విశాఖపట్నం, ఫిబ్రవరి 28: శీతాకాలంలో కూడా విద్యుత్ కోతలను విధించిన ఈపిడిసిఎల్, వాటిని కొనసాగిస్తూ, శుక్రవారం నుంచి అధికారికంగా వీటిని అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. విశాఖ నగరంలో ప్రస్తుతం రెండు గంటల విద్యుత్ కోత విధిస్తోంది. ఉదయం ఒక గంట, మధ్యాహ్నం ఒక గంట ఈ కోతలను విధిస్తోంది. సాధారణంగా జిల్లా కేంద్రాల్లో నాలుగు గంటల విద్యుత్ కోత విధించాలి. అయితే ఈపిడిసిఎల్ ప్రధాన కార్యాలయం విశాఖలోనే ఉన్నందువలన ఇక్కడ విద్యుత్ కోతను రెండు గంటలకే పరిమితం చేశారు. జిల్లా కేంద్రాల్లో నాలుగు గంటల విద్యుత్ కోత ఉంటుంది. ఉదయం రెండు గంటలు, మధ్యాహ్నం రెండు గంటల కోత అమల్లో ఉంటుంది. మున్సిపల్ పట్టణాల్లో ఆరు గంటల విద్యుత్ కోత అమల్లో ఉంటుంది. ఉదయం మూడు గంటలు, మధ్యాహ్నం మూడు గంటల విద్యుత్ కోత అమలవుతుంది. ఇక మండల కేంద్రాల్లో ఉదయం నాలుగు గంటలు, మధ్యాహ్నం నాలుగు గంటల విద్యుత్ కోత విధించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్న సమయంలో గృహాలకు కూడా విద్యుత్ ఉంటుంది. కొన్ని గ్రామాల్లో ఏడు గంటలు, కొన్ని చోట్ల నాలుగు గంటలు విద్యుత్‌ను వ్యవసాయానికి సరఫరా చేస్తున్నారు. ఆయా వేళల్లో మినహా, మిగిలిన సమయాల్లో ఎప్పుడు విద్యుత్ సరఫరా ఉంటుందో చెప్పలేం.
బకాయిలపైనే దృష్టి
విద్యుత్ శాఖకు బకాయి ఉన్న సంస్థల నుంచి వాటిని రాబట్టడానికి డిస్కం చర్యలు చేపట్టింది. ఈపిడిసిఎల్‌కు ఇప్పటికి 140 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా మేజర్, మైనర్ పంచాయతీల నుంచి కోట్ల రూపాయల బకాయిలు రావల్సి ఉంది. కొన్ని పంచాయతీలకు విద్యుత్‌ను కట్ చేస్తున్నారు కూడా. అత్యవసర సర్వీసులకు అంటే ఆసుపత్రులు, తాగునీటి సరఫరాకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూస్తున్నారు. మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలేవైనా బిల్లులు బకాయి పడితే, వాటిని ఏవిధంగానైనా వసూలు చేసుకోవాలన్న సంకల్పంతో ఉంది ఈపిడిసిఎల్.
భద్రతపై సిపి సమీక్ష
విశాఖపట్నం(క్రైం), ఫిబ్రవరి 28: హైదరాబాద్‌లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ సంఘటనల నేపధ్యంలో నగర పోలీసు కమిషనర్ బి.శివధరరెడ్డి గురువారం పోలీసు అధికారులు, రైల్వే అధికారులతో కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌తో పాటు ఇతర రైల్వేస్టేషన్ల వద్ద తీసుకోవాల్సిన భద్రత చర్యలు గురించి సిపి రైల్వే అధికారులకు పలు సూచనలు చేశారు. సెక్యూరిటీని మరింతగా అభివృద్ధి చేయడంతో పాటు సిసి కెమెరాల ద్వారా రైల్వే స్టేషన్లలోకి ప్రవేశిస్తున్న అపరిచితు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అలాగే రైల్వే స్టేషన్ల బయట, లోపల అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై నిఘా ముమ్మరం చేయాలన్నారు. రైల్వేస్టేషన్ల సమీపంలోని లాడ్లీలు, రెస్టారెంట్లపై అకస్మిక దాడులు చేయాలని, అపరిచితులు తారస పడినట్టయితే వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలని చెప్పారు. రెగ్యులర్‌గా నాకబందీలను నిర్వహించి రైల్వే స్టేషన్లలోను, ప్రధాన రహదారుల వద్ద తనిఖీలు చేయాలన్నారు. రైల్వేస్టేషన్ లోపల, బయట ద్వారాల వద్ద ఆర్‌పిఎఫ్, జిఅర్‌పి బలగాలు అలర్ట్‌గా ఉంటూ, అనుమానితులను పరిశీలించాలన్నారు. విశాఖ రైల్వేస్టేషన్‌ను 40సిసి కెమెరాలు, ప్రత్యేక బిడి టీమ్‌లతో రెండు నెలలో సెంట్రలైజ్‌డ్ సెక్యూరిటీ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఆర్‌పిఎఫ్ సీనియర్ డిఎస్‌సి ప్రదీప్‌కుమార్ గుప్తా వెల్లడించారు. ఈ సమావేశంలో ఇంకా జిఆర్‌పి డీప్యూటీ సూపరండండెంట్ వి.్భమారావు, డిసిపి పి.విశ్వప్రసాద్, ఎడిసిపి బి.అచ్యుతరావు, ట్రాఫిక్ ఎడిసిపి వి.సురేష్‌బాబు, పోలీసు అధికారులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
బ్యాట్స్‌మెన్లకు దడపుట్టిస్తున్న
ఎసిఎ-విడిసిఎ స్టేడియం పిచ్
* విజయ్ హజారే క్రికెట్ టోర్నీ
విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 28: విజయ్ హజారే క్రికెట్ టోర్నమెంట్‌లో ఎసిఎ-విడిసిఎ స్టేడయం పిచ్ మేటి జట్లకు దడ పుట్టిస్తోంది. ఈ పిచ్‌పై ఆడాలంటే ఏ జట్టు ఆసక్తి చూపడం లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటుచేసిన ఈ స్టేడియం చూడటానికి సుందరంగా ఉన్నా పిచ్‌లో చేవ లేకపోవడంతో బంతి లోకీప్ అయి బాట్స్‌మన్లకు సహకరించడం లేదు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ల్లో ఏ జట్టు 200 పరుగుల మైలు రాయి దాటలేదు. ఈ స్టేడియంలో ఆడాలంటే బ్యాట్స్‌మెన్లు బెదిరిపోతున్నారు. బవులర్లు వేసే బంతులను ఆడటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి స్టేడియం నిర్వహణలో లోపంగానే పరిగణించాలి, స్టేడియంను చూడటానకి అందంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నా స్టేడియం మేనేజ్‌మెంట్ పిచ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా మాత్రం ఏర్పాటు చేయలేకపోయింది.
ఫేవరెట్‌లకు చుక్కెదురు:
ఈ టోర్నమెంట్‌లో ఫేవరేట్ జట్లన్నీ ఒక్కొటిగా నిష్క్రమిస్తున్నాయి. సురేష్ రైనా నాయకత్వంలోన ఉత్తరప్రదేశ్ జట్టు బాటలోనే పంజాబ్, కర్నాటక జట్లు కూడా ఇంటి దారి పట్టాయి. దీంతో జాతీయ జట్టులో ఆడుతున్న సురేష్ రైనా, పంజాబ్ డైనమేట్ యువరాజ్‌సింగ్, ఊతప్ప, మహ్మద్ ఖైఫ్ వంటి ఆటగాళ్ల ఆట చూసే అవకాశం ప్రేక్షకులకు కరవైంది. అనూహ్యంగా అసోం, కేరళ జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఢిల్లీ జట్టులో గౌతం గంభీర్, కేరళ జట్టులో శ్రీశాంత్‌లు మాత్రమే ప్రేక్షకులకు సెమీఫైనల్స్‌లో ఆకర్షణగా నిలువనున్నారు.
శుక్రవారం విరామం కావడంతో సెమీఫైనల్స్‌కు చేరన జట్లకు ఆటవిడుపు లభించింది. శనివారం జరిగే సెమీఫైనల్స్‌లో అసోం-కేరళ మధ్య పోటీ ఎసిఎ-విడిసిఎ స్డేడియంలో, బెంగాల్-్ఢల్లీ జట్ల మధ్య పోటీ పోర్టు స్టేడయంలో జరుగుతాయి.
చిదంబరం బడ్జెట్‌పై రాజకీయ పార్టీల నిరసన
* రోడ్డెక్కిన ‘దేశం’ వామపక్షాలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 28: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి చిదంబరం గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌పై పలు రాజకీయ పార్టీలు రోడ్డు ఎక్కి వివిధ రూపాల్లో నిరసన తెలియజేసాయి. ఈ బడ్జెట్ సామాన్యులకు హాని కలిగించేదిగా ఉందని, కార్పొరేట్ కంపెనీలకు సానుకూలంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలను మరిచారని, ఆహారభద్రతకు తగినన్ని నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేదలను మరిచారని టిడిపి నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ మండిపడ్డారు. టిడిపి కార్యాలయం నుంచి శ్రీ రాఘవేంద్రస్వామి దేవాలయం వరకూ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లో దేశాభివృద్ధికి, ధరల నియంత్రణకు ఉపయోగపడదన్నారు. రైతులకు ఈ బడ్జెట్ వలన ఎటువంటి లాభం లేదని అన్నారు. రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్లను ప్రభావం చేసేందుకు అంకెల గారడీ చేయడమే తప్ప పేదలు, సామాన్యులకు ప్రయోజనం కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు భరణికాన రామారావు, ఆర్సి అప్పలనారాయం, నొడగల కృష్ణ, సయ్యద్ వర్గీస్, కృష్ణవేణి, వాణి కార్యకర్తలు పాల్గొన్నారు.
సిపిఎం
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర హాని చేసేదిగా ఉందని సిపిఎం విమర్శించింది. సిపిఎం ఆధ్వర్యంలో జగదాంమ జంక్షన్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు జిఎస్ రాజేశ్వరరావు మాట్లాడుతూ ద్రవ్యలోటును స్థూల జాతీయోత్పత్తిలో 5.2 నుండి 4.8 శాతం తగ్గించడంపై ప్రభుత్వ వ్యయానికి భారీగా కోతకు గురిచేసారని అన్నారు. కార్పొరేట్ పన్నులు పెంచాల్సింది పోయి 55814 కోట్ల రూపాయల ఫ్రభుత్వ రంగ సంస్థల షేర్లు అమ్మేందుకు నిర్ణయించడం దుర్మార్గమని అభివర్ణించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.24వేల కోట్లు ప్రభుత్వరంగ షేర్లు కారుచౌకగా అమ్మి ఖజానాకు జమవేసారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి బి.గంగారావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిపిఐ
పేదలకు, సామాన్యులకు కనీస సదుపాయాల కల్పనకు చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉపయోగపడే విధంగా లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి విమర్శించారు. గురువారం కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ సిపిఐ గ్రేటర్ విశాఖ నగర సమితి ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి గురజాడ అప్పారావు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు. చమురు కంపెనీలపై నియంత్రణ ఎత్తివేయడం వల్ల డీజిల్, పెట్రోల్, కిరోసిన్, ఆయిల్ వంటి వస్తువుల ధరలు పెరుగుతున్యాని ఆవేదన వ్యక్తపరిచారు. ఆహారభద్రతకు రూ.84 కోట్ల రూపాయలు అవసరమైతే కేవలం 10 కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులిపారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్లను ఆకర్షించడానికి చిదంబరం చేసిన పేరడీ బడ్జెట్ అని అభివర్ణించారు.
పిపిపి పద్ధతిలో
విశాఖకు మెట్రో రైలు
ప్రాజెక్టు రూపకల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
ఆర్‌కెబీచ్‌లో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు
విశాఖపట్నం (జగదాంబ), ఫిబ్రవరి 28 : ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) పద్ధతి ద్వారా విశాఖలో మెట్రో రైలు ఏర్పాటుకు ప్రతిపాదనలను రూపొందించనున్నట్లు కమిషనర్ ఎం.వి. సత్యనారాయణ తెలిపారు. గురువారం ఉదయం తన చాంబర్‌లో ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రతిపాదనలపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ పార్టిసిపేషన్ (పిపిపి) ద్వారా మెట్రో రైలు ఏర్పాటుకు ప్రతిపాదనలను రూపొందించాలని అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) బి. నాగేంద్రకుమార్‌ను ఆదేశించారు. 2013 జనవరిలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మెట్రో రైలు పాలసీకి అనుగుణంగా ప్రాజెక్టును రూపొందించాలని సూచించారు. ఆర్‌కెబీచ్‌లో పార్కింగ్ కోసం మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు, నగర పరిశ్రమలకు ఉపయోగపడేలా నీటి సరఫరాకు సముద్ర జలాలను శుద్ధి చేసి పారిశ్రామిక అవసరాలకు వినియోగించడానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ ఆదా చేయడానికి ఎల్‌ఇడి లైట్లను వినియోగించడానికి ప్రతిపాదించినట్లు తెలిపారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం కింద రైవాడ మంచినీటి సరఫరా విభాగం వంటి పలు ప్రాజెక్టులకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు.
ప్రతి శనివారం ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశం
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన అన్ని ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి శనివారం ఉదయం 11 గంటలకు ఆయా విభాగాధిపతులు, ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫ్లై ఓవర్, బిఆర్‌టిఎస్ పనులను ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మంచినీటి ప్రాజెక్టులు, సివరేజీలు, గెడ్డల ఆధునీకరణ, గృహ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయడంలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో ఇఇలు శ్యాంసన్‌రాజు, రవి, వెంకట్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సినిమా థియేటర్లపై జివిఎంసి కొరఢా
13 థియేటర్లను గుర్తించిన ఫైర్, టౌన్‌ప్లానింగ్ అధికారులు
ముందుగా నోటీసుల జారీ... ఆపై చర్యలు
విశాఖపట్నం (జగదాంబ), ఫిబ్రవరి 28 : మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న సినిమా థియేటర్లు, షాపింగ్‌మాల్స్, హోటళ్లలో మంటలను అదుపు చేసే పరికరాలు, భద్రతా చర్యలు, పార్కింగ్ సదుపాయం లేని వాటిపై జివిఎంసి అధికారులు కొరఢా ఝుళిపించనున్నారు. ఇప్పటికే నగరంలోని సినిమా హాళ్లు, షాపింగ్‌మాల్స్, హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. అయితే వాటిలో ఏవీ భద్రతా చర్యలు చేపట్టకపోవడంతో కమిషనర్ ఎం.వి. సత్యనారాయణ జారీ చేసిన ఆదేశాల మేరకు ఫైర్, టౌన్ ప్లానింగ్ చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇటీవల దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లు, కోల్‌కతాలో జరిగిన అగ్నిప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖను అప్రమత్తం చేయాలనే ఆలోచనతో ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతే కాకుండా ముఖ్యంగా నగరంలోని నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు, ఆలయాలు, పలు హోటళ్లలో అగ్నిమాపక భద్రతా చర్యలు కనీస స్థాకిలో కూడా పాటించకపోవడంతో ఇకపై చర్యలు తప్పవన్నారు. అదే విధంగా నగరంలోని పాఠశాలల్లో కూడా కొన్నింటికి ఇప్పటికీ భద్రతా ఏర్పాట్లు లేవని, వాటిని కూడా గుర్తించనున్నట్లు తెలిపారు. నగరానికి, ప్రజలకు భద్రత కల్పించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అధికారులు సమన్వయంతో లోపాలను గుర్తించి ఎంతటి వారిపైన అయినా చర్యలు తీసుకోవాలన్నారు. అంతే కాకుండా నగరంలోని భద్రతా చర్యలపై జివిఎంసి ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు, విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు.
గిరిజనాభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం
* మంత్రి బాలరాజు
గూడెంకొత్తవీధి, ఫిబ్రవరి 28: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ అత్యధిక నిధులు విడుదల చేస్తుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి బాలరాజు అన్నారు. గురువారం గూడెంకొత్తవీధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గూడెంకాలనీలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గిరిజనుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌తో మరిన్ని నిధులతో ఏజెన్సీ ప్రాం తాలు అభివృద్ధి చెందాయన్నారు.
అభివృద్ధికి కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు, అధికారులు సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని, నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుండి విద్యాభివృద్ధికి నిధులు కేటాయించడంతోపాటు వాటికి వసతులను సమకూర్చడానికి ఎంతో కృషి చేశారని మంత్రి అన్నారు. మండలంలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనుమతిఇచ్చారన్నారు. గత కొనే్నళ్ళుగా గిరిజన ప్రాంతంలో ఏలిన పార్టీలు అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయని, ఎన్నికల సమయంలో హామీలిచ్చి, ఆశలు కల్పించి మోసం చేయడమే వారి పనిగా ఉండేదన్నారు. గత ఎన్నికల్లో ప్రజలందరూ సహకరించడంతో ఈ అభివృద్ధిని సాధించగలుగుతున్నామని, వచ్చే రెండు, మూడేళ్ళల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మంత్రి బాలరాజు పేర్కొన్నారు. గూడెం కాలనీ గ్రామంలో రక్షిత మంచినీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు.
పార్టీ కోసం పనిచేసే వారికే
టిడిపి సంస్థాగత పదవులు
అనకాపల్లి, ఫిబ్రవరి 28: పార్టీకోసం ఎక్కువ సమయం కేటాయించే వారికి, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల వైఖరిని ఎండగట్టే నాయకులకు జిల్లా తెలుగుదేశం ప్రధాన కమిటీల్లో సంస్థాగత పదవులు ఇవ్వాలని గురువారం స్థానికంగా జరిగిన జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయించింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు దాడి రత్నాకర్ అధ్యక్షతన జరిగిన సమావే శం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఏడాది జరగనుండటంతో పార్టీ పట్ల విధేయత, సమర్ధత కలిగిన వారికే పార్టీలోను, జిల్లా కమిటీలోను కీలక బాధ్యతలను అప్పగించాలని మాజీ మంత్రి ఎస్‌ఆర్‌జిడిపి అప్పలనర్సింహరాజు చేసిన ప్రతిపాదనలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలుగుదేశం జిల్లా కమిటీ అనుబంధ సంస్థాగత కమిటీలను నియమించాలని, మండల, పట్టణ తెలుగుదేశం పార్టీ సమావేశాలు ఈనెల 3, 4, 5తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించాలని, నూతన జిల్లా కమిటీ ఏర్పాటు అనంతరం పల్లెపల్లెకు తెలుగుదేశం నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. మాజీమం త్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ బలోపేతానికి నేతలంతా సమన్వయంతో కృషిచేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు దాడి రత్నాకర్ అధ్యక్షోపన్యాసం చేస్తూ జిల్లా కమిటీని, అనుబంధ కమిటీలను ప్రకటించాల్సి ఉన్నందున అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అన్ని కులాల వారికి, అన్ని ప్రాంతాల వారికి పార్టీ సంస్థాగత పదవుల్లో స్థానం కల్పిస్తామన్నారు. పార్టీ జిల్లా ఇన్‌చార్జి సుజనాచౌదరి సమక్షంలో పార్టీ అధినేత చంద్రబాబుకు ఈ కమిటీ ఆమోదం కోసం పంపుతామన్నారు. మాజీమంత్రి మత్స్యరాస మణికుమారి, ఎమ్మెల్యేలు గవిరెడ్డి రామానాయుడు, సివేరి సోమ, దేశం నాయకులు లాలం భాస్కరరావు, బొలిశెట్టి శ్రీనివాసరావు, శెట్టి లక్ష్మణుడు, చింతకాయల రాంబాబు, వి. వినోద్‌బాబు, బొర్రా నాగరాజు పాల్గొన్నారు.
బొంగరం ఘాట్‌లో జీపు బోల్తా
* ముగ్గురు గిరిజనులు దుర్మరణం
* పది మందికి గాయాలు
జి.మాడుగుల, ఫిబ్రవరి 28: పెదబయలు మండలం మారుమూల ప్రాంతమైన బొంగరం ఘాట్‌లో గురువారం సాయంత్రం జీపు బోల్తా పడిన దుర్ఘటనలో ముగ్గురు గిరిజనులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో పదిమంది గిరిజనులు గాయపడగా, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విషమంగా ఉన్న ముగ్గురు గిరిజనులకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధమ చికిత్స నిర్వహించి గురువారం రాత్రి పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. జి.మాడుగుల మండలం మద్దిగరువులో గురువారం జరిగిన వారపు సంత నుంచి పెదబయలు మండలం లింగేటి గ్రామానికి వెళుతున్న ప్రైవేట్ జీపు బొంగరం సమీపంలో బోల్తా పడింది. జీపు అప్పు ఎక్కుతుండగా గేర్ పనిచేయకపోవడంతో అదుపుతప్పి 40 అడుగుల లోయలోకి జీపు పడిపోయింది. ఈ ప్రమాదంలో పెదబయలు మండలం కుంతర్ల పంచాయతీ కిండలం గ్రామానికి చెందిన కిముడు పెంటంనాయుడు(30), గుల్లెలు పంచాయతీ సంగంవలసకి చెందిన లింగేటి బుజ్జిబాబు (25), ఇంజరి పంచాయతీ తూలం గ్రామానికి చెందిన కొరవంగి బాలంనాయుడు (40) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పెదబయలు మండలం జంగంపుట్టుకి చెందిన కొరవంగి బాలన్న, వనకొత్తూరుకి చెందిన పూజారి కృష్ణమ్మ, పెదవంచలంగికి చెందిన బుచ్చెలి లింగన్న తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ముగ్గురు గిరిజనులకు స్థానిక ఆరోగ్య కేంద్రంలో ప్రధమ చికిత్స నిర్వహించి పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. జీపు బోల్తా పడిన సంఘటనలో పెదబయలు మండలం బూసుపల్లికి చెందిన బైశెట్టి రాజారావు, లింగేరిపుట్టుకి చెందిన కిల్లో దొమరన్న, పెద గుల్లెలుకి చెందిన బొండా అప్పన్న, బొండా సైలమ్మ, బొండా బొంజయ్యదొర, పిప్పరవలసకి చెందిన గుల్లెలి రంగారావు, గుల్లెలు లక్ష్మమ్మ గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా, జి.మాడుగుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి రాణి మార్గ మధ్యలోనే కొంతమందికి అత్యవసర వైద్య సేవలు అందించారు. అనంతరం వారిని స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్సలు చేస్తున్నారు. ఈ సంఘటనపై పెదబయలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళలపై వేధింపులను అరికట్టేందుకు సబ్ కంట్రోల్ స్టేషన్లు
సబ్బవరం, ఫిబ్రవరి 28: రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేకంగా సబ్‌కంట్రో ల్ రూంలను ఏర్పాటుచేశామని, అందుకోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామని ఉత్తరకోస్తాఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కెవి రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం ఇక్క డి పోలీసు స్టేషన్‌ను పరిశీలించేందుకు వచ్చిన ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.సబ్ కంట్రోల్ రూంల వల్ల విద్యార్థ్ధులు,యువతులపై జరిగే ఈవ్‌టీజింగ్‌ను అరికట్టే వీలుంటుందన్నారు. ప్రతి పోలీసుస్టేషన్‌లోను రిసెప్షనిస్ట్‌లను ఏర్పాటుచేసి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఆమెవద్ద పుస్తకం పెట్టామని అం దులో కాగ్నజబుల్, నాన్‌కాగ్నజిబుల్ కేసుల విషయంలో స్పష్టంగా వివరాలు రాస్తున్నామని అన్నారు. గాయాల పాలై న వారికి వెంటనే చికిత్సలు అందించటం, సంబంధిత వ్యక్తులపై తక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. దెబ్బలులేని కేసుల విషయంలో వేరే రకమైన చర్యలకు ఆదేశించామన్నారు. ముఖ్యం గా సివిల్ వివాదాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడే పోలీసులు చర్యలు తీసుకోవాలే తప్ప అనవసర జోక్యంపై ఉపేక్షించేది లేదన్నారు. తీర భద్రతకు ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లానుంచి నెల్లూరు వరకు 15 మెరైన్ పోలీసుస్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. అందులో మత్సకార కుటుంబాల యు వకులకు హోంగార్డు ఉద్యోగాలు కల్పించి కొత్త వ్యక్తుల ఆచూకీని సులభ తరం చేశామన్నారు. పోలీసులకు సముద్రంలో పరిరక్షణకు బోటులను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నామన్నారు. హోంగార్డులకు రోజులు 300 రూపాయల జీతం ఉండేలాగ నిర్ణయించటంతోపా టు వారికి ఆరోగ్యశ్రీ కల్పిస్తున్నామన్నారు. పోలీసుశాఖలో కొత్తగా రిక్రూట్‌మెంట్ అయిన ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగ్‌లు విషయంలో జాప్యం జరుగుతోందని ప్రతీ ఏడాది కొత్తపోస్టులు,రిటైర్‌మెంట్ లు జరుగుతున్నందున కొంత గ్యాప్ వస్తోందన్నారు. త్వరలో వాటిని పూర్తిచేస్తామన్నారు. జిల్లాలో 36 సిఐలకు పోస్టులు ఇస్తున్నామన్నారు. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్‌లో గతంతో పోలిస్తే నిధులు విడదలలో జాప్యం జరుగుతోందన్నారు. క్వార్టర్స్‌లో ఉండే పోలీసుల కంటే హెచ్‌ఆర్‌ఎ కావాలనే వారిసంఖ్య పెరిగిందన్నారు. తీర్ధాల విషయంలో కొన్నిజిల్లాల్లో నిబంధనలు పాటించని పోలీసులు విశాఖ లాంటి జిల్లాల్లోనే ఎందుకు అమలుచేస్తున్నారంటూ వస్తోన్న విమర్శలను ఆయన దృష్టికి తేగా పక్క వాళ్లుచేసే నేరాలను మనం చేయాలని కోరుకుంటామా? అంటూ ఛలోక్తివిసిరారు. త్వరలో సబ్బవరం పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టును భర్తీ చేయాలని డిఐజి స్వాతి లక్రాను ఆదేశించారు. మావోయిస్టులపై మానవ రహిత విమానాలను ఉపయోగిస్తున్నామని, త్వరలో పూర్తి స్ధాయిలో ఏరివేత జరుగుతుందన్నారు. జిల్లాలోశాంతిభద్రత విషయంలో 107 బైండోవర్ కేసు లు నమోదుచేసి ముందుగానే సమస్యాత్మక గ్రామాలపై నిఘా పెంచుతున్నామన్నారు. ఈ పర్యటనలో డిఐజి స్వాతి లక్రా, అనకాపల్లి సిఐ ఆర్.గోవిందరావు, ఇన్‌చార్జిఎస్‌ఐ ఎస్.గోపాలరావు, ఎఎస్‌ఐ ఎంవి రమణ పాల్గొన్నారు.
‘పేదరిక నిర్మూలనకు ఉపాధి హామీ భేష్’
కోటవురట్ల, ఫిబ్రవరి 28: పేదరికం నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని నైజీరియా ప్రభుత్వ ప్రతినిధి ముఘాజిబుబకా అన్నారు. జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నైజీరియా, క్యూబా, బర్మా, శ్రీలంక , సుడాన్, మొరాకో తదితర 15 దేశాలకు చెందిన 25 మంది విదేశీయుల బృందం గురువారం మండలంలో పర్యటించింది. కైలాసపట్నంలో ఇందిర జలప్రభ, టి.జగ్గంపేటలో చెరువుల మరమ్మతుల పనులను పరిశీలించి గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రయోజనాలను కూలీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కైలాసపట్నంలో లక్కబొమ్మలను, చేనేత వస్తువుల ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఐ.కె.పి. కార్యాలయంలో మండల మహిళా సమాఖ్య సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పొదుపు, రుణాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఘాజిబుబకా మాట్లాడుతూ కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు అభివృద్ధి పనులను చేపడుతున్న ఉపాధి హామీ అద్భుతంగా ఉందన్నారు. గురువారంతో తమ పర్యటన ముగిసిందన్నారు. తిరిగి తమ దేశాలకు వెళ్ళిన తరువాత ఇక్కడ తాము పరిశీలించిన విషయాలను తమ ప్రభుత్వాలకు నివేదించి ఆయా దేశాల్లో ఈ కార్యక్రమాలను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్సీ డి.వి.ఎస్.రాజు మాట్లాడుతూ జిల్లాలో 100 కోట్లతో 70 వేల ఎకరాల వ్యవసాయ భూములను అభివృద్ధిలోకి తీసుకువస్తున్నామన్నారు. మండలంలో ఈ ఏడాది ఇంతవరకు 3,500 కుటుంబాలకు 100 రోజుల పనికల్పించా మన్నారు. ఈ పథకం వల్ల వలసలను నిరోధించగలిగామన్నారు. ఈ పర్యటనలో డుమా పి.డి. సత్యసాయి శ్రీనివాస్, గ్రామీణ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ రజనీకాంత్, ఎడీవో కృష్ణారావు, ఎ.పి.డి. శ్రీనివాస్, ఎ.పి.ఓ.ఎరకయ్య, వెలుగు ఎ.పి. ఎం.రమణ, పాల్గొన్నారు.