మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 28: తీవ్రమైన విద్యుత్ సంక్షోభం రాష్ట్రంలో తలెత్తడంతో ఈ ప్రభావం జిల్లాపై పడింది. దాంతో నేటి నుండి తీవ్రమైన విద్యుత్ కోతలను విధించేందుకు ట్రాన్స్‌కో నిర్ణయం తీసుకుంది. జిల్లా కేంద్రంలో శుక్రవారం నుండి 4 గంటల విద్యుత్ కోత అమలులోకి వస్తుంది. పురపాలక పట్టణాలలో 6 గంటల కోత విధించనున్నారు. మండల కేంద్రాలలో 8 గంటల విద్యుత్ కోతలు అమలు కానున్నాయి. గ్రామాలలో ఏకంగా 12 గంటల కోతలు అమలులోకి రానున్నాయి. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో నేటి నుండి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్ కోత ఉంటుందని, అదేవిధంగా మధ్యా హ్నం ఒంటిగంట నుండి 3 గంటల వరకు కోతలు ఉంటాయని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు.
టైలర్ల అభివృద్ధికి కృషి
* మంత్రి డికె అరుణ
గద్వాల, ఫిబ్రవరి 28: టైలర్ల అభివృద్ధికి తాను ఎల్లప్పుడు కృషి చేస్తానని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డికె అరుణ హామీ ఇచ్చారు. గురువారం టైలర్స్‌డే సందర్భంగా గద్వాల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన టైలర్ల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి రూ.3 లక్షలతో నిర్మించిన టైలర్ల కమిటీ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరూ తనకు సహకరించాలని కోరారు. అన్ని రంగాలలో నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి పరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటిని అందించడం ద్వారా నియోజకవర్గ ప్రజలు మరింత అభివృద్ధి చెందుతారన్నారు. నేటి సమాజంలో టైలర్లకు ఉపాధి లభించేందుకు ఇక్కడి ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి సాగునీరు కూడా అవసరమన్నారు. టైలర్లకు స్థలాలు కేటాయించి వారిని ఆదుకుంటామన్నారు. ఇల్లులేని టైలర్లు తమ పేర్లను, కార్డు జిరాక్సు జతచేసి సమర్పించాలని తెలిపారు. జౌళి శాఖ నుండి టైలర్ల సంక్షేమానికి పథకాలుంటే తప్పక ఆచరణలో పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, యూసుఫ్, మున్సిపల్ మాజీ చైర్మన్ కేశవ్, కోడిగుడ్ల సలాం, టైలర్ల సంఘం అధ్యక్షుడు హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.
శాస్ర్తియ దృక్పథాన్ని అలవర్చుకోవాలి
*విద్యార్థులకు జాయింట్ కలెక్టర్ శర్మన్ పిలుపు
పాలమూరు, ఫిబ్రవరి 28: విద్యార్థులు శాస్ర్తియ దృక్పథాన్ని అలవర్చుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ శర్మన్ అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం పిల్లలమర్రి, జిల్లా సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌కు జెసి శర్మన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శాస్ర్తియ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, సైన్స్ పట్ల అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో ఆ రంగాలలో రాణించవచ్చని అన్నారు. పాఠశాల స్థాయిలోనే పరిశోధన, అనే్వశాలను అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. జిల్లాలో 15 కేంద్రాలలో సైన్స్ టాలెంట్ టెస్టు నిర్వహించి ప్రతిభావంతులకు అవార్డులు అందజేసి విద్యార్థులకు మంచి ప్రేరణను అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున సైన్స్ ఫోరం సిబ్బందిని తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని జెసి శర్మన్ తెలిపారు. పాఠశాలల్లో సైన్స్‌పై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా చొరవ తీసుకుని విద్యార్థులను ఆ దిశగా తయారు చేయాలని కోరారు. సైన్స్ కేంద్రాలను ఎప్పటికప్పుడు సందర్శిస్తే విద్యార్థుల్లో సృజనాత్మకమైన ఆలోచన విధానాలు వస్తుంటాయని, సైన్స్ కేంద్రాలకు తరచుగా విద్యార్థులను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తీసుకెళ్లాలని తెలిపారు. పరిశీలన, పరిశోధన, అనే్వషనలపై దృష్టి పెడితే చిన్నప్పటి నుండే విద్యార్థులు ఆయా రంగాలలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచే అవకాశాలు ఉంటాయని అన్నారు. జిల్లాలోని అచ్చంపేట ప్రాంతంలో పరిశీలనతోనే ప్రత్యేక లక్షణాలు గల బ్యాక్టీరియాలు ఉన్నట్లుగా పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు కనుగొన్నారని, అది సైన్స్ ద్వారానే సాధ్యమైందని జెసి వెల్లడించారు. జిల్లాలో పరిశోధనలకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఇఓ సుదర్శన్‌రెడ్డి, పియూ ప్రిన్సిపాల్ పవన్‌కుమార్, ఆర్‌విఎం పిఓ విష్ణువర్దన్‌రావు, జెపిఎన్‌సిఇ చైర్మన్ రవికుమార్, ఆర్‌విఎం ఎంఓ రవీందర్, డిఎస్‌ఓ రవీందర్‌గౌడ్, ప్రాజెక్టు ఆఫీసర్ రాఘవులు, అధికారులు జనార్ధన్‌రెడ్డి, రవిశంకర్, శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.
దాహం.. దాహం
అడుగంటిన భూగర్భ జలాలు
* ఎండిపోతున్న బోరుబావులు
* వృథాగా చేతిపంపులు
* పట్టణలో దయనీయ పరిస్థితి
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 28: జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకు అడుగంటిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాతాళానికి భూగర్భ జలాలు పడిపోతుండటంతో రోజురోజుకు జిల్లాలో నీటి కష్టాలు మరింత పెరిగాయి. దాహం తీర్చుకునేది ఎలా అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మున్సిపాలిటీలలో వారానికి ఒకరోజు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా గ్రామాలలో ఎండిపోతున్న బోరుబావుల కారణంగా వేసవిలో మంచినీరు దొరుకుతుందోలేదోననే ఆందోళన మొదలైంది. 1330 గ్రామపంచాయతీలకు గాను దాదాపు 846 గ్రామాలలో మంచినీటి ఎద్దడి నెలకొంది. దాదాపు 600 గిరిజన తండాలలో ఇప్పటికే మంచినీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో జిల్లాలో 730 సింగిల్ విలేజ్ స్కీంలు రూ. 43 కోట్లతో చేపట్టబడి 236 పనులు నీటి పథకాలు పూర్తయ్యాయి. అంతేకాక 50 సమగ్ర మంచినీటి పథకాలకు 1115 నివాస ప్రాంతాలలో రూ. 458 కోట్లతో ప్రభుత్వం పనులు చేపట్టింది. ప్రపంచ బ్యాంకు సహకారంతో జిల్లాలో రూ. 145 కోట్ల ఖర్చుతో 600 ఆవాస ప్రాంతాలలో మంచినీరు ఇచ్చేందుకు మంజూరు చేయబడిన పథకం పనులు జిల్లాలో వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. కరవు నివారణలో భాగంగా ఇప్పటికే గ్రామాలలో జిల్లాలోని దాదాపు 28 గ్రామాలలో ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వం జిల్లాకు కొన్ని నీటి పథకాల పనులను మంజూరు చేసినప్పటికీ ఆ పనులు వేగవంతంగా ముందుకుసాగకపోవడంతో ప్రజలకు అంకితం చేయకపోవడంతో ఈ ఏడాది వేసవిలో కూడా నీటి కష్టాలు తప్పేలా లేవు. ప్రపంచబ్యాంకు సహాయం చేసినా వాటి పనులను పూర్తి చేసుకోవడంలో జిల్లా అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని ఆరోపణలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పనులు ముందుకుసాగడం లేదనే విమర్శలు ప్రతి సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రస్తావన చేసిన దాఖలాలు ఉన్నాయి. మార్చి ప్రారంభమవుతున్న నేపథ్యం, ఎండలు పెరుగుతుండటం, భూగర్భజలాలు అడుగంటుతుండటం జిల్లా ఎమ్మెల్యేలకు ఆందోళన రేకెత్తిస్తోంది. గ్రామాలకు వెళ్లాలంటేనే వెనుకడుగు వేస్తున్నారు. ఏ గ్రామంలోకి వెళ్లినా ముందుగా ప్రజలు ఎమ్మెల్యేలను మంచినీటిపై నిలదీస్తున్నారు. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో వివిధ వార్డులలో పది రోజులకు పైగా ఒక్కోసారి తాగునీటిని వదులుతున్నారు. రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో గల షాద్‌నగర్ మున్సిపాలిటీలో పరిస్థితి దారుణంగా మారింది. అక్కడ ఎలాంటి ప్రత్యేకంగా నీటి పథకాలు లేకపోవడంతో బోరుబావుల మీదే ఆ ప్రాంత ప్రజలు ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం భూగర్భజలాలు అడుగంటిపోతుండటం, చుట్టుపక్కల బోర్లన్నీ ఎండుముఖం పడుతుండటంతో షాద్‌నగర్ మున్సిపాలిటీ ప్రజలు వేసవిలో తాగునీటి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వివిధ గ్రామాలలో, పట్టణ ప్రాంతాలలో దాదాపు 3600 చేతిపంపులు ఎండిపోయినట్లు అధికార వర్గాలే బహిరంగంగా చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో గిరిజన తండాల ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తే తప్ప వేసవిలో మంచినీటి ఎద్దడి తీర్చలేమని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ప్రధాన పట్టణాలైన కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి, జడ్చర్ల, అయిజ, దేవరకద్ర, కొడంగల్, మక్తల్, నారాయణపేట, మహబూబ్‌నగర్ పట్టణాలలో అప్పుడే నీటి కష్టాలు ప్రజలను వెంటాడుతున్నాయి. నీటి పథకాలు పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది కూడా వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం జిల్లాలో భూగర్భజలశాఖ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడు లేని విధంగా జిల్లాలో భూగర్భజలాలు 500 అడుగులకు పైగా పడిపోయినట్లు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలలో 800 అడుగులకు పైగా పడిపోవడంతో బోర్లు వేసినా ఫలితం దక్కే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రస్తుత వేసవి కాలంలో ఎలాగైనా జిల్లా ప్రజానీకానికి తాగునీటిని అందించి వచ్చే వర్షాకాలం వరకు నెట్టుకరావాలని జిల్లా అధికార యంత్రాంగం భావిస్తున్నప్పటికీ కష్టాలు మాత్రం తప్పేలా లేవు. ఏదిఏమైనా గ్రామాలలో బోరుబావులు ఎండిపోతుండటం, చేతిపంపుల్లో నీటిమట్టం పడిపోయి అవి వృథాగా ఉండిపోతుండటంతో జిల్లా వ్యాప్తంగా 846 గ్రామాలకు పైగా వందల సంఖ్యలో గిరిజన తండాలలో నీటి ఎద్దడి నెలకొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు చేస్తే తప్ప ఈ ఏడాది వేసవి కాలంలో నీటి కోసం గట్టెక్కే పరిస్థితి కనబడటం లేదు.
దశాదిశ లేని బడ్జెట్
* విపక్షాల పెదవి విరుపు
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 28: దేశ ఆర్థిక వార్షిక 2013-14 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టారు. చిదంబరం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో జిల్లాలో యువకులు, రాజకీయ పార్టీల నాయకులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక వర్గాలు, ప్రజలు సైతం టీవీల ముందు ప్రత్యక్ష ప్రసారం చూసేందుకు ఆసక్తి కనబరిచారు. కాగా ఈ బడ్జెట్‌పై అధికార పక్ష నాయకులు మాత్రం దేశాభివృద్ధి కోసం ఎంతగానో దోహద పడుతుందని చెబుతుండగా, విపక్షాలు మాత్రం దశా దిశ లేని బడ్జెట్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వివిధ రాజకీయ నాయకుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
దేశాభివృద్ధి కోసం దోహదం: డిసిసి అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్
చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ బ్రహ్మండంగా ఉందని, 1992లో మొదలైన సంస్కరణలు ఈ బడ్జెట్ ద్వారా ఇంకా ఆ సంస్కరణలు వేగవంతంగా పురోగతి చెంది భారతదేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతాయని, యుపిఏ-2 ప్రభుత్వంలో చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజలకు మేలు చేకూరుస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్ అభిప్రాయ పడ్డారు.
లక్ష్యం లేని బడ్జెట్: ఎమ్మెల్యే యెన్నం
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు లక్ష్యం లేదని, పైకి పుంతలు పూసి కలర్‌పుల్‌గా చేశారే తప్ప కఠినమైన సంస్కరణలు గానీ, ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే విధానమైనటువంటి బడ్జెట్‌గా లేదని, ఆహార భద్రతకు పెద్దపీట వేయకపోవడం గమనార్హమని, విద్యుత్, యువత, వ్యవసాయ, ధరల నియంత్రణలను పూర్తిగా విస్మరించారని మహబూబ్‌నగర్ బిజెపి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. విదేశాలలో ఉన్నటువంటి నల్లధనాన్ని దేశాభివృద్ధి కోసం తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టకపోవడం కూడా దురదృష్టకరమని, అసలు బడ్జెట్‌లో దశ, దిశ లేదని ఆయన ఎద్దేవా చేశారు.
వ్యవసాయ రంగాన్ని విస్మరించారు: టిడిపి జిల్లా అధ్యక్షుడు నర్సిములు
అన్నం పెట్టే రైతన్నను కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం విస్మరించి వ్యవసాయ రంగానికి కేటాయింపులో నిర్లక్ష్యం చూపారని, రైతులు అంటే కాంగ్రెస్‌కు కోపమని టిడిపి జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సిములు ఆరోపించారు. ఈ బడ్జెట్‌లో దేశాభివృద్ధి కోసం కొత్తగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని, ముమ్మాటికీ కాంగ్రెస్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన బడ్జెట్‌గా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రజల ఆశలకు గండి: సిపిఎం జిల్లా కార్యదర్శి కిల్లె గోపాల్
దేశ బడ్జెట్‌లో ధరల నియంత్రణ, పేదరిక నిర్మూలన కోసం పెద్దపీట వేస్తారని ఆశపడ్డ ప్రజలకు కేంద్ర మంత్రి చిదంబరం గండికొట్టారని సిపిఎం జిల్లా కార్యదర్శి కిల్లె గోపాల్ ఆరోపించారు. ముఖ్యంగా బడ్జెట్‌లో ధరల నియంత్రణపై దృష్టి సారించకపోవడం, ఇంధన, ఆయిల్ కంపెనీలను కంట్రోల్‌లో పెట్టడంలో కూడా దృష్టి సారించకపోవడం, పైకి మెరుగులు దిద్ది లోపల మాత్రం ప్రజలను మోసగించిన బడ్జెట్‌లా ఉందని ఆయన ఆరోపించారు.
యువతకు మొండిచేయ: టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య
దేశంలో కోట్లాది మంది యువకులకు ఈ బడ్జెట్ ద్వారా ఎలాంటి మేలు చేకూర్చడం లేదని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు బడ్జెట్‌లో ప్రత్యేక చొరవ చూపకపోవడం దురదృష్టకరమని, తలాతోక లేని బడ్జెట్‌గా ఉందని, ఇది నిసారమైన బడ్జెట్‌ను చిదంబరం ప్రవేశపెట్టారని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఏర్పాటుతోనే రైతుల అభివృద్ధి
* ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు
పాన్‌గల్, ఫిబ్రవరి 28: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే రైతులు అభివృద్ధి చెందుతారని స్థానికి ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సింగిల్‌విండో నూతన పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులకు సింగిల్‌విండో ద్వారా ఎరువులను, విత్తనాలను, రుణాలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఎక్కువ రుణాలను పాన్‌గల్ సింగిల్‌విండో ద్వారా రైతులకు అందించడం జరిగిందని, కొత్త పాలకవర్గం కలిసికట్టుగా పార్టీలకతీతంగా రైతులకు సేవలందించాలని ఆయన సూచించారు. ఈ పర్యాయం నుండి రైతులు పడించిన పంటలను సింగిల్‌విండో ద్వారానే మార్కెటింగ్ చేయాలని ఆయన సూచించారు. నూతనంగా ఎంపికైన పాలకమండలి చైర్మెన్, డైరెక్టర్లను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మెన్ గోపల్‌దినె్న బాల్‌రెడ్డి, వైస్‌చైర్మెన్ భాస్కర్‌యాదవ్, నాయకులు చంద్రశేఖర్‌నాయక్, సుదర్శన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, తిరుపతయ్య సాగర్, గోవర్దన్‌సాగర్, లోకారెడ్డి, శివలింగం, రవి, హన్మంత్‌నాయక్, ఎల్లూరిశేఖర్‌రెడ్డి, చంద్రునాయక్, నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.
కూలీ డబ్బుల కోసం
ఫీల్డ్ అసిస్టెంట్ నిర్బంధం
వెల్దండ, ఫిబ్రవరి 28: వెల్దండ మండలం భైరాపురం గ్రామంలో చేసిన పనికి కూలీ డబ్బులు చెల్లించడంతో పాటు ఉపాధిహామీ పథకంలో పనులు కల్పించడం లేదని నిరసిస్తూ గురువారం ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్‌ను కూలీలు నిర్బంధించారు. గ్రామానికి నూతనంగా మంజూరైన ఉపాధిహామీ పథకం పనులు ప్రారంభించేందుకు వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్‌ను గత ఏడాది క్రితం చేసిన పనులకు డబ్బులు ఎందుకు చెల్లించడం లేదని కూలీలు నిలదీశారు. అంతేకాకుండా 54 సంఘాలకు గాను 9 సంఘాలకు మాత్రమే ఉపాధి పనులు చూపించడం ఏమిటని, తామందరికీ పనులు కల్పించాలని, లేకుంటే ఇక్కడి నుండి కదిలేది లేదంటూ స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో శంకర్‌ను నిర్బంధించారు. గ్రామంలో పనులు ఉన్నా నీ నిర్లక్ష్యం వల్లే పనులు దక్కడం లేదని, వివక్షత చూపించడం ఏమిటని మహిళా కూలీలు మండిపడ్డారు. ఈ విషయంపై ఇన్‌చార్జి ఎపిఓ రాజ్‌కుమార్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయడంతో భైరాపూర్ గ్రామంలో విచారించి పనులు కల్పించి పెండింగ్‌లో ఉన్న కూలీ డబ్బులు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్‌ను కూలీలు వదిలిపెట్టారు.
ఎల్‌ఐసి ఏజెంట్ల ధర్నా
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 28: కేంద్ర ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలతో తాము ఆర్థికంగా నష్టపోతామని వాటిపై పునరాలోచించాలని, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎల్‌ఐసి ఏజెంట్లు గురువారం స్థానిక కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం తాలూకా అధ్యక్షుడు లియాఫీ, నేతలు సుఖజీవన్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం ఇస్తున్న కమీషన్‌ను పూర్తిగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నదని దీంతో మా కుటుంబాలు వీధిన పడే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కమీషన్ తగ్గించే ప్రతిపాదనను ఉపసంహరించుకొని 1956 చట్ట ప్రకారం కమీషన్లు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సురేష్, చంద్రశేఖర్‌రెడ్డి, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తిలో...
కల్వకుర్తి: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న 2008 బిల్లును వ్యతిరేకిస్తు జీవితభీమా ఎజెంట్ల సంఘం అధ్వర్యంలో గురువారం కల్వకుర్తి ఎల్‌ఐసి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈధర్నాలో తాలుకా అధ్యక్షుడు వెంకటయ్యగౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టె బిల్లు వల్ల ఎజెంట్లకు తీవ్ర అన్యాయం జరగనుందన్నారు. హక్కులు, వ్యాపారాన్ని, కమీషన్‌నీ కోల్పోవనున్నామన్నారు. దేశంలోని 13 లక్షల మంది ఎజెంట్లు, వారి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నదని ఆరోపించారు. ఈకార్యక్రమంలో సత్యనారాయణ, దస్తగిరి, వెంకటయ్య, ఆర్.కృష్ణయ్య, బాల్‌రెడ్డి, నామనిశ్రీను, తిర్పతయ్య, మధన్‌మోహన్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
కొడంగల్, ఫిబ్రవరి 28: బొంరాస్‌పేట మండలంలో ఓ వ్యాపారికి సంబంధించిన రూ. 5.50 లక్షల నగదును గుర్తుతెలియని దొంగలు అపహరించుకుపోయారు. బొంరాస్‌పేట పోలీసులు చోరీ కేసును ఛేదించారు. దొంగలను పట్టుకుని రూ. 5.35 లక్షలను రికవరీ చేసి వారిని గురువారం రిమాండ్‌కు తరలించారు. గురువారం కొడంగల్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నారాయణపేట డిఎస్పీ బాలాదేవి మాట్లాడుతూ బొంరాస్‌పేట మండలంలోని ఏర్పుమల్ల గ్రామానికి చెందిన వెంకటయ్య వ్యాపారం చేస్తున్నాడని తెలిపారు. అందులో భాగంగానే కొంతమంది రైతుల నుండి వేరుశనగను కొనుగోలు చేసి డిసిఎం వ్యాన్‌లో సోమవారం జడ్చర్ల మార్కెట్‌కు తరలించడం జరిగిందని అన్నారు. వేరుశనగ పంటను విక్రయించగా రూ. 5.50 లక్షలు వచ్చాయని ఆమె తెలిపారు. లగచర్ల గ్రామానికి చెందిన మున్నూరు శ్రీనివాస్ కుమారుడికి చెవి, మూగ ఉండటంతో ఆపరేషన్‌కు గాను అవసరమైన డబ్బులను ఎలా సంపాదించాలని ఈ చోరీకి పాల్పడినట్లు తెలిపారు. ఈ విషయమై దుద్యాల గ్రామానికి చెందిన వాహిద్, మున్నూరు శ్రీనివాసులు కలిసి డిసిఎం డ్రైవర్ జావిద్‌కు సమాచారం ఇచ్చారని, ముగ్గురు లోపాయికారి ఒప్పందంతో సోమవారం అర్ధరాత్రి డిసిఎం వ్యాన్ రావడాన్ని గమనించి కాపల కాశారని డిఎస్పీ తెలిపారు. బాధితుడు వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపగా దొంగలు పట్టుబడ్డారని తెలిపారు.
అక్రమంగా నీటిని విడుదల చేసిన నాయకుల అరెస్టు
గద్వాలటౌన్, ఫిబ్రవరి 28: ర్యాలంపాడు రిజర్వాయర్ నుండి అక్రమంగా నీటిని విడుదల చేసిన వైఎస్సార్‌సిపి నేత కృష్ణమోహన్‌రెడ్డి పాటు 14 మందిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 25న ర్యాలంపాడు రిజర్వాయర్‌లో ఉన్న నీటిని అధికారులకు సమాచారం ఇవ్వకుండా కృష్ణమోహన్‌రెడ్డితో పాటు వైకాపా నాయకులు షట్టర్లను ధ్వంసం చేసి నీటి విడుదల చేసి..కాలువ గట్లను తెంపారు. నెట్టెంపాడు ఇఇ రాధాకృష్ణ ఫిర్యాదు మేరకు కృష్ణమోహన్‌రెడ్డితో పాటు 18 మంది నాయకులపై కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం పట్టణంలోని వైకాపా కార్యాలయం వద్ద కృష్ణమోహన్‌రెడ్డితో పాటు 14 మందిని గద్వాలరూరల్, ధరూరు ఎస్‌ఐ అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించారు.
‘రాజకీయంగా ఎదుర్కోలేకే అరెస్టులు’
ధరూరు మండలంలో సహకార ఎన్నికల్లో అధికార పార్టీ ఘోరంగా ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయిస్తున్నారని వైకాపా నాయకులు ఆరోపించారు. గురువారం సాయంత్రం స్థానిక వైకాపా కార్యాలయంలో నాయకులు చెన్నయ్య, కృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి, రమేష్‌నాయుడు విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రజల దాహార్తి, పంట పొలాలకు తాగు, సాగునీటిని విడుదల చేస్తే కృష్ణమోహన్‌రెడ్డితోపాటు మరికొందరిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడం ఎంత వరకు సమంజసమన్నారు.
ట్రయల్న్ విజయవంతం
గద్వాల, ఫిబ్రవరి 28: నెట్టెంపాడు పథకం ర్యాలంపాడు ఫేజ్-2 మూడవ పంపు ట్రయల్న్ విజయవంతమైనట్లు అధికారులు ప్రకటించారు. గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సుమారు 10 నిమిషాల పాటు ట్రయల్న్ నిర్వహించగా పంపింగ్ నిరాటకంగా సాగినట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు, అవాంతరాలు తలెత్తకపోవడంతో ట్రయల్న్ విజయవంతమైనట్లు అధికారులు ప్రకటించారు. పథకంలో మొత్తం మూడు పంపులు ఉండగా ఇప్పటికే రెండు పంపుల్లో ట్రయల్న్ నిర్వహించి పంపింగ్ చేపట్టారు. మూడవ పంపు ట్రయల్న్ విజయవంతంతో ఖరీఫ్ సీజన్ నాటికి మొత్తం మూడు పంపులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.