అనంతపురం , మార్చి 3: 96 లక్షల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈవిఎంల భద్రపరచు గదుల నిర్మాణంను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వి.దుర్గాదాస్ అధికారులను ఆదేశించారు. ఆదివారం భవన నిర్మాణాన్ని కలెక్టర్, డిఆర్‌ఓ సుదర్శన్‌రెడ్డిలు పరిశీలించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, సాధారణ ఎన్నికల దృష్ట్యా గదులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సుబ్బారెడ్డి, డిటి తిరుమలరెడ్డిలు తదితరులు పాల్గొన్నారు.
ఆధార్ కేంద్రాన్ని పరిశీలించిన జెసి
అనంతపురం కల్చరల్, మార్చి 3: నగరంలో బళ్లారి రోడ్డులో గల డిఎస్‌పి రెడ్డి భారత్‌గ్యాస్ ఏజెన్సీ వద్ద ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని జెసి సత్యనారాయణ ఆదివారం పరిశీలించారు. గ్యాస్ కోసం ఆధార్ కార్డు అవసరమైన వినియోగదారుల సౌకర్యార్థం అన్ని గ్యాస్ ఏజెన్సీల వద్ద ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటి పనితీరు గురించి తెలుసుకునేందుకు జెసి పర్యటించారు. ఆయనతోపాటు డిఎస్‌ఓ శాంతకుమారి, పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వరరావు, ఏజెన్సీ నిర్వాహకులు సీతారాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నీటి కోసం మహిళల వాగ్వివాదం
లేపాక్షి, మార్చి 3: మండల పరిధిలోని పి.సడ్లపల్లి గ్రామంలో నీటికోసం మహిళల మధ్య వాగ్వివాదం చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే పి.సడ్లపల్లిలో ఏడాది కాలంగా నీటి సమస్య నెలకొంది. అధికారులు నీటి సమస్య తీర్చడానికి అనేక ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో వస్తున్న కొద్దిపాటి నీటిని గ్రామానికి సరఫరా చేస్తున్నారు. అయితే ఆ నీరు ఒక కొళాయి ద్వారా మాత్రమే వస్తుండటంతో గ్రామంలో ఇతర ప్రాంతాలకు నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది.
శనివారం గ్రామంలోని ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలు నీటి సరఫరా అవుతున్న కొళాయి వద్దకు వచ్చి నీటిని నిలిపివేస్తే తమ ప్రాంతాలకు నీటి సరఫరా అవుతుందని పేర్కొనగా అక్కడున్న మహిళలు అందుకు నిరాకరించారు. ఈ సందర్భంలో మహిళల మధ్య వాగ్వివాదం చోటు చేసుకొంది. వెంటనే అక్కడున్న పురుషులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే బోరు సమీపానికి వెళ్ళి ఫ్యూజులను బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారు. దాంతో వస్తున్న కొద్దిపాటి నీరు కూడా నిలిచిపోయింది. ఈ విషయంగా కార్యదర్శిని వివరణ కోరగా గ్రామంలో నీటి సమస్య ఉందని, సమస్య పరిష్కారానికి తాము అనేక ప్రయత్నాలు చేస్తున్నామని గ్రామంలో ఘర్షణ చోటు చేసుకోవడంతో వస్తున్న కొద్దిపాటి నీరు ఆగిపోయిందన్నారు. అదే విధంగా మల్లిరెడ్డిపల్లి గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని గ్రామ ప్రజలు తెలిపారు.
ఒత్తిడిని జయించడానికి
కరాటే విద్య అవసరం
హిందూపురం రూరల్, మార్చి 3: కరాటే విద్యతో ఒత్తిడులను జయించవచ్చని నేతాజీ మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెన్నోబులం తెలిపారు. ఆదివారం స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్ర స్టేడియంలో కరాటే బెల్ట్ పరీక్షలు జరిగాయి. కరాటే కర్ణాటక చీఫ్ అల్త్ఫాపాషా, హిందూపురం కరాటే బ్రాంచీ శిక్షకులు ఫైరోజ్‌ల ఆధ్వర్యంలో జరిగిన పరీక్షల్లో 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో 11 మందికి ఎల్లో బెల్ట్‌లు, 13 మందికి ఆరెంజ్ బెల్ట్‌లు, 14 మందికి బ్లూబెల్ట్‌లు దక్కాయి. విజేతలకు సర్ట్ఫికేట్లు అందచేశారు.
సమస్యలు పరిష్కరించండి
మడకశిర, మార్చి 3: గత సంవత్సరం క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రచ్చబండ, రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చిన సమస్యలను పరిష్కరించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. గత సంవత్సరం క్రితం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని అన్ని మండలాల్లో రచ్చబండ కార్యక్రమం, రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆ సమయంలో చాలా మంది రైతులు తమకు పట్టాదార్ పాసు పుస్తకాలు ఇవ్వాలని, భూముల యొక్క హద్దులు చూపించాలని, తమ కుటుంబాలకు చెందిన పెద్దలు మృతి చెందారని వాటి పేరిట ఉన్న ఆస్తులను తమ పేరిట రికార్డుల్లోకి మార్చాలని అర్జీలు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో సగం సమస్యలను కూడా అధికారులు పరిష్కారం చేయలేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ తగిన చొరవ తీసుకొని గత సదస్సుల్లో ఇచ్చిన వినతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
1372 మరుగుదొడ్లు మంజూరు
గుడిబండ, మార్చి 3: మండల పరిధిలోని ఐదు పంచాయతీలకు 1372 మరుగుదొడ్లు మంజూరైనట్లు ఎంపిడిఓ లలితకుమారి తెలిపారు. గుడిబండ పంచాయతీకి 710, చిగతుర్పికి 44, ఎస్.రాయాపురంకు 49, రాళ్ళపల్లికి 232, మందలపల్లికి 337 మరుగుదొడ్లు మంజూరైనట్లు చెప్పారు. లబ్ధిదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఘనంగా వీర పాపమాంబ ఉత్సవాలు
లేపాక్షి, మార్చి 3: మండల పరిధిలోని మద్దిపి గ్రామంలో ఆదివారం వీరపాపమాంబ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం వీరపాపమాంబకు అభిషేకార్చనలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ఉపవాస దీక్షతో అమ్మవారిని పూజించారు. ఈ కార్యక్రమంలో మద్దిపి, కంచిసముద్రం గ్రామానికి చెందిన అనేక మంది మహిళలు పాల్గొన్నారు. సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
నేడు విద్యాసంస్థల బంద్
లేపాక్షి, మార్చి 3: విద్యార్థి ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన రాజ్‌కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల సోమవారం విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఎన్‌ఎస్‌యుఐ, టిఎన్‌ఎస్‌ఎఫ్, ఎఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. రాజ్‌కుమార్ ఆత్మశాంతి కోసం విద్యార్థులతో పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి ఇందిరమ్మ సర్కిల్‌లో శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయా విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.
టిడిపి నాయకుడి మృతి
చిలమత్తూరు, మార్చి 3: మండల పరిధిలోని మొరంపల్లి గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు గంగాధర్ ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపురం బస్టాండ్‌లో అకస్మాత్తుగా గంగాధర్ కిందకు పడిపోవడంతో ఆయన్ను ప్రక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గంగాధర్ మృతిపట్ల స్థానిక ఎమ్మెల్యే అబ్ధుల్‌ఘనీ, మండల టిడిపి నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.