వి.కోట, మార్చి 3: మండల పరిధిలోని పైపల్లె సమీపంలో ఆదివారం నీటి కుంటలో మునిగి ఓ విద్యార్థి మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు పైపల్లెకు చెందిన రాజేంద్రప్ప కుమారుడు విజయకుమార్(11) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో తోటి స్నేహితులతో కలసి సమీపంలో గల రాయప్ప చెరువులోని నీటి కుంటలో ఈత కోసం వెళ్లారు. ప్రమాదవశాత్తు విజయకుమార్ నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వెలికి తీసారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వారు తెలిపారు. ఆడుతూ పాడుతూ తిరిగిన విద్యార్థి ఆకస్మికంగా మరణించడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
ప్రైవేటు బస్సు ఢీకొని చిన్నారి దుర్మరణం
మదనపల్లె, మార్చి 3: రోడ్డుపక్కన ద్విచక్రవాహనంలో నిలబడి ఉన్న తండ్రి, రెండేళ్ళ చిన్నారిని వెనుక నుంచి వేగంగా వస్తున్న ఓ ప్రైవేట్‌బస్సు ఢీకొంది. ఈ సంఘటన ఆదివారం మదనపల్లె మండలం సిటిఎం పంచాయతీ కేంద్రంలో జరిగింది. రూరల్ ఎస్‌ఐ మధు కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి... కురబలకోట మండలం అంగళ్ళు గ్రామానికి చెందిన రఫి, వాల్మీకిపురం మండలం కేంద్రానికి చెందిన రేష్మాతో వివాహమైంది. వీరికి తౌషిక్(5), అస్లామా(3) పిల్లలు ఉన్నారు. ద్విచక్రవాహనంలో అత్తగారింటికి వెళ్ళి తిరిగి వస్తు సిటిఎం తిరుణాలలో కనపడిన బొమ్మలను గుర్తించిన పిల్లలు మారాం చేశారు. దీంతో తండ్రి రఫి ద్విచక్రవాహనాన్ని రోడ్డు పక్కన నిలిపడంతో వెనుక కూర్చున్న తల్లి రేష్మా కుమారుడు తౌషిక్‌ను తీసుకుని దుకాణానికి వెళ్లింది. ద్విచక్రవాహనం ముందుభాగంలో కూర్చున్న కుమార్తె మారాం చేస్తుండగా ఓదార్చుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్‌బస్సు ఆ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో ఎడమవైపుకు రఫి పడగా, కుడివైపుకు పడిన చిన్నారి అస్లాం బస్సు చక్రాల కిందపడి దుర్మరణం పాలైంది. గాయపడిన రఫిని 108 ద్వారా మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ మధు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.