Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఇంటర్ పరీక్షలు ప్రారంభం

$
0
0

శ్రీకాకుళం (టౌన్), మార్చి 6: జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సర తెలుగు పరీక్షకు 1406 మంది గైర్హాజరు కాగా 25,673 మంది పరీక్ష రాసారు. జిల్లా వ్యాప్తంగా 86 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు విద్యార్థులకు అనేక కేంద్రాల్లో నేల రాతలు తప్పలేదు. మొదటి నుండి అధికారులు పరీక్ష రాసే విద్యార్థులకు వౌళిక వసతులు కల్పిస్తున్నామని, బెంచీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పటికీ ఎక్కడా అటువంటి దాఖలా కానరాలేదు. జిల్లా కేంద్రంలోనే అనేక కేంద్రాల్లో విద్యార్థులు నేలమీద కూర్చుని పరీక్షలు రాసారంటేనే ఇక జిల్లా వ్యాప్తంగా విద్యార్ధుల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడా మంచినీటి సదుపాయం, వైద్య సదుపాయం వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం విద్యార్ధులు పరీక్షలు రాసేందుకు అనేక ఇక్కట్లకు గురయ్యారు. పరీక్షలకు అర్ధగంట ముందు పరీక్ష హాల్‌లోకి విడిచిపెట్టాల్సి ఉన్నప్పటికీ పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్ధులను పది నిమిషాల ముందే హాల్‌లోకి విడిచిపెట్టడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులకు, కళాశాల యాజమాన్యానికి మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి ఎ.అన్నమ్మ రెండు కేంద్రాలను తనిఖీ చేసారు.

అగ్నికి ఆహుతి
సీతంపేట,మార్చి 6:మండలంలోని సోమగండి పంచాయతీ పరిధి చీడిగూడ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం సంభవించిన అగ్నిప్రమాదంలో గిరిజనులకు చెందిన 17 పూరిళ్లు ఆహుతయ్యాయి. ఒక్కసారిగా గ్రామాన్ని మంటలు చుట్టుముట్టి దహించివేసాయి. బుధవారం మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో గ్రామంలోని పొచ్చయ్య ఇంటిలో రాజుకున్న అగ్గి కళ్లు మూసి తెరిచేలోగానే మంటలు చుట్టుముట్టాయని, గ్రామంలో మంటలను అదుపుచేసేందుకు ఎవరూ లేకపోవడంతో కనీసం సామాగ్రిని కూడా తీసుకొలేని పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనలో నిమ్మక నారాయణరావు, నూకయ్య, ధర్మారావు, వూలక దుర్గారావు, పాలకమోహనరావు, ఎన్ ప్రసాద్, పి సింహచలం, కె కరువయ్య, పాలక జిబ్బన్నదొర, పొచ్చయ్య, పతిక లక్ష్ముమ్మ, రవణమ్మ, కడ్రక జాతయ్య, వూలక పట్టయ్య, వూలక రాజారావు, ఆదయ్య, తట్టయ్యలకు చెందిన ఇళ్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. కట్టుకున్న బట్టలు మినహా ధాన్యం, నగదు, బట్టలు, సామాగ్రి బూడిదయ్యాయి. ఇటీవల తాము వలసపోయి రెండు రోజుల క్రితమే గ్రామానికి చేరుకున్నామని, తాము ఇన్నాళ్లు కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బు అంతా బుగ్గిపాలయ్యిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేసారు.
అగ్నిప్రమాదం విషయమై కొత్తూరు ఫైర్‌స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించినప్పటికి వారు సకాలంలో స్పందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి వచ్చి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేసారు.
స్పందించిన పివో సునీల్‌రాజ్‌కుమార్:
చీడిగూడ లో అగ్నిప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఐటిడిఎ పివో సునీల్‌రాజ్‌కుమార్ స్పందించి హుటాహూటిన ఏపిఓ నాగోరావును సంఘటన స్థలానికి పంపారు.అలాగే ఎంపిడిఓ, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసి, అగ్నిమాపక సిబ్బందితో కూడా మాట్లాడారు. అనంతరం పిఒ చీడిగూడ గ్రామానికి చేరుకొని అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. నిలువనీడ కోల్పోయిన ఒక్కోక్క గిరిజన కుటుంబానికి ఐటిడిఎ తరుపున రూ.5వేలు నగదు, 25కేజిల బియ్యం, కిరోసిన్ పంపిణీ చేయాలని ఏపిఓ నాగోరావుకు ఆదేశించారు. కలెక్టర్ సౌరభ్‌గౌర్,పాలకొండ ఎమ్మెల్యే నిమ్మకసుగ్రీవులతో పివో ఫోన్‌లో మాట్లాడి జరిగిన ప్రమాదం వివరాలను తెలియజేసారు. పివోతో పాటు ఎంపిడిఓ కుమారస్వామి,సిఎ రవి తదితరులు ఉన్నారు.

రామమందిరం కూల్చివేత ఘటనపై అసెంబ్లీలో ప్రస్తావిస్తాం
శ్రీకాకుళం (టౌన్)/శ్రీకాకుళం రూరల్, మార్చి 6: పట్టణంలోని జిటిరోడ్డు వద్దనున్న రామమందిరాన్ని కూల్చివేయడం అన్యాయమని, ఈ విషయాన్ని శాసనసభలో ప్రస్తావింపజేస్తామని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రంగమోహన్ అన్నారు. బుధవారం రామమందిరం కూల్చివేసిన స్థలాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం స్థానికంగా, ఎన్జీవో హోంలో విలేఖరులతో మాట్లాడారు. ఎక్కడ చూసినా హిందువుల దేవాలయాల్నే పడగొడుతున్నారని, హిందువులు సాత్వికులు అన్న ధీమాతో అధికారులు, పాలకులు ఉన్నట్లున్నారని అన్నారు. కొంతమంది వ్యాపారస్తుల కోసం ఈ విధంగా చేయడం అన్యాయమన్నారు. దీనిపై తాము పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకువస్తామని హెచ్చరించారు. రోడ్డు (మిగతా 2వ పేజీలో)

విస్తరణలో మందిరం అడ్డువస్తుందంటే చర్చల ద్వారా వారిని ఒప్పించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని తెలిపారు. కొందరి స్వార్ధ ప్రయోజనాల కోసం రామమందిరాన్ని కూల్చివేయడం అమానుషమన్నారు. దీంట్లో మంత్రి ధర్మాన ప్రసాదరావు హస్తం ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారని అంటూ మంత్రి ధర్మాన ఇప్పటికే పలు విషయాల్లో అపప్రద మూటగట్టుకున్నారని, ఇంకా చాలదన్నట్లు ఈ అపప్రదను మూటగట్టుకుంటున్నారని విమర్శించారు. ఒకవేళ మంత్రికి ఏ ప్రమేయమూ లేదంటే ప్రభుత్వ అధికారులే మందిరాన్ని కూలదోశారు కాబట్టి ప్రభుత్వ నిధులతోనే పునఃనిర్మించాలని డిమాండ్ చేశారు. మంత్రి అనుచరుల ఆగడాలను అడ్డుకునే విధంగా ఉద్యమం చేపడతామని చెప్పారు. మందిర నిర్మాణంలో స్థానిక ప్రజలకు తాము అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు పైడి వేణుగోపాలం, టంకాల దుర్గారావు, వైకాపా నాయకులు ఎన్ని ధనుంజయ, స్వామి శ్రీనివాసానంద సరస్వతి, సంపతిరావు నాగేశ్వరరావు, యోగేశ్వరరావు, ఎవిటి అప్పారావు, సూరు చంద్రశేఖరరావు తదితరులు ఉన్నారు.

గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేదు
* ఎ.ఇ రంగారావు
జలుమూరు, మార్చి 6: మండలం 40 గ్రామ పంచాయతీల్లో ఉన్న ప్రజలకు అవసరమగు తాగునీటి సరఫరాకు తగిన నీటివసతులున్నాయని గ్రామీణ రక్షిత మంచినీటి పథకం ఎ.ఇ జామిరంగారావు అన్నారు. మండల పరిధిలో 282 తాగునీటి బోర్లు పనిచేస్తున్నాయని, అదేవిధంగా 28 రక్షితనీటిపథకాలు ఉన్నాయని, సవిరిగాం గ్రామానికి ఓవర్‌హెడ్ ట్యాంక్ ఏర్పాటుకు 23 లక్షలు రూపాయల మంజూరైందన్నారు. ఇక మండలం టెక్కలిపాడు గ్రామంలో మరో నీటిపథకానికి 12 లక్షల రూపాయలు మంజూరైందని, వీటిని త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. బోరు మరమ్మతులైన వెంటనే ఎంపిడిఒ కార్యాలయంలో నమోదు చేయిస్తే తక్షణమే మరమ్మతులు చేపట్టనున్నామన్నారు.
మూడు పథకాలకు రూ. 15 లక్షలు మంజూరు
మండలం చల్లవానిపేట, కిల్లివానిపేట, వెంకటాపురం గ్రామాల్లో కొనే్నళ్ల కిందట నిర్మించిన నీటిపథకాలు పనిచేయనందున రక్షిత మంచినీటి పథకానికి అవసరమైన నీటిని అందించేందుకు తగినంత బావుల్ని తవ్వేందుకు 15 లక్షలరూపాయలు మంజూరైందన్నారు.
మహాశివరాత్రి పండుగకు పందిరిరాట
జలుమూరు, మార్చి 6: ఈ నెల పదవ తేదీన మూడురోజులపాటు జరిగే శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలకు పలు పనులు చేపట్టినట్లు బుధవారం ఆలయ ప్రాంగణంలో స్వామివారి పందిరిరాటను ఏర్పాటుచేశారు. ఈ పందిరిరాటను శుభసూచికంగా భావించి ప్రతీఏటా శివరాత్రి ముందుఐదురోజులు కార్యక్రమాన్ని చేపడతారని అర్చకులు తెలిపారు. ఆలయ మేనేజర్ ప్రభాకరరావు కంకణం కట్టుకుని పందిరిరాటను వేశారు. కార్యక్రమంలో ఆలయసంఘ అధ్యక్షులు పెదలింగన్న, పాలకమండలి చైర్మన్ బైరి బలరాం, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.
వృత్తి నైపుణ్యంలో మహిళలకు చేయూత
* ఐ.ఆర్.డి.ఎస్. పి.డి ప్రసాదరావు
నరసన్నపేట, మార్చి 6: మహిళలకు అన్నింటా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ దిశగా వారికి వృత్తినైపుణ్యం పెంపొందించేందుకు పలు కార్యక్రమాలను చేపడుతున్నామని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పి.డి పి.వి.వి.ప్రసాదరావు తెలిపారు. బుధవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వృత్తివిద్యానైపుణ్యంపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు తగుశిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి దోహదపడేలా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటికే 300 వృత్తివిద్యానైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటుచేశామని, అలాగే మండలంలో తొమ్మిది కేంద్రాలను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పంచాయతీ విస్తరణాధికారి నిశ్చల, ఇ.ఒ ప్రకాశరావు, కోఆర్డినేటర్ బగ్గు ఎల్లయ్య, సింహబలుడు, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.
ఎత్తిపోతల పథకంతోనే పరిష్కారం
* మాజీ మంత్రి తమ్మినేని
పొందూరు, మార్చి 6: మడ్డువలస రెండవ విస్తరణ పనుల్లో మండలంలో రైతుల మధ్య నెలకొన్న సమస్యకు ఎత్తిపోతల పథకం విధిగా చేర్చడమే పరిష్కారమార్గమని తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం సూచించారు. గురువారం వివాదాస్పదంగా తయారైన కాలువ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలుత నిర్ణయించిన ప్లాన్‌ను మార్చడంతోనే రైతుల్లో అపోహలు పెరిగాయని, దాంతో గ్రామాల్లో ఐక్యంగా ఉన్న రైతుల మధ్య అభిప్రాయబేధాలు పొడచూపాయని ఆందోళన వ్యక్తంచేసారు. దీనికి ఇంజనీరింగ్ అధికారులే ఆజ్యం పోసారన్నారు. ఈ పరిస్థితి దూరం కావాలంటే కాలువ పనులతోపాటు ఎత్తిపోతల పథకం అనుసంధానం చేసి పనులు జరిపించాలని ఆయన కలెక్టర్‌కు డిమాండ్ చేశారు. ఇదే జరిగితే పై గ్రామాలైన అలకాం, తండ్యాం, లక్ష్మీపేట, బాణాం గ్రామాలకు సంబంధించిన రెండువేలకు పైగా ఎకరాల పంటభూమికి సాగునీరందుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. లేనట్లయితే రైతుల ఆగ్రహానికి అధికారులు గురవ్వకతప్పదని హెచ్చరించారు. కాంటూరు స్థాయిని కూడా మార్చాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకతీతంగా నాయకులు, రైతులు పాల్గొన్నారు.

కాశీనగర్‌కు
నిరంతర బస్‌సర్వీసు
*మంత్రి ధర్మాన
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, మార్చి 6: జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగించిన ఒడిశా రాష్ట్రంలోని కాశీనగర్‌కు బస్సు సర్వీస్ నిరంతరం కొనసాగుతుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. జిల్లా బోర్డర్‌కు దగ్గర్లో ఒడిశా రాష్ట్రంలో ఉన్న కాశీనగర్ గ్రామానికి ఆర్టీసి బస్సు సర్వీస్‌ను ఏర్పాటుచేసినందుకు ఆ గ్రామస్థులు బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని గజమాలతో సత్కరించి జ్ఞాపికనందజేశారు. వారినుద్దేశించి మంత్రి మాట్లాడుతూ కాశీనగర్‌లో 90 శాతం తెలుగువారున్నారని, వీరందరికీ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లోని కుటుంబాలతో బంధుత్వం కలిగిఉన్నారని చెప్పారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ రొక్కం ఇందిరమ్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలుగువారితో బంధుత్వం ఏర్పడడం వల్ల రాకపోకలకు గతంలో ఇబ్బందులు పడేవారమని, ఇకనుంచి ఆ పరిస్థితులు తలెత్తవన్నారు. డి.సి.ఎం.ఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి కృష్ణకుమార్, గుమ్మా నగేష్, బరాటం నాగేశ్వరరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుండ ఢిల్లీరావు, కాశీనగర్ వాసులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి ధర్మాన సభలకు ఉపాధి కూలీలు

శ్రీకాకుళం (టౌన్), మార్చి 6: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభోత్సవ సభలకు ఉపాధి కూలీలను సంబంధిత అధికారులు తరలిస్తున్నారని, దీనిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కోరారు. బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల రూరల్ మండలపరిధిలోని అలికాం వద్ద నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని మంత్రి ధర్మాన ప్రారంభోత్సవం చేయగా, సమీపంలోని పనిచేస్తున్న ఉపాధికూలీలను మస్తర్లు వేసి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలించారని ఆరోపించారు. మండలంలోని ముఖ్య విభాగాలలో పనిచేస్తున్న అధికారులు జిల్లా కేంద్రంలో స్థిర నివాసం ఏర్పరచుకొని నాయకులతో కలిసి రాజకీయాలు నెరుపుతున్నారని ఆరోపించారు. కలెక్టర్ కల్పించుకొని అటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో దివంగత నేత ఎర్రన్నాయుడు, అప్పటి మంత్రి తమ్మినేని సీతారాంలతో కూడి తాను వంశధార కుడి ప్రధాన కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించామని, పనులు సాగుతుండగా, తదనంతర పరిణామాలలో ప్రభుత్వం మారగా మిగిలి ఉన్న పనులను పూర్తిచేయించి వంశధార కుడి కాలువ తానే తెచ్చానని మంత్రి ధర్మాన గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దీనిని తాము ఖండిస్తున్నామని, వంశధార కుడికాలువపై ప్రజల సమక్షంలో చర్చలకు రావాలని సవాల్ విసిరారు. సమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, మాజీ పట్టణ అధ్యక్షుడు పి.వి.రమణ, గుత్తు చిన్నారావు, జి.నాగేశ్వరరావు, ఐ.వి.రమణ తదితరులు పాల్గొన్నారు.

రూ.51కోట్లతో రహదారి నిర్మాణానికి ప్రతిపాదన

నరసన్నపేట, మార్చి 6: రాష్ట్ర ప్రభుత్వం నక్సల్స్‌ఏరియాకు సంబంధించి రహదారుల నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు మంజూరుచేసేందుకు రంగం సిద్ధం చేసిందని రోడ్లు, భవనాల శాఖ డి.ఇ ఎస్.రామినాయుడు తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. జిల్లా మంత్రి ధర్మాన ప్రసాదరావు కృషితో కళింగపట్నం-పర్లాఖిమిడి రోడ్డుకు 51 కోట్లరూపాయలతో విస్తరణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. అదేవిధంగా ఆర్ అండ్ బి ఎస్.ఇ. వి.సోమశేఖర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతీఒక్క నియోజకవర్గంలో 20 కిలోమీటర్ల మేర ఉన్న జిల్లా పరిషత్ రహదారులను ఆర్ అండ్ బికి కలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో 75 కిలోమీటర్ల మేర జిల్లా పరిషత్ రోడ్లను గుర్తించామని, ప్రతీ కిలోమీటర్‌కు 12 వేల రూపాయల చొప్పున ఏడాదికి మరమ్మతులు చేపట్టేందుకు నిధులను మంజూరుచేశారన్నారు. సిపి రోడ్డు మధ్య పోలాకి, పల్లిపేట, నరసన్నపేట, తిలారు, చల్లపేట, సారవకోట, పాతపట్నం మీదుగా రహదారి నిర్మాణం చేపట్టనున్నామని వివరించారు. అలాగే తిలారు రైల్వేక్రాస్ వద్ద ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కూడా ప్రతిపాదనలు ఇప్పటికే పంపించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎ.ఇ జగన్మోహన్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సర
english title: 
i

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles