శ్రీకాకుళం (టౌన్), ఫిబ్రవరి 28: జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా సెంథిల్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2008 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం వరంగల్ జిల్లా మునుగు ఎఎస్‌పిగా పనిచేస్తున్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాకు బదిలీపై రానున్నారు. ఇంతవరకు జిల్లాలో ఎఎస్‌పిగా పనిచేసిన బిడివి సాగర్ పదోన్నతితో 2011లో జిల్లాకు ఎఎస్పీగా వచ్చారు. ఆయనకు హైదరాబాద్ డిజీపీ కార్యాలయంలోరిపోర్టు చేయమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
========
ఆధ్యాత్మికతతోనే సమైక్యత
రాజాం, ఫిబ్రవరి 28: రాజకీయం ,కులం , వర్గం , మతం సమాజాన్ని కలిపి ఉంచలేవని, ఆధ్యాత్మిక మార్గమే సమాజాన్ని సమైక్యంగా ఉంచుతుందని శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి ఉద్బోంధించారు. గురువారం రాజాం సమీపంలో అంతకాపల్లి గ్రామంలో బాలాజీదేవాలయ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆయన అనుగ్రహ భాషణ చేశారు. సమాజాన్ని కలిపి ఉంచేది ఆధ్యాత్మిక మార్గమేనని అన్నారు. గతంలో భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో హిందూ, ముస్లింలు సమైక్యంగా పూజలు నిర్వహించేవారని ప్రస్తుతం ఆ భావం కానరావడం లేదన్నారు. ఏకతాసూత్రం పాటించకపోవడం వలన చాలా మంది దూరమై బాంబు కల్చర్‌కు అలవాటు పడుతున్నారని అన్నారు. ధర్మాన్ని, దైవాన్ని నమ్మిన వారికి ఎటువంటి ఆపదలు రావని ఉపదేశించారు. ఆలయాలు నిర్మించినపుడు ప్రామాణికాలు, ఆగమశాస్త్రం పాటించకుంటే ఉపద్రవాలు తప్పవని ఇటీవల జరిగిన హైదరాబాద్ సంఘటనే దానికి నిదర్శనమన్నారు. దేవున్ని శపిస్తూ కూర్చునేకంటే దేవున్ని ఆరాధించడం ఎంతో మంచిదని ఉపదేశించారు. ప్రతీ ఒక్కరూ పూరీ క్షేత్రాన్ని దర్శించి అక్కడ నెలకొల్పిన సమైక్యతాభావాన్ని అలవరుచుకోవాలని కోరారు. అంతకుముందు ఆయన బాలాజీ దేవస్థాన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ ట్రస్టు తరపున గ్రంధి ఈశ్వరరావు, గ్రంధి పెదబాబు, గ్రంధి చినబాబు వారి కుటుంబ సభ్యులు , భక్తజనులు పాల్గొన్నారు.
==========
శీతకన్ను
(ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం)
పార్లమెంట్‌లో గురువారం చిదంబరం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ జిల్లా వాసులను మరోసారి నిరాశకు గురిచేసింది. జిల్లాలో వ్యవసాయ రంగం తరువాత అతిపెద్దరంగంగా ఉన్న చేపలవేటను అనాదిగా నమ్ముకుంటున్న మత్స్యకారుల బతుకుల్లో వెలుగునింపాల్సిన భావనపాడు, కళింగపట్నం ఓడరేవులకు కనీస నిధులు కేటాయింపులు జరుపకపోవడంతో వారంతా మరోసారి నిరాశకు గురయ్యారు. జిల్లాలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో లక్షకు పైగా మత్స్యకారులు తీరాన్ని నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. 193 కిలోమీటర్లు పొడవునా సముద్రతీరం ఉండగా భావనపాడు, కళింగపట్నంల వద్ద ఓడరేవులు నిర్మిస్తామన్న పాలకుల హామీ కాగితాలకే పరిమితమైంది. దారిద్య్రరేఖకు దిగువన చేపలవేటే జీవనాధారంగా ఆటుపోటులు ఎదుర్కొంటున్న గంగపుత్రులు జీవితాల్లో వెలుగునింపాలన్న ఆలోచన ఏ పార్టీకి రాకపోవడంతో వారి బతుకులు మసిబారిపోయాయనే చెప్పాలి. 60 వేల కుటుంబాలు చేపలవేటపై జీవనం సాగిస్తుండగా సుమారు 30 వేల మంది బతుకుబండి సాగించేందుకు గుజరాత్, వీరావాల్, కాండ్లా, పోర్‌బందర్, అండమాన్, చెన్నై వంటి ప్రాంతాలకు వలసబాట పట్టి మరిన్ని ఈతిబాధలకు గురవుతున్నారు. స్థానికంగా వేట గిట్టుబాటు కాకపోవడంతో మత్స్యకారులు దయనీయ పరిస్థితిల్లో కొట్టుమిట్టాడుతున్నారు ఇటువంటి ప్రత్యేక పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా రాష్ట్రంలో రెండు ఓడరేవుల అభివృద్ధికి నిధులు కేటాయించి కళింగపట్నం, భావనపాడుఓడరేవులపై శీతకన్ను వేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.
విశాఖపట్నం నుంచి పారాదీప్ వరకు ఓడరేవు లేకపోవడంతో భావనపాడులో హార్బర్ నిర్మించి గంగపుత్రులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం 1984లో వేసిన శిలాఫలకమే నేటికి సాక్ష్యంగా మిగిలింది. అనంతరం ఈ హార్బర్‌ను విదేశీయులకు అప్పగిస్తారని ఓ ప్రచారం సాగినా ఆ దిశగా చర్యలు లేవు. దివంగత ముఖ్యమంత్రులు ఎన్.టి.రామారావు, వై.ఎస్.రాజశేఖరరెడ్డి, నేటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలు వివిధ సందర్భాల్లో ఈ ఓడరేవును నిర్మిస్తామని ప్రకటించడమే తప్ప కనీస నిధులు కూడా కేటాయించే దాఖలాలు కానరాలేదు. తాజాగా ఈ హార్బర్‌ను నిర్మించాలంటే సుమారు వెయ్యికోట్లు అవసరముంటుందని, దక్షిణం వైపు గోడ, ముఖద్వారం వద్ద భారీగా ఇసుకమేటలు ఏర్పాటుచేయాలని నిపుణులు ప్రభుత్వానికి సూచించినప్పటికీ ఆ దిశగా ఆలోచన జరుపకపోవడం శోచనీయం. ఇంత చరిత్ర ఉన్న భావనపాడుకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం శ్రీకాకుళం జిల్లా వాసుల పాలిట పాలకులకు ఉన్న ప్రేమ ఏపాటిదో ఇట్టే అర్ధమవుతోంది.
ఇక బ్రిటీష్ కాలం నుండి ఒకవెలుగు వెలిగిన కళింగపట్నం తీరాన్ని కూడా ఓడరేవుగా అభివృద్ధి చేస్తామని వై.ఎస్. హయాంలో స్థలపరిశీలన కూడా పూర్తిచేశారు. ఇందులో భాగంగా బందరువానిపేట, మత్స్యలేశం సమీపాన ఉప్పుగెడ్డ వద్ద, అలాగే వంశధార నదీసంగమం ప్రాంతంలో హార్బర్‌ను నిర్మించేందుకు స్థలాన్ని ఉన్నతాధికారులు సేకరించారు. వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కళింగపట్నం హార్బర్ ప్రతిపాదన ప్రభుత్వం దృష్టిలో ఉందని స్పష్టం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో వివక్షత చూపడం ఈ ప్రాంతీయులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే ఈ తీరంలో రాడార్ వ్యవస్థ, మెరైన్ పోలీసుస్టేషన్, 1500 మెగా సామర్ధ్యం గల అధునాతన కెమెరాను అమర్చి మరింత నిఘా కట్టుదిట్టం చేసారు. ఈ ఆధునిక పరికరాలు సముద్రంలో 30 కిలోమీటర్ల పరిధిలో కార్యకలాపాలను పసిగట్టేలా ఏర్పాట్లు చేశారు. ఇటువంటి సౌకర్యాలు ఉన్న తీర ప్రాంతాన్ని ఓడరేవుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో గంగపుత్రులకు వలసపాట్లు తప్పేటట్లు లేవు.
మరోవైపు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన కోస్టల్ కారిడార్‌కు కూడా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. ఈ ప్రాజెక్టు తీరం వెంబడి ఏర్పాటుచేస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెంది జిల్లా మరింత ఆర్థిక ప్రగతి సాధించి ఉండేది. బడ్జెట్‌లో కూడా కారిడార్‌ను ప్రస్తావించకపోవడం పర్యాటక రంగంపై కూడా నీలినీడలు అలముకున్నాయి.
============
థర్మల్‌ను రద్దు చేయకపోతే యాజమాన్యాన్ని తరిమికొడతాం
సంతబొమ్మాళి, ఫిబ్రవరి 28:్థర్మల్ పవర్‌ప్లాంట్ జీవో రద్దు చేయ్యకపోతే పవర్‌ప్లాంటులోపలకు వెళ్లి భారీ బహిరంగసభ నిర్వహిస్తామని, ప్లాంట్ యజమాన్యాన్ని తరిమివేస్తామని మాజీ మంత్రి తమ్మినేని సీతారాం హెచ్చరించారు. థర్మల్‌కాల్పులలో ముగ్గురు మృతి చెందిన సంఘటన జరిగిన రెండేళ్లు పూర్తి కావడంతో అమర వీరుల స్థూపం వద్ద గురువారం హనుమంతునాయుడుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ థర్మల్ పవర్‌ప్లాంట్ వద్దని కాకరాపల్లి పరిసర గ్రామాల్లో వేలాది మంది మత్స్యకారులు, రైతులు గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తుంటే ప్రభుత్వం, అధికారులు, యజమాన్యం పెడచెవిని పెడుతుందన్నారు. న్యాయమైన పోరాటం చేస్తున్న సమయంలో పోలీసుకాల్పులు జరిపించి ముగ్గురు వ్యక్తులను పొట్టనపెట్టుకున్నారని, వారు ఏమి పాపం చేసారని ప్రశ్నించారు. పవర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న తరుణంలో పోలీసులు జులుం చేసి రాజకీయనాయకులు మాటలు విని పాశవికంగా దాడులు జరిపారన్నారు. 25 ఏళ్ల పాటు ఈ ప్రాంతీయులతో అధికారాన్ని అనుభవించిన నేతలు నేడు థర్మల్ యజమాన్యానికి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. జీవవైవిధ్య సదస్సులో పవర్‌ప్లాంట్ వల్ల ముప్పు ఉందని వ్యాఖ్యానించిన ఎంపి కృపారాణి, కేంద్రమంత్రి కాగానే మాటమార్చారని అన్నారు. పవర్‌ప్లాంటు యజమాన్యం ఇక్కడి పరిస్థితులు గ్రహించి ప్రజాగ్రహానికి గురికాక ముందే ఇక్కడ నుండి వెళ్లిపోవాలని, లేదంటే ప్రజలే తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. వై ఎస్ ఆర్ పార్టీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ థర్మల్ యజమాన్యానికి మంత్రి ధర్మాన ప్రసాదరావు, కేంద్ర మంత్రి కృపారాణి వత్తాసు పలికి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా పోలీసు కాల్పుల్లో అమరులైన బారికివాడు, ఎర్రయ్య, నాగేశ్వరరావు విగ్రహాలకు అభిషేకం చేసి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ రాష్ట్ర స్థాయి నాయకులు చలపతిరావు, పోరాట కమిటీ నాయకులు తాండ్ర ప్రకాశ్, హన్నురావు, నర్శింగరావు, ఎన్ ఎ సి ఎల్ పోరాట కమిటీ నాయకుడు ఎం.మురళీధర్, సిపి ఐ ఎం ఎల్ నాయకురాలు జయమ్మ, అణువిద్యుత్తు కేంద్ర ఉద్యమనాయకురాలు పోలీసు, కృష్ణమూర్తి, వంకల మాధవరావు, ఎస్.రాజారావు, భాస్కరరావు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
============
శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు
* శ్రీముఖలింగం దేవస్థానం చైర్మన్ బలరాం
జలుమూరు, ఫిబ్రవరి 28: ఈ నెల పదవ తేదీ నుండి మూడు రోజులపాటు మండలం శ్రీముఖలింగం పుణ్యక్షేత్రంలో జరుగు మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నట్లు పాలకమండలి చైర్మన్ పైడి బలరాం అన్నారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ శివరాత్రి ఏర్పాట్లపై పలు విషయాలు వివరించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా బారికేడ్లు, సామియాన్లు, తాగునీటి సౌకర్యాలు కల్పనకు దేవాదాయ, ఇతర శాఖాధికారులతో మరో మూడురోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. శివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. శ్రీముఖలింగంకు రాకపోకలు సాగించే భక్తులకు బస్సుల సౌకర్యం, నదీతీరాల్లో స్నానాలరేవు పరిశుభ్రత, పలు కార్యక్రమాలు జరిపేందుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ పేర్కొన్నారు.
===========
‘రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
నరసన్నపేట, ఫిబ్రవరి 28: రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు చెందిన నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు మంజూరు చేసిన రుణాలను సద్వినియోగం చేసుకోవాలని బి.సి కార్పొరేషన్ ఇ.డి కె.బలరాం సూచించారు. గురువారం మండలం ఉర్లాం గ్రామంలో ఉన్న గ్రామీణ వికాస్ బ్యాంకును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల వారికి మార్జిన్ మనీతో వివిధ రకాలవ్యాపారాలు చేసుకునేందుకు గాను బ్యాంకులద్వారా రుణాలను అందజేస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 2,010 యూనిట్లు లక్ష్యం కాగా 1300 యూనిట్లను ఇప్పటివరకు మంజూరు చేశామన్నారు. ఈ రుణాలను వివిధ బ్యాంకుల ద్వారా ఆయా లబ్ధిదారులకు అందజేస్తున్నామని, మార్చి నెలాఖరుకు మిగిలిన యూనిట్లను పూర్తిచేసే దిశగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ శ్రీ్ధర్, సిబ్బంది పాల్గొన్నారు.
========
కూర్మనాథుని దర్శించుకున్న వౌనిబాబా
గార, ఫిబ్రవరి 28: మండలం శ్రీకూర్మంలో కూర్మనాథ క్షేత్రాన్ని హిమాలయాల్లో దీర్ఘకాల తపస్వి అవధూత వౌనిబాబా తన శిశ్యఘనంతో గురువారం సందర్శించారు. క్షేత్రానికి చేరుకున్న వౌనిబాబాకు ఆలయ పాలక మండలి సభ్యుడు మళ్ల నారాయణమూర్తితో పాటు అర్చకులు ఆలయ మర్యాదలుతో సాదరంగా స్వగతించారు. ఆలయ బేడా మండపం గోడలపై ఒడిషా ఆకుపసర్లుతో వేసిన నాటి చిత్రాల చరిత్ర, విశిష్టత, క్షేత్ర మహత్యంను అర్చకులు చామర్ల మురళికృష్ట హిందీలో వివరించారు. ఆలయ ప్రధానార్చకులు చామర్ల సీతారామనృసింహాచార్యులు వీరిచే కూర్మనాథునికి విశేష పూజలు నిర్వహింపజేసారు. అనంతరం స్వామి సన్నిధిలో గల లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేసారు. తదుపరి వౌనిబాబాకు అర్చకులు శేష వస్త్రంతో పాటు తీర్ధ ప్రసాదాలు అందజేసారు. వౌనిబాబాతో పాటు విశాఖపట్నంకు చెందిన పది మంది శిష్యులు, మునసబ్‌పేట గురజాడ కళాశాలకు చెందిన ఆంగ్ల బోధకుడు ఎ.ఎస్.బాబులు ఉన్నారు.
==========
బోటు ఇంజన్‌కు చిక్కుకుని
మత్స్యకారుడు దుర్మరణం
గార, ఫిబ్రవరి 28: మండలం బందరువానిపేట గ్రామానికి చెందిన గనగళ్ల పెద లక్ష్మణ (50) తాను నడుపుతున్న బోటు ఇంజనుకి చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. సహచర మత్స్యకారులు, కుటుంబీకులు తెలియజేసిన వివరాలు ప్రకారం పెదలక్ష్మణ గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇంజనుబోటుపై సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. ఈ సమయంలో తన మెడలో ఉన్న తువ్వాలు ప్రమాదవశాత్తు ఇంజను ఫ్యానుకు చిక్కుకోవడంతో అమాంతం తన వైపు లాగివేసింది. ఈఘటనలో లక్ష్మణ మొండెం బోటులో ఉండిపోగా తల భాగం సముద్రంలో తెగి పడింది. ఈ ఘటనతో హతాశులైన సహచరులు తేరుకొని సముద్రంలో తెగి పడిన తల భాగాన్ని సేకరించి శరీర భాగాలను ఒడ్డుకు తీసుకువచ్చారు. వేటకు వెళ్లిన తన భర్త చేపలతో తిరిగి వస్తాడనుకుంటే శవమై వచ్చాడని భార్యా కన్నీటి పర్యంతమై రోదిస్తోంది. ఈ ఘటనతో బందరువానిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ బి. శాంతి, ఎస్సై నారీమణిలు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. శవపంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మృత దేహాన్ని రిమ్స్‌కు తరలించారు. చేపలు వేటకు వెళ్లిన వారిలో గనగళ్ల పెద లక్ష్మణతో పాటు గనగళ్ల రామారావు, గనగళ్ల అమ్మోరు, గనగళ్ల సందెయ్యలు ఉన్నారు.
======
ఆదర్శప్రాయుడు
సివి రామన్
* వర్సిటీ ప్రిన్సిపాల్ చంద్రయ్య
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 28: సర్. సి.వి.రామన్ ఆదర్శప్రాయుడని అంబేద్కర్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ఎం.చంద్రయ్య అన్నారు. సైన్స్ దినోత్సవం సందర్భంగా ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగం విద్యార్థులు వర్సిటీలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతీ విద్యార్థి సి.వి.రామన్‌ను ఆదర్శంగా తీసుకుని శాస్తవ్రేత్తలు కావాలన్నారు. రామన్ ఎఫెక్ట్ ప్రపంచానికి పరిశోధక దిక్చూచిగా నిలిచిందని వివరించారు. తొలుత రామన్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు టీచింగ్ అసోసియేట్స్ రామన్ ఎఫెక్ట్ విశిష్టతను వివరించారు. డా.పద్మారావు, ఆనందమోహన్, విద్యార్థులు పాల్గొన్నారు.
============
40 శాతం మేర పెరగనున్న భూముల విలువ
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఫిబ్రవరి 28: జిల్లాలో భూముల మార్కెట్‌రేట్లు 40 శాతం వరకు పెరుగనున్నట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. గురువారం ఉదయం ఆయన ఛాంబర్‌లో జిల్లా రిజిష్టర్, సబ్‌రిజిష్టర్లతో రేట్లు పెంపుదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలించిన మీదట భూమి నాణ్యతను బట్టి పది శాతం నుండి 40 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపారు. భూముల మార్కెట్ రేట్లు పెంపుదలను ఒక కమిటీ పరిశీలిస్తుందన్నారు. ఈ కమిటీలకు పట్టణ ప్రాంతంలో జాయింట్ కలెక్టర్ చైర్మన్ గాను, సంబంధిత సబ్ రిజిష్టరర్ కన్వీనర్‌గాను, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, వుడా వైస్ ఛాన్సలర్, మున్సిపల్ కమిషనర్ మెంబర్లుగా ఉంటారన్నారు. అదే విధంగా మండల స్థాయి కమిటీలను రెవెన్యూ డివిజనల్ అధికారి చైర్మన్ గాను, సంబంధిత సబ్ రిజిస్టరర్ కన్వీనర్‌గాను, తహశీల్దార్, ఎంపిడిఒలు మెంబర్లుగా వ్యవహరిస్తారని చెప్పారు.
సూచనలు, సలహాలు తెలియజేయాల్సిన రైతులు మార్చి 15వ తేదీలోగా జిల్లా రిజిష్టరర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రిజిష్టరర్ ఎస్.శామ్యూల్, సబ్ రిజిష్టరర్లు తదితరులు పాల్గొన్నారు.
======
ప్రాచీన చరిత్రను సజీవం చేయాలి
శ్రీకాకుళం(కల్చరల్), ఫిబ్రవరి 28: చరిత్రను వెలికితీయడం ద్వారా ప్రాచీన కళలు, సంస్కృతిని సజీవం చేయాలని ఉత్కల్ యూనివర్సిటీ భారత ప్రాచీన, పర్యాటక విభాగాధిపతి సంజయ్‌ఆచార్య పిలుపునిచ్చారు. గురువారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రెండవరోజు చారిత్రక పర్యాటక అభివృద్ధిపై నిర్వహించిన జాతీయ సెమినార్‌లో ఆయన మాట్లాడారు. గిరిజనుల సంస్కృతి, ప్రాచీన చరిత్ర టూరిజం గూర్చి విశే్లషించారు. ఈ సందర్భంగా జరిగిన పేపర్ ప్రజంటేషన్‌లో 35 పేపర్‌లలో 15 వాటిని వ్యక్తీకరించారు. కళింగాంధ్ర తూర్పు గంగుల శిల్పకళ అంశంపై ఎన్.రాధాకుమారి, మత విశిష్టత గూర్చి సుష్మామిత్రా, బౌద్ధస్థూపాలు, అరసవల్లికి సంబంధించి పరదేశీనాయుడులు పేపర్‌ప్రజంటేషన్‌లు చేశారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జి.కృష్ణారావు మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి పలు సూచనలు చేశారు. ఉదయం జరిగిన నాల్గవ సెషన్‌లో పర్యాటక చరిత్రకు చెందిన పలువురు ఆచార్యులు, పరిశోధకులు, రిసెర్చ్‌కాలర్స్, వ్యక్తీకరణతో కలసి శ్రీముఖలింగం చారిత్రక స్థలాన్ని సందర్శించారు. ఐదవ సెషన్‌లో ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ అంకటి రఘు పర్యాటక రకాలు, అభివృద్ధి, పబ్లిక్, ప్రైవేట్ రంగాల పాత్ర గూర్చి వివరించారు. సెమినార్‌కు అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ మైథిలి మాట్లాడుతూ ప్రతీ విద్యార్థిలో ఒక ప్రత్యేక లక్షణాలు ఉంటాయని, సహనంతో తెలుసుకోవడం ద్వారా విజ్ఞత, విలువలు పెరుగుతాయని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ సెమినార్ ద్వారా తెలుసుకున్న విషయాలను స్పూర్తితో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉత్కల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ప్రసాద్‌పాణి, బి.శంకర్రాజు, టూరిజం మేనేజ్‌మెంటు అధ్యాపకురాలు ఎ.ఎల్.రూపవాణి, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, బి.వి.రామారావునాయుడులతోపాటు విశే్లషకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
=======
విద్యుత్ కోతలు షురూ
విశాఖపట్నం, ఫిబ్రవరి 28: విద్యుత్ కోతలు మొదలయ్యాయి. శుక్రవారం నుంచి వీటిని అమలు చేస్తున్నట్లు విశాఖలోని ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ (ఈపిడిసిఎల్) గురువారం అధికారికంగా ప్రకటించింది. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లకు నాలుగు గంటలు, మునిసిపాలిటీలకు ఆరు గంటలు, మండల కేంద్రాల్లో ఎనిమిది గంటలపాటు విద్యుత్ కోతలుంటాయి. అన్ని మునిసిపాలిటీ పట్టణాలకు ఉదయంఆరు గంటల నుంచి 9 గంటల వరకు , సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు విద్యుత్ కోతలు ఉంటాయి. అలాగే జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో ఉదయం 8 గంటల నుంచి పది గంటల వరకు, మరలా మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు కోతలు అమలు చేస్తారు.
మండల కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తారు.
కాగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రాత్రి వేళల్లో సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరా ఉంటుందని సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ (ఓ అండ్ సి) పేర్కొన్నారు.