ఎంత డబ్బు ఖర్చు చేసి ఇల్లు పూర్తి చేశారన్నది కాదు.. ఎంత అందంగా ఇంటిని తీర్చిదిద్దుకున్నారన్నదే అసలైన నైపుణ్యం. ఇటీవల గృహ నిర్మాణరంగంలో ఎనె్నన్నో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడంతో అవసరాలతో పాటు అందచందాలకూ ప్రాధాన్యం పెరిగింది. మన అభిరుచుల మేరకు గృహాలంకరణ చేసుకునేలా విభిన్న పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వంటగది, డైనింగ్ హాలు, బెడ్‌రూం, స్నానాల గది, టాయిలెట్లు.. ఇలా అన్ని చోట్లా ఆధునిక వసతులు సమకూర్చుకునేందుకు ఎనె్నన్నో మార్గాలు. ఫ్లోరింగ్, సీలింగ్, గోడలకు రంగులు, ఫర్నిచర్, కుండీల్లో మొక్కలు.. ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేకతను చాటుకోవాలని చాలా మంది తహతహలాడుతుంటారు. ఇంట్లో స్థలం, చేతిలో డబ్బు బట్టి గృహాలంకరణకు సరిహద్దులే లేవు. మన అభిరుచులకు, వ్యక్తిత్వానికి ఇంటి అలంకరణ దర్పణం పడుతుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్నందునే గృహాలంకరణపై ప్రత్యేకంగా పత్రికలు, వెబ్‌సైట్లు, సంస్థలు వెలిశాయి. నగరాల్లో అయితే గృహాలంకరణపై తగిన సలహాలిచ్చే నిపుణులు కూడా నేడు అందుబాటులో ఉన్నారు.
ముందుగా ఇంట్లో ఏ మేరకు స్థలం అందుబాటులో ఉంది? ఎలాంటి అలంకరణ అవసరం? మన బడ్జెట్ అందుకు అనుమతిస్తుందా? అనే విషయాలను లోతుగా ఆలోచించాలి. అలంకరణ సామగ్రికి సంబంధించి అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి అక్కడి అలంకరణను పరిశీలిస్తే మనకు కొంత అవగాహన ఏర్పడుతుంది. అలంకరణ వల్ల ఇల్లు మరీ ఇరుకైందన్న భావన రాకుండా జాగ్రత్త పడాలి. కంటికి ఇంపైన రంగులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. జారి పడేందుకు అవకాశం లేని విధంగా ఫ్లోరింగ్ ఉండాలి.
ఇంట్లో స్థలాన్నంతా ఫర్నిచర్ ఆక్రమించినట్లయితే ఇబ్బందులు తప్పవు. ఫర్నిచర్ కొనేముందు మన అభిరుచులు, ఆర్థిక పరిస్థితులను సరిచూసుకోవడం ఉత్తమం. మనకు అవసరమైన ఫర్నిచర్‌ను మాత్రమే ఎన్నుకోవాలి. ఆడంబరం కోసం భారీ సోఫాలు, ఖరీదైన సామగ్రి పట్ల మోజు పడితే సమస్యలు తప్పవు. తరచూ శుభ్రం చేసుకునేందుకు వీలుగా ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
ముఖ్యంగా ఇంట్లో తగిన గాలి, వెలుతురు వచ్చేలా అలంకరణ సామగ్రిని అమర్చుకోవాలి. వీలైనంత వరకూ విద్యుత్ పొదుపు చేసేలా లైట్లు వంటివి ఏర్పాటు చేసుకోవాలి. వెలుతురు వచ్చేలా జాగ్రత్త పడితే పగటి పూట విద్యుత్ లైట్లను వాడాల్సిన అవసరం ఉండదు. తగినన్ని కిటికీలు, ద్వారాలు ఉంటే గాలి,వెలుతురు పుష్కలంగా లభిస్తాయి. పలుచని కర్టన్లు వాడితే మేలు. గదులకు మరింత అందం తెచ్చేలా కార్పెట్లు ఉండాలి. అలంకరణతో పాటు భద్రత విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. షార్ట్ సర్క్యూట్లు, అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఇంట్లో సామగ్రిని అమర్చుకోవాలి. రంగుల విషయానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కంటికి ఇంపైన రంగులను వాడాలి. ఇంట్లో చీకటి వాతావరణాన్ని తెచ్చే ముదురు రంగుల వల్ల మంచి అలంకరణ అసాధ్యం. ఫ్లోరింగ్, టైల్స్, పెయింట్ల విషయంలో నిపుణులు సలహాలు తీసుకుంటే మంచిది. పిల్లల గదుల్లో అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ చూపడం అవసరం. స్విచ్‌లు, ప్లగ్‌లు, విద్యుత్ పరికరాలు చిన్న పిల్లలకు అందుబాటులో లేకుండా జాగ్రత్తలు అవసరం. ఇక, వాల్ పేపర్లను ఎంచుకోవడంలోనే నైపుణ్యం దాగి ఉంది. వంట సామగ్రిని, ఆహార పదార్థాలను పొందికగా ఉంచేందుకు కిచెన్‌లో తగిన ఏర్పాట్లు అవసరం. అలంకరణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో, అందుకువాడే వస్తువుల నాణ్యతపై కూడా అంతే ఆసక్తి చూపాలి. ఏది కొన్నా మన బడ్జెట్ పరిమితులు, నిపుణుల సలహాలు, మన అవసరాలు వంటి విషయాలపై తగిన అవగాహన అవసరం.
ఎంత డబ్బు ఖర్చు చేసి ఇల్లు పూర్తి చేశారన్నది కాదు.
english title:
v
Date:
Thursday, February 28, 2013