విశాఖపట్నం, మార్చి 6: దిల్‌సుఖ్‌నగరం బాంబు పేలుళ్ళ నేపధ్యంలో విశాఖ నగరంలో భద్రతా చర్యలు మరింత పటిష్టం చేసే దిశగా పోలీసు శాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో ఉండే పెద్దపెద్ద దుకాణాలు, బయటివారు బసచేసే హోటళ్ళు, ఉగ్రవాదులు రాకపోకలు సాగించే రవాణా విభాగాలు ఒకింత అప్రమత్తంగా ఉంటే భారీ ప్రమాదాలు చోటుచేసుకోకుండా అడ్డుకోవచ్చని పోలీసు శాఖ భావిస్తోంది. దీనిలో భాగంగానే నగర పోలీసు కమిషనర్ బి.శివధర రెడ్డి చర్యలకు ఉపక్రమించారు. హోటళ్ళు, షాపింగ్ మాల్స్, ఆర్టీసీ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఉగ్రవాదులు తాము విధ్వంసం సృష్టించబోయే ప్రాంతాల్లోని హోటళ్ళలో బసచేసినట్టు హైదరాబాద్ ఉదంతం వెల్లడించడంతో పోలీసులు కూడా హోటళ్ళపై దృష్టి సారించింది. హోటళ్ళలో బసచేసేందుకు వచ్చిన వారి పూర్తి వివరాలు సేకరించాలని, వారి ఫోటో గుర్తింపు కార్డుతో పాటు డిజిటల్ ఫోటోను తీసుకోవాలని సూచించారు. వారి ఫోన్ నెంబర్, వచ్చిన వాహనాల నెంబర్లను తీసుకోవాలన్నారు. ఇక హోటల్‌కు వచ్చే వారి లగేజీలను తనిఖీ చేసేందుకు సొంతంగా మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్ తమ చుట్టుపక్కల ప్రాంతాలు స్పష్టంగా కన్పించేట్టు నిఘా కెమేరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానస్పదంగా సంచరించే వ్యక్తుల వివరాలను పోలీసులకు అందించాలన్నారు.
ఇక రవాణా సంస్థ కాంప్లెక్స్ వద్ద బందోబస్తును పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవడంతో పాటు బాంబ్‌లను పరిసిగట్టే పరికరాలు, డాగ్ స్క్వాడ్‌లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నిఘా కెమేరాలతో నిరంతరం ప్రయాణీకులను నిశితంగా పరిశీంచాలని సూచించారు. అలాగే ఆర్టీసీ డిపోల్లో కూడా నిఘాను పెంచుకోవాలని సూచించారు.
అంతకు ముందు సిపి శివధర రెడ్డి ఇంటర్ పరీక్షల బందోబస్తుపై సమీక్షించారు. ఇంటర్ పరీక్షల దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలవుతోందని పేర్కొన్నారు. నగరంలో 62 పరీక్షా కేంద్రాల వద్దా 144 సెక్షన్ అమలవుతోందని, అయిదు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న జెరాక్స్ సెంటర్లను ఉదయం 9 నుంచి పరీక్ష ముగిసేంత వరకూ మూయించి వేయాల్సిందిగా అదేశించారు.
పోలవరంపై తెరాసా అనవసర రాద్ధాంతం
* సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ద్వంద్వ వైఖరి
* మండిపడ్డ పొలిటికల్ జెఎసి
విశాఖపట్నం, మార్చి 6: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి అనవసర రాద్ధాంతం సృష్టించి, తప్పుదోవ పట్టిస్తోందని సమైక్యాంధ్ర పొలిటికల్ జెఎసి ఆరోపించింది. పోలవరం టెండర్ల విషయంలో తెరాస అధినేత కెసిఆర్, తదితరులు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై జెఎసి బుధవారం నాడిక్కడ గులాబీ జెండాలు, సూట్‌కేసులను దగ్ధం చేసి నిరసన తెలిపింది. ఈసందర్భంగా పొలిటికల్ జెఎసి కన్వీనర్ జెటి రామారావు మాట్లాడుతూ పక్కనున్న మహారాష్టల్రో గోదావరి నదిపై బాబ్లీ తదితర ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తూ తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మారుస్తోంటే స్పందించని తెరాస పోలవరం టెండర్లను రాజకీయం చేయడాన్ని ఖండించారు. రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్ష పోలవరం ప్రాజెక్టుకు కదలిక రావడం హర్షించతగ్గ పరిణామంగా పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అవకతవకలు జరిగితే స్పందించాల్సింది పోయి, ప్రాజెక్టు ఏర్పాటునే అడ్డుకునే యత్నం చేయడం గర్హించాల్సిన విషయంగా పేర్కొన్నారు. ఇక అధికార పార్టీలో ఉంటూ పోలవరం చిరకాల వాంఛగా చెప్పుకున్న చిరంజీవి పోలవరం విషయంలో శకుని పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఈప్రాజెక్టునకు జాతీయ హోదా తెస్తానని ప్రగల్బాలు పలికిన చిరంజీవి తెలుగువారి ఆత్మగౌరవాన్ని సోనియా గాంధీ పాదాల వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే వ్యతిరేక శక్తులతో విందులు చేస్తున్న వారి వల్ల నష్టం తప్పదని అభిప్రాయపడ్డారు. పోలవరంతో పాటు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెఎసి నేతలు కె.రామచంద్రమూర్తి, లీగల్ కన్వీనర్ పి.శ్రీరామ్మూర్తి, బి.అప్పారావు, శ్రీనివాస్, జి.రాము తదితరులు పాల్గొన్నారు.
పొలిట్‌బ్యూరోకు అయ్యన్న హాజరు
* అలకవీడి పార్టీ సమావేశాలకు
ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం, మార్చి 6: అలకవీడిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సిహెచ్ అయ్యన్నపాత్రుడు ఈనెల 9న కృష్ణా జిల్లాలో జరగనున్న పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొననున్నారు. విశాఖ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుని తొలగింపు, తదనంతరం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పెందుర్తిలో పీలా శ్రీనివాసరావు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వర్గాల మధ్య జరిగిన సంఘటనలో పీలాకు అనుకూలంగా తన పదవులకు రాజీనామా చేసిన అయ్యన్న తదనంతరం జరిగిన పరిణామాలతో కాస్త మెత్తబడ్డారు. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన అయ్యన్న పరిస్థితి వివరించారు. జరిగిన సంఘటనపై కమిటీని నియమించామని, నివేదిక అనంతరం చర్చిద్దామని హామీ ఇవ్వడంతో అయ్యన్న పార్టీని వీడే ప్రశక్తి లేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాని చెప్పడమే కాకుండా తనకు అప్పగించిన పొలిట్‌బ్యూరో బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధ పడుతున్నారు.
పట్టపగలు తొమ్మిది తులాల బంగారం చోరీ
విశాఖపట్నం(క్రైం), మార్చి 6: ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సినిమా తరహాలో ఇంట్లోకి ప్రవేశించి దాహం వేస్తుందని, మంచి నీరు ఇమ్మని అడిగి, వెంటనే దాడి చేసి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ మెడలోని బంగారు ఆభరణాలను దోచుకు పోయారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలివి.
నగరంలోని చినవాల్తేరులో ఉంటున్న శ్రీదేవి ఇంటికి బుధవారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించారు. దాహంగా ఉందని మంచినీళ్ళు ఇమ్మని ఆమెను వారు అడిగారు. దీంతో లోపలికి వెళ్ళి మంచినీళ్ళను తీసుకుని వస్తుండగా వారిద్దరిలో ఒకడు కత్తి చూపించి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసి ఇవ్వాలని లేని పక్షంలో చంపుతామని బెదిరించాడు. దీంతో ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసివేసి, వారికి ఇచ్చింది. అనంతరం వారు అక్కడ నుండి పారిపోయారు. కొద్ది సమయం తర్వాత భర్త రామకృష్ణ రావడంతో లబోదిబోమంటూ జరిగిన విషయాన్ని చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని చోరీ జరిగిన విధానాన్ని బాధితులను అడిగి తెలుసుకున్నారు. దొంగలిద్దరు కారులో వచ్చి చోరీ అనంతరం అదే వాహనంపై అక్కడ నుండి వెళ్ళిపోయినట్టు స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు ఆయా జంక్షన్ల వద్ద నిఘా వాహనాలను తనిఖీలు చేశారు. సుమారు తొమ్మిది తులాల బంగారు ఆభరణాలను దొంగలు దోచుకుపోయినట్టు శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడో పట్టణ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
మర్రిపాలెం నేవల్ క్వార్టర్స్‌లోని ఓ ఇంట్లో భారీ చోరీ
* 20తులాల బంగారం, నగదు మాయం
విశాఖపట్నం(క్రైం), మార్చి 6: మర్రిపాలెం పరిధిలోని 104ఏరియాలోని నేవల్ క్వార్టర్స్‌లోకి దొంగలు చొరబడి సుమారు 20తులాల బంగారం, రూ.పది వేలును దోచుకు పోయారు. స్థానిక ఎస్.వి.ఎన్.కాలనీలోని నేవల్ క్వార్టర్స్‌లో ఎమ్.ఇ.ఎస్.లో ఫిట్టర్‌గా పని చేస్తున్న కందుల సత్యనారాయణ, కుటుంబంతో నివాసముంటున్నారు. ఈనెల నాలుగో తేదీన ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సత్యనారాయణ, కుటుంబంతో కలిసి అక్కయ్యపాలెంలోని బంధువుల ఇంటికి వెళ్ళారు. తిరిగి బుధవారం ఇంటికి చేరుకోగా తలుపులు పగలగొట్టబడి ఉండడాన్ని వారు గమనించారు. బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో పాటు అందులో ఉంచిన 20తులాల బంగారు ఆభరణాలు, రూ.పది వేలు నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్టు గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ తాతారావు నేతృత్వంలో కంచరపాలెం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను
ప్రకటించిన వైకాపా
* విశాఖ పశ్చిమ, చోడవరంపై నిర్ణయం వాయిదా
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 6: విశాఖ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌లను బుధవారం ప్రకటించింది. అయితే విశాఖ పశ్చిమ, చోడవరం నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను ఇంకా ప్రకటించలేదు. విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి పోటీ ఎక్కువగా ఉండడంతోపాటు, ఈ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌ను ప్రకటించలేకపోయింది. అలాగే చోడవరం నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌ను నియమించే విషయంలో పార్టీ ఒక నిర్ణయం తీసుకోలేకపోయింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారిలో చాలా మందికి ఇన్‌చార్జ్ హోదా లభించలేదు. అన్నింటికన్నా ముఖ్య విషయం ఏంటంటే, పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబూరావుకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించకుండా, టిడిపి నుంచి వైకాపాలోకి వచ్చిన చెంగల వెంకటరావుకు కట్టబెట్టారు. జిల్లాలో ఉన్న ఏకైక వైకాపా ఎమ్మెల్యే బాబూరావు. సాధారణంగా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లుగా ఉన్న వారికే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్‌లు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే పాయకరావుపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు తిరిగి టిక్కెట్ ఇస్తారా? ఇవ్వరా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే బాబూరావుకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. మరోపక్క టిడిపి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చెంగలను వైకాపా అధిష్ఠానం ఏరి కోరి పార్టీలోకి తీసుకుంది. అందువలనే ఆయనకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించింది. మరి ఈ ఇన్‌చార్జ్‌ల నియామకంలో ఎంపి సబ్బం హరి వర్గానికి స్థానం కల్పించలేదనే వాదన పార్టీలో వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రకటించిన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల విషయంలో వైకాపా అధిష్ఠానం ఆచి తూచి అడుగు వేసినట్టు తెలుస్తోంది. అరకు ఎంపిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కిశోర్ చంద్రదేవ్ వ్యవహరిస్తున్నారు. ఆయనను ఢీకొనేందుకు విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణరంగారావు సోదరుడు, బొబ్బిలి మున్సిపల్ మాజీ చైర్మన్ బేబీ నాయనకు అప్పగించడం గమనార్హం.
ఇక మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చాలా కాలంగా యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మునగపాక మండలంలో ఆయనకు మంచి పట్టు ఉంది. అది యలమంచిలి నియోజకవర్గంలో ఉన్నందున అక్కడి నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కొణతాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అనకాపల్లి నియోజకవర్గానికి కొణతాలను ఇన్‌చార్జ్‌గా నియమించింది పార్టీ అధిష్ఠానం. దీనిపై కొణతాల ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి కోలా గురువులును జగనే స్వయంగా పార్టీలోకి తీసుకున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిని చవిచూసినందున, మత్స్యకారుల్లో ఆయనకు పట్టు ఉన్నందువలన జగన్ గురువులుకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇక వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్, గండి బాబ్జి, నాగిరెడ్డికి ఆయా నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో వేరొకరి పేరును పరిశీలించకుండానే వీరికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించింది.
కాగా, పార్లమెంట్ నియోజకవర్గాలకు నియమించిన ఇన్‌చార్జ్‌లు కేవలం పార్టీ వ్యవహారాలు చూడ్డం వరకే ప్రస్తుతానికి పరిమితం అవుతారని తెలిసింది.
సమాచార హక్కు చట్టం
దేవాదాయ శాఖకు వర్తింపజేయాల్సిందే
* నేడు కేబినెట్‌లో సింహాచలం భూసమస్యపై చర్చ
* దేవాదాయ శాఖ మంత్రి శ్రీరామచంద్రయ్య
సింహాచలం, మార్చి 6: సమాచార హక్కు చట్టం దేవాదాయ శాఖకు వర్తింపజేయాల్సిందేనని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీరామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. స.హ. చట్టం దేవాదాయ శాఖకు వర్తించదని వినిపిస్తున్న వాదన నేపధ్యంలో ఈ విషయంపై విలేఖరులు మంత్రిని ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. న్యాయ స్థానం ఆదేశాల నేపధ్యంలో ఈ వ్యవహారంపై కొంత వివాదం ఉందని, అయితే తన వ్యక్తగత అభిప్రాయం మాత్రం దేవాదాయ శాఖ కూడా సమాచారం హక్కు చట్టం పరధిలోకి రావలసిందేనని ఆయన అన్నారు. బుధవారం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దర్శనార్థం వచ్చన మంత్రి విలేఖరులతో మాట్లాడారు. దేవాలయాలకు చెందిన ఆస్తులు దాతలు భక్తుల నుండి వచ్చినవేనని వీటిపై సమాచారం తెలుసుకోవలసిన అవసరం అందరికీ ఉంటుందని మంత్రి చెప్పారు. సింహాచలం దేవస్థానం భూసమస్యకు సంబంధించి జోనల్ సమావేశంలో చర్చించడం జరిగిందని గురువారం జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో కూడా చర్చించనున్నట్లు మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేవస్థానాలలో ఎన్‌ఎంఆర్ ఉద్యోగుల పర్మినెంట్ వ్యవహారానికి సంబంధించి క్యాడర్ స్ట్రంగ్త్ నిర్ణయించిన దానిపై తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. దేవస్థానం ఉద్యోగుల సమస్యలపై సంఘం కార్యదర్శి శ్రీహరిరాజు మంత్రికి నివేదించారు. వివరాలను తనకు పంపించాలని పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
విద్యావ్యవస్థ పట్ల దృక్ఫధం మారాలి
పెందుర్తి, మార్చి 6: తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాల దృక్ఫధం మారాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. పెందుర్తిలో లిటిల్ ఫ్లవర్స్ పబ్లిక్ స్కూల్ 22వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. దీనికి ముఖ్యఅతిధిగా హాజరైన ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ చదువంటే కంఠస్థం చేయడం, మార్కులు గ్రేడులుగా తయారైందన్నారు. దీని వల్ల సమాజంలో సమతుల్యం దెబ్బ తిని, మనుషుల్లో నిరంకుశ లక్షణాలు అలవడుతున్నాయని అన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత లోపిస్తుందన్నారు. పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల్లో విలువలు, సృజనాత్మకత పెరిగే విధంగా బోధన చేయాలని సూచించారు.
దివ్యక్షేత్రం పనులతో దేవాదాయ అధికారుల చెలగాటం
సింహాచలం, మార్చి 6: సింహాచలం దివ్యక్షేత్రం అభివృద్ధి పనులతో రాష్ట్ర దేవాదాయశాఖ ఉన్నతాధికారులు చెలగాటమాడుతున్నారు. నిర్ధిష్టమైన ప్రణాళికలు రూపొందించుకోకుండా ఇష్టారాజ్యంగా పనులు చేస్తూ కట్టిన వాటినే కొడుతూ చేసిన పనులను మధ్యలో నిలిపివేస్తూ మళ్లీ మరో ప్రణాళిక రూపొందిస్తూ లక్షలాది రూపాయలు వృధా చేస్తున్నారు. దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దమని ప్రభుత్వం జిఓ వచ్చి పుష్కరకాలం దాటుతున్నా నేటికీ అధికారికమైన మాస్టర్ ప్లాన్ రూపొందించకపోవడం అధికారుల అలసత్వాన్ని రుజువు చేస్తోంది. దివ్యక్షేత్రం పేరుతో ఇప్పటివరకూ కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా దేవస్థానం ఆశించిన రీతిలో భక్తులకు సౌకర్యాలు కల్పించలేకపోయింది. ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు అధికారులు ఇష్టానుసారం జరుగుతున్నాయి. మాస్టర్‌ప్లాన్ పేరుతో అధికారులు మారినప్పుడల్లా సరికొత్త ప్రణాళికలు తెరపైకి తెస్తున్నారు. ఒక అధికారి వచ్చి కొన్ని పనులు ప్రతిపాదిస్తారు. ఆయన బదిలీ అయి వేరే అదికారి వచ్చినప్పుడు ఎవరయ్యా ఈ పనులు చెయ్యమన్నారంటూ మరో ప్రతిపాదన ప్రవేశపెడుతున్నారు. దీంతో అంతవరకు సాగిన పనులు అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారు. ఇలా దేవస్థానంలో లక్షలాది రూపాయల ఖర్చుతో జరిగిన పనులు ఏటూ కాకుండా పోయాయి. తాజాగా దేవాదాయశాఖ జీఫ్ ఇంజనీర్ బృందం గురువారం సింహగిరిపై పర్యటించి ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. ఈ క్రమంలోనే కొత్త ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం గాలిగోపురం పక్కన నిర్మాణంలో ఉన్న రథం షెడ్డు పనులను నిలిపివేయాలని సూచించారు. సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి కొద్దికాలం ముందే వాడుకలోకి తీసుకవచ్చిన ప్రసాదాల కౌంటర్లను సైతం మార్పు చేయాల్సిందేనని చీఫ్ ఇంజనీర్ చెప్పారు. న్యూకాంప్లెక్స్ నిర్మాణం ఎక్కడ చేపట్టాలన్న దానిపై కూడా అధికారులు ఇప్పటివరకు ఖచ్చితమైన నిర్ణయానికి రాలేదు. కేశఖండనశాల, పిఎసి భవనం దిగువ భాగంలో నిర్మించాలని ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం అక్కడ ఉడా సహకారంతో రోడ్డు పనులు జరుగుతున్నాయి. వీటిని నిలిపి చేయాలని అదికారులను నిర్ణయించారు. గోకులం నిర్మాణం పనులను కూడా కమిషనర్ తొలుత నిలిపి వేయించి మళ్ళీ పునః ప్రారంభింపజేశారు. సింహగిరిపై అత్యంత ప్రధానమైన రహదారుల నిర్మాణం మాత్రం రెండేళ్ళు గడుస్తున్నా పూర్తి కాలేదు. ఈ పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో దేవస్థానానికి అరకోటి రూపాయలపైనే అదనంగా భారం పడింది. ఆలయం ఎదురుగా నిర్మించిన నృసింహమండపం కూడా ఎందుకు ఉపయోగం లేకుండా పోయింది. రెండున్నర కోట్ల రూపాయల పైన ఖర్చు చేసిన ఈ మండపం అలంకారప్రాయమై పోయింది. ఈ నిర్మాణంపై 2008లోనే అప్పటి ఇఓగా ఉన్న రామచంద్రమోహన్ వ్యతిరేకించిన దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్ల పుణ్యమా అని పూర్తయిపోయింది. ప్రస్తుతం దేవదాయశాఖ ఉన్నత ఇంజనీర్ల వద్ద రామచంద్రమోహన్ మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు.