Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మేలూ లేదు.. కీడూ లేదు..!

$
0
0

కర్నూలు, ఫిబ్రవరి 28: ఎన్నికల ముందు జనాకర్షక బడ్జెట్ వస్తుందన్న ఊహలకు విరుద్ధంగా ఎలాంటి రాయితీలు లేకుండా కేంద్రం రానున్న ఆర్థిక సంవత్సరానికి గురువారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో పేద ప్రజల కోసం రాయితీలు ప్రకటించే అవకాశం ఉందని అనుకున్నారు. అయితే ఆర్థిక మంత్రి చిదంబరం ఎలాంటి రాయితీలు ప్రకటించకుండా బడ్జెట్‌ను రూపొందించడంతో సామాన్యులు ఉసూరుమన్నారు. అయితే రైతులకు కొంత మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం విశేషం. రైతులు వ్యవసాయ రుణాలను సకాలంలో చెల్లిస్తే బ్యాంకులు 4 శాతం వడ్డీని వసూలు చేస్తాయని చెప్పడం, రసాయనిక ఎరువుల సబ్సిడీ, పన్నుల ధరల్లో మార్పు లేకపోవడం రైతాంగానికి ఊరటనిచ్చే అంశం. జాతీయ బ్యాంకులతో పాటు ప్రైవేట్ రంగంలోని బ్యాంకులు సైతం ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యవసాయ రుణాలు ఇస్తాయని ప్రభుత్వం ఇచ్చే రాయితీలు వాటికి కూడా వర్తిస్తాయని ప్రకటించారు. అయితే వ్యవసాయ రంగానికి ప్రకటించిన రూ. 27కోట్లు తక్కువేనన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా వడ్డీ రాయితీని ప్రకటించి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేగాక రైతులు పండించే ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించకపోవడంపై కూడా నిరసన వ్యక్తమవుతోంది. మహిళలకు సంబంధించి రక్షణ చర్యల్లో భాగంగా నిర్భయ పేరుతో నిధి ఏర్పాటు చేసి రూ. వెయ్యి కోట్లు, వారి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళా బ్యాంకు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన వారిని ఆకర్శించే ప్రయత్నం చేసిందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న నిధికి రూ. వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ నిధికి కేంద్రం రూ. 5 వేల కోట్లు కేటాయించాల్సి ఉండిందని అభిప్రాయపడుతున్నారు. చేనేత కార్మికులకు ఊరటనిచ్చే విధంగా వడ్డీ రాయితీని ప్రకటించారు. చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు ఆ రంగంలోని కార్మికులకు 6 శాతం వడ్డీకే రుణాలు ఇచ్చేలా నిర్ణయించారు. అయితే ఈ వడ్డీ రాయితీ స్వల్ప కాలిక రుణాలకు మాత్రమే పరిమితం చేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలన్న ఆశ ఉన్న వారికి గృహ రుణాలపై కొంత మేర వెసులుబాటు కల్పించారు. తొలి సారి కడుతున్న ఇంటికి తీసుకునే రూ. 25 లక్షల రుణ గ్రహీతలకు రుణం చెల్లింపు సందర్భంగా రూ. లక్ష వరకూ రాయితీ పొందే అవకాశం కల్పించారు. మధ్య తరగతి వారికి ఈ రాయితీ కొంత మేర సంతృప్తిపరుస్తుందని భావిస్తున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కోసం రూ. 62 వేల కోట్లు కేటాయించడం ఆ వర్గం వారిని ఆనందింపజేసింది. చర్మంతో తయారు చేసే ఉత్పత్తులతో పాటు రెడీమేడ్ దుస్తులపై ఎక్సైజు సుంకం తగ్గించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. సెల్‌ఫోన్ వినియోగదారులు రూ. 2 వేల లోపు ఖరీదు చేసే సెల్‌ఫోన్ కొంటే ధరల్లో మార్పు ఉండదని, ఆ పై ధరలో కొంటే ఎక్కువ ధర చెల్లించాల్సిందే. ఎక్కువ ధర ఉన్న సెల్‌ఫోన్‌లపై దిగుమతి సుంకం పెంచడంతో వాటి ధరలు పెరగనున్నాయి. యువకులు ఇష్టపడే స్పోర్ట్ యుటిలిటీ మోటార్ సైకిళ్లపై పన్నుల భారం మోపడంతో వాటి ధర కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక పొగరాయుళ్లు ఎపుడూ ఎదుర్కొన్నట్లే ఈ బడ్జెట్‌లోనూ పన్ను పెంపును ఎదుర్కొన్నారు. ఈ సారి ఎక్సైజు సుంకం ఏకంగా 18 శాతం పెంచడంతో సిగరెట్ ముట్టించకుండానే జేబుకు చిల్లు పెట్టే ప్రమాదం పొంచి ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద గర్భిణులకు ప్రస్తుతం ఖర్చు చేస్తున్న పౌష్ఠికాహార నిధులు ఇక ముందు నగదు బదిలీ ద్వారా వారి ఖాతాలకు చేరనుంది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు ఆనందాన్ని, ఆవేదనను కలిగించకపోవడం గమనార్హం. జనాన్ని నొప్పించకుండా తానొవ్వకుండా చిదంబరం బడ్జెట్‌ను రూపొందించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజలకు మేలు చేసే బడ్జెట్.. : డిసిసి అధ్యక్షుడు రఘురామిరెడ్డి
బడ్జెట్‌ను ప్రజలపై అభిమానంతో రూపొందించారు. పన్నులు వేయకుండా, రాయితీలు, సబ్సిడీలు కొనసాగిస్తూ ప్రజలకు మేలు చేసే విధంగా ఉంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా రాయితీలు ఎక్కువగా ఇవ్వలేకపోయినా ప్రజలపై భారం మోపని విషయాన్ని గుర్తుంచుకోవాలి. మహిళలకు, యువతకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుంది. పారిశ్రామిక అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ప్రత్యేక హంగులు కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశారు. మహిళల భద్రత కోసం నిర్భయ నిధి, ప్రత్యేకంగా మహిళా బ్యాంకు ఏర్పాటు ప్రకటన, రైతులకు, చేనేత కార్మికులకు ఊరటనిచ్చే విధంగా వడ్డీ రాయితీ ప్రకటించడం హర్షణీయం.
మసి పూసి మారేడు కాయ చేశారు..:
- టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు
మసి పూసి మారేడు కాయను చేసి ఏదో చేశామని చెప్పుకుంటున్నారే కానీ వాస్తవంగా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడదు. మహిళల కోసం ఏర్పాటు చేసిన నిర్భయ నిధికి కేటాయించిన రూ. వెయ్యి కోట్లు ఏ మూలకూ సరిపోవు. రైతులకు ప్రకటించిన వడ్డీ రాయితీ కంటి తుడుపు చర్యే. షరతులు లేకుండా వడ్డీ రాయితీని ప్రకటించి ఉంటే బాగుండేది. చేనేత కార్మికులకు ఏదో చేశామని చెప్పుకోవడానికి మినహా కేంద్రం ప్రకటించిన వడ్డీ రాయితీ వారి కష్టాలను గట్టెక్కించేది కాదు.
పేదలను కొట్టి.. పెద్దలకు పెట్టారు..:సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్
గత ఏడాది కంటే ఈ ఏడాది మరింత ఎక్కువగా పెద్దలకు మేలు చేసే విధంగా ఉంది. పేద ప్రజలపై పరోక్ష, ప్రత్యక్ష పన్నులు వేయడమే కాకుండా అనేక వస్తువులను పన్నుల పరిధిలోకి తీసుకొచ్చారు. తద్వారా పేద వారికి చూపుతున్న లబ్ధి కంటే ఎక్కువగా వారికి తెలియకుండానే తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. బడా పారిశ్రామికవేత్తలకు కోటీశ్వరులకు ఇచ్చిన పన్ను రాయితీలు వారిని మరింత ఆస్తిపరులుగా చేస్తూ పేదోడిని మరింత పేదరికంలోకి నెట్టి వేసేలా బడ్జెట్‌ను రూపొందించారు. అంకెల గారడీతో సామాన్య ప్రజలను బరిడీ కొట్టే ప్రయత్నం చేశారు.
భారీగా విద్యుత్ కో(వె)తలు
* నగరంలో 4, పట్టణాల్లో 6 గంటలు..
* గ్రామాల్లో రాత్రి వేళల్లోనే సరఫరా..
* నేటి నుంచి అమలు..
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, ఫిబ్రవరి 28: జిల్లా వ్యాప్తంగా విద్యుత్ కోతలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం గురువారం అధికారికంగా విద్యుత్ కోత వేళలను ప్రకటించింది. ఆ మేరకు శుక్రవారం నుంచి కర్నూలు నగరంలో 4, పురపాలికలైన నంద్యాల, ఆదోని, డోన్, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, గూడూరు, బనగానపల్లె, నందికొట్కూరు, ఆళ్లగడ్డ పట్టణాల్లో 6 గంటల కోత విధించారు. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో 8 గంటలు కోత విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారిక విద్యుత్ కోత లు రెండు విడతలు సమానంగా విధించాలని సూచించింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ ఏకధాటిగా విద్యుత్ సరఫరా పూర్తి స్థాయి లో నిలిపివేయనున్నారు. ఇక వ్యవసాయ విద్యుత్‌ను రాత్రి, పగటి వేళల్లో సమానంగా రెండు విడతలుగా 7 గంటలు మాత్ర మే సరఫరా చేయనున్నారు. గత రెండు వారాలుగా జిల్లా వ్యాప్తంగా అనధికార విద్యుత్ కోతలు
కొనసాగుతున్నాయి. అనధికారికంగా కర్నూలు నగరంలో 2, పట్టణాల్లో 4, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో 6, గ్రామాల్లో 8 గంటల విద్యుత్ కోత అమలులో ఉండేది. ప్రభుత్వం ప్రకటించిన అధికారిక విద్యుత్ వేళలతో కర్నూలు నగరంలో రెట్టింపు కోత అమలులో ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో అదనంగా మరో 2 గంటల కోత విధించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుదుత్పత్తి గణనీయంగా పడిపోవడం, అదే సమయంలో విద్యుత్ వినియోగం పెరగడంతో కోతలు అనివార్యమయ్యాయని ట్రాన్స్‌కో అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో విద్యుత్ సరఫరాకు, వినియోగానికి మధ్య 30 శాతం తేడా ఉందని, దీని కారణంగా విద్యుత్ కోతలు అనివార్యమయ్యాయని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వేసవిలో విద్యుత్ ఇబ్బందులు మరింత తీవ్రం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రయత్నం సఫలమైతే కొంత మేర వెసులుబాటు ఉంటుందని అధికారులంటున్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటుతాం..
* 8న కలెక్టరేట్ ఎదుట టిడిపి మహాధర్నా
* పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ, కెఇ
కర్నూలు టౌన్, ఫిబ్రవరి 28: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతుందని పొలిట్‌బ్యూరో సభ్యుడు, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలవ శ్రీనివాసులు ధీమా వ్యక్తం చేశారు. నగర పరిధిలోని దేవీ ఫంక్షన్ హాల్‌లో గురువారం జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు కెఇ. కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మ జ, మాజీ ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి జయనాగేశ్వరరెడ్డి, బిటి నాయుడు, జనార్దన్‌రెడ్డి, చక్రపాణి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ ప్రకటిస్తామన్నారు. ప్రస్తుత సిఎం కిరణ్ కుర్చీపై చూపిన శ్రద్ధ పాలనపై చూ పడం లేదన్నారు. ఎన్ని పార్టీలు పుట్టినా టిడిపిని ఏమీ చేయలేవని, 2014 ఉన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్ప డి సహకార ఎన్నికల్లో విజయం సాధించిందని రైతులు ఎవరూ స్వచ్ఛందంగా ఓటు వేయలేదన్నారు. కెఇ కృష్ణమూర్తి మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గానికి మంచి వ్యక్తి ఇన్‌చార్జిగా వస్తారన్నారు. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలుత పాణ్యం సీటు కైవసం అవుతుందన్నారు. ఇకపోతే తాగునీరు, విద్యుత్ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరల పెం పు తదితర సమస్యలను నిరసిస్తూ మార్చి 8వ తేదీ టిడిపి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా చేపడుతున్నామని, ఇందులో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమిశెట్టి మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా 2 వేల కి.మీ పూర్తి చేసుకోవడం హర్షణీయమన్నారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో బిసిలకు 4 సీట్లు కేటాయిస్తామన్నారు. అనంతరం మంత్రాలయంకు చెందిన మాధవరం రామిరెడ్డితో పాటు వెయ్యి మంది కెఇ ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు. కార్యక్రమంలో మణిగాంధీ, చక్రపాణిరెడ్డి, ఎన్‌డీ ఫరూక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తమిళనాడు గవర్నర్ రోశయ్య
3న కర్నూలు రాక
* కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి
కర్నూలు, ఫిబ్రవరి 28 : తమిళనాడు రాష్ట్ర గవర్నర్ డా. కె.రోశయ్య పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి కోరారు. కలెక్టర్ ఛాంబర్‌లో గురువారం గవర్నర్ రోశయ్య రాక సందర్భంగా ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 3వ తేదీ గవర్నర్ రోశయ్య కర్నూలుకు వస్తున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, తప్పనిసరిగా ప్రొటోకాల్ పాటించాలని, భద్రత, వైద్య, వౌలిక సదుపాయాలు, తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ రోశయ్య 3వ తేదీ ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి రోడ్డు మార్గం ద్వారా 11 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్కొని మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారని తెలిపారు. సమావేశంలో జెసి కన్నబాబు, డిఆర్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, సిపిఓ ఆనందనాయక్, మున్సిపల్ కమిషనర్ మూర్తి, జడ్పీ సిఇఓ సూర్యప్రకాష్, డిపిఓ స్వరూపారాణి, కర్నూలు ఆర్డీఓ ఓబులేసు పాల్గొన్నారు.
శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు
గట్టి నిఘా:ఎస్పీ
శ్రీశైలం, ఫిబ్రవరి 28: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చేసి, నిఘా కెమెరాలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బ్ర హ్మోత్సవ వేడుకలను విజయవంతం చేస్తామని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. మార్చి 3 నుంచి 13వ తేదీ వర కూ జరిగే శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు 2,500 మంది సిబ్బందితో, 85 సిసి కెమెరాలతో గట్టి భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే 12 మంది డీఎస్పీలు, 50 మంది సిఐలు, 128 మంది ఎస్‌ఐలు, 282 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 1002 మంది కానిస్టేబుళ్లు, 102 మంది మహిళా పోలీసులు, 50 మంది హోంగార్డులు, 20 స్పెషల్ పా ర్టీ, 92 అదనపు బలగాలతో భద్రత ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా క్యూలైన్లలో, పార్కింగ్ విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలుగు యూనివర్శిటీ, హెలిప్యాడ్ ప్రదేశాల్లో పార్కింగ్ సదుపా యం కల్పిస్తామన్నారు. భక్తులతో రద్దీ గా వున్న ప్రదేశాల్లో బాంబు స్క్వాడ్ వంటి వాటితో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తామని, ప్రత్యేక నిఘా అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం తె లుసుకుంటూ అనుమానాస్పద వాహనాలు కూడా తనిఖీ చేస్తామన్నారు. 10వ తేదీ శివరాత్రి పర్వదినాన ఆలయంలోకి 2 వేల మందికి మాత్రమే అనుమతిస్తామని, శివరాత్రి రోజున రాత్రి 10 గంటల తర్వాత మన్ననూరు, దోర్నాల, మహబూబ్ నగర్ నుంచి వచ్చే వాహనాలు 10 గంటలలోపే శ్రీశైలం చేరుకోవాలన్నారు. గురువారం ఉదయం ఆత్మకూరు డీఎస్పీ పిఎన్ బాబు, శ్రీశైలం సిఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్‌ఐలు నాగేశ్వరరావు, గిరిబాబు, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేష్‌తో కలిసి ఎస్పీ పార్కింగ్ స్థలాలను, పాతాల గంగను పరిశీలించారు.
ముగిసిన చెంచు ఉత్సవాలు
శ్రీశైలం, ఫిబ్రవరి 28: సమీకృత గిరిజన అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న చెంచు మహోత్సవాలు గురువారం ముగిశాయి. మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన ఉత్సవాల్లో ముఖ్యంగా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా నిర్వహించబడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, అలాగే ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా సంపూర్ణ అవగాహన, చెంచు గిరిజనుల కోసం ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో 42 గూడెంలకు సంబంధించిన చెంచులను శ్రీశైలం వేదికగా తీసుకొచ్చి వారికి వసతి కల్పించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించే రీతిలో సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించారు. గురువారం డిఇఓ బుచ్చన్న, ఎజెసి రామస్వామి, డిటిడబ్ల్యుఓ గిరిధర్‌రావు, ఎడి ఇఓ బ్రహ్మానందరెడ్డి, ఎవి సుబ్బారావు, అధ్యక్షతన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఎజెసి రామస్వామి బహుమతులు ప్రదానం చేశారు.
ఆదోని ఎఎస్పీ శిమోషీ బదిలీ!
ఆదోనిటౌన్, ఫిబ్రవరి 28: ఆదోని ఎఎస్పీ శిమోషీ బాజ్‌పేయి కృష్ణ జిల్లా ఎఎస్పీగా బదిలీ అయినట్లు గురువారం తెలిసింది. ఈ విషయమై ఆమెను విచారించగా తనకు పూర్తిగా వివరాలు తెలియవన్నారు. 2011 జనవరిలో ఆదోని ఎఎస్పీగా శిమోషీ బాజ్‌పేయి పదవీ బాధ్యతలు చేపట్టారు. గత రెండు సంవత్సరాల ఒక నెలకాలం ఆమె ఎఎస్పీగా ప్రజలకు పలు రకాలుగా సేవలందించారు.
20లోగా పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా పూర్తి చేయండి
* కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి
కర్నూలు ఓల్డ్‌సిటీ, ఫిబ్రవరి 28: పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాను మార్చి 20వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్సు హాలులో గురువారం పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాను పూర్తి చేయాలన్నారు. ఎంపిడిఓలు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి మార్చి 1వ తేదీ నుండి ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. జిల్లాలో 890 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, అన్ని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను గుర్తించి వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లను తప్పనిసరిగా నమోదు చేయించాలన్నారు. అలాగే జాబితాను గ్రామ, వార్డుల వారీగా తయారు చేయాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్త వహించాలన్నారు. కార్యక్రమంలో జెసి కన్నబాబు, డిఆర్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీ సిఇఓ సూర్యప్రకాశ్, డిపిఓ స్వరూపరాణి, ఆర్డీఓలు ఓబులేసు శంకర్, ఎంపిడిఓలు, ఇఓఆర్‌డి అధికారులు పాల్గొన్నారు.
అహోబిలంలో
బాంబు స్క్వాడ్ తనిఖీలు
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 28: అహోబిలంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందం రామ్మూర్తి, దస్తగిరి, మహేశ్వరరెడ్డి, చంద్రశేఖర్ గురువారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆళ్లగడ్డ డీఎస్పీ బిఆర్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మార్చి 17 నుంచి 28వ తేదీ వరకూ జరగనున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని, కావున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఇందులో భాగంగానే దిగువ, ఎగువ అహోబిలాల్లోని ఆలయ పరిసరాలు, అటవీ ప్రాంతంలో రహదారికి ఇరువైపులా మెటల్ డిటెక్టర్‌తో తనిఖీలు నిర్వహించామన్నారు. అలాగే పట్టణంలోని పలుప్రాంతాల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.
సహకార బ్యాంకు డైరెక్టర్‌గా
కాత రమేష్‌రెడ్డి
మిడుతూరు, ఫిబ్రవరి 28: మండల పరిధిలోని పీరుసాహెబ్‌పేట సహకార సంఘానికి సంబంధించి 11వ స్థానానికి జరిగిన డైరెక్టర్ ఎన్నికల కౌంటింగ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు కాత రమేష్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు సయ్యద్‌పై 121 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. 11వ స్థానానికి గతంలో కాంగ్రెస్ మద్దతుతో బరిలో వున్న రామనాగిరెడ్డి ఆకస్మిక మరణంతో ఈ నెల 8వ తేదీ ఆ స్థానానికి ఎన్నికలు నిర్వహించారు. అయితే కాంగ్రెస్ మద్దతుదారుడు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఎన్నికల కౌంటింగ్ పై కోర్టు స్టే తొలగిపోవడంతో గురువారం జరిగిన కౌంటింగ్‌లో కాత రమేష్‌రెడ్డికి 229 ఓట్లు రాగా, సయ్యద్‌కు 108 ఓట్లు రాగా మరో 2 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. దీంతో ఎన్నికల అధికారులు కాత రమేష్‌రెడ్డిని విజేతగా ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశారు. రైతుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని రమేష్‌రెడ్డి ఫలితాల అనంతరం విలేఖరులకు తెలిపారు.
అగ్ని ప్రమాదంలో 20 గుడిసెలు దగ్ధం
* 75 గొర్రె పిల్లలు సజీవ దహనం.. * రూ. 15 లక్షల ఆస్తి నష్టం
కొత్తపల్లె, ఫిబ్రవరి 28: మండల పరిధిలోని కపిలేశ్వర గ్రామంలో ప్రమాదవశాత్తు గురువారం సంభవించిన అగ్ని ప్రమాదంలో 20 పూరిగుడిసెలు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన విజేయుడు, వెంకటరమణ, ఆంజనేయులు, సుభాషిని, చెన్నప్పలతో పాటు మరో 15 మంది పూరిగుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితులు మత్స్యకారులుల కావడంతో కృష్ణానదిలో చేపల వేటకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రమాదం జరగడంతో ప్రధానంగా చేపల వలలు, అలివిలు అగ్నికి ఆహుతి కావడంతో జీవనోపాధి పోయిందని మత్స్యకారులు వాపోయారు. సంగమేశ్వరం వెళ్లే దారిలో ప్లాస్టిక్ పేపర్లపై సిగరెట్ కాల్చి వేయడంతో కాగితాలు అంటుకుని గుడిసెలకు నిప్పు అంటుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 75 గొర్రె పిల్లలు సజీవ దహనం అయ్యాయి. దీంతో సుమారు రూ. 15 లక్షల ఆస్తి నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని గమనించారు.
వేంపెంటలో రెండు గుడిసెలు దగ్ధం
పాములపాడు : మండల పరిధిలోని వేంపెంట గ్రామంలో గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి రెండు గుడిసెలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో రామకోటి నాయక్, రాంబాబు నాయక్‌లకు చెందిన రెండు గుడిసెలు, నిత్యావసర సరుకులు, వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని బాధితులు కోరారు.
అన్ని వర్గాలను నిరాశ పరిచిన బడ్జెట్
* బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా దామోదర్‌రెడ్డి
కర్నూలు రూరల్, ఫిబ్రవరి 28: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కల్గించకపోగా, అన్ని వర్గాల ప్రజలను నిరాశ పరిచిందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ ములిగేనక్క పై తాటి పండు పడ్డ చందంగా ఈ బడ్జెట్ పేదవాడి నడ్డి విరిచేలా వుందన్నారు. సామాన్యుడు బతికే పరిస్థితి లేకపోయిందని ఆర్థిక మంత్రి చిదంబరం తమిళనాడు, కర్నాటక మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ను విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 60 శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని అలాంటి రైతులకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని, దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలను విస్మరించారని, పట్టణాల అభివృద్ధిని పట్టించుకోలేదని, మహిళలను పూర్తిగా విస్మరించారని పదవులను నిలబెట్టుకోవడంపై వున్న శ్రద్ధ ప్రజల అభివృద్ధిపై లేదని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహవర్మ, నగర అధ్యక్షులు మదనమోహనారి, ఉమామహేశ్వరప్ప, దర్గా స్వామి, మధుసూదన్‌రావు పాల్గొన్నారు.
నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట చిన్న వ్యాపారుల బైఠాయింపు
కర్నూలు రూరల్, ఫిబ్రవరి 28: నగరంలో పూలు, పండ్లు, టీ, టిఫెన్, బజ్జీ, పొత, కొత్త దుస్తులు, బీడి బంకు లు, మట్టి కుండల వ్యాపారాలు నిర్వహించుకునే చిన్న వ్యాపారులు గురువారం సిఐటియు ఆధ్వర్యంలో నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సిఐటియు నేత పుల్లారెడ్డి మాట్లాడుతూ నగరపాలక సంస్థ పెంచిన పన్నుల భారం నగరంలో దాదాపు 2 వేల మందిపై పడుతుంద న్నారు. ను చాలా మంది చిన్న వ్యాపారులు కట్టే స్థితిలో లేరన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పన్నులతో సతమతమవుతున్న తరుణంలో తామేమీ తక్కువ కాదని నగర పాలక సంస్థ రుజువు చేసుకుంటుందని విమర్శించారు. సబ్సిడీలు పొంది న బడా పారిశ్రామిక వేత్తలను వదిలి బ్యాంకుల్లో రుణాలు తీసుకుని చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకుం టూ కుటుంబాన్ని పోషించుకునే వారి పై పన్నులు పెంచడం ఏ పాటి న్యాయమని ప్రశ్నించారు. కార్యక్రమంలో వ్యాపారుల సంఘం కార్యదర్శి షరీఫ్, నాయకులు గోపాల్, ఎగ్బాల్, అక్బర్, నర్సింహులు, గౌస్ పాల్గొన్నారు.
భారతీయ కట్టుబొట్టులోనే
మహిళల అందం
కల్లూరు, ఫిబ్రవరి 28: ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ సంప్రదాయమైన చీరలకు ఎంతో పేరు ప్రఖ్యాతలు వున్నాయని, భారతీయ చీర కట్టు బొట్టులో వున్న మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారని ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. నగరంలోని కళా నికేతన్ వస్త్ర నిలయం ప్రథమ వార్షికోత్సవానికి గురువారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరై వార్షికోత్సవ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నగరంలో కళా నికేతన్ వస్త్ర నిలయం ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడి మహిళలు వ్యయ ప్రయసాలకోర్చి దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఎంతో విలువైన తమ కిష్టమైన చీరలను నగరంలో కొనుగోలు చేసుకునే సౌకర్యం వుందన్నారు. మహిళల కోసం 50 శాతం తగ్గింపు ధరతో కొనుగోళ్లను కళానికేతన్ ప్రారంభించిందన్నారు. కళానికేతన్ మేనిజింగ్ డైరెక్టర్ లీలా కుమార్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో విదేశీయులు కూడా భారత కట్టుబాట్లకు ఆకర్షితులవుతున్నారన్నారు. ముఖ్యంగా దేశంలో తయారయ్యే చీరలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. కార్యక్రమంలో కళా నికేతన్ ఎండి లీలా కుమార్, ఆయన సతీమణి శారద, రాజు, కృష్ణ, మేనేజర్లు, రమేష్, రామరావు పాల్గొన్నారు.

జగన్నాథగట్టు ఇందిరమ్మ కాలనీ
దేశంలోనే అతిపెద్దది
* లే అవుట్‌ను రివైజ్ చేయాలి:కలెక్టర్
కర్నూలు, ఫిబ్రవరి 28: నగరంలోని జగన్నాథగట్టు ఇందిరమ్మ గృహాల కాలనీ దేశంలోనే అతిపెద్ద నీరుపేదల కాలనీ అని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కాలనీ లే అవుట్‌ను రివైజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో గురువారం జగన్నాథగట్టు ఇందిరమ్మ గృహాల అభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పనపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కాలనీ లేఅవుట్‌ను రివైజడ్ చేయాలని హౌసింగ్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే మున్సిపల్ అధికారుల సహకారంతో కాలనీలో విద్యుత్, తాగునీరు, రోడ్ల నిర్మాణం కోసం ప్రత్యేక అనుమతి తీసుకోవాలన్నారు. అటవీశాఖ, డ్వామా అధికారుల సహకారంతో మొక్కలు నాటించాలని సూచించారు. సమావేశంలో హౌసింగ్ పిడి రామసుబ్బు, మున్సిపల్ కమిషనర్ మూర్తి, హౌసింగ్ ఇఇ జయరాం ఆచారి, డ్వామా ఎపిడి మోహన్‌రావు, కల్లూరు తహశీల్దార్ తిప్పేనాయక్ పాల్గొన్నారు.

* కొత్తగా రాయితీలు, పన్నులు లేని బడ్జెట్ * రైతులు, చేనేతలకు వడ్డీ రాయితీ.. * సిగరెట్లు, ఖరీదైన సెల్‌ఫోన్లు మరింత ప్రియం
english title: 
hj

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>