మోపిదేవి, ఫిబ్రవరి 28: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణమాఫీ ఫైల్‌పై తొలి సంతకం చేస్తానని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. గురువారం మోపిదేవి గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యం బెల్టుషాపుల విషయంలో మలి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పేదల పిల్లలకు విద్య, పెరుగుతున్న ధరలు, తదితర అంశాలపై ప్రసంగించారు. గురువారం ఉదయం మోపిదేవిలో తాత్కాలిక నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మచిలీపట్నం, విజయవాడ నియోజకవర్గాల కార్యకర్తలతో మాట్లాడారు. కార్యకర్తల నుండి సమస్యలు, పరిష్కారాలు, సూచనలు, సలహాలు సేకరించారు. బందరు నియోజకవర్గం వాడపాలెం గ్రామానికి చెందిన యానాదిరావు కార్యకర్తలకు భరోసాగా పార్టీ నాయకులు అండగా నిలవాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మైనార్టీ మహిళ బేగం ఉన్నీసా గత పదేళ్లుగా తమ ఇళ్ళ స్థలాలకు పట్టాలు ఇవ్వటం లేదని, ఈవిషయంలో టిడిపి నాయకుల కృషి అంతంతమాత్రంగా ఉందని సమస్యను చంద్రబాబుకు చెప్పుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాయకులు కొందరు ఎన్‌టి రామారావు కుటుంబానికి చెందిన బాలకృష్ణ, హరికృష్ణ రాజకీయాల్లో కీలకపాత్ర వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. స్థానిక సమస్యలను కార్యకర్తలు బాబుకు వివరించారు. తరువాత మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల ఏసి వివి సత్యనారాయణ స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలు అందించారు. తరువాత బాబు పాదయాత్ర పెదప్రోలు గ్రామం వైపు సాగింది. శ్రీ బాషితా విద్యాల యం వద్ద విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి వారితో ముచ్చటించారు. పెదప్రోలు గ్రామంలో మహిళలు నీరాజనాలు పలికారు. ట్రాఫిక్ నిలిచిపోవటంతో ఆర్టీసి బస్సులో ఎక్కి ప్రయాణికులను పలకరించారు. ట్రాఫిక్‌లో నిలిచిన లారీని కొద్దిదూరం నడిపారు. మహిళలను అప్యాయంగా పలకరించి వారు అందించిన పూలు, పండ్లను అందుకుని కార్యకర్తలకు పంచారు. పెదప్రోలు గ్రామంలో 15కిలోల కేక్‌ను కట్ చేసి జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు, జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు తదితర కార్యకర్తలకు తినిపించారు. గ్రామంలోని ట్రైలర్లు సమస్యలపై వినతిపత్రం అందించారు. కాసానగర్‌లోని మైనార్టీ మహిళల ఆశీస్సులతో బాబు యాత్ర ముందుకు సాగింది.
=======
ముస్లింలకు 8శాతం రిజర్వేషన్లు
చల్లపల్లి, ఫిబ్రవరి 28: తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వస్తే దివిసీమకు ప్రధాన వాణిజ్య కూడలిగా ఉన్న చల్లపల్లి గ్రామాన్ని నగరంగా అభివృద్ధి చేస్తానని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ‘వస్తున్నా... మీకోసం’ పాదయాత్రలో భాగంగా గురువారం రాత్రి చల్లపల్లి చేరుకున్న ఆయన స్థానిక ప్రధాన సెంటరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ మచిలీపట్నం- రేపల్లె రైల్వేలైన్ ఏర్పాటు, పోర్టు నిర్మాణం, 214ఎ జాతీయ రహదారి అభివృద్ధి చేయటం ద్వారా చల్లపల్లి ప్రాంతాన్ని సమగ్రాభివృద్ధి చేస్తామన్నారు. టిడిపి హయాంలో జేబులో డబ్బులు వేసుకుంటే సంచినిండా సరుకుల వచ్చాయని, ప్రస్తుతం సంచిలో డబ్బులు వేసుకుని వెళితే జేబులోకి కూడా సరుకులు రావటం లేదన్నారు. అధికారంలోకి రాగానే రైతుల రుణాల మాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని ప్రకటించటంతో తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు గించుకుంటున్నాయన్నారు. దోపిడీ సొమ్ము బయటకు తీస్తే ఐదుసార్లు రుణమాఫీ చేయవచ్చని చెప్పారు. తొమ్మిదేళ్ళలో 29సార్లు పెట్రోల్ ధరలు పెంచారని, బైక్‌లపై తిరిగి డబ్బులు ఖర్చు చేసుకోవటం కంటే సైకిలెక్కి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ముస్లింలకు 8శాతం రిజర్వేషన్‌లు కల్పించి, వడ్డీ లేని రుణం అందిస్తామన్నారు. బిసిలకు బిసి డిక్లరేషన్ ప్రకటించి 100 సీట్లు కేటాయిస్తామని ముందుగా చెప్పింది టిడిపినేనని అన్నారు. పులిగడ్డ- పెనుమూడి వారధి నిర్మించింది తామేనన్నారు. సక్రమంగా సరఫరా కాని విద్యుత్‌కు పెద్దమొత్తంలో బిల్లులు వస్తున్నాయన్నారు. పలు అంశాలపై సభికులను ప్రశ్నించి వారి నుండి సమాధానాలు రాబట్టారు. ఎన్‌టిఆర్‌కు జన్మనిచ్చిన కృష్ణా జిల్లాలోని చల్లపల్లి అంటే ఎన్‌టిఆర్‌కు ఎంతో అభిమానమన్నారు. ఆయన ఆశలకు అనుగుణంగా చల్లపల్లిని అభివృద్ధి చేస్తానని బాబు హామీ ఇచ్చారు.
=====
గంజాయి స్వాధీనం.. ఇద్దరు మహిళల అరెస్టు
జగ్గయ్యపేట రూరల్, ఫిబ్రవరి 28: తూర్పుగోదావరి జిల్లా ఫిఠాపురం పరిసరాల నుండి జగ్గయ్యపేట మండలానికి సరఫరా అవుతున్న గంజాయిని గురువారం ఉదయం ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకున్నారు. షేర్‌మహమ్మద్‌పేట అడ్డరోడ్డులో ఉదయం 8గంటల నుండి నిఘా పెట్టగా 12గంటల సమయంలో గంజాయిని తీసుకువెళుతున్న మహిళలు పేరం పద్మ, పేరం తిరుపతమ్మలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సేకరించిన వివరాలను సాయంత్రం తొర్రగుంటపాలెం ఎక్సైజ్ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో సిఐ కె విద్యాసుధాకర్ వెల్లడించారు. చాలాకాలం నుండి జగ్గయ్యపేట ప్రాంతానికి భారీఎత్తున గంజాయి సరఫరా అవుతున్నట్లు తమకు సమాచారం అందిందని, అయితే ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా పట్టుబడలేదన్నారు. పూర్తి సమాచారంతో నిఘా పెట్టగా వీరు దొరికారని అన్నారు. రాత్రి సమయంలో సరఫరా అవుతున్న గంజాయి సంచులను లారీల్లో తీసుకువచ్చి రోడ్డు పక్కన కంప చెట్లలో పడవేసి దాన్ని విక్రయించే వ్యాపారులు ఎవరికీ అనుమానం రాకుండా పగటివేళల్లో తమకు ఇళ్లకు చేరవేస్తున్నట్లు సిఐ తెలిపారు. మంగొల్లు రోడ్డులో నిందితులు ఇద్దరు తమ ఇళ్లలో గంజాయి పెట్టి చిన్న చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్‌లు తయారుచేసి విక్రయిస్తున్నట్లు చెప్పారు. గంజాయిని ఎక్కువగా విద్యార్థులు, ఇతరేతర వారికి అమ్మకాలు చేస్తున్నారని, వారు సిగరెట్లలో కలుపుకొని గంజాయిని వాడుతున్నట్లు తెలిపారు. గత నెల రోజులుగా ఈ వ్యవహారం నడుస్తుందని సిఐ చెప్పారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న 15కేజీల గంజాయి మూటను ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు ఎండి గాలిబ్, విజయకుమార్, సిబ్బంది ఆర్ శ్రీనివాసులు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
==========
సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్రం తలమానికం
నూజివీడు, ఫిబ్రవరి 28: సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు తలమానికంగా ఉందని రాష్ట్ర ఓడరేవులు, వౌలిక సదుపాయాల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. గురువారం మంత్రి శ్రీనివాస్ ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ఐటిఎస్ టెక్నో పరిశ్రమను సందర్శించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విభిన్న వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తోందని, ఈ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. పేద ప్రజల సంక్షేమానికి అమలుచేస్తున్న పథకాలు, దేశంలో మరెక్కడా అమలు జరగటం లేదని, పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్న ఘనత ఆంధ్ర రాష్ట్రానికే దక్కిందని చెప్పారు. రాష్ట్రంలో మరో పెద్ద తరహా ఓడరేపులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని అన్నారు. ప్రకాశం జిల్లా రామయ్యపట్నంలో కొత్త ఓడరేవు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. గన్నవరం విమానాశ్రయంను శరవేగంతో అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, దీనికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ జరుగుతోందని మంత్రి శ్రీనివాస్ వివరించారు. గన్నవరం విమానాశ్రయంను అభివృద్ధి చేస్తే మరిన్ని విమాన సర్వీసులు వస్తాయని అన్నారు. నౌకాయాన రంగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ప్రజాసంక్షేమ బడ్జెట్
పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధిక మంత్రి గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా సంక్షేమ బడ్జెట్‌గా మంత్రి శ్రీనివాస్ అభివర్ణించారు. మహిళాభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తూ, మహిళల ఆర్ధిక అభివృద్ధికి చేయూతనిచ్చే విధంగా బడ్జెట్‌లో చర్యలు తీసుకున్నారని అన్నారు. తీసుకున్న నిర్ణయాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. ఇది ప్రజారంజక బడ్జెట్ ఏమాత్రం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నూజివీడు రెవెన్యూ డివిజన్ అధికారి బి సుబ్బారావు, మండల తహశీల్దార్ కెబి సీతారాం, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
=======
పింఛన్‌ల సొమ్ము స్వాహాపై క్రిమినల్ కేసు
తోట్లవల్లూరు, ఫిబ్రవరి 28: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను పారదర్శకంగా నిర్వహిస్తే ఎలాంటి సమస్యలు రావని డ్వామా అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ జె సురేష్‌బాబు అన్నారు. తోట్లవల్లూరు జెడ్పీ హైస్కూల్లో గురువారం ఈ ఏడాది నిర్వహించిన కోటీ 20లక్షల రూపాయల విలువైన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. మండలంలోని 16గ్రామాలలో నిర్వహించిన పనులపై సిబ్బంది తనిఖీలు నిర్వహించి తయారుచేసిన రిపోర్టులను బహిర్గతం చేశారు. ఒక్కో తప్పుపై సమగ్రంగా చర్చించారు. సిబ్బంది నుంచి వివరణలు తీసుకున్నారు. ఈ నివేదికల బహిర్గతం అనంతరం సురేష్‌బాబు మాట్లాడుతూ మొత్తం 16గ్రామాల్లో కేవలం రూ.13వేలు తేడా మాత్రమే వచ్చిందని, ఈ మొత్తం రికవరీకి ఆదేశించామన్నారు. తోట్లవల్లూరు గ్రామంలో చనిపోయిన 10మంది వ్యక్తుల పింఛన్‌ల సొమ్ము రూ.21వేలు స్వాహా జరిగినట్టు సామాజిక తనిఖీ సిబ్బంది విచారణలో తేలిందన్నారు. పింఛన్‌లు పంపిణీ చేసిన సిఎస్‌టి కె కుమారి ఉద్దేశపూర్వకంగా రూ.21వేలు తీసుకున్నట్టు తేలిందన్నారు. ఈ అక్రమానికి పాల్పడినందుకు కుమారిపై క్రిమినల్ కేసు పెట్టమని ఎంపీడీఓ కెవి సాంబశివారెడ్డిని ఆదేశించారు. అలాగే ఎక్విడెన్స్‌లపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కార్యదర్శి కుమారస్వామికి షోకాజ్ నోటీసు ఇస్తున్నట్టు చెప్పారు. సిఎస్‌టి నుంచి రూ.21వేలను ఎంపీడీఓ శివారెడ్డి, యాక్సిస్ బ్యాంకు మేనేజర్ రికవరీ చేయాలని ఆదేశించారు. డిఆర్‌డిఎ అధికారిణి జ్యోతి మాట్లాడుతూ పింఛన్‌ల పంపిణీపై కార్యదర్శుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ఎపిడి పచ్చిగళ్ళ దేవానందరావు, ఎస్‌ఆర్‌పి శేషుబాబు పాల్గొన్నారు.
========
జిల్లా గ్రంథాలయ సంస్థ బడ్జెట్ ఆమోదం
* రొండి కృష్ణయాదవ్ వెల్లడి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 28: జిల్లా గ్రంథాలయ సంస్థ 2013-14 ఆర్థిక సంవత్సరానికి 11.61 కోట్ల రూపాయల మిగులుతో బడ్జెట్ అంచనాలు ఆమోదించినట్టు చైర్మన్ రొండి కృష్ణయాదవ్ వెల్లడించారు. గురువారం జిల్లా గ్రంథాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది తోట్లవల్లూరు, వణుకూరు, అగ్నిపర్రు, ఘంటసాల, కండపల్లి తదితర ప్రాంతాల్లో లైబ్రరీలకు నూతన భవనాలు నిర్మించనున్నట్లు చెప్పారు. దీనికోసం బడ్జెట్‌లో రూ.2.40కోట్లు, మరమ్మతులకు రూ.40లక్షలు కేటాయించినట్లు తెలిపారు. కొత్త పుస్తకాల కొనుగోలుకు రూ.60 లక్షలు, వివిధ వర్గాలకు అవసరమైన పుస్తకాల కొనుగోలుకు రూ.16 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. వివిధ గ్రంథాలయాల్లో కంప్యూటర్ల ఏర్పాటుకు రూ.10లక్షలు, నూతన భవనాల్లో ఫర్నీచర్ కొనుగోలుకు రూ.20లక్షలు, జనరేటర్లకు రూ.12లక్షలు, జిరాక్స్ మిషన్‌లకు రూ.12లక్షలు కేటాయించినట్లు చెప్పారు. మొత్తం మీద ఈ ఏడాది బడ్జెట్ ఆశాజనకంగా ఉందన్నారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కృష్ణారావు, వయోజన విద్య ఉప సంచాలకులు సరోజాదేవి తదితరులు పాల్గొన్నారు.
విద్య, ఆరోగ్యం, పర్యావరణంపై దృష్టి
బంటుమిల్లి, ఫిబ్రవరి 28: ఓఎన్‌జిసి బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో ఆయిల్ నిక్షేపాలను వెలికితీయటంతో పాటు సామాజిక సేవలో భాగంగా విద్య, ఆరోగ్యం, పర్యావరణంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆ శాఖ డెప్యూటీ జనరల్ మేనేజర్ (రాజమండ్రి) పిఆర్ భావన అన్నారు. గురువారం బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో ఓఎన్‌జిసి సాయంతో చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బంటుమిల్లి జూనియర్ కళాశాలలో రూ.1.25లక్షలతో చేపట్టిన ఆర్వో వాటర్ ప్లాంట్, రూ.1.70లక్షలతో నిర్మించిన సైకిల్ స్టాండ్ షెడ్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రూ.70లక్షలతో కృత్తివెన్ను మండలంలో వివిధ పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించామన్నారు. బంటుమిల్లి జడ్‌పి హైస్కూల్‌కు రూ.3.64లక్షలు, అర్తమూరు హైస్కూల్‌కు రూ.3.8లక్షలు, కృత్తివెన్ను మండలంలో 39పాఠశాలలకు రూ.55లక్షలు చెక్కులు పంపిణీ చేశామన్నారు. బంటుమిల్లి జూనియర్ కళాశాలకు రూ.3.50 లక్షలతో ఫర్నీచర్ అందించనున్నట్లు తెలిపారు. చినపాండ్రాక పిహెచ్‌సిలో రూ.50లక్షతలో స్కానింగ్ సెంటరును, ఎమర్జన్సీ సెంటరును ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్లో బహూకరించిన సామగ్రిని పరిశీలించారు. కార్యక్రమంలో ఓఎన్‌జిసి జియాలజిస్ట్ కిస్ట్ఫర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దుర్గారమేష్, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి (రిటైర్డ్) మాట్టా రాధాకృష్ణమూర్తి, బంటుమిల్లి పిఎసిఎస్ బ్యాంక్ వైస్ చైర్మన్ చిటికనేని అబ్బులు, వి చినబాబు, గులాబి రమణ, సరళాదేవి, ఉపాధ్యాయులు ఎఎస్‌విడి ప్రసాద్, తోకల మోహనరావు పాల్గొన్నారు.
లారీ ఢీకొని సైక్లిస్టు మృతి
కలిదిండి, ఫిబ్రవరి 28: ఆకివీడు నుండి లోడిదలంక వెళుతున్న చేపల లోడు లారీ పొత్తూరు నుండి నంద్యాల వెంకటేశ్వరరావు(50) సైకిల్‌పై కలిదిండి వెళుతుండగా గురవాయిపాలెం వద్ద ఢీకొంది. ఈ దుర్ఘటనలో వెంకటేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఎఎస్‌ఐ గుమ్మడి శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థుల భారీ ర్యాలీ
కలిదిండి, ఫిబ్రవరి 28: సైన్స్ డే సందర్భంగా హైదరాబాద్ బాంబు పేలుళ్ళకు నిరసనగా కోరుకొల్లు కెజిఆర్, ఇ-స్మార్ట్ పాఠశాలల 300 మంది విద్యార్థులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రిన్సిపాల్ వెంకట్, ఉపాధ్యాయులు కృష్ణకుమారి, భవాని, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం సైన్స్ పెయిర్ కూడా ఏర్పాటు చేశారు.
=========
దర్జీలకు ప్రభుత్వ సాయం అందించాలి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 28: మచిలీపట్నం టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘టైలర్స్ డే’ వేడుకలను స్థానిక క్లాత్ బజార్ టైలర్స్ స్థూపం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సూదిని కనిపెట్టిన శ్రీవిలీన్ జీన్స్, మిషన్ కనిపెట్టిన విలియమ్ హోవే చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక ఫ్యాషన్స్, రెడీమేడ్ వలన దర్జీలకు పని తగ్గిపోతుందని ప్రభుత్వ పరంగా దర్జీలకు సహాయం అందే విధంగా కృషి చేస్తానన్నారు. పట్టణ టైలర్స్ అసోసియేషన్ కోసం స్థలం సేకరిస్తే బిల్డింగ్ నిర్మాణానికి ఎమ్మెల్యే గ్రాంట్ నుండి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. సభకు అధ్యక్షత వహించిన జిల్లా టైలర్స్ యూనియన్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ కూడా మాట్లాడారు. పట్టణ సంఘం అధ్యక్షులు ఎండి ఇలియాస్ పాషా, ప్రధాన కార్యదర్శి చండిక రామాంజనేయులు అసోసియేషన్ యొక్క ఆవశ్యకతను వివరించారు. అనంతరం సీనియర్ టైలర్స్ మహమ్మద్ ఖాసీమ్, మారుబోయిన వెంకటేశ్వరరావులను ఎమ్మెల్యే పేర్ని నాని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ మస్తాన్, కోప్పనాతి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
======
డివిజన్‌ను తనిఖీ చేసిన రైల్వే ఇన్‌చార్జి జిఎం
విజయవాడ (రైల్వేస్టేషన్), ఫిబ్రవరి 28: దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ ప్రస్తుత సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీ జనరల్ మేనేజర్ అశోక్‌కుమార్ మిట్టల్ గురువారం ప్రత్యేక సెలూన్‌లో నగరానికి వచ్చారు. ఇక్కడ నుంచి సామర్లకోట వెళ్లి అక్కడ స్టేషన్ పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో కాకినాడ వెళ్లి అక్కడ పోర్టు పరిసర ప్రాంతాలను తనిఖీ చేసిన అనంతరం తిరిగి ప్రత్యేక సెలూన్‌లో విజయవాడ చేరుకున్నారు. సాయంత్రం ఐదున్నర గంటలకు కనకదుర్గమ్మ దర్శనార్థం ఇంద్రకీల్రాదికి వెళ్లారు. అక్కడ నుంచి వచ్చిన అనంతరం ఒకటవ నెంబర్ ప్లాట్‌ఫారంపై ఉన్న విఐపి లాంజ్‌లో కొద్దిసేపు ఉండి విజయవాడ డివిజన్ సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈయన వెంట విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్‌కుమార్, అడిషినల్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎస్ సుబ్బారావు, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎల్‌ఎన్‌ఎంఆర్‌కె శాస్ర్తీ తదితరులు ఉన్నారు.
==========
జిల్లాలో ఇక ఎడాపెడా విద్యుత్ కోత
* విజయవాడలో నాలుగు గంటలు
* మండల కేంద్రాల్లో 8 గంటలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 28: వేసవి కాలం ప్రవేశంకు ముందుగానే జిల్లాలో అధికారికంగా విద్యుత్ కోత వేళలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. మార్చి ఒకటో తేదీ నుంచి ‘కోత’ మరింతగా పెరుగబోతున్నది. విజయవాడ నగరపాలక సంస్థ మచిలీపట్నం పురపాలక సంఘం పరిధిలో రెండు విడతలుగా ఉదయం 7.30 గంటల నుంచి 9.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3.30 వరకు రోజులో నాలుగు గంటలు కోత విధిస్తారు. ఇతర మున్సిపాల్టీల్లో ఉదయం 6 నుంచి 9 గంటలు, తిరిగి మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఆరు గంటలు, మండల కేంద్రాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు 8 గంటల పాటు విద్యుత్ కోత అమల్లో ఉంటుందని విద్యుత్ శాఖ ఎస్‌ఇ తెలిపారు.
==========
భద్రత అంశాలు తప్పనిసరి
బెజవాడకూ ఉగ్రవాదుల ముప్పు
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 28: ఇటీవల రాష్ట్ర రాజధానిలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో నిఘావర్గాల హెచ్చరికల మేరకు నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగరానికి ఉగ్రవాదుల తాకిడి ఉన్నట్లు గత అనుభవాల దృష్ట్యా భావిస్తున్న అధికార యంత్రాంగం భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టింది. గతంలో దీన్‌దార్ అంజుమన్, ఆల్ ఉమా తీవ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు నగరంలోనే కాక, జిల్లాలో పలుచోట్ల ముఖ్యంగా నూజివీడు, పెనమలూరు తదితర ప్రాంతాల్లో తల దాచుకున్నట్లు పోలీసు వర్గాలు గుర్తించాయి. తాజాగా హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ళ అనంతరం రాష్ట్రంలోని ముఖ్య నగరాలపై ఉగ్రవాదలు పంజా విసిరే అవకాశం లేకపోలేదని అటు కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలు అభిప్రాయపడ్డాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నగర పోలీసు కమిషనర్ ఎన్ మధుసూదనరెడ్డి భద్రతా చర్యలపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా నగరంలో అపరిచితులు, అనుమానితుల కదలికలను పసికట్టేందుకు నిఘానేత్రం తెరిచారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నందున నగరంలో ముఖ్యమైన రైల్వే స్టేషన్, పండిట్ నెహ్రూ బస్టేషన్, దుర్గగుడి తదితర వాటితోపాటు పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలు, సినిమా థియేటర్లు, హోటళ్ళ వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆయా యాజమాన్యాలను పోలీసు యంత్రాంగం ఆదేశించింది. ఇప్పటికే పోలీసు కమిషనర్ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ ఉన్నతాధికారులతో భద్రతా చర్యలపై సమీక్షించారు. లగేజ్ క్లాక్‌రూమ్ వద్ద విస్తృత తనిఖీలు, బస్టాండులో కెమేరాలు ఏర్పాటు చేయడం, బస్టేషన్‌లోకి ప్రవేశించే ఇన్‌గేటు, అవుట్‌గేటు మినహా మరేతర ప్రవేశ ద్వారాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా రైల్వే డిఆర్‌ఎంతో ఏర్పాటైన ప్రత్యేక సమావేశంలో రైల్వే ఉన్నతాధికారులతోపాటు రైల్వే ఎస్పీ, రైల్వే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లతో సమావేశమై భద్రతా చర్యలపై చర్చించారు. ముఖ్యంగా ప్లాట్‌ఫారమ్‌లపై అనుమానితుల కదలికలపై నిఘా, సిసి కెమేరాల ఏర్పాటు, డోర్‌ఫ్రేం మెటల్ డిటెక్టర్లు, పార్శిల్ విభాగం వద్ద స్కానర్లు ఏర్పాటు చేయడంతోపాటు రైల్వేస్టేషన్‌లోకి అనధికార ప్రవేశ మార్గాల మూసివేతకు చర్యలను సూచించారు. ఇక బుధవారం సీపి స్వయంగా దుర్గగుడిని సందర్శించి అధికారులతో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఇక నగరం ప్రజానీకానికి రక్షణ కల్పించే క్రమంలో దృష్టి పెట్టిన సీపీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు నగరంలోని రద్దీ ప్రదేశాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడం, కమిషనరేట్ పరిథిలో పలు ప్రాంతాలను సందర్శిస్తూ ప్రజలకు అవగాహన కలిగించడంతోపాటు అనుమానిత వ్యక్తుల గూర్చి ఆరా తీస్తున్నారు. దీనిలో భాగాంగా ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత సినిమా థియేటర్లు, వాణిజ్య సంస్థలు, హోటళ్ళదేనంటూ భద్రతా ప్రమాణాలు పాటించేలా ఆయా సంస్థ యాజమాన్యాలకు తాజాగా గురువారం పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగా పటమటలోని మోడరన్ సూపర్ మార్కెట్ యజమాన్యానికి సెంట్రల్ ఏసిపి సత్యనారాయణ, సిఐ పవన్‌కుమార్‌రెడ్డి, కొత్తపేటలోని సాయిరాం థియేటర్ మేనేజ్‌మెంట్‌కు సిఐ ఎస్ ప్రసాదరావు, ఏలూరురోడ్డులోని సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ యాజమాన్యానికి గవర్నర్‌పేట ఎస్‌ఐ కాళీచరణ్, ఇబ్రహీంపట్నం స్వర్ణ అండ్ వెంకటేశ్వర సినిమా థియేటర్ మేనేజ్‌మెంట్‌కు సిఐ రామచంద్రరావు స్వయంగా నోటీసులు జారీ చేశారు.
నోటీసులో పేర్కొన్న భద్రత అంశాలు...
* సినిమా థియేటర్లు, వాణిజ్య సంస్థలు, హోటళ్ళల్లో భద్రత నిమిత్తం తప్పనిసరిగా ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. ఆయా సంస్థలు ప్రవేశ ద్వారం వద్ద డిఎఫ్‌ఎండి (డోర్ ఫ్రేం మెటల్ డిటెక్టర్)లను ఏర్పాటు చేసుకోవాలి.
* హెచ్‌హెచ్‌ఎండి (హేండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్)లను ఏర్పాటు చేసుకుని అనుభవం ఉన్న సిబ్బందితో ప్రతీ ప్రవేశ ద్వారం వద్ద విధిగా ఫిజికల్ తనిఖీలు నిర్వహించి లోనికి అనుమతించాలి, (సినిమా థియేటర్లలో ప్రతి ఒక్క తరగతికి సంబంధించి ప్రవేశ ద్వారం వద్ద హెచ్‌హెచ్‌ఎండి లను ఏర్పాటు చేసుకుని తనిఖీలు నిర్వహించాలి )
* విద్రోహ శక్తులు, అరాచక, అసాంఘిక శక్తులు అలాగే ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వ్యక్తులను గమనించేందుకు ఆయా సంస్థల ప్రవేశ ద్వారం వద్ద, ఖాళీప్రదేశంలో, పార్కింగ్ ప్రదేశంలో అలాగే బయటకు వెళ్ళే ద్వారాల వద్ద సిసి కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలి.
* వ్యక్తులను ఫిజికల్ తనిఖీలు నిర్వహించడంతోపాటు సందర్శకుల బ్యాగులు, సెల్‌ఫోన్‌లు ఇతర వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించాలి.
* సినిమా థియేటర్లు, వాణిజ్య సంస్థలు, హోటళ్ళలో పార్కింగ్ చేసే ప్రతీ వాహనాన్ని ముందుగా తనిఖీ చేసిన అనంతరం పార్కింగ్‌కు అనుమతించాలి.
భద్రతపై ప్రత్యేక శిక్షణ
ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించే క్రమంలో సంబంధిత సినిమా థియేటర్లు, వాణిజ్య సంస్థలు, హోటళ్ళల్లో పని చేసే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి అలాగే ఇతర సిబ్బందికి భద్రతాపరంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గూర్చి పోలీసు శాఖ తరుఫున శిక్షణా కార్యక్రమం చేపట్టదలిచినట్లు పోలీసు కమిషనర్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు పోలీసు కమిషనర్ కార్యాలయంలోని యుపిఎస్‌సి (సమీకృత పోలీసు సేవా కేంద్రం)లో వివరాలు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా పోలీసుశాఖ సూచించిన ముందస్తు జాగ్రత్తలు పాటించని సినిమా థియేటర్లు, వాణిజ్య సంస్థలు, హోటళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు ఆయా సంస్థల లైసెన్స్‌లు రద్దు చేసేందుకు సంబంధిత అధికారులకు ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని పోలీసు కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
======
సకాలంలో నాబార్డు పనులు పూర్తి చేయాలి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 28: గ్రామాల్లో వౌళిక సదుపాయాల అభివృద్ధికి నాబార్డ్ నిధుల ద్వారా చేపట్టిన ప్రాజెక్టులను నిర్దేశించిన కాలానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. బుద్ధప్రకాష్ ఎం జ్యోతి అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వౌళిక సదుపాయాల అభివృద్ధి, రూరల్ ఇన్ఫాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ ఫండ్ ద్వారా చేపట్టిన వివిధ ప్రాజెక్ట్‌ల పనులపై గురువారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ సమావేశమందిరంలో జరిగింది. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, ఐసిడిఎస్, సాంఘిక సంక్షేమ శాఖ, ఆర్‌డబ్ల్యుఎస్, పశు సంవర్థక శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో రహదారులు, తాగునీరు, విద్య, ఆరోగ్యం, అంగన్‌వాడీ కేంద్రాలు నిర్మాణం వంటి వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు నాబార్డ్ ఆర్‌ఐడిఎఫ్ రుణాలను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 1,114 ప్రాజెక్టులకు 634 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. 2012-13 సంవత్సరంలో 34 ప్రాజెక్టుల నిర్మాణానికి 83.61 కోట్ల రూపాయలు నాబార్డ్ ద్వారా ఆర్‌ఐడిఎఫ్ నిధులు జిల్లాకు మంజూరయ్యాయన్నారు. వీటిలో 2.82 కోట్ల నిధులతో గ్రామీణ పశువైద్యశాలలు, 63.27 కోట్లతో ఎత్తిపోతల పథకాల నిర్మాణం, 3.71 కోట్లతో మైలవరం, కోరుకొల్లు, మండవల్లి, కౌతవరం వద్ద జూనియర్ కళాశాల నిర్మాణం, 2.35 కోట్లతో గన్నవరం వద్ద ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు రూరల్ ఇన్ఫాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ ఫండ్ ద్వారా నాబార్డ్ నిధులు మంజూరు చేసిందన్నారు. సమీక్ష సమావేశంలో డ్వామా పిడి వి హనుమానాయక్, నాబార్డు ఎజిఎం మధుమూర్తి, జడ్‌పి సిఇఓ సిఎస్‌వివి కొండయ్యశాస్ర్తీ, పశు సంవర్థక శాఖ జెడి టి దామోదర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.