మదనపల్లె, మార్చి 3: అప్రకటిత విద్యుత్‌కోత కారణంగా రేయింబవళ్ళు అని తేడాలేకుండా పంటపొలాలకు సాగునీరందించేందుకు అన్నదాతల కష్టాలు మొదలయ్యాయి. రైతుబతుకు దయనీయంగా మారింది. తిండిగింజలు పండించడమే గానీ వేళకు తిండి ఉండదు. కష్టపడటమే తప్ప కంటినిండా కునుకు ఉండదు. కరెంటు రాలేదనో.. మోటారు నడవలేదనో.. నిత్యం ఏదో ఒక సమస్య. రాత్రనక, పగలనక పొలం వద్దనే కాపలా కాయాల్సిన దుస్థితి. దీనంతటికీ ప్రధాన కారణం వేళకు విద్యుత్ సరఫరా చేయకపోవడమే. కరెంటు ఎప్పుడోస్తుందో.. ఎన్నిగంటలకు వస్తుందో.. తెలియకపోవడమే. ఎండ బడలికతోనో, మరో కారణంతోనో ఒక్క పూట పొలం వద్దకు వెళ్ళకుంటే ఆరుగాలం శ్రమ వృథానే.
జిల్లాలో వరి, వేరుశనగ, చెరుకు, కాయగూరలు, టమోటా ప్రధాన పంటలుకాగా, వివిధ రకాల పూలసాగు రైతుల జీవనాధారంగా ఉంది. తరుచూ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే రైతులు అధికశాతం బోర్లపైనే ఆధారపడుతున్నారు. అయితే సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారుల విద్యుత్ ఫీడర్లు ప్రాంతాల వారీగా విభజించి ఒక రాత్రివేళల్లో రెండువిడతలుగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయానికి ఏడుగంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవానికి ఐదుగంటలు మించి ఇవ్వడం లేదని కొందరు రైతులు వాపోతున్నారు. ఏడు గంటల కరెంటును రెండు విడతలుగా ఇచ్చి ప్రయోజనం ఏమిటని మరికొందరు రైతులు నిట్టూరుస్తున్నారు. రెండు విడతలుగా ఇవ్వడం వలన పొలం చివరివరకు నీటితడి అందే అవకాశం లైదని రైతులు పోతున్నారు. విద్యుత్ సరఫరా వేళల్లో షిప్టు విధానం లోపభూయిష్టంగా ఉంది. రాత్రివేళ సరఫరా చేస్తుండడంతో రైతుల ప్రాణాలమీదికి వస్తోంది. ప్రతి వారం విద్యుత్ సరఫరా షెడ్యూల్‌ను మారుస్తున్న అధికారులు ఆ మేరకు ప్రకటించకపోవడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. రాత్రిపూట పొలాల్లో పాములు, విషపురుగులు సంచరిస్తుంటాయని, చిమ్మచీకటిలో నీరు పారించడం కష్టతరంగా ఉందని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా అధికారికంగా ప్రకటించిన వేళల్లో లేదా విద్యుత్ సరఫరా అవుతున్న సమయంలో ఎమర్జెన్సీ లోడ్ రిలీప్ కింద అకస్మాత్తుగా సరఫరాను నిలిపి వేస్తున్నారు. మరో సమయంలో సరఫరా ఇచ్చి ఏడుగంటలను సమయం చేస్తున్నామని అధికారులు అంటున్నారు. అయితే షెడ్యూళ్ళ సమయానికి కొంతఆలస్యంగా సరఫరా ఇవ్వడం, ముందుగానే నిలిపివేయడం వంటివి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ అధికారులు వారికి అనుకూలంగా సరఫరా వేళలను మార్చుకోవడం తగదని అంటున్నారు. ఇకనైనా సరఫరా వేళలను సక్రమంగా పాటిస్తూ ఏడుగంటల విద్యుత్‌ను నిరంతరంగా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
* అర్ధరాత్రి అన్నదాత కష్టాలు
english title:
raithanna
Date:
Monday, March 4, 2013