ఒంగోలు, ఫిబ్రవరి 28: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి చిదంబరం గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్‌పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తుండగా పాలకపక్షానికి చెందిన ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మాత్రం సంక్షేమానికి పెద్దపీట వేసిన బడ్జెట్‌గా అభివర్ణించారు. ఈ బడ్జెట్‌తో పేద, మధ్యతరగతి ప్రజల బతుకు దుర్భరమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెడీమేడ్ వస్త్రాలు తగ్గనుండగా, ఎసి రెస్టారెంట్లలో భోజనాల రేట్లు పెరగనున్నాయి. రెండువేల రూపాయలకు పైగా ఉన్న మొబైల్‌ఫోన్ల ధరలు, మధ్యతరగతి ప్రజలు గృహాలకు వినియోగించే మార్బుల్స్ రేట్లు పెరుగుతాయి. సరదాసరదా సిగరెట్ల ధరలు యథావిధిగా భారీగా పెరగనున్నాయి.
సంక్షేమానికి పెద్దపీట:ఎంపి మాగుంట
2013-14 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేశారని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మహిళలను, యువతను, పేదప్రజలను దృష్టిలో ఉంచుకుని ఆర్థికమంత్రి ప్రణాళికాబద్ధంగా ఈ బడ్జెట్‌ను రూపొందించటం హర్షణీయమన్నారు. మహిళల ఆర్థిక స్వయం సంవృద్ధికి మొదటిసారిగా వెయ్యి కోట్లరూపాయలతో మహిళా బ్యాంకు ఏర్పాటు, వారి భద్రతకు నిర్భయ ఫండును ఏర్పాటుచేయనున్నారని పేర్కొన్నారు. దేశంలో అధికశాతం ఉన్న యువతను దృష్టిలో ఉంచుకుని చక్కటి పథకాలను ఈ బడ్జెట్‌లో రూపొందించటం దేశ పురోభివృద్ధికి ముఖ్యమైన అవస్తాపన రంగానికి ప్రాముఖ్యత ఇచ్చారని తెలిపారు. మొత్తంమీద కేంద్ర బడ్జెట్ సమతుల్యతతో రూపొందించటంలో కేంద్రమంత్రి చిదంబరం సఫలీకృతులైనట్లు ఆయన పేర్కొన్నారు.
సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదు
టిడిపి జిల్లా అధ్యక్షుడు దామచర్ల
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యప్రజలకు ఉపయోగపడని బడ్జెట్ అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ విమర్శించారు. ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్‌ను రూపొందించారని ఆరోపించారు. మహిళల భద్రతకోసం మహిళా పోలీసుస్టేషన్లను పెంచలేదన్నారు. రైల్వేబడ్జెట్ ఉపయోగపడని విధంగానే ఆర్థిక బడ్జెట్ కూడా అదేకోవలో ఉందన్నారు. ప్రధానంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి అన్నివర్గాల వారిని ఇబ్బందుల్లోకి నెట్టారని ఆయన ధ్వజమెత్తారు. రైతులకు ఏమాత్రం ఈ బడ్జెట్ ఉపయోగపడదని ఆయన తెలిపారు.
పేదలను విస్మరించిన బడ్జెట్
- వైకాపా జిల్లా అధ్యక్షుడు నూకసాని
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేదప్రజల సంక్షేమాన్ని విస్మరించారని వైకాపా జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ ధ్వజమెత్తారు. ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ పేదలప్రజల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. భారతదేశంలో ప్రధానంగా వ్యవసాయ రంగంపై రైతులు ఆధారపడి జీవిస్తుంటారని, అలాంట రైతాంగాన్ని ఈ బడ్జెట్‌లో విస్మరించారని ఆయన ఆరోపించారు.
సం‘క్షోభ’ హాస్టళ్లు
విద్యార్థుల అవస్థలు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఫిబ్రవరి 28: జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. బిసి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క గొప్పలు చెబుతూ ఆచరణలో చూపడం లేదన్న లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 77 బిసి సంక్షేమ శాఖ హాస్టళ్ళు ఉండగా వాటిలో సగానికిపైగానే అద్ద్భెవనాల్లోనే నిర్వహిస్తున్నారు. బిసి విద్యార్థులు తలదాచుకునేందుకు భవనాలను నిర్మించలేని దుస్ధితిలో ప్రభుత్వం ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు అద్దె భవనాల్లో సక్రమమైన సదుపాయాలు లేక విద్యార్థుల అవస్థలు చెప్పనలవి కాదు. వర్షాకాలం వచ్చిందంటే హాస్టళ్ళు చుట్టూ వర్షపునీరు, పైకప్పుల నుండి నీరు కురుస్తుండటంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సిన దుస్థితి జిల్లాలో నెలకొంది. కాగా విద్యార్థులను ప్రధానంగా మరుగుదొడ్ల సమస్య వేధిస్తోంది. అద్ద్భెవనాల్లో సక్రమంగా మరుగుదొడ్ల సదుపాయం లేక సుదూరప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రివేళల్లో బహిర్భూమికి వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. అదేవిధంగా హాస్టళ్లలో విద్యార్థులకు సక్రమంగా మంచినీరు దొరకడం లేదు. దీంతో విద్యార్థులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ సరిపోవటం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు ఉపకార వేతనాలు సక్రమంగా రాని పరిస్థితి ఏర్పడింది. ఆధార్‌కార్డు ఉంటేనే ఉపకార వేతనం మంజూరు అవుతుందని అధికారులు చెబుతుండగా ఆ కార్డులను కొన్ని మండలాల్లో ఇంకా తీయని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయాప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఆధార్‌కార్డు కోసం పరుగులు తీస్తున్నారు. గత సంవత్సరం నుండి చదువుతున్న బిసి విద్యార్థులకు ఉపకార వేతనాలు రాగా ఈసంవత్సరం చదువుతున్న వారికి ఇంకా రాలేదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రఘురాం ఆరోపించారు. ఇదిలాఉండగా సంక్షేమ హాస్టళ్ళ నిద్రబాట పట్టాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నిర్లక్ష్యం నీడలో..
* మొక్కుబడిగా ఉప ఉపాధి కార్యాలయం సేవలు
* అవస్థలు పడుతున్న పశ్చిమప్రాంత నిరుద్యోగులు
మార్కాపురం, ఫిబ్రవరి 28: విద్యార్థి సంఘాల పోరాట ఫలితంగా మార్కాపురం డివిజన్ కేంద్రంలో ఏర్పాటైన ఉప ఉపాధి కార్యాలయం నిరుపయోగమవుతోంది. దీంతో పశ్చిమప్రాంత విద్యార్థులు, నిరుద్యోగులు పడరానిపాట్లు పడుతున్నారు. ఉప ఉపాధి కార్యాలయం మార్కాపురంలో నెలకొల్పకముందు మార్కాపురం డివిజన్‌లోని యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పెద్దదోర్నాల, పుల్లలచెరువు, కంభం, అర్ధవీడు, పెద్దారవీడు, గిద్దలూరు తదితర మండలాల అభ్యర్థులు ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకునేందుకు అధిక వ్యయప్రయాసలకోర్చి జిల్లాకేంద్రమైన ఒంగోలుకు వెళ్ళేవారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థి యువజన సంఘాలు పలు ఉద్యమాలు చేపట్టి మార్కాపురం డివిజన్ కేంద్రంలో సబ్ ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఏర్పాటుకు కృషిచేసి విజయం సాధించారు. ఫలితంగా స్థానిక ఆర్డీఓ కార్యాలయంలోని ఓ గదిలో ఉప ఉపాధి కార్యాలయాన్ని 1991 ఆగస్టు 30వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభించి నేటికి 22 సంవత్సరాలు గడచినప్పటికీ కార్యాలయంపరంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కార్యాలయానికి మొత్తం ఐదుగురు సిబ్బంది ఉండాల్సి ఉండగా సీనియర్ అసిస్టెంటు, అటెండర్ మాత్రమే పని చేస్తున్నారు. మరో మూడు పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. కార్యాలయంలో దాదాపు 10 కంప్యూటర్లు ఉన్నప్పటికీ కనీస బడ్జెట్ కేటాయించకపోవడంతో ఆన్‌లైన్ సౌకర్యం లేక వృథాగా పడి ఉన్నాయి. నెలకు దాదాపు 300 మంది తమ అర్హతలను నమోదు చేసుకుంటున్నప్పటికీ రెన్యువల్ విధానం ప్రవేశపెట్టకపోవడంతో ప్రత్యేకంగా రెన్యువల్స్ కోసం జిల్లాకేంద్రానికి వెళ్ళక తప్పడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. బడ్జెట్‌తోపాటు రిజిస్టర్‌దారులకు ప్రింటెడ్ రిజిస్ట్రేషన్ కార్డులకు బదులు ఫిల్టర్ పేపర్‌పై టైప్‌చేసి రబ్బర్‌స్టాంప్ వేసి కార్డుగా ఇస్తున్నారు.
మూడు నెలలు గడుస్తున్నా కార్డు రాలేదు
స్థానిక ఉప ఉపాధి కార్యాలయంలో 2012 డిసెంబర్ 26వ తేదీన పేర్లు నమోదు చేసుకున్నప్పటికీ నేటికీ దానికి సంబంధించిన కార్డులు చేరలేదని రిజిస్టర్‌దారులు మార్కాపురానికి చెందిన పఠాన్ రజియా, బోడపాడుకు చెందిన రామలక్ష్మమ్మలు వాపోయారు. తాము ఒకేషనల్ ఇంటర్ నర్సింగ్ పూర్తిచేసి ఉద్యోగం వేటలో ఉన్నామని, తమకు ఎంప్లాయిమెంటు కార్డు తప్పనిసరి అయిందని, నేటికీ సదరుకార్డు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్డు కోసం రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమాధానం చెప్పే అధికారి లేరని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్టర్ వరకు మాత్రమే తమ బాధ్యత అని, కార్డులు చేరాయా? లేదా? అనే విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని సంబంధిత కార్యాలయ సీనియర్ అసిస్టెంటు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఉప ఉపాధి కార్యాలయానికి అన్ని సౌకర్యాలు సమకూర్చి అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని ఈ ప్రాంత నిరుద్యోగులు కోరుతున్నారు.
ప్రైవేటు సంస్థలకు టోకరా వేసిన మోసగాడి అరెస్టు
మార్కాపురం, ఫిబ్రవరి 28 : స్వచ్చంధ సేవా సంస్థలకు ఎరవేసి విదేశాల నుంచి లక్షలాది రూపాయల కంట్రీబ్యూటరీ ఫండ్ తెప్పిస్తానంటూ ఆయా సంస్థలకు 5 లక్షల రూపాయల వరకూ టోకరా వేసిన మోసగాడిని బుధవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఉదయం డివైఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డివైఎస్పీ రామాంజనేయులు పూర్తివివరాలను వెల్లడించారు. టంగుటూరుకు చెందిన కొమ్ము కోటేశ్‌మాదిగ ఒంగోలులోని దిబ్బలరోడ్డుగల ఓ ప్రైవేటు కార్యాలయంలో ఉద్యోగం చేస్తూ విలాసాలకు అలవాటుపడి పలుమోసాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఈనేపథ్యంలో గిద్దలూరులో ఉన్న ఆల్ఫా రూరల్ డెవలప్‌మెంటు సొసైటీ, లీలా ఆనంద్ రూరల్ డెవలప్‌మెంటు సొసైటీ సంస్థల అధ్యక్షులైన స్వరూప్ సునీల్‌కుమార్, చీదెళ్ళ కరుణమ్మలను కలిసి మోసపూరిత మాటలుచెప్పి నమ్మించి ఆయా సంస్థలకు చెందిన రిజిస్ట్రేషన్ ఇతరత్రా రికార్డులను తీసుకొని ఆ సంస్థ అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం నుంచి, విదేశాల నుంచి పెద్దమొత్తంలో నిధులు తెప్పిస్తానని చెప్పారు. 10శాతం నగదు జమచేస్తే 90శాతం మార్జిన్‌ఫండ్ చేతికి అందుతుందని, అందుకుగాను 5లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలని కోటేశ్ తన బ్యాంకు అకౌంట్‌లో జమ చేయించుకున్నాడు. వాటిని సొంత అవసరాలకు వినియోగించుకుంటూ ఇదే తరహాలో కడపజిల్లాలో కూడా పలుమోసాలకు పాల్పడుతున్నాడని డివైఎస్పీ రామాంజనేయులు వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు బుధవారం జిల్లాకేంద్రమైన ఒంగోలులో కోటేశ్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు.
* ఆశకుపోయి ఆస్తులు పోగొట్టుకోవద్దు - డివైఎస్పీ
హిమ్ సంస్థ మోసాన్ని జిల్లాప్రజలు మరువకముందే మరోమోసగాడి చేతిలో మరికొందరు మోసానికి గురయ్యారని, తేలికగా డబ్బులు సంపాదించవచ్చునన్న ఆశలో ప్రజలు అవకాశవాదులను పోషిస్తున్నారని డివైఎస్పీ రామాంజనేయులు అన్నారు. మోసగాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం మోసాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కోటేశ్ బాధితులు ఎవరైనా ఉంటే సంబంధిత పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో గిద్దలూరు సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ, ఎస్సై కె శ్రీనివాసరావులు పాల్గొన్నారు.
మోకాళ్లపై నడుస్తూ విఆర్‌ఎల నిరసన
ఒంగోలు అర్బన్, ఫిబ్రవరి 28: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మోకాళ్ళపై నడుస్తూ ప్రభుత్వానికి గ్రామ రెవెన్యూ సహాయకులు నిరసన వ్యక్తం చేశారు. జిఓ నెంబర్ 39 ప్రకారం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి విఆర్‌ఓలుగా ప్రమోషన్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా గ్రామ రెవిన్యూ సంఘం అధ్యక్షులు గుర్రం నాగయ్య అధ్యక్షతన కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరవధిక రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి ఆరవ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరం నుండి కలెక్టరేట్ వరకు మోకాళ్ళపై నడిచి ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. అంతకుముందు దీక్ష శిభిరాన్ని హాస్టల్ యూనియన్ కార్యదర్శి కె వెంకటేశ్వర్లు, సభ్యులు డి సుబ్బారావు, పి శంకర్‌నాయక్, డి మోహన్‌రావు, ఎం రాములు, ఎం ఆంజనేయులు, పి సురేష్‌లు ప్రారంభించి మాట్లాడారు. గ్రామ సేవకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, జిఓ నెంబర్ 39 ప్రకారం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రమోషన్‌లు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా రెవిన్యూ అధికారులు ఇప్పటికైన నిర్లక్ష్య వైఖరి విడనాడి గ్రామ సేవకుల సమస్యలు పరిష్కరించే వరకు తాము దీక్షకు మద్దతుగా ఉంటామని హామి ఇచ్చారు. ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి వి ఆంజనేయులు, బి పేతురు తమ పాటలతో ఉత్తేజ పరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ సేవకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె మాణిక్యారావు, కార్యదర్శులు కె చంద్రశేఖర్, పాలపర్తి కాంతారావు, పి హరిబాబు, పి పరుశురాం, పి రాజు, బి యేవేలు, ఎం రాజేష్, దారా మల్లయ్య, పి రంగనాయకులు, ఎన్ సురేష్, బి వెంకట్రావు, బి రజనీ, కె జయలక్ష్మి, కె సుజాత, బి నర్సింహం, టి గురువయ్య, పి మోహన్‌రావు తదితరులు నాయకత్వం వహించారు.
18న కానిస్టేబుల్ పోస్టులకు పరుగు పోటీ
ఒంగోలు అర్బన్, ఫిబ్రవరి 28: పోలీస్ కానిస్టేబుల్ సివిల్, ఎఆర్, ఎపిఎస్‌పి, ఫైర్‌మెన్ తదితర పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈనెల 18వ తేదిన పరుగు పోటీ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కొల్లి రఘురాంరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా ఈనెల 1వ తేది శుక్రవారం పరుగుపందెం నిర్వహిస్తున్నట్లు ప్రకటించామన్నారు. అభ్యర్థులు ఈనెల 18వ తేదిన జరిగే పరుగు పోటీలో పాల్గొనాలని సూచించారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈనెల 16వ తేది వరకు కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆఫీస్ పనిచేసే వేళల్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.
సిపిఎం విజయోత్సవ ర్యాలీ
ఒంగోలు అర్బన్, ఫిబ్రవరి 28: త్రిపుర రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సిపిఎం నాయకత్వంలోని వామపక్ష కూటమిని వరుసగా ఏడవసారి ఎన్నుకున్న సందర్భంగా గురువారం ఒంగోలు నగరంలో సిపిఎం విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. స్థానిక కోర్టు సెంటర్ నుండి రంగారాయుడు చెరువు, పివిఆర్ బాలుర హైస్కూల్, ఆర్‌టిసి బస్టాండ్ మీదుగా సాగర్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడికి చేరుకున్న పార్టీ శ్రేణులు పెద్దఎత్తున బాణాసంచా పేల్చి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు మిరియం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిపిఎం ప్రజానుకూల విధానాలు అనుసరిస్తున్నందునే 30 సంవత్సరాలుగా వరుసగా ఎన్నికై ఏడవసారి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుందన్నారు. యుపిఎ - 2 ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నామన్నారు. ఈకార్యక్రమానికి సిపిఎం నగర కార్యదర్శి జివి కొండారెడ్డి, నగర నాయకులు బి వెంకట్రావు, జి బాలకృష్ణ, కెఎఫ్ బాబు, ఎస్‌డి హుస్సేన్, ఆర్ శ్రీనివాసరావు, వి బాలకోటయ్య, బి రఘురాం తదితరులు నాయకత్వం వహించారు.
పొగాకుకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి
రైతు సంఘం డిమాండ్
ఒంగోలు అర్బన్, ఫిబ్రవరి 28: పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఈ సంవత్సరం పొగాకు రైతులకు కేజీకి సరాసరిన 120 రూపాయలకు తగ్గకుండా ఇవ్వాలని రైతుసంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎల్‌బిజి భవన్‌లో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకట్రావు అధ్యక్షతన రైతు సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర రాక తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ సంవత్సరమైన రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని అనుకుంటే ఇప్పటివరకు జరిగిన పొగాకు వేలంలో మేలురకం కేజి 123 రూపాయలు కూడా రావడం లేదన్నారు. ఐటిసి కంపెనీ కనుసన్నల్లో వ్యాపారులు సిండికేట్‌గా మారి కొనుగోలు చేస్తున్నారన్నారు. ఈ సంవత్సరం పొగాకు వేలంలో ప్రవేశపెట్టిన ఈ- వేలం కూడా పొగాకు వ్యాపారుల సిండికేట్లు బద్దలకొట్టలేకపోయిందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య, కోల్ సొసైటీలను రంగంలోకి దించి ఐటిసి, పొగాకు వ్యాపారులకు పోటీగా కొనుగోళ్ళు జరిపి కేజి ధర సరాసరి 120కి తగ్గకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యత్ చార్జీలు పెంచి రైతులు, ప్రజలపై భారాలు మోపారన్నారు. తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతుసంఘం కార్యదర్శి ఎస్ రామారావు, జిల్లా కార్యదర్శి నాగబోయిన రంగారావు, జిల్లా సహాయ కార్యదర్శి దుగ్గినేని గోపినాధ్, ఉపాధ్యక్షులు కె రామకోటేశ్వరరావు, ఎం కోటయ్య, ఆర్ వినోద్, పి తిప్పారెడ్డి, ఎస్ ఓబులరెడ్డి, టి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా టైలర్స్ డే వేడుకలు
ఒంగోలు అర్బన్, ఫిబ్రవరి 28: ఒంగోలు నగర టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలో భారీఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక పద్మావతి ఫంక్షన్ హాలులో జరిగిన సభలో రాష్ట్ర టైలర్స్ ప్రధాన కార్యదర్శి కానుగుల నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నో సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచినప్పటికి ఆ సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్టవ్య్రాప్తంగా దర్జీ వృత్తిలో జీవనం కొనసాగిస్తున్న ప్రతిఒక్కరికి ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ షాపింగ్ మాల్స్‌లో కొన్ని షాపులు తమకు కేటాయించాలని కోరారు. రాయితీతో కూడిన విద్యుత్‌ను సరఫరా చేయాలని కోరారు. రాష్ట్రంలో 30 లక్షల మంది, జిల్లాలో 30 వేల మంది టైలరింగ్ వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని వివరించారు. రోడ్ మర్జిన్‌లలో బంకులు పెట్టుకొని అద్దె షాపుల్లో అద్దెల భారంతో టైలరింగ్ నిర్వహిస్తున్న టైలర్స్‌కి కాంప్లెక్స్‌లు ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధునిక పద్దతులపై కుట్టు శిక్షణ ఏర్పాటు చేసి దర్జీ వృత్తిని ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో 300లకు పైగా టైలర్స్ సహకార సంఘాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు టైలర్స్‌కుగాని, దర్జీ సహకార సంఘాలకుగాని సహకరం అందించలేదన్నారు. పక్కనే ఉన్న తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు టైలర్లకు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేశాయన్నారు. 2011 ఫిబ్రవరి 28న జరిగిన వేడుకల్లో ఆనాటి జౌళిశాఖ మంత్రి శంకరరావు 7,500 మంది సమక్షంలో వరాలజల్లు కురిపించి వెళ్ళారన్నారు. ఇంతవరకు ఆ వరాలు అమలుకు నోచుకోలేదన్నారు. తమ సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రులను, మంత్రులను కలిసి తమ గోడు విన్నవించుకున్న పట్టించుకున్న నాధుడే లేరన్నారు. ముందుగా కుట్టుమిషన్ సృష్టికర్త ఇలియన్స్ హోవే, టైలర్స్‌డే కృషిరత్న కెఎన్ స్వామి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బధిరుల పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. పెద్ద మసీదు వద్ద నగర అధ్యక్షులు ఎస్‌కె హుస్సేన్ జెండా విష్కరణ చేశారు. బాపూజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎస్‌కె నాగూర్, కార్యదర్శి మల్లికార్జున్, కోశాధికారి బి నాగేశ్వరరావు, ప్రచార కార్యదర్శి సుధాకర్, బి సుబ్బారావు, నగర కార్యదర్శి నాగేశ్వరరావు, సుభాని, లక్ష్మీపతి, శ్రీనివాసులతోపాటు నగరంలోని టైలర్‌లందరు పాల్గొన్నారు.
యానాం ఎమ్మెల్యే కృష్ణారావుకు ఘన స్వాగతం
ఒంగోలు అర్బన్, ఫిబ్రవరి 28: యానం శాసనసభ్యుడు మల్లాడి కృష్ణారావుకు మత్య్యకార సంఘం, బిసి సంక్షేమ సంఘం, ఫిష్ మార్కెట్ యూత్ అసోసియేసన్, అఖిల భారత యాదవ మహాసభ ప్రతినిధులు గురువారం ఘనంగా స్వాగతం పలికారు. గత నెల 13వ తేదీన యానాంలో ప్రారంభమైన పాదయాత్ర ఈనెల 11వ తేదికి తిరుపతికి చేరుకుంటుంది. అందులో భాగంగా ఒంగోలుకు వచ్చిన ఆయనకు ఘనస్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డి మస్తాన్‌రావు, మత్స్యకార చైతన్య వేదిక జిల్లా కన్వీనర్ జి ఏడుకొండులు, మత్స్యకార హక్కుల పరిరక్షణ కమిటి జిల్లా అధ్యక్షులు ఎస్ రాములు, వడ్డెర ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పి చెంచు రామయ్య, నారుూబ్రాహ్మణ సేవాసంఘం జిల్లా అధ్యక్షులు డి లక్ష్మీనారాయణ, యాదవసంఘం నగర అధ్యక్షుడు ఎం అంజిబాబు, ఫిష్ మార్కెట్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కె సముద్రాలు, మహిళా నాయకులు నాయుడు సామ్రాజ్యం, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు ఆర్ వెంకట్రావు, నరాల కృష్ణ, జి వెంకటేశ్వర్లు, పి వెంకటేశ్వర్లు, కె జగన్, చాపల వెంకటేశ్వర్లు, పి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఆయన ముందు ఏకరువు పెట్టారు. సమస్యలు పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్
ఒంగోలు అర్బన్, ఫిబ్రవరి 28: జాతీయ సైన్స్ డే సందర్భంగా నగరంలోని విజేత పబ్లిక్ స్కూల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో 1 నుండి 5వ తరగతి విద్యార్థులచే సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ప్రారంభించారు. విద్యార్థులు 60 ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ అందరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సిటిజన్స్ అధ్యక్షులు పి రాజేష్, ఎపిటిసి ఎ రాష్ట్ర నాయకులు పిహెచ్‌జి కృష్ణంరాజు, ఎబియం జూనియర్ కళాశాల కరస్పాండెంట్ కొమ్మూరి రవిచంద్ర, కమర్షియల్ ట్యాక్ ఆఫీసర్ భాను సత్యప్రకాష్, కె రమష్, విజేత ప్రమరీ స్కూల్ ప్రిన్సిపాల్ సుజాత, కరస్పాండెంట్ వివి రమణ తదితర ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య రాకుండా చూడాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఫిబ్రవరి 28: జిల్లాలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని కలెక్టర్ కాన్ఫరెన్స్‌హాలులో ముందస్తు జిల్లా సమీక్షా మండల సమావేశాన్ని అధికారులతో కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలో గత జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న తాగునీటి బోర్లను వెంటనే మరమ్మతులు చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇని ఆదేశించారు. తాగునీటి చెరువులను ఎన్‌ఎస్‌పి నీటితో నింపుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాలలో తాగునీరు ట్యాంకర్ల ద్వారా రవాణా చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. జిల్లాలో డెయిరీ యూనిట్లకు కేటాయించిన సబ్సిడీని వినియోగించనట్లైతే దాని నుండి ఆర్‌ఆర్ యాక్టు కింద వసూలు చేయాలని కలెక్టర్ పశుసంవర్ధ శాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో పావలావడ్డీ బకాయిలను మహిళా స్వయం సహాయక సంఘాలకు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని డిఆర్‌డిఎ పిడిని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలను ప్రతి సంవత్సరం ఆడిట్ చేయాలన్నారు. జిల్లాలో అన్ని శాఖల్లో అధికారులకు పదోన్నతులు, ఇక్రిమెంట్‌లు కల్పించేందుకు అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలన్నారు. ఉద్యోగులు అధికారులకు పదోన్నతుల కోసం అర్జీలు పెట్టి వేడుకొనే విధానానికి స్వస్తి పలకాలన్నారు. జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు పునరావాస బాధితులకు తాత్కాలికంగా కలనూతల, సుంకేసులలో పాఠశాలలు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు పూర్తయి 3 సంవత్సరాలు అయ్యిందన్నారు. ముంపు గ్రామాల బాధితులకు ఆర్‌ఆర్ ప్యాకేజి కింద వౌలిక వసతులు కల్పించాల్సి ఉందన్నారు. ముంపు గ్రామాల్లో వౌలిక వసతుల కల్పనకోసం ప్రణాళికలు రూపొందించి అమలు చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పునరావాస కేంద్రాలలో బాధితులకు పక్కా గృహాలు, సిమెంట్ రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, పాఠశాల భవనాలు నిర్మించాలని ఆదేశించారు. జాతీయ ఉపాధిహామీ పథకం కింద గ్రామాలలో పనికోరిన ప్రతిఒక్కరికి పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కరేడు, రామయపట్నం సంక్షేమ హాస్టళ్లను వెంటనే తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని సంక్షేమశాఖ అధికారులు ఆదేశించారు. సంక్షేమ హాస్టల్‌ను మండల పరిషత్ అభివృద్ధి అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహించి నివేదికను అందజేయాలన్నారు. 2 తేదిన జరిగే జిల్లా సమీక్షా మండలి సమావేశానికి అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో రావాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఓ కెటి వెంకయ్య, జిల్లా రెవెన్యూ అధికారి జె రాధాకృష్ణమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ ఆస్తులు పరిరక్షించాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
ఒంగోలు అర్బన్, ఫిబ్రవరి 28: జిల్లాలో గ్రామ పంచాయతీ ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి పంచాయతీ ఆస్తుల పరిరక్షణ ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పంచాయితీ ఆస్తులను అధికారులు ముందుగా గుర్తించి రికార్డును తయారుచేయాలన్నారు. పంచాయితీ ఆస్తుల పరిరక్షణకు మూడు రకాల ఎబిసి రికార్డులను తయారుచేయాలన్నారు. ఏ రికార్డులో పంచాయతీ సొంత భవనాలు, కాలువలు, రోడ్లు, పశువుల కొస్టాలు, మార్కెట్‌లు నమోదు చేయాలన్నారు. బి రిజిస్టర్‌లో గ్రామ పంచాయతీకి సంబంధించిన నీటి వనరులు, చెరువులు, కుంటలు, రిజర్వాయర్‌లు, చలములు, మైనర్ ఇరిగేషన్ చెరువులు నమోదు చేయాలన్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను యుద్ధప్రాతిపధికపై తయారుచేయాలని పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జనవరి 1 - 2013 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని ఓటర్ల జాబితా తయారుచేయాలన్నారు. ఆసెంబ్లీ ఓటర్ల జాబితాను తీసుకొని పంచాయితీలవారీగా, వార్డుల వారీగా విడగొట్టాలన్నారు. పంచాయతీ ఓటర్ల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బిసి ఓటర్ల వివరాలను విభజించాలన్నారు. ఓటర్ల జాబితాల సంఖ్య అసెంబ్లీ ఓటర్ల జాబితా సంఖ్యకంటె ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగకూడదన్నారు. జిల్లాలో 1029 గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాలు అధికారులు తయారు చేయాలన్నారు. తయారుచేసిన ఓటర్ల జాబితాను మండల పరిషత్ ఇఓఆర్‌డిలు మొదటి దశలో డివిజన్ పంచాయతీ అధికారి, రెండవ దశలో జిల్లా పంచాయతీ అధికారి మూడవ దశలో తనిఖీ నిర్వహించాలన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో 2 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులకు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 16 నుండి 31 వరకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులకు నిర్ణయించిన లక్ష్యాల మేరకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన అధికారులకు ప్రజల్లో మంచి గౌవరం లభిస్తుందన్నారు. మండల పరిషత్ ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు వేసవిలో ఎదుర్కోవాల్సిన త్రాగునీటి సమస్యలను గుర్తించాలన్నారు. దీనికి అనువైన ప్రణాళికలను తయారు చేయాలన్నారు. మండలాలలో వ్యిక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు అనుభం ఉన్న మేస్ర్తిలను గుర్తించాలన్నారు. మండలస్థాయిలో గుర్తించిన మేస్ర్తిలకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై గృహనిర్మాణశాఖ అధికారులు శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సిపి ఓ కెటి వెంకయ్య, జిల్లా రెవిన్యూ అధికారి జె రాధాకృస్ణమూర్తి, డిఆర్‌డిఎ పిడి పద్మజ, జిల్లాపరిషత్ సిఇఓ గంగాథర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
కోతలే.. కోతలు
ప్రజల అవస్థలు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, ఫిబ్రవరి 28: రాష్ట్ర ప్రభుత్వం భారీగా విద్యుత్ కోతలు అమలుచేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో గ్రామాలు, పట్టణాలు, నగరాలు అంధకారంలో మగ్గనున్నాయి. ఈ పాటికే విద్యుత్ కోతలు అమలులో ఉండగా మరికొన్ని గంటలు విద్యుత్ కోతలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు పనిచేసే అవకాశాలు కన్పించటంలేదు. ప్రధానంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుంటుపడే అవకాశాలు ఉన్నాయి. కార్పోరేషన్‌లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. 4 గంటలపాటు కార్పోరేషన్ పరిధిలో ప్రజలకు అవస్థలు తప్పవు. అదేవిధంగా మండల కేంద్రాలలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు విద్యుత్ కోతలు విధించనున్నారు. 8 గంటలపాటు మండల కేంద్రాలలో కోతలు తప్పవు. మున్సిపాలిటీలలో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. 6 గంటలపాటు మున్సిపాలిటీలలో కోతలు విధించనున్నారు. 12 గంటలపాటు గ్రామాలు అంధకారంలో మగ్గనున్నాయి. ఇదేవిధంగా విద్యుత్ కోతలు కొనసాగితే అన్ని రంగాల ప్రజలు ఇబ్బందులకు గురికాక తప్పదు. ఇదిలావుండగా పరీక్షలు సమీపించిన తరుణంలో విద్యుత్ కోతలు పెంచడంతో విద్యార్థులు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.