Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఆడబిడ్డల ఆదరణ మరువలేను

$
0
0

గుడివాడ, మార్చి 6: చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న ‘వస్తున్నా... మీ కోసం’ పాదయాత్ర గుడివాడ నియోజకవర్గంలో బుధవారం సాయంత్రంతో ముగిసింది. మంగళవారం సాయంత్రం గుడివాడ నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించగా రాత్రి స్థానిక బైపాస్ రోడ్డులో ఉన్న మాజీ ఎంపిపి గుత్తా చంటి స్థలంలో చంద్రబాబు బస చేశారు. ఉదయం కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించిన అనంతరం సాయంత్రం 4.30గంటలకు తిరిగి పాదయాత్రను కొనసాగించారు. స్థానిక దొండపాడు కాల్వ వంతెన దగ్గర శ్రీకాళహస్తి కాలనీకి చెందిన మహిళలు చంద్రబాబుకు హారతులిచ్చి స్వాగతం పలికారు. అదే ప్రాంతంలో టీ కొట్టులోకి వెళ్ళి యజమాని కష్టసుఖాలు తెలుసుకున్నారు. పక్కనే బాలాజీ కోళ్ళఫారంలోకి వెళ్ళి కోళ్ళ వ్యాపారం తీరుతెన్నులను పరిశీలించారు. బీసీ కమ్యూనిటీ హాలులో పలువురు ప్రముఖులతో ముచ్చటించారు. రైస్‌మిల్లులోని కార్మికుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. అలంకృత ఫంక్షన్ హాలు దగ్గర పలువురు మహిళలు చంద్రబాబుకు హారతులిచ్చారు. ఇండేన్ గ్యాస్ కంపెనీలోకి వెళ్ళి ఉద్యోగులతో మాట్లాడారు. మల్లాయిపాలెంలోని శ్రీకృష్ణవేణి ఆయిల్ మిల్ దగ్గర మాజీ ఎమ్మెల్యే రావి శోభనాద్రిచౌదరిని కలుసుకున్నారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత కొత్త చౌటపల్లి మీదుగా మోటూరు అడ్డరోడ్డుకు చేరుకున్నారు. అక్కడ చంద్రబాబు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ ఆడబిడ్డలు తనపై చూపుతున్న అభిమానానికి వారి రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనన్నారు. తొమ్మిదేళ్ళు అధికారంలో, మరో తొమ్మిదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న తన రికార్డును అధిగమించాలంటే ఎవరికైనా ఇరవై ఏళ్ళు పడుతుందని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఇళ్లు కేటాయించడంతోపాటు లక్ష రూపాయలు రుణం ఇచ్చి సొంత ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. వితంతవులు, వృద్ధులకు నెలకు రూ.600లు పింఛన్ ఇస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు దారుణంగా పెరిగాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ దొంగలు పడి ప్రజల సొమ్మును దోచుకుపోతున్నారన్నారు. ప్రజల కష్టాలను తీర్చేందుకే పాదయాత్ర చేపట్టానన్నారు. కాంగ్రెస్‌కు సహకరిస్తే తలపై వెంట్రుకలు కూడా మిగలవని అన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్‌షాపులను రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పారు. అనంతరం ముదినేపల్లి మండలంలోకి యాత్ర ప్రవేశించింది. చంద్రబాబు వెంట ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, టిడిపి జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు, గుడివాడ ఇన్‌చార్జ్ రావి వెంకటేశ్వరరావు, నేతలు బొండా ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్, గుత్తా చంటి, లంకదాసరి ప్రసాదరావు, నూతక్కి బాలాజీ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
చల్లపల్లి, మార్చి 6: ద్విచక్ర వాహనం అదుపుతప్పి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన బుధవారం ఉదయం ఘంటసాల మండలం పాపనేశ్వరం గ్రామ సమీపంలో కృష్ణా కరకట్టపై జరిగింది. కోడూరు శివారు ఉల్లిపాలెం గ్రామానికి చెందిన ఆరిగ అనిల్ కుమార్(27) జీవనోపాధి కోసం విజయవాడలోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. కోడూరు శివారు వేటపాలెం గ్రామానికి చెందిన దోవారి లక్ష్మీనారాయణ(37) ఆర్టీసీగా డ్రైవర్‌గా పనిచేస్తూ ఇటీవలే అవనిగడ్డ డిపో నుండి విజయవాడకు బదిలీ అయ్యాడు. అనిల్, లక్ష్మీనారాయణ మధ్య బంధుత్వం ఉండడం, ఇద్దరూ వృత్తిరీత్యా విజయవాడలో ఉండటంతో స్నేహం పెరిగింది. ఇటీవల అనిల్ అనారోగ్యానికి గురికాగా వైద్య ఖర్చుల నిమిత్తం స్వగ్రామమైన ఉల్లిపాలెం వచ్చి నగదు తీసుకుని బుధవారం ఉదయం లక్ష్మీనారాయణకు చెందిన ద్విచక్ర వాహనంపై కరకట్ట మీదుగా విజయవాడ బయలుదేరారు. పాపనేశ్వరం సమీపంలో బైక్ అదుపుతప్పి కరకట్ట వెంబడి ఉన్న సిమెంట్ దిమ్మను ఢీకొంది. దీంతో బైక్ పైనుండి ఎగిరి దూరంగా పడిన అనిల్ ఛాతీకి తీవ్ర గాయం కావటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో ఉన్న లక్ష్మీనారాయణను 108 అంబులెన్స్‌లో అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న చల్లపల్లి సిఐ కె బాలరాజు, ఘంటసాల ఎస్‌ఐ ఎల్ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం అనిల్ మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

గణనీయంగా తగ్గిన మినుము దిగుబడులు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 6: జిల్లాలో మినుము కోతలు, మాసూళ్ళు, వరి నూర్పిళ్ళు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే కూలీల కొరత సమస్యతో రైతన్నలు బెంబేలెత్తుతున్నారు. అన్ని పనులు ఒక్కసారిగా రావటంతో కూలీ ధరలు విపరీతంగా పెరిగాయి. ఎకరా మినుము కోసేందుకు రూ.2,500 నుంచి రూ.3వేలకు పైగా ధరలు పెంచేశారు. దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. చేసేదిలేక యంత్రాల సహాయంతో మినుము మాసూలు చేస్తున్నారు. కొంత మంది రైతులు వరి కుప్పలను నూర్పిళ్ళు కూడా చేస్తున్నారు. మినుములకు ధర తక్కువగా ఉన్నా ధాన్యం ధరలు మాత్రం కొంత ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో రైతులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇటీవల ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం కారణంగా మినుము పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. తాలు ఎక్కువగా రావటంతో ఎకరాకు 8 నుంచి 9 బస్తాలు వస్తాయనుకుంటే మూడు నుంచి నాలుగు బస్తాల వరకే దిగుబడులు వస్తున్నాయి. ఏదిఏమైనా మినుము దిగుబడులు, ధరలు నిరాశపరుస్తున్నా ధాన్యం ధరలు మాత్రం కొంత ఊరటనిస్తున్నాయి.

ప్రాజెక్టుల పేరిట రైతుల నోట్లో మన్ను
* ముదినేపల్లి సభలో నిప్పులు చెరిగిన బాబు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మార్చి 6: పులిచింతల, కృష్ణా డెల్టా ఆధునికీకరణ పేరుతో ప్రజాధనం వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తూ రైతుల నోట మన్ను కొడుతున్నారంటూ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తన పాదయాత్రలో భాగంగా బుధవారం రాత్రి 11గంటలకు ముదినేపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. డెల్టా రైతులు రెండో పంటకు నోచుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తపర్చారు. గతంలో తమ ప్రభుత్వం 24గంటలు సాధారణ వినియోగదారులకు కరెంట్ ఇచ్చి వ్యవసాయానికి 9గంటల ఇచ్చిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోగా అసలు ఇళ్లకే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇక పరిశ్రమలన్నీ మూతపడ్డాయని అన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా తన కుటుంబానికి, బంధువులకు జైకొట్టినవారికి ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టారని, ఈ సొమ్ముతో రాష్ట్రంలో కనీసం కోటి మందికి ఇళ్ళు కట్టించవచ్చన్నారు. తాను అధికారంలోకి వస్తే దోపిడీ సొమ్ము రికవరీ చేసి ఆయా ప్రభుత్వ శాఖల తరఫున ప్రజలకే ఖర్చుచేస్తానని అన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో రౌడీలు, గూండాలు, బాంబుదాడులు విచ్చలవిడి అయ్యాయని అంటూ ఈ ప్రభుత్వానికి కూలదోయటానికి కనీసం ఇంటికి ఒకరు రోజుకి మూడు గంటల పాటు తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేయాల్సిందిగా పిలుపునిచ్చారు. సభలో పలువురు విద్యార్థినీ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదని చంద్రబాబు చెప్పారు.

రైల్వే స్టేషన్‌లో డిఆర్‌ఎం తనిఖీలు
మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 6: రైల్వే డివిజనల్ మేనేజర్ (డిఆర్‌ఎం) ప్రదీప్‌కుమార్ మచిలీపట్నం రైల్వే స్టేషన్‌ను బుధవారం పరిశీలించారు. స్టేషన్‌లో నెలకొని ఉన్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ప్రయాణికుల సంఘం కార్యదర్శి లింగం మోజస్, సంయుక్త కార్యదర్శి ఉడత్తు శ్రీనివాసరావు డిఆర్‌ఎంను కలిసి స్టేషన్‌లో నెలకొని ఉన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. బందరు రైల్వే స్టేషన్ ప్రారంభించి 107 సంవత్సరాలు గడచినా సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయని, లోగడ 24 బోగీలు ఉంచేందుకు ఫ్లాట్‌ఫారమ్ పెంచేందుకు పనులు మొదలుపెట్టి మధ్యలోనే ఆపేశారని, డబుల్ లైన్ మంజూరు అయినప్పటికీ కనీసం టెండరు కూడా పిలవలేదని, నర్సపూర్ టూ నాగర్‌కోయిల్ రైలు నర్సపూర్ నుంచి మచిలీపట్నంకు మెయింటెనెన్స్ (క్లీనింగ్)కు వచ్చి ఖాళీగా వెళుతోందని, దాన్ని ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా మార్చాలని వినతిపత్రంలో కోరారు. అలాగే పినాకిని రైలును మచిలీపట్నం నుండి బయలుదేరే విధంగా మార్చాలని, విశాఖపట్నం రైలుకు కనీసం నాలుగు స్లీపర్ బోగీలు పెంచాలని, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రతిరోజూ నడపాలని డిఆర్‌ఎంకు వారు విజ్ఞప్తి చేశారు.
పెడనలో పరిశీలన
పెడన : స్థానిక రైల్వే స్టేషన్‌ను డిఆర్‌ఎం బుధవారం సందర్శించి స్టేషన్‌లో నెలకొని ఉన్న సమస్యలతో పాటు ప్రయాణికులు ఎదుర్కొంటున్న అసౌకర్యాలను కూడా తెలుసుకున్నారు. పట్టణ వెజిటబుల్ హ్యాండ్ బ్లాక్ కలంకారీ ప్రింటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కలంకారీ హ్యాండ్‌లూమ్ క్లాత్ మాన్యుఫ్యాక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సజ్జా నాగేశ్వరరావు, కట్టా నిర్మల్‌కుమార్, పిచ్చుక కోటేశ్వరరావు, భట్ల మోహనరావు, వార్త ప్రసాద్, తదితరులు డిఆర్‌ఎంను కలిసి మొత్తం ఎనిమిది సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ సమస్యలను విన్న డిఆర్‌ఎం ప్రదీప్‌కుమార్ స్పందిస్తూ స్టేషన్‌కు రిజర్వేషన్ సౌకర్యం కోసం బుకింగ్ క్లర్క్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మచిలీపట్నం- విశాఖపట్నం ప్యాసింజర్ ట్రైన్‌కు అదనంగా రెండు స్లీపర్ కోచ్‌లను ఏర్పాటు చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. ఈసందర్భంగా రైల్వే స్టేషన్‌న ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాలను కూడా పరిశీలించారు.
తేళ్లూరి వీరభద్రారెడ్డి మృతిపై
పోలీసుల ప్రత్యేక దర్యాప్తు
జగ్గయ్యపేట రూరల్, మార్చి 6: గత వారం మండలంలోని పోచంపల్లి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మైన్స్ మేనేజర్ తేళ్లూరి వీరభద్రారెడ్డి మృతి రాష్టవ్య్రాప్తంగా సంచలనం కావడంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవ్వడంతోపాటు రాజకీయ పార్టీల నుండి విమర్శలు రావడంతో పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే చిల్లకల్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వీరభధ్రారెడ్డి పని చేసిన కడప జిల్లాకు వెళ్లి విచారణ చేపట్టి కొన్ని విషయాలు సేకరించి వచ్చారు. కాగా ఈ కేసు విచారణ జరిపేందుకు ఆవనిగడ్డ సిఐ రమణ మూర్తిని ప్రత్యేకంగా నియమించడంతో బుధవారం సాయంత్రం ఆయన చిల్లకల్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్, సిబ్బందితో కలిసి పోచంపల్లి గ్రామానికి వెళ్లి వీరభద్రారెడ్డి మృతి చెందిన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వారు మృతుడి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ద్వారా కొన్ని వివరాలు సేకరించారు. కేసు ప్రాధాన్యంను దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాల్సి ఉందని సిఐ రమణమూర్తి ఈ సందర్భంగా తెలిపారు.

షర్మిల పాదయాత్రతో
టిడిపి, కాంగ్రెస్ బెంబేలు
* డా. వాకా వాసుదేవరావు
పెడన, మార్చి 6: దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్రతో టిడిపి, కాంగ్రెస్ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయని వైఎస్‌ఆర్‌సిపి నియోజకవర్గ నాయకులు డా. వాకా వాసుదేవరావు అన్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక 9వ వార్డు మొగ్గయ్య కాలనీలో పాదయాత్ర నిర్వహించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. పార్టీ సిద్ధాంతాల కరపత్రాలతో పాటు పసుపుకుంకుమలు, జాకెట్ ముక్కలను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. వీధిలైట్లు వెలగటం లేదని, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, మరికొన్ని సమస్యలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ సమస్యలపై త్వరలోనే మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని వివిఆర్ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మాసాబత్తుల శ్రీనివాస్, గడ్డం రామారావు, వల్లభ అర్జునరావు, గరికముక్కు చంద్రబాబు, బత్తిన రమేష్, అర్జంపూడి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

బాలికను వేధిస్తున్న
ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్టు
పెడన, మార్చి 6: ఓ బాలికను నెలరోజులుగా వెంటపడి వేధిస్తున్నందుకు ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని పెడన పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ వెంకట నారాయణ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని చేవేండ్ర గ్రామానికి చెందిన 13సంవత్సరాల బాలికను అదే గ్రామానికి చెంది నందమూరు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న కారే శ్రీరాములు అనే విద్యార్థి నెలరోజులుగా వేధిస్తుండటంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీనిపై బాలిక తండ్రి స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా విచారణ జరిపిన ఎస్‌ఐ నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. సెక్షన్ 354 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

ప్రతి సోమవారం సందర్శకుల దినం
* ఎస్పీ ప్రభాకరరావు వెల్లడి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), మార్చి 6: జిల్లాలోని పోలీసు కార్యాలయాల్లో ప్రతి సోమవారం సందర్శకుల దినం పాటించాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు పోలీసు సిబ్బందికి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రతి పోలీసు ఠాణాలో ఠాణా అధికారి విధిగా హాజరుకావాలని, ఫిర్యాదిదారులతో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించాలన్నారు. జిల్లాలో నేర పరిశోధనా సమాచార కేంద్రం (డిసిఆర్‌బి)కి తెలియపరచాలని ఆదేశించారు. జిల్లా పౌరులు కూడా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

టిఆర్‌ఎస్ నేతల వ్యాఖ్యలపై రాస్తారోకో
జగ్గయ్యపేట రూరల్, మార్చి 6: సమైక్యవాదులను కించపరుస్తూ మాట్లాడటం టిఆర్‌ఎస్ నాయకులకు ఆనవాయితీ అయిపోయిందని, దీంతో సమైక్యవాదుల మనోభావాలు దెబ్బతింటున్నాయని సమైక్య ఆంధ్రా దళిత దండోరా రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల విజయకుమార్ ఆరోపించారు. 5న మంగళవారం రాత్రి ఒక టీవి ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నేత శ్రావణ్, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్, మంత్రి టిజి వెంకటేష్‌ని చెప్పుతో కొట్టాలంటూ అగౌరవంగా, అమర్యాదగా మాట్లాడటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 10గంటల సమయంలో విజయవాడ - హైదరాబాదు రహదారిలో చిల్లకల్లు వద్ద సమైక్యవాదులు, దళిత నేతలతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. సంబంధిత సంఘటనపై విచారణ జరిపించి అగౌరవంగా మాట్లాడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మేధావుల కార్ఖానా లయోలా
పటమట, మార్చి 6: విద్యార్థుల్ని మేథావులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించిన ఘనత ఆంధ్ర లయోల కళాశాలకే దక్కుతుందని రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ కొనియాడారు. ఆంధ్ర లయోల కళాశాల వజ్రోత్సవ వేడుకలు, 59వ కళాశాల దినోత్సవ వేడుకలు బుధవారం సాయంత్రం కళాశాల్లోని ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన నరసింహన్ మాట్లాడుతూ ఆంధ్ర లయోల కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం తన భాగ్యంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. విద్యార్ధులు ఉజ్వలమైన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఆంధ్రలయోల కళాశాల నైతిక విలువలు, క్రమశిక్షణతోకూడిన
విద్యనందిస్తూ ఈ దేశానికి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుందని, లయోల కళాశాల సేవలను అభినందించారు. విలువలు లేని జీవితం వ్యర్ధమని, కనుక విద్యార్థులు విలువలతో కూడిన జీవితాన్ని అలవరచుకుని విజయం సాధించే దిశగా పయనించాలని కోరారు. ముఖ్యంగా యువత మానవీయత కలిగి, మంచి వ్యక్తిత్వం ఏర్పరచుకోవాలని అన్నారు. అందివచ్చిన అవకాశాల్ని విద్యార్ధులు సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని అభిలాషించారు. విద్యార్ధిని, విద్యార్ధులు ఈ సమాజంలో ఒక భాగమేనన్న భావనను మరచిపోకుండా సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతదేశం ఎంతో గొప్ప దేశమని, ఈ దేశంలో అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని, కాని యువత మాత్రం ఇతర దేశాల్లో మన దేశాన్ని పోల్చి నిరాశకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. సమాజంలో మహిళల పట్ల, ఇంట్లో తల్లిదండ్రుల పట్ల గౌరవ భావంతో యువత మెలగాలని హితవుపలికారు. ఆంధ్ర లయోల కళాశాల ఫాదర్స్ తమ జీవితాల్నే త్యాగం చేసి ఈ దేశానికి మంచి పౌరుల్ని అందించే దిశగా కృషి చేస్తున్నారు కాబట్టి విద్యార్ధులు ఫాదర్స్ త్యాగాలను మరచిపోకుండా మంచి పౌరులుగా ఎదగాలని, కళాశాల పేరు ప్రతిష్టల్ని పెంచాలన్నారు. ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా చదువు చెప్పిన గురువును, విద్యను అభ్యసించిన విద్యా సంస్థను ఎప్పుడూ మరువకూడదని అదే మనకు శ్రీరామరక్షని పేర్కొన్నారు. ఈ వయసులో విద్యార్ధులు అల్లరి పనులు చేయడం సహజమని, అయితే ప్రతి దానికి ఒక హద్దు ఉంటుందనీ, ఆ హద్దుల్ని దాటి వెళ్లకూడదన్నారు. లక్ష్మణ రేఖ దాటితే ప్రమాదాలు ఎదురవుతాయన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ తన చిన్ననాటి స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ తాను హైదరాబాదులోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో విద్యను అభ్యసిస్తున్నప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర్ బిట్రో తనను బెత్తంతో కొట్టిన సంఘటనల్ని ఆయన నెమరువేసుకున్నారు. అలాగే, చెన్నైలో వివేకానంద కళాశాలలో తన కాలేజ్ డేస్‌ను గుర్తు చేసుకున్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ జీవితంలో పైకి రావాలంటే విదార్ధులు చదువును కష్టంతో కాక ఇష్టంతో చదవాలన్నారు. ఆయన లయోల కళాశాల్లో చదివిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ తాను లయోల కళాశాల్లో చదివినప్పటికీ తన మనసు ఎప్పుడు మహిళా కళాశాల అయిన స్టేల్లా కాలేజ్ వైపే ఉండేదనడంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి. మనిషి ఆకాశంలో ఉన్నా మనసనేది ఈ భూమిపైనే ఉండాలనేది తన పెద్దనాన్న చెప్పిన మాటలను గుర్తించుకోబట్టే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. విద్యార్ధులు విద్యకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విజయవాడ నగరంతో గవర్నర్‌కు చిన్నతనం నుండి ఎంతో అనుబంధం ఉందనీ, నరసింహన్ ఎట్కిన్‌సన్ స్కూల్‌లో చదివిన సందర్భాన్ని లగడపాటి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లయోల కళాశాల రెక్టర్ ఫాదర్ డి.రవిశేఖర్, కరస్పాండెంట్ ఫాదర్ ఫ్రాంచెస్ జేవియర్, ప్రిన్సిపాల్ జె.ఎ.పి.కిశోర్, కృష్ణా యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ ప్రొఫిసర్ వి.వెంకయ్య, ప్రొవిన్షియల్ ఫాదర్ పి. అంటోని తదితరులు ప్రసంగించగా విజయవాడ కతోలియక్ డయోసిస్‌కు చెందిన గురువులు, సిస్టర్స్, లయోల కళాశాల పూర్వ ప్రిన్సిపాల్స్, పూర్వపు రెక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయోల కళాశాల వజ్రోత్సవ వేడుకుల సందర్భంగా లోగోను గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు.

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
అజిత్‌సింగ్‌నగర్, మార్చి 6: ఇంటర్మీడియేట్ పరీక్షలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. నగర వ్యాప్తగా వివిధ చోట్ల 84 సెంటర్లను ఏర్పాటు చేయగా వేలాది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో మొత్తం అభ్యర్థులు 63,570 మంది కాగా వీరిలో 61,535 మంది హాజరయ్యారు. వివిధ కారణాల వలన సుమారు 2,035 మంది అభ్యర్థులు మొదటిరోజు పరీక్షకు హాజరుకాలేదు. అలాగే వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొత్తం 2,171 అభ్యర్థులు కాగా వీరిలో 260 మంది పరీక్షకు గైర్హాజరై 1,911 మంది పరీక్షలకు హాజరైనారు. కాగా సెంటర్ నెంబర్ 05006 ఎ మరియు 05006 బి నెంబర్ల సెంటర్ నారాయణ జూనియర్ కళాశాలకు సంబంధించి ఇందిరాగాంధీ స్టేడియం, లబ్బీపేట పరీక్షా కేంద్రాలను మాచవరం డౌన్, పడవల రేవు సెంటర్‌లోని నారాయణ జూనియర్ కళాశాలకు మార్చడమైందని ఆర్‌ఐఓ కె వెంకటరామయ్య పేర్కొన్నారు. అలాగే ఎన్‌ఆర్‌ఐ జూనియర్ కళాశాల (05037) సెంటర్‌ను ఈడ్పుగల్లు, బందర్‌రోడ్డులో గల ఎన్‌ఆర్‌ఐ జూనియర్ కళాశాల సెంటర్‌కు మార్చారని, ఈ మార్పును విద్యార్థులు గమనించి విధిగా పరీక్షలకు హాజరుకావాలని ఆయనకోరారు. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేసారు. జిల్లా పరీక్షల కమిటీ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు. ఇదిలావుండగా విద్యార్థి జీవితంలో ఉన్నత విద్యా భవిష్యత్తుకు నాందిపలికే ఇంటర్ పరీక్షలకు ఎంటువంటి అవరోధాలు ఎదురుకాకపోవడంతో నిర్వాహణాధికారులతోపాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షాసమయం కల్లా విద్యార్థులు ఆయా సెంటర్లకు చేరుకోవడం గమనార్హం. పరీక్షకు కొద్ది నిమిషాల ఆలస్యం అయినా విద్యార్థులను అనుమతిస్తామని ఉన్నతాధికారులు పేర్కొనడంతో కొంత వెసులుబాటు కల్పించినా విద్యార్థులు టెన్షన్‌గానే నిర్ణీత సమయానికే చేరుకోవడంతో వివాద రహితంగానే పరీక్ష సాగింది. పరీక్షా సమయానికి ముందు, తరువాత నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమైనాయి. వేలాది మంది విద్యార్థులు రహదారులపై బస్‌లకోసం వేచి ఉండటంతో విద్యార్థులతో రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. కొంత మంది కళాశాల యాజమాన్యాలు తమ విద్యార్థులను తమకు చెందిన బస్‌లలోనే రవాణా సౌకర్యం కల్పించడం విశేషం. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను తమ వాహనాలపై పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకువచ్చి వెళ్ళారు. మరికొంత మంది తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల సమీపంలోనే ఉండి సమయం అయ్యే వరకూ వేచి ఉన్నారు. పరీక్షకు ముందు సమయంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా సక్రమ నిర్వహణకు, క్రమబద్దీకరణకు అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

విమానాశ్రయంలో గవర్నర్‌కు ఘన స్వాగతం
పటమట, మార్చి 6: లయోల కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు ప్రజా ప్రతినిధులు, అధికారులు బుధవారం ఘనంగా స్వాగతం పలికారు. లయోలా కళాశాల్లో నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం హైదరాబాదు నుండి విమానంలో గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న గవర్నర్‌కు అధికారుల నుండి ఘన స్వాగతం లభించింది. సాయంత్రం 5.35 గంటలకు విమానాశ్రయం చేరుకున్న ఆయనకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారధి, తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు యలమంచిలి రవి, జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ యం.జ్యోతి, నగర పాలక సంస్థ కమిషనర్ పండాదాస్, జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, కృష్ణా యూనివర్శిటి వైస్ ఛాన్సులర్ వి.వెంకయ్య, ఏలూరు రేంజ్ డిఐజి సూర్యప్రకాశరావు, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీసు ఎన్ మధుసూదనరెడ్డి, డిసిపి రవిప్రకాష్, ఏసిపి రాఘవరావు, నూజివీడు ఆర్డీఓ సుబ్బారావు, గన్నవరం తహశీల్దార్ వై.వి.ప్రసన్నలక్ష్మీ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అడపా నాగేందర్ తదితరులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాదు నుండి విమానంలో వచ్చిన గవర్నర్ వెంట వచ్చిన వారిలో విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ తదితరులున్నారు.

భద్రతకు పెద్దపీట... అభివృద్ధికి రాచబాట
విజయవాడ (రైల్వేస్టేషన్), మార్చి 6: రైల్వే స్టేషన్ అభివృద్ధికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మరో ఆరు నెలల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఆధునిక రైల్వేస్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్ కుమార్ చెప్పారు. బుధవారం విలేఖరులకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డిఆర్‌ఎం ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ ప్రయాణీకుల సౌకర్యార్థం ఎస్కలేటర్లు, లిఫ్టులు మరో ఆరు నెలల్లో పూర్తిచేయనున్నామన్నారు. రానున్న ఎండాకాలంను దృష్టిలో పెట్టుకుని పదవ నెంబరు ప్లాట్‌ఫారంపై ప్రయాణీకులు వేచి ఉండేందుకు వీలుగా షెల్టర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎనిమిది, తొమ్మిది, పది ప్లాట్‌ఫారాల నుంచి రాజమండ్రి వైపు వెళ్లుమార్గం లేదు. దీనిని కలపడం కోసం ఆర్‌ఆర్‌ఐ (రూట్ రిలే ఇంటర్ లాకింగ్) సిస్టిం మూడో దశ పనులు సైతం మరో రెండు నెలల్లో పూర్తికానున్న కారణంగా ప్రస్తుతం నాలుగు దిక్కుల నుంచి వచ్చే రైళ్లు ఊరు బయట ఔటర్ సిగ్నల్ వద్ద ఆగకుండా నేరుగా ప్లాట్‌ఫారం మీదకు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. దీని కారణంగా రాజమండ్రి లైన్ కూడా కలిసిపోవడం వలన ఇరువైపుల వచ్చే రైళ్లన్నీ కూడా అన్ని ప్లాట్‌ఫారాల మీదకు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రాజమండ్రి వైపు రాకపోకలు సాగించే రైళ్లు మాత్రమే ఎనిమిది, తొమ్మిది, పది ప్లాట్‌ఫారాలకు రావడం లేదని ప్రదీప్‌కుమార్ వివరించారు. సింగ్‌నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల వారి కోసం సింగ్‌నగర్‌లో సాటిలైట్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ఇందుకోసం రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని, అందుకు ఆమోదం కూడా లభించిందని తెలిపారు. సత్యనారాయణపురంలో ఉన్న ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ (ఇటిటిసి) ఉన్న ప్రదేశం కలిగినవారు కోర్టులో గెలవగా రైల్వే విభాగం సుప్రీంకోర్టులో తిరిగి కేసు వెయ్యడం జరిగిందని, దీని కారణంగా త్వరలో వచ్చే కోర్టు నిర్ణయం కారణంగా ట్రైనింగ్ సెంటర్‌ని మార్చే పరిస్థితి ఏర్పడిందని ఆయన విలేఖరులకు తెలిపారు. సాధారణ బోగీలో ప్రయాణించే ప్రయాణికుల దగ్గర నుంచి ప్రతీ ప్రయాణికుడికి తాగునీరు అందే విధంగా ఎండాకాలంను దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛంద సంస్థలతో పాటు రైల్వే స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని అందుకు వారు కూడా ముందుకు వచ్చారని వివరించారు.
పెరిగిన స్టేషన్ ఆదాయం
కాగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది రెండు వేల మూడు వందల కోట్ల ఆదాయం పెరిగిందని ప్రదీప్‌కుమార్ చెప్పారు. దీనిని 2013-13లో రెండు వేల ఐదు వందల కోట్లకు పెంచాలని చూస్తున్నామన్నారు. అలాగే రైల్వే కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా త్వరలో అన్ని కాలనీల్లో పర్యటించి వారి సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రైలులో దొంగతనాలు అరికట్టేందుకు సిసి కెమెరాలను ప్రధాన స్టేషన్లలో ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకునే విధంగా ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే ప్రతీ రైలులోని మహిళా బోగీలో ప్రత్యేకంగా మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. అలాగే భద్రత విషయంలో వినూత్న రీతిలో పెద్దపీట వేస్తున్నట్లు వివరించారు. ఈ విలేఖరుల సమావేశంలో అడిషినల్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎస్ సుబ్బారావు, సీనియర్ డిసిఎం శాస్ర్తీ, సీనియర్ డిఇఇ నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

అవినీతి మూలాలన్నీ వైఎస్ కుటుంబంలోనే
విజయవాడ (క్రైం), మార్చి 6: అంధ్రప్రదేశ్‌లో అవినీతి ఎక్కడున్నా దాని మూలాలు మాత్రం వైయస్ కుటుంబంలోనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ పామర్రు నియోజకవర్గ ఇంచార్జ్ వర్లరామయ్య ఆరోపించారు. వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్‌శాస్ర్తీ మత ప్రచారకుడా లేక రాజకీయ నాయకుడా అంటూ ఆయన మండిపడ్డారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మామ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తవ మత ప్రచారకుడిగా అనిల్ బాగా ప్రఖ్యాతి చెందాడని ఎద్దేవా చేశారు. మత ప్రచారకుడైన అనిల్ చంద్రబాబు గురించి కారుకూతలు కూయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. అనిల్ మనీలాండరింగ్ వ్యవహారంపై అదే విధంగా ఆయన బినామీలపై సిబిఐ జాయింట్ డైరెక్టర్‌ను, రాష్ట్ర డిజిపిని కలిసి విచారణకు డిమాండ్ చేస్తామని చెప్పారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
విజయవాడ(క్రైం), మార్చి 6: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం ప్రసాదంపాడు సాయిబాబు గుడి సెంటర్‌కు చెందిన కడియాల వెంకటరామయ్య (65) అనే వృద్ధుడు మంగళవారం మధ్యాహ్నం ఐదవ నెంబరు జాతీయ రహదారి పై టయోట షోరూం సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా గన్నవరం వైపు నుండి విజయవాడ వైపు వేగంగా వస్తున్న ఐచార్ వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భార్యాభర్తల అరెస్టు
ఇబ్రహీంపట్నం, మార్చి 6: పోలీసులమని చెప్పి మీ ఇల్లు తనిఖీ చేయాలని చెప్పి ఇంటిలోని రూ. 10 లక్షలు, 30 కాసుల బంగారం, పిక్సిడ్ డిపాజిట్ డీడ్స్, ఆస్తుల డాక్యుమెంట్లు దోచుకున్న ఇద్దరు భార్యాభర్తలను అరెస్టు చేసి బుధవారం పోలీసులు కోర్టుకు హాజరు పరచారు. ఇబ్రహీంపట్నం సిఐ రామచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం కొండపల్లి హెచ్‌పిసిఎల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న దయాకర్ ఇంటికి ఫిబ్రవరి 14న యూనిఫారంలో ఉన్న లేడీ కానిస్టేబుల్, ఇద్దరు మగవారు వచ్చి మేము సిటీ పోలీసులమని, మీ ఇల్లు సోదాలు చేయాలని చెప్పి ఇంటిలో ఉన్న రూ. 10 లక్షల నగదు, 30 కాసుల బంగారు వస్తువులు, పిక్సిడ్ డిపాజిట్ డీడ్‌లను తీసుకుని వెళ్ళి పోయినట్లు బాధితుడు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి ఎస్‌ఐ మహేష్ కేసు నమోదుచేసి కేసుకు సంబంధించి విజయవాడ వించిపేటలో ఉన్నారని సమాచారం మేరకు యస్‌ఐ మహేష్ సిబ్బంది ముద్దాయిలని అనుమానించి ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారించగా నిందితులు నేరం ఒప్పుకున్నారు. వించిపేటకు చెందిన పేటేటి రాజామోహన్ (35), అతని భార్య పేటేటి సూర్యదుర్గను అరెస్టు చేశారు. ఈమె విజయవాడ మొదటి పోలీసు స్టేషన్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో హోం గార్డుగా పనిచేస్తున్నట్టు తెలిసింది. వారి నుండి 20కాసుల బంగారం, రూ. 50 వేల నగదు, సుమారు 20 లక్షల రూపాయల విలువ కలిగిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచారు. సిఐ రామచంద్రరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న ‘వస్తున్నా... మీ కోసం’ పాదయాత్ర గుడివాడ నియోజకవర్గంలో బుధవారం
english title: 
a

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>