అనంతపురం , మార్చి 3: నగరంలోని రామచంద్రనగర్ రైల్వే గేటును తెరవాలని అఖిలపక్ష నేతలు అనంతపురం పార్లమెంటు సభ్యులు అనంత వెంకటరామిరెడ్డిని తన నివాసంలో కలసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ రైల్వే గేటు మూసివేతతో మొదటి రోడ్డులోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైల్వే గేటు ఆవైపుకున్న చిన్న వ్యాపారస్తులు, తోపుడుబండ్ల వ్యాపారస్తులు, కళాశాలల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తపోవనం వెళ్లాలన్న, అక్కడ నుండి రామచంద్ర నగర్ వైపుకు రావాలన్న ప్రజలు బ్రిడ్జిపైన వెళ్లాల్సిన అవసరం ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ పనిచేసుకుంటున్న వారి కోసం రైల్వే గేటును తాత్కాలికంగా తెరపించడానికి సంబందించిన రైల్వే శాఖ మంత్రులను, సాంకేతిక అధికారులను సంప్రదించామని తెలిపారు. ఈ గేటు 8నెలలు మాత్రమే తెరుస్తామని, ఆ సమయంలో సిబ్బంది జీతాలను రాష్ట్ర ప్రభుత్వ భరించాల్సి ఉంటుందని తెలిపారు. తాత్కాలికంగా 8నెలల పాటు తెరిపిస్తామని హామీ ఇచ్చారు. సిపిఐ నగరకార్యదర్శి పి.నారాయణస్వామి, సిపిఎం నగర కార్యదర్శి రాంభూపాల్, మాజీ కార్పొరేటర్ కొగటం విజయభాస్కర్‌రెడ్డి, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఇండ్ల ప్రభాకర్, టిడిపి సరిపూటి రమణ, కృష్ణకుమార్, బిజెపి లలిత్‌కుమార్, లోక్‌సత్తా ఇస్మాయిల్, నాగరాజు, బియస్పీ నాగరాజు పాల్గొన్నారు.
వికలాంగుల క్రికెట్ పోటీల్లో
మహారాష్ట్ర విజేత
అనంతపురం సిటీ, మార్చి 3: 24వ జాతీయ స్థాయి అజిత్ వాడేకర్ వికలాంగుల క్రికెట్ పోటీల్లో విజేతగా మహారాష్ట్ర జుట్టు ట్రోఫీ కైవసం చేసుకుంది. అలాగే మిరాజ్‌కర్ ట్రోఫీ సైతం మహారాష్ట్ర జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం స్థానిక అనంత క్రీడా మైదానంలో జరిగిన ఫైనల్స్ పోటీలు ఆసక్తికరంగా సాగాయి.
హైదరాబాద్‌పై మహారాష్ట్ర జట్టు విజయం సాధించింది. ఇందులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర జట్టు 12 ఓవర్లులో 96 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. జట్టులో స్వప్నిల్ 33 పరుగులు చేసారు. అనంతరం హైదరాబాద్ జట్టు 12 ఓవర్లులో 85 పరుగులు సాధించి 8 వికెట్లు కోల్పోయింది. దీంతో మహారాష్ట్ర జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించి అజిత్ వాడేకర్ జాతీయ ట్రోఫీను కైవసం చేసుకుంది.
రెస్ట్ఫా ఇండియాపై
మహారాష్ట్ర జట్టు విజయం...
మధ్యాహ్నం జరిగిన మిరాజ్‌కర్ ట్రోఫి పోటీలో జాతీయ క్రికెట్ విజేత మహారాష్ట్ర, రెస్ట్ఫా ఇండియా జుట్ల ఢీకొన్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మహారాష్ట్ర జట్టు 12 ఓవర్లులో 81 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయారు. జట్టులో అతుల్ 35 పరుగులు సాధించి నాటౌట్‌గా మిగిలారు. అనంతరం రెస్ట్ఫా ఇండియా జట్టు 12 ఓవర్లులో 76 పరుగులు సాధించి 7 వికెట్లు కోల్పోయారు. దీంతో ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు విజయం సాధించి మిరాజ్‌కర్ ట్రోఫీని సాధించుకుంది.
అంతర్ జాతీయ వికలాంగుల పోటీలు అనంతలో నిర్వహణ
వికలాంగుల అంతర్ జాతీయ వనే్డ క్రికెట్ పోటీలను అనంతలో నిర్వహిస్తే తమ నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచూ ఫెర్రర్ అభిప్రాయపడ్డారు. వికలాంగుల క్రికెట్ ఫైనల్స్ అనంతరం ఏర్పాటు చేసిన ముగింపు సభకు మాంచూ ఫెర్రర్, అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ నీలకంఠారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగులకు మరిన్ని పోటీలు నిర్వహణనకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం విన్నర్స్ మహారాష్ట్ర జట్టుకు ట్రోఫీతోపాటు 15,000 నగదు, రన్నర్స్ హైదరాబాద్ జట్టుకు ట్రోఫితోపాటు 10,000 నగదు అందజేసారు. ట్రోఫీలో ప్రతి మ్యాచ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటి స్పోర్ట్స్ డైరెక్టర్ జెవియార్, సిబిఆర్ డైరెక్టర్ దశరథరాముడు, జాతీయ వికలాంగుల క్రికెట్ సంఘం కార్యదర్శి మిరాజ్‌కర్, ఎపి కార్యదర్శి మధుసూదన్ నాయక్, జిల్లా కార్యదర్శి రామిరెడ్డి, సుబ్బారావు, రోషిరెడ్డి, ఇతర క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
సౌందర్య శృజన పుస్తకావిష్కరణ
అనంతపురం కల్చరల్, మార్చి 3: చిత్రకళా విమర్శకులు ఎల్‌ఆర్. వెంకట రమణ రచించిన సౌందర్య శృజన అనే చిత్రకళా వ్యాసాల సంపుటి పుస్తకాన్ని ఆర్వీఎం పిఓ రామారావు ఆవిష్కరించారు. రెయిన్‌బో ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో లలిత కళాపరిషత్‌లో పుస్తకావిష్కరణ సభను ఆదివారం నిర్వహించారు. త్యాగరాజ సంగీత సభ ఉపాధ్యక్షులు హరిశ్చంద్రరామ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యోగివేమన విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ మల్లికార్జునరెడ్డి, ఎల్కేపి కార్యదర్శి జి.నారాయణస్వామి, న్యాయవాది లలితా ప్రభాకర్, లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.