చిత్తూరు, మార్చి 3: జీవితంలో మరవలేనిది, మరుపురానిది కాలేజీ డేస్ అని ఆ ఉత్సవాల్లో యువతతో కలిసి కేరింతలు కొట్టేందుకే వచ్చానంటూ ప్రముఖ సినీనటి తమన్నా అన్నారు. చిత్తూరు పట్టణంలోని ఆర్‌విఎస్ విద్యాసంస్థలలో జరుగుతున్న జాతీయ యువజనోత్సవాలు (సెలెస్టా-2కె13)ముగింపు కార్యక్రమానికి ఆదివారం ప్రముఖ నటీమణి తమన్నా విచ్చేశారు. ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ తాను మొట్టమొదటిసారిగా చిత్తూరుకు వచ్చానని, ఈ అవకాశాన్ని కల్పించిన ఆర్‌విఎస్ విద్యాసంస్థల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. యువతకు ప్రత్యేక సందేశం ఏమైనా ఇస్తున్నారా? అని విలేఖర్లు అడుగగా తాను యువతను ఎంక్రేజ్ చేసేందుకు వచ్చానని, అయితే విద్యార్థి జీవితంలో విద్య ఎంతో ముఖ్యమని సూచించారు. సినీరంగంలో మీరు ప్రముఖ స్థానంలో ఉన్నారని, మీరు ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా? అని ప్రశ్నించగా సేవా కార్యక్రమాలు చేస్తున్నానుగాని...వాటిని చెప్పడం ఇష్టం లేదన్నారు. మంచి సినిమాల్లో నటించి మరింత పేరు తెచ్చుకోవాలని చెప్పారు తమన్నా. ఎన్నో బాధలు, కష్టాలు, అలోచనలతో సినిమా థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులకు కొంత సమయమైనా వాటిని మర్చిపోయేలా సినిమాలో నటించాలన్నది తన ఆశయమన్నారు. ఫ్యామిలీ సినిమాలు చేయాలంటే తనకు ఎక్కువ ఆసక్తి అని అన్నారు. తెలుగులో చైతన్యతో ఒక సినిమా చేస్తున్నట్లు చెప్పారు. మీకు నచ్చిన హీరోలు ఎవరు అని ప్రశ్నించగా-చాలామందే ఉన్నారు, వారిలో ఎవరిని చెప్పను? అన్నారు. హీరోయిన్‌ల గూర్చి ప్రశ్నించగా శ్రీదేవి, మాధురిదీక్షిత్ తనకు నచ్చిన హీరోయిన్‌లు అన్నారు. ప్రేమపై మీ అభిప్రాయం- ప్రేమ అనేది జీవితంలో చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి ప్రేమించే గుణం ఉండాలని, ప్రేమ లేని జీవితం లేదన్నారు. మీరు ప్రేమ వివాహం చేసుకుంటారా? తాను ఇంకా వివాహం గురించి ఆలోచించలేదని తమన్నా మాట దాటవేశారు. విలేఖర్ల సమావేశంలో పాల్గొన్న ప్రముఖ దర్శకుడు, నటుడు, చిత్తూరు పార్లమెంటు సభ్యుడు డాక్టర్ ఎన్.శివప్రసాద్ మాట్లాడుతూ తనకు రావూరి వెంకటస్వామి మంచి మిత్రుడన్నారు. స్వయంకృషి, పట్టుదలకు మారుపేరు రావూరి వెంకటస్వామి అన్నారు. ఈ కార్యక్రమానికి తమన్నా రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎస్‌విసెట్ కళాశాలల కరెస్పాండెంట్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ గత మూడు రోజులుగా జరుగుతున్న సెలెస్టా-2కె13 ఎంతో విజయవంతమైందన్నారు. ఇంకా ఈ విలేఖర్ల సమావేశంలో కళాశాలల వైస్ చైర్మన్ రావూరి శ్రీనివాస్, డైరెక్టర్ రావూరి రామచంద్ర తదితరులు ఉన్నారు.
* యువజనోత్సవాల ముగింపు కార్యక్రమంలో స్టెప్పులు వేసిన తమన్నా
english title:
tamanna
Date:
Monday, March 4, 2013