక్టోపస్ సంస్థను ఏర్పాటు చేసింది. కాని ఆక్టోపస్‌ను కూడా నిర్వీర్యం చేశారు. ఆక్టోపస్‌కు దర్యాప్తు, నిఘా, గాలింపు చర్యలు, అరెస్టు చేసే తదితర అధికారాలు ఉండాలి. అవేమి లేకుండా కేవలం ఒక గార్డు విధులను నిర్వహించే సంస్థగా ఆక్టోపస్ మారిందనే అభియోగాలున్నాయి. వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఎస్‌ఐబి లాంటి మంచి నిఘా సంస్థను ఏర్పాటు చేశారు. మెరికల్లాంటి వారితో గ్రేహొండ్స్ దళాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలను నిర్వహించి వామపక్ష తీవ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించారు. ఆ తరహా పోలీసు నాయకత్వం, శిక్షణ ప్రస్తుతం లేదు. ఉగ్రవాదం అడవుల్లో ఉండదు. జనావాసాల్లో ఉంటుంది. వీరు సాదాసీదా వ్యక్తులే. వీరిని పట్టుకోవడం, శిక్షించడం వెనుక పెద్ద కసరత్తు చేయాల్సి ఉంటుంది. రాజకీయ వత్తిడులుంటాయి. వామపక్ష తీవ్రవాదం కంటే ప్రమాదకరమైనది ఉగ్రవాదం. వామపక్ష తీవ్రవాదులకు శత్రువు పెట్టుబడిదారులు, పోలీసులు. కాని ఉగ్రవాదులకు ఒక వర్గం శత్రువులంటూ ప్రత్యేకంగా ఉండరు. మన దేశంలో జాతీయ స్థాయిలో ఉగ్రవాదుల కదలికల సమాచారాన్ని పంచుకునే యంత్రాగం అంతంత మాత్రమే. నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన తర్వాత కొంతలోకొంత మెరుగుపడింది. కాని ఈ వ్యవస్థ పనితీరు ఇంకా మెరుగుపరచాల్సి ఉంది. నిఘా విభాగంలో ఉండే వారికి ఉగ్రవాదులు మాట్లాడే భాష తెలిసి ఉండాలి. ఇచ్చిన పని పూర్తి చేయడం కోసం సర్వం త్యాగం చేసే దృక్పథం ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే దేశభక్తి కలిగి ఉన్నవారే ఈ తరహా నిఘా విభాగంలో పనిచేసేందుకు అర్హులు. కాని మన పోలీసు యంత్రాంగం, రానున్న రోజుల్లో ఇంకా విజృంభించనున్న ఉగ్రవాదం ముప్పును ముందుగా పసిగట్టి పీచమణిచే స్థాయకి ఎదిగే విధంగా తీర్చిదిద్దాలంటే రాజకీయ నాయకత్వం ఆలోచనా ధోరణలు మారాలి. అలాగే పోలీసు యంత్రాంగాన్ని విఐపిల భద్రతకు ఉపయోగించే విధానాలకు స్వస్తి చెప్పాలి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలీసు సంస్కరణలను అమలు చేయాలి.
శాంతి భద్రతలు పర్యవేక్షణ, దర్యాప్తు విభాగం, నిఘా విభాగం పనులకు పోలీసులను ఉపయోగించుకోవాలి. ఈ విభాగాలను వేరు చేయాలి. అన్నింటికి మించి రాష్ట్ర స్థాయిలో, రాష్ట్రం, కేంద్రం మధ్య, రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండాలి. ఈ సమన్వయం లేని పక్షంలో వ్యవస్థను ఎంత ప్రక్షాళన చేసినా, ఆధునీకరించినా ఉపయోగం ఉండదు.
ప్రభుత్వ లోపం లేదు
దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబుపేలుళ్ల సంఘటనలకు సంబంధించి ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదు. దీన్ని నిఘా వైఫల్యం అనడానికి కూడా వీలులేదు. ప్రభుత్వం ప్రతిక్షణం అప్రమత్తంగానే ఉంది. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏదైనా సంఘటన జరగగానే ‘ప్రభుత్వ వైఫల్యం’ అంటూ విపక్షాలు విమర్శిస్తుండటం సహజమే. అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ ఉగ్రవాదం, తీవ్రవాదంపట్ల కఠినంగా ఉండాల్సిందే! మా ప్రభుత్వం కూడా ఉగ్రవాదులు, తీవ్రవాదులపట్ల కఠినంగానే ఉంది. పోలీసు వ్యవస్థ, ఇంటెలిజెన్స్ నిఘా ఉండటం వల్ల శాంతిభద్రతల పరిస్థితి అదుపులోనే ఉంది. అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో కొన్ని పర్యాయాలు బహిరంగంగా వెల్లడించడానికి వీలు కాకపోవచ్చు. అలా వెల్లడించడం సరైన విధానం కాదు. ఉగ్రవాదులు, తీవ్రవాదులకు సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుందో బహిరంగంగా వివరించదు. అందువల్ల ప్రభుత్వం పనిచేయడం లేదని, పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిందని, నిఘా వైఫల్యం అయిందని ఆరోపించడం సరైంది కాదు. కొన్ని అంశాలను బహిరంగంగా చర్చించడం మంచిది కాదు. సంక్షేమ కార్యక్రమాలో, అభివృద్ధి కార్యక్రమాలపైనే చర్చ జరిగితే అర్థం చేసుకోవచ్చు. వీటిపై అందరి అభిప్రాయాలు తీసుకోవడంలో తప్పు లేదు. అయితే శాంతిభద్రతల పరిస్థితి, ఉగ్రవాదులు, తీవ్రవాదుల విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలపై చర్చించడం వల్ల మంచికన్నా కీడే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ నిఘా వైఫల్యం వల్లనే ఈ సంఘటన జరిగినట్టు రూఢీ అయితే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రమాద హెచ్చరికలను తేలిగ్గా ఏమీ తీసుకోలేదు.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దర్యాప్తు సంస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) పేలుళలపై దర్యాప్తు జరుపుతున్నాయి. ఇప్పటికే అనేక పర్యాయాలు ఉన్నతస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి కూలంకషంగా చర్చించాం. ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తూనే, మరోవైపు ప్రజల సహకారం కూడా కోరాం. బాంబుపేలుళ్ల సంఘటనకు సంబంధించిన ఉగ్రవాదుల సమాచారం అందించాలని, అలా అందించిన వారికి పదిలక్షల రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించాం. ఈ విధంగా ప్రకటించడాన్ని కూడా కొందరు తప్పు పట్టారు. మన దేశంలోని ఇతర రాష్ట్రాలు, ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఈ విధమైన ప్రకటనలు చేస్తుంటాయి. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చేందుకు ముందుకు వచ్చేవారికి ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఏ ప్రభుత్వమైనా ఈ విధమైన ప్రకటన చేయడం సాధారణమే. ప్రభుత్వపరంగా పదిహేను దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి. దర్యాప్తు కొనసాగిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. కీలకమైన ప్రాంతాల్లో 450 కోట్లతో 3,500 క్లోజ్‌డ్ సర్క్యూట్ (సిసి) కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలైన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, భారీ దుకాణాలు, పెద్ద ఆసుపత్రులు, సినిమా థియేటర్లలో సర్విలెన్స్ కెమెరాలను పెట్టాలని నిబంధనలను పెడుతున్నాం. కేంద్రం సహకారంతో ఉగ్రవాదులు, తీవ్రవాదులపై కఠిన చర్యలు చేపడతాం.
- పట్లోళ్ల సబితారెడ్డి, హోం శాఖ మంత్రి
హెచ్చరించినా పట్టించుకోరా?
హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్ల విషయంలో రాజకీయ పార్టీలన్నీ తమ విభేదాలను విస్మరించి దేశ రక్షణ కోసం ప్రజల హితం కోసం ఏకం కావల్సిన అవసరం ఉంది. దేశాన్ని అస్థిరపరచాలని, ఆర్థికంగా బలహీన పరచాలని, ఆంతరంగిక కలహాలు సృష్టించి మతాన్ని ఆయుధంగా వాడుకుని ప్రజల్లో విభేదాలు సృష్టించాలని, ప్రోత్సాహాన్నిచ్చి, శిక్షణ ఇచ్చి, నిధులిచ్చి, విధులు కూడా తెలియజెప్పి సరిహద్దులు దాటించి మన శత్రువులు భారతదేశానికి పంపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పథకం ప్రకారం దేశాన్ని ప్రచ్చన్న యుద్ధం ద్వారా బలహీన పరచాలనే ప్రయత్నం జరుగుతోంది. దీనిని మనం గుర్తించలేకపోతే, సమైక్యం కాకపోతే దేశానికి తీరని హాని చేసిన వారం అవుతాం. కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు పంపించినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? ఆ హెచ్చరికలను ఎందుకు ఖాతరు చేయలేదు? హెచ్చరికలు అందాయా లేదా కేంద్రం చెప్పింది నిజమేనా కాదా అనేదైనా రాష్ట్ర ప్రభుత్వం వివరించాలి. సిసి కెమేరాలు పనిచేయడం లేదని, మరొకటని అంటున్నారు అదంతా నిజమేనా కాదా అన్నది కూడా వివరించాలి. ఇటీవల కమిషనర్ వివరణలో ఈ విషయం కొంత స్పష్టం చేసినా ఇంకా ప్రజల్లో అనుమానాలు నివృత్తి కాలేదు. వీటన్నింటికీ ఎవరు జవాబుదారీ వహిస్తారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. నిజమైన పోలీసు అధికారులు ఎ.కె. మహంతి, రాజీవ్ త్రివేది వంటి వారిని విధుల నుండి తప్పించి, రాజకీయ వత్తిడులకు లొంగి ఓటు బ్యాంకు రాజకీయాలకు ఈ ప్రభుత్వం పాల్పడింది. నగరంలో స్లీపింగ్ సెల్స్ ఉన్నాయని ప్రభుత్వానికి తెలుసు, అలాంటపుడు వాటిపై ఏం చర్యలు తీసుకుంది? అలాగే అఫ్జల్ గురు ఉరితీత తర్వాత హుజీ, జిహాది కౌన్సిల్, లష్కరే తోయిబా తదితర సంస్థలు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాయి కదా... ఎందుకు అప్రమత్తం కాలేకపోయారు? ఒకవేళ స్పందించి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండి... వీటన్నింటినీ స్పష్టం చేయాలి. కేంద్రం ఇచ్చిన హెచ్చరికను రొటీన్‌గా ముఖ్యమంత్రి చెప్పడం చాలా ఆశ్చర్యకరం. కేంద్రం అలాంటి హెచ్చరికలు ఇవ్వకపోతే డోర్ నెంబర్‌తో సహా ఇస్తారా. అన్నీ వారే ఇస్తే ఇక రాష్ట్రం చేస్తున్నది ఏమిటి? కేంద్ర ఇంటెలిజెన్స్ బృందాలు ఎన్నో హెచ్చరికలు చేసినా పట్టించుకోకపోవడం ఏమిటి? అదే జరిగితే కౌంటర్ ఇంటెలిజెన్సీలు, ఆక్టోపస్‌లు, ఇంటెలిజెన్స్ బ్యూరోలు ఇవన్నీ ఎందుకు? మాకు తెలియదని చెప్పడానికైనా ప్రభుత్వానికి సిగ్గుండాలి... ఇదంతా ఒక ఎత్తయితే, పాకిస్తాన్ ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డాగా మారిన విషయం కొత్త కాదు, 1991 నుండి వరుసగా ఎన్నో సంఘటనలు, బాంబు దాడులు జరిగాయి. నందరాజ్ గౌడ్, పాపయ్య గౌడ్‌లను ఆనాడే చంపారు. 1994, 1995, 2002లో అనేక ఘటనలు జరిగాయి. 2005లో టాస్క్ఫోర్సు ఆఫీసు ముందు, 2007లో మక్కా పేలుళ్లు జరిగాయి. గోకుల్‌చాట్, లుంబిని పార్కు ఘటనలు జరిగిన తర్వాత కూడా హైదరాబాద్‌కు టెర్రరిజానికి ఉన్న లింకు ఏమిటి? ఐఎం, హుజీ, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు కొంతమంది నాయకుల సహకారంతో కార్యకలాపాలు సాగిస్తున్నాయని ప్రభుత్వానికి తెలియదా? ముజీబ్ అనే వ్యక్తికి క్షమాభిక్ష పెట్టి, ఐఎస్‌ఐ కార్యకలాపాలకు పాల్పడేందుకు వీలుకల్పించినట్టు కాదా? పాకిస్తాన్ పౌరులు కాలం గడిచినా ఇక్కడే తిష్టవేశారు. దీన్‌దార్ అంజుమాన్ అనే సంస్థ మంచిదని కూడా కొంతమంది సర్ట్ఫికేట్లు కూడా ఇస్తున్నారు. ఈ సంస్థ మీద ఢిల్లీ పోలీసులు ఏం చెప్పారో అందరూ చదువుకోవాలి.. హైదరాబాద్‌లో రెక్కీ గురించి ఢిల్లీ పోలీసులు ఏనాడో చెప్పిన మాట నిజం కాదా... అందుకే ఉగ్రవాదుల పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలని అంటున్నాం. ఓట్ల కోసం మెతకవైఖరి అవలంభిస్తే మనం ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నామో తేల్చుకోండి... అమెరికాలో ఒక ఉగ్రవాద ఘటన జరిగిన తర్వాత మళ్లీ అలాంటి సంఘటన జరగలేదు, కాని భారత్‌లో మాత్రం ఎప్పటికపుడు ఏదో ఒక నగరంలో ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? కారణం ప్రభుత్వ వైఫల్యమే. దీనికి మందు కఠినంగా వ్యవహరించడమే.
-ఎం. వెంకయ్యనాయుడు
బిజెపి సీనియర్ నాయకుడు
మొదటిది కాదు.. చివరిదీ కాదు!
పేలుళ్ల సంఘటన మన రాష్ట్రంలో మొదటిదీ కాదు.. చివరిదీ కాదు. గతంలోనూ ఈ తరహా సంఘటనలు జరిగాయి. భవిష్యత్తులో జరిగే అవకాశాలూ ఉన్నాయి. ప్రజల్లో భయోత్పాతం సృష్టించేందుకు ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఏదో ఒక దుర్ఘటనకు పాల్పడాలన్న ఆలోచనతోనే ఉంటారు. ఉగ్రవాద సమస్య మన రాష్ట్రానికే పరిమితం కాలేదు. ఇది జాతీయ సమస్య. దేశంలో ఎక్కడ ఉగ్రవాద సంఘటనలు జరిగినా.. దానికి హైదరాబాద్‌తో సంబంధాలు ఉన్నాయంటూ వార్తలు వస్తూనే ఉన్నాయ. అంటే ఉగ్రవాదానికి ‘మూలాలు’ హైదరాబాద్‌లో ఉన్నాయని స్పష్టమవుతోంది. ఉగ్రవాదులకు సాధారణంగా పెద్దగా ఆయుధ సంపత్తి ఉండదు. డెటనోటర్లను, పేలుడు పదార్థాలను పేలుళ్లకు ఉపయోగిస్తారు. ఉగ్రవాదులు నేరుగా వీటిని పేల్చేందుకు ముందుకు రాకుండా ఇతరులను ఉపయోగించుకుంటారు. పేలుడు పదార్థాలను సైకిళ్లకో, మోటార్ సైకిళ్లకో అమర్చి ఫలానా స్థలంలో పెట్టిరమ్మంటూ కొంతమంది సహాయం తీసుకుంటూ ఉంటారు. దీని కోసం పెద్దగా శిక్షణ కూడా అక్కర్లేదు. నియామకాలు సైతం అక్కర్లేదు. కొంత మంది యువతను ఆకట్టుకుని తమ పనికానిచ్చేందుకు ఉగ్రవాదులు ఒక ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తుంటారు. ‘స్లీపర్‌సెల్స్’ ఉగ్రవాదులకు సహాయంగా ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉగ్రవాదం ప్రత్యేక సమస్యగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే ‘ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్’ (ఆక్టోపస్) ఏర్పాటు చేయాల్సి వచ్చింది. టెర్రరిస్ట్ కార్యకలాపాలు శాంతిభద్రతల సమస్య అయినప్పటికీ, దీన్ని మరో కోణంలో చూడాల్సిందే! ఉగ్రవాదుల కదలికలపై నిరంతరం నిఘావేసి ఉంచేందుకు కౌంటర్ ఇంటలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుండేది. అయితే ఈ తరహా వ్యవస్థ ఏర్పాటు చేస్తే తమ పెత్తనం పోతుందేమోనన్న అపోహ పోలీసు ఉన్నతాధికారుల్లో ఉంది. రాష్ట్ర స్థాయిలో కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అధిపతి తమకు ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా మారతారేమోనన్న భయంతో ఈ తరహా వ్యవస్థను రూపొందించలేకపోతున్నారు. నిబద్ధత కలిగిన అధికారి నేతృత్వంలో నిరంతర నిఘా కొనసాగించడం వల్ల, ఉగ్రవాద చర్యలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం వల్ల సత్ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు. ఉగ్రవాదుల ఆచూకి కోసం ‘ఇన్‌ఫార్మెంట్’ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇది చిన్న అంశం ఏమీ కాదు. ఇన్‌ఫార్మెంట్ వ్యవస్థ ఉగ్రవాదుల్లో కలిసిపోయి, వారిలో ఒకరిగా మారిపోయి, సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం కష్టమే! స్లీపర్‌సెల్స్ లేకపోతే ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను కొనసాగించడం కష్టమవుతుంది. అందుకే స్లీపర్‌సెల్స్‌పై నిఘా అవసరం ఉంటుంది.
దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లపై సరైన దర్యాప్తు జరగడం లేదు. దర్యాప్తు సంస్థలు ఎవరో ఒకరిపై, ఏదో సంస్థపై అనుమానాలు రేకెత్తించి, మీడియా ద్వారా ప్రచారం చేసుకుని పనిచేస్తున్నట్టు హడావుడి చేస్తున్నాయి. అలాగే సరైన సమాచారంతో అనుమానితులను అరెస్ట్ చేస్తే రాజకీయనేతలు అడ్డుకుంటున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో రాజకీయాలు చోటు చేసుకోవడం, నాయకులు జోక్యం చేసుకోవడం మంచిది కాదు.
- ఎం.వి. మైసురారెడ్డి,
మాజీ హోంమంత్రి.
నిరోధక చట్టం కావాలి!
మన దేశంలో తీవ్రవాదుల అణచివేతకు, తీవ్రవాద చర్యల నిరోధానికి సంబంధించి ఇప్పటివరకు సమగ్రమైన ‘తీవ్రవాద చట్టం’ (టెర్రరిస్ట్ యాక్ట్) లేదు. ‘అన్‌లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్-1967’ అమల్లో ఉంది. ఈ చట్టానికి కాలానుగుణంగా కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి. అయితే తీవ్రవాదం, ఉగ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరించేందుకు ఈ చట్టం సరిపోవడం లేదు. రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ‘తీవ్రవాది’ అంటూ గట్టిగా అనలేని దుస్థితి నెలకొంది. అధికారంలో ఉన్న వారు ఓటుబ్యాంకును కాపాడుకునేందుకు తీవ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు. పేదరికం పేరుతో ఒక వర్గానికి ప్రభుత్వం వంతపాడుతోంది. పేదరికం అన్నది ఏ ఒక్క వర్గానికో పరిమితం కాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం తాండవిస్తోంది. గిరిజనులు నూటికి నూరు శాతం పేదరికంలో, వౌలిక సదుపాయాల లేమితో బాధపడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన అంశం. జాతీయంగా, అంతర్జాతీయంగా మారుతున్న సామాజిక పరిస్థితుల మూలంగా మన దేశం కూడా తీవ్రవాదులను అణచివేసేందుకు, తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ప్రత్యేక చట్టం చేయాల్సి ఉంది. యునైటెడ్ కింగ్‌డం, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో ఈ తరహా చట్టాలు అమల్లో ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో బాంబు పేలుళ్ల వంటి తీవ్రవాద చర్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇతర దేశాల తరహాలోనే తీవ్రవాదాన్ని అణచివేసేందుకు మన దేశం కూడా ఈ తరహా చట్టాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్న చట్టాల వల్ల సామాన్యుల్లో అభద్రతాభావాన్ని తొలగించలేకపోతున్నాం. ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి క్షేమంగా వస్తాడని చెప్పలేని దుస్థితి నెలకొని ఉంది.
మనరాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోంది. కేంద్ర నిఘా వ్యవస్థ-రాష్ట్ర పోలీసు యంత్రాంగం మధ్య సమన్వయం కూడా బాగానే ఉంది. బాంబు పేలుళ్ల సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడటం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి సంఘటనలకు శాశ్వత పరిష్కారం లేదు. 2007లో గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌లలో జరిగిన బాంబు పేలుళ్ల తర్వాత మళ్లీ ఆ తరహా సంఘటన జరగడం ఇదే ప్రథమం. అంటే ఆరేళ్ల తర్వాత ఈ తరహా సంఘటనలు జరిగాయని స్పష్టమవుతోంది. బాంబు పేలుళ్ల సంఘటనలు కేవలం మన రాష్ట్రానికే పరిమితం కాలేదు. ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లోనూ ఈ తరహా సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం మన రాష్ట్రంలోనే పోలీసు వ్యవస్థ బాగాలేదనడంలో ఔచిత్యం లేదు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు తమకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా అమలు చేస్తున్నాయి. అయతే స్థానిక పోలీసులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇటీవల పోలీసుల విభాగంలో నియామకాలు చేపట్టి, 37 వేల మందిని నియమించింది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్ కూడా చేయలేని దుస్థితి నెలకొని ఉన్నప్పటికీ, హైదరాబాద్ ఫ్రీజోన్ కావడంతో పాటు చట్టపరమైన కారణావల్ల ఇక్కడ పోలీసు సిబ్బంది సంఖ్యను పెంచలేకపోతున్నాం. ఈ అంశంలో ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
- కె. అరవిందరావు, డిజిపి (రిటైర్డ్)
ముమ్మాటికీ ఇంటెలిజెన్స్ వైఫల్యమే
పేలుళ్లకు ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యమే కారణం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కాంగ్రెస్ పాలనలో తీవ్రవాదం, ఉగ్రవాదం కార్యకలాపాలను పూర్తిగా విస్మరించిందని చెప్పవచ్చు. రాజకీయ వత్తిళ్ళతో కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కార్యకలాపాలకే పరిమితం చేసి, తన సొంత జేబు సంస్థగా మార్చుకుంది. అసమ్మతి నేతలపై నిఘా, ప్రతిపక్ష పార్టీల కార్యకలాపాలు, రాజకీయ ఉద్యమాలు వీటి సమాచారాన్ని రాబట్టడానికే ఇంటెలిజెన్స్ వ్యవస్థను పరిమితం చేసింది. దేశ భద్రత, రాష్ట్ర భద్రత, శాంతిభద్రతలు, తీవ్రవాదం, ఉగ్రవాదంపై దృష్టి సారించాల్సిన వ్యవస్థను ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఆఫ్జల్‌గురు, కసబ్ ఉరితీత అనంతరం తలెత్తే పరిణామాలను ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. ఈ రెండు ఉరిశిక్షలను అమలు చేసిన తర్వాత ఉగ్రవాదులు చేసిన హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే హైదరాబాద్‌లో ఉగ్రవాదులు సులువుగా పేలుళ్లకు పాల్పడ్డారు. దీనికి ముఖ్యమంత్రి, హోంమంత్రి, డిజిపి ముగ్గురూ బాధ్యులే. అఫ్జల్‌గురు, కసబ్ ఉరితీతల అనంతరం హైదరాబాద్‌లో ఉగ్రవాదులు దాడులకు తెగపడే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినా, తమకు సాధారణ హెచ్చరికలే తప్ప, ప్రత్యేకమైన హెచ్చరికలు ఏమి అందలేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పడం పూర్తిగా బాధ్యతారాహిత్యం. ముఖ్యమంత్రి చేసిన ప్రకటన తప్పనీ, కేంద్రహోంశాఖే ఖండించింది. హైదరాబాద్, బెంగళూరుకు ప్రత్యేక బృందాలను పంపించినట్టు కూడా కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ చేసిన హెచ్చరికలపై కనీసం ప్రజలనైనా ప్రభుత్వం అప్రమత్తం చేసి ఉంటే ఈ అనర్థం జరిగి ఉండేది కాదు. ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ప్రజలకు తెలియజేసి ఉంటే, పౌరులే పోలీసులుగా మారి స్వీయ రక్షణకు పూనుకునే అవకాశం ఉండేది. కానీ అలా కూడా చేయలేదు. పైగా హైదరాబాద్‌లో ఉగ్రవాదులు దాడులు చేయడం కొత్తేమి కాదు. దేశంలో ఎక్కడ ఏమి జరిగినా ఉగ్రవాదులు హైదరాబాద్‌ను టార్గెట్ చేస్తూ వస్తూనే ఉన్నారు. గతంలో లుంబినీ పార్క్, గోకుల్‌చాట్, సాయిబాబా ఆలయం, మక్కా మసీదులో పేలుళ్లు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. ఈ ఘటనల నుంచైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదు. దాని ఫలితమే ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్ నగరంలో 150 సిసి కెమెరాలు ఉంటే, వాటిలో కొన్నింటినీ ఉగ్రవాదులు ముందుగానే ధ్వంసం చేశారన్న విషయం పేలుళ్ల తర్వాత బయటపడింది. సిసి కెమెరాలను ఎవరు ధ్వంసం చేశారో తెలుసుకోలేని, ఆరా తీయలేని దీనస్థితిలో పోలీసు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉన్నాయంటే, దానికి ప్రభుత్వం కారణం కాదా? అక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను పునరుద్ధరించి, ఉగ్రవాదం, తీవ్రవాదంపై దృష్టి సారించనంత వరకు ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండదు.
- శ్రవణ్, తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు
ఉగ్రవాదులూ ప్రభుత్వాన్ని తేలిగ్గా తీసుకున్నారు
రాష్ట్రంలో ప్రభుత్వం లేదని ఉగ్రవాదులు సైతం గ్రహించారు. అందుకే హైదరాబాద్‌ను లక్ష్యంగా చేసుకుని వరుసగా పేలుళ్లకు పాల్పడుతున్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు 2002లో సాయిబాబా గుడి వద్ద పేలుళ్లు జరిగాయి. అప్పుడు ప్రభుత్వం వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. పేలుళ్లు జరిగిన మరుసటి రోజే నిందితులను పట్టుకున్నాం. తరువాత ఎన్‌కౌంటర్‌లో మరణించారు. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యా లేదు. క్లూ కూడా లభించలేదు. ఉగ్రవాదం నివారణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కసబ్, అప్జల్‌గురు ఉరి తరువాత ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉన్న ప్రాంతాల్లో హైదరాబాద్ కూడా ఉందని తాము స్పష్టంగా సమాచారం ఇచ్చినట్టు కేంద్ర హోంశాఖ మంత్రి షిండే పేర్కొన్నారు. ఐబి సూచనలను రొటీన్‌గా తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించడం చూస్తుంటే శాంతిభద్రతల వ్యవహారాన్ని వీరు ఎంత తేలిగ్గా తీసుకున్నారో అర్థం అవుతోంది. ఉగ్రవాద సమస్య హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. ఇదేమీ స్థానిక సమస్య కాదు ప్రపంచమంతా ఉంది. కానీ ఉగ్రవాద నివారణకు ఇతర దేశాలు తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే మన దేశం మాత్రం అంత కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడం లేదనిపిస్తోంది. మన రాష్ట్రంలో ఇది మరీ దారుణంగా ఉంది. దిల్‌సుఖ్‌నగర్‌లో దాదాపు అదే ప్రాంతంలో ఇంతకు ముందే రెండుసార్లు ఉగ్రవాదులు బాంబులు అమర్చారు. అఫ్జల్‌గురు ఉరి తరువాత సహజంగా ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఉండాలి, కానీ అలాంటిదేమీ లేదు. ఇంత నిర్లక్ష్యంగా ఉండడం అంటే ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కాదా? ప్రభుత్వం కఠినంగా వ్యవహరించినప్పుడు ఉగ్రవాదులు సైతం భయపడతారు. ఇది అసమర్థ ప్రభుత్వం. ప్రభుత్వ అసమర్థతను ప్రజలు భరించాల్సి వస్తోంది. కేంద్రం హెచ్చరికలు జారీ చేసి తమ పని అయపోయిందని భావిస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనీసం ఆ హెచ్చరికలను సైతం పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలకు సైతం ఉగ్రవాదుల నుంచి ముప్పు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలి. తీవ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో రాజకీయాలకు అతీతంగా కఠినంగా ఉండాలి. దిల్‌సుఖ్‌నగర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల శివారు ప్రాంతం అయినప్పటికీ చాలా బిజీగా ఉండే ప్రాంతం, అలాంటి ప్రాంతాన్ని ఉగ్రవాదులు ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యకరమే. విస్తృతంగా తనిఖీలు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో బాంబు పేలుళ్లకు అవకాశం లేకుండా చేయాల్సింది కానీ ప్రభుత్వం అలా చేయలేకపోయింది. దానివల్ల 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. మీకు అండగా మేం ఉన్నాం అంటూ ప్రధానమంత్రి ప్రకటించి వెళ్లిపోవడం కాదు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
- టి దేవేందర్‌గౌడ్
మాజీ హోంశాఖ మంత్రి, రాజ్యసభ సభ్యులు