మదనపల్లె, మార్చి 3: పెద్దపంజాణి మండలం ఆకులవారిపల్లె పంచాయతీ బందార్లపల్లె గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం చెరకు గానుగ దగ్ధమైంది. పెద్దపంజాణి మండలం శివారులోని అటవీప్రాంతంలో ఉన్న బందార్లపల్లెకు చెందిన రైతు బుడ్డారెడ్డి వేసిన చెరకు పంటను మూడునెలల పాటు చెరకు గానుగ చేసి అందులో వచ్చిన వందబస్తాల బెల్లంను సమీపంలోనే గుడెసెలో నిల్వవుంచారు. అనంతరం ఎనిమిది రోజుల కితం గానుగను కౌలుతీసుకున్న రైతులు లింగప్ప, శివయ్య, చినపాపమ్మ తాము పండించిన చెరకును గానుగ ఆడిస్తున్నారు. ఆదివారం ఉన్న ఫలంగా గాలులు రావడంతో చెరుకురసంను వేడిచేసే పొయ్యివద్ద మంటలు చెలరేగాయి. వంటచెరకుపై మంటలు ఎగిసిపడి చెలరేగాయి. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు రైతులు, ఇద్దరు కూలీలు మంటలు ఆర్పడానికి చేసిన యత్నం పూర్తిగా విఫలమైంది. అప్పటికీ బుడ్డారెడ్డి పండించిన బెల్లం, గానుగ చేస్తున్న వంటచెరుకు, బెల్లం, మోటారు, క్రషర్లు సైతం అగ్నికి బూడిదపాలైంది. దీంతో పాటు పండించిన 10టన్నుల చెరువు మంటలపాలైంది. అప్పటికే పలమనేరులోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించినా ఫలితం లేకపోయింది. ఏడాదిపాటు ఆరుగాలం పండించిన చెరుకుపంట కళ్ళఎదుటే మంటల్లో కాలిపోవడంతో రైతులు లబోదిబోమంటు కన్నీరుమున్నీరయ్యారు. నలుగురు రైతులకు చెందిన పంట మాత్రమే 5లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని, గానుగ యంత్రం, మోటారు, క్రషరు సైతం సుమారు రూ.2లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. సమాచారం అందించినా సంఘటన స్థలాన్ని పరిశీలించి నష్టం అంచనా వేసేందుకు రెవెన్యూ అధికారులు రాకపోవడం గమనార్హం.
* లబోదిబోమంటున్న కౌలు రైతులు * రూ. 5 లక్షల ఆస్తి నష్టం
english title:
ganuga dagdham
Date:
Monday, March 4, 2013