న్యూఢిల్లీ, మార్చి 2: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్న నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ పన్ను వసూళ్లపై దృష్టి పెట్టింది. ఇందులోభాగంగానే వచ్చేవారం 35వేల మంది పన్ను చెల్లింపుదారులకు రెవి న్యూ విభాగం నోటీసులు పంపనుందని కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం శనివారం తెలిపారు. ఈ మేరకు ఓ టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. తమకు ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటికే 35వేల మందికి నోటీసులు పంపించామని, మరో 35వేల నోటీసులు వచ్చేవారం పంపించనున్నామని స్పష్టంచేశారు. ఆదాయ పన్ను శాఖ వద్ద ఎవరెవరు ఎంతెంత ఖర్చు చేస్తున్నారో, వారి ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయోనన్న స్పష్టమైన సమాచారం ఉందన్నారు. కాబట్టి ఎంతోకాలం పన్ను చెల్లించకుండా తప్పించుకోలేరని, నిజాయితీగా మీ ఆదాయం తెలియపరిచి ప్రభుత్వానికి పన్ను చెల్లించేందుకు ఇదే సరైన సమయమని ఈ సం దర్భంగా ఆయన సూచించారు. అలాగే దేశం లో కోటీ రూపాయలకుపైగా ఆదాయం ఉన్న వ్యక్తులు, సంస్థలు అన్ని కలిపి 42,800 మాత్ర మే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని, అంద రూ తమ వాస్తవ ఆదాయాన్ని బయటపెడితే ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అన్నారు. అయినా అధిక ఆదాయాన్ని కలిగి ఉండటం సిగ్గుపడే అంశమేమీ కాదన్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగానూ గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తొలుత పన్నుల వసూళ్ల లక్ష్యం 5.70 లక్షల కోట్ల రూపాయలుగా నిర్ణయించుకున్నప్పటికీ, పలు కారణాల దృష్ట్యా ప్రభుత్వం దాన్ని స్వల్పంగా తగ్గించి 5.65 లక్షల కోట్ల రూపాయలకు చేర్చింది. ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి వ్యవధిలో 4.55 లక్షల కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు జరిగాయి. ఇదిలావుంటే బీమా, పెన్షన్ బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ప్రతిపక్షాలతో చర్చలు జరిపామని, స్టాండింగ్ కమిటీ చైర్మన్‌తోనూ మాట్లాడానని, వచ్చేవారం మరోసారి సమావేశం నిర్వహించాలనుకుంటున్నామన్నారు. పార్లమెంట్‌లో ఈ రెండు బిల్లులు పాస్ అవుతాయనే విశ్వాసం తనకుందన్నారు. వొడాఫోన్ పన్ను వివాదాన్ని పరిష్కరించే దిశగా అడుగులు ముందుకెస్తున్నామని చెప్పారు.
వచ్చే వారం పంపుతామన్న కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం
english title:
chidambaram
Date:
Sunday, March 3, 2013