ఒకే సీజన్‌లో ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించి నేపాల్‌కు చెందిన కుర్రిమ్ (29) సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాక, ‘గిన్నిస్ బుక్’ సంస్థ వారు తాజాగా ఈమెకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఎవరెస్టు శిఖరంపై ఏటా మే నెలలో పర్వతారోహణ సీజన్ ప్రారంభమవుతుంది. మార్చి, ఏప్రిల్ నాటికి పర్వతారోహణపై ఆసక్తి ఉన్నవారు ఇక్కడికి చేరుకుని వాతావరణ పరిస్థితులకు అలవాటు పడుతుంటారు. వాతావరణం అనుకూలించాక మేలో పర్వతారోహకుల యాత్ర ప్రారంభమవుతుంది. గత ఏడాది మేలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు బయలు దేరిన కుర్రిం 29,035 అడుగుల మేరకు ప్రయాణం సాగించి 12వ తేదీన తన లక్ష్యాన్ని సాధించింది. మరో వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి (మే 19న) ఈ పర్వతాన్ని రెండోసారి అధిరోహించింది. ఒకే సీజన్‌లో రెండుసార్లు ఎవరెస్టు ఎక్కినందుకు ‘గిన్నిస్ బుక్ రికార్డు’ ధ్రువపత్రాన్ని నేపాల్ పర్యాటక శాఖామంత్రి బహదూర్ బొగాటి ఈమెకు అందజేశారు.
‘ఈ రికార్డుతో సరిపెట్టుకోను, మున్ముందు పర్వతారోహణను కొనసాగిస్తాన’ని కుర్రిమ్ చెబుతోంది. పర్వతారోహణలో పాల్గొనే మహిళల సంఖ్య తక్కువగానే ఉందని, కొద్దిమంది మాత్రమే రికార్డులు సృష్టించారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పర్వతారోహణలో మహిళల కంటే పురుషులు ఎంతో ముందంజలో ఉన్నారని, టాయిలెట్ల సమస్య తమకు ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తోందని ఈమె అంటోంది. ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని ఇంతవరకూ సుమారు నాలుగు వేల మంది అధిరోహించగా, వీరిలో మహిళల సంఖ్య తక్కువేనని నేపాల్ పర్వతారోహణ సంఘం తెలిపింది. అతి శీతల వాతావరణం పర్వతారోహణకు అడ్డంకిగా ఉంటుంది. వేసవికాలం అనుకూలం కావడంతో ఏటా వందలాది మంది ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు ఉత్సాహ పడుతుంటారు.
ఒకే సీజన్‌లో ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించి నేపాల్‌కు చెందిన కుర్రిమ్ (29)
english title:
e
Date:
Thursday, February 28, 2013