విజయనగరం (్ఫర్టు), మార్చి 6: గ్రామస్థాయిలో ఈనెల 12వ తేదీ నుంచి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులు విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ మినీకానె్ఫరెన్స్ హాలులో పలుశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో భూ పంపిణీకి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. దీనిలోభాగంగా ఏడోవిడత భూ పంపిణీ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడతామన్నారు. ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశామన్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీలో అగ్రభాగం కల్పిస్తామన్నారు. ఏడో విడత భూ పంపిణీ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీలు ఉన్న ప్రాంతాల్లో అర్హులైన వారందరికీ పంపిణీ చేస్తామన్నారు. గతంలో పంపిణీ చేసిన భూములకు సంబంధించి సాగులో ఉన్నాయో లేవో తదితర అంశాలను కూడా పరిశీలించడం జరుగుతోందన్నారు. ఆర్థిక సంవత్సరం గడువుమరికొద్దిరోజుల్లో ముగిస్తున్నందున అభివృద్ధిపనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీపథకం, గ్రామీణ నీటి సరఫరా విభాగం, గృహనిర్మాణశాఖ, మున్సిపాలిటీ, పశుసంవర్థకశాఖ తదితర శాఖల పనితీరుపై సమీక్షించారు. ఉపాధి హామీ పథకం 30శాతం మెటీరియల్ కాంపొనెంట్ నిధులను తక్షణమే ఖర్చు చేయాలని డుమా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీరాములునాయుడును మంత్రి బొత్స ఆదేశించారు. రానున్న వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంచినీటి ఎద్దడి నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, జాయింట్‌కలెక్టర్ పి.ఎ.శోభ, పాల్గొన్నారు.
‘గ్రీవెన్స్’లో
వినతులపై15 రోజుల్లో చర్యలు: కలెక్టర్
విజయనగరం(పోర్టు), మార్చి 6 : సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చిన వినతులపై 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆదేశించారు. ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. బుధవారం సాయంత్రం కలక్టరేట్ ఆడిటోరియంలో గ్రీవెన్స్ సెల్ ఫిర్యాదులపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని శాఖల అధికారులకు సంబంధించి వివిధ సమస్యలపై 25,338 దరఖాస్తులు రాగా ఇంకా 5,364 సమస్యలను పరిష్కరించ వలసి ఉందని తెలిపారు. గ్రీవెన్స్ సెల్ ఫిర్యాదులపై ప్రతి వారం అధికారులు సమీక్షించుకోవాలని ఆదేశించారు. మండలాల వారీగా ఎన్ని సమస్యలు పరిష్కరించ వలసి ఉందో సమీక్షిస్తూ ఉండాలని తెలియచేశారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఎ పిడి జ్యోతి, వ్యవసాయ శాఖ జెడి లీలావతి, వయోజనవిద్య డిడి అమ్మాజీరావు, సిపిఓ మోహనరావు, మున్సిపల్ కమిషనర్ గోవిందస్వామి, బిసి సంక్షేమాధికారి నాగేశ్వరరావు, బిసి కార్పొరేషన్ ఎడి శోభ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
విజయనగరం (్ఫర్టు), మార్చి 6: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 67 కేంద్రాల్లో పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించారు. మొదటి సంవత్సరానికి చెందిన 24, 687 మందికిగాను 23,487మంది పరీక్షలకు హాజరయ్యారు. 1200 మంది పరీక్షలకు హాజరు కాలేదని ఇంటర్మీడియట్ అధికారులు తెలిపారు. మొదటిరోజున తెలుగు, జనరల్ ఫౌండేషన్ కోర్సులకు చెందిన పరీక్షలు జరిగాయి. అయితే పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాల్లో అసౌకర్యాలు మాత్రం యథావిధిగానే ఉన్నాయి. చాలాచోట్ల వరండాల్లోను, నేలపై విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. పరీక్షల్లో ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలోను పోలీసు బందోబస్తు పూర్తిస్థాయిలో కల్పించారు. 144 నిషేధాజ్ఞలు అమలు చేశారు. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలుగు, జనరల్ ఫౌండేషన్ కోర్సులకు సంబంబంధించిన పరీక్షలు జరగనున్నాయి.
గంట్యాడలో...
గంట్యాడ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు మండలంలో బుధవారం ప్రశాంత వాతావరణంలో మొదలయ్యాయి. గంట్యాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో బుధవారం నాటి పరీక్షకు 181 మంది విద్యార్ధులకు 177 మంది హాజరయ్యారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
‘కార్మికులకు పరిహారం చెల్లింపునకు నిధులు మంజూరు’
బొబ్బిలి, మార్చి 6: కార్మికులకు వివిధ పథకాల ద్వారా అందించేందుకు సుమారు 20లక్షల రూపాయలు మంజూరైనట్లు కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎస్‌డివి ప్రసాదరావు తెలిపారు. స్థానిక కార్మికశాఖ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికశాఖ ద్వారా కార్మికులకు వివిధ రకాలైన పథకాలను అందిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలలో ఈ ఏడాది 147మంది కార్మికులకు 20లక్షల రూపాయల పరిహారం అందించేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందులో ఇద్దరు వికలాంగ కార్మికులకు, 60మందికి ప్రసూతి సాయం, 44మందికి వివాహానికి ఆర్థిక సహాయం, 41మంది సాధారణ మరణాలకు ఈ మొత్తాన్ని కేటాయించామన్నారు. ఇంతవరకు జిల్లాలలో 477మంది కార్మికులకు 81లక్షల 80వేలరూపాయలు అందించామన్నారు. భవన నిర్మాణ కార్మికులంతా తప్పనిసరిగా తమ పేర్లును రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.
ప్రమాదానికి గురైన నెలరోజులలోపు ఆయా కార్యాలయాలకు తెలియజేయాలని కోరారు. బొబ్బిలి, రామభద్రపురం, బలిజిపేట, తెర్లాం మండలాల కార్మికులు బొబ్బిలిశాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈయనతోపాటు కార్మికశాఖ అధికారి సుజాత, తదితరులు పాల్గొన్నారు.
అంతర్‌జిల్లా దొంగ అరెస్టు
విజయనగరం (కంటోనె్మంట్), మార్చి 6: విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో వివిధ దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లాల నేరస్థుడు విశాఖ జిల్లా నర్సీపట్నానికి చెందిన కుంభా రాజేష్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ కార్తికేయ తెలిపారు. ఎస్పీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సెల్‌ఫోన్ ఆధారంగా కొత్తవలస మండలం మంగళపాలెం సమీపంలో నిందితుడు రాజేష్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడు జిల్లాలో భోగపురం, గంట్యాడ, బొండపల్లి మండలాల్లో వివిధ మద్యం దుకాణాల్లో సుమారు 5 లక్షల రూపాయల విలువైన మద్యం సీసాలను అపహరించినట్లు తెలిపారు. నిందితునిపై జిల్లాలో 5 కేసులు నమోదు కాబడినట్లు చెప్పారు. నిందితుని వద్ద నుంచి 2.9 లక్షల రూపాయల విలువైన ప్రాపర్టీని స్వాధీన పరుచుకుని, నిందితుడ్ని రిమాండ్‌కు తరలించిట్లు చెప్పారు. అలాగే శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో మరో అయిదు కేసుల నమోదు కాబడ్డాయన్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకోవడంలో చొరవ చూపిన సిసిఎస్ సిఐ ఎ.వి రమణ, కొత్తవలస సిఐ జె.మురళీ, సిసిఎస్ సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ టి.మోహనరావు తదితరలు పాల్గొన్నారు.
‘సహకార సంఘ పాలకవర గసభ్యులకు విధులపై శిక్షణ’
పార్వతీపురం, మార్చి 6: ఇటీవల ఎన్నికైన ప్రాథమిక సహకార సంఘాల పాలక వర్గ సభ్యులకు వారికున్న అధికారాలు, విధులపై ఈ నెల 8 నుంచి 20వ తేదీ వరకు అవగాహన కల్పిస్తామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్‌పర్సన్ మరిశర్ల తులసి తెలిపారు. బుధవారం ఇక్కడి విలేఖరులతో మాట్లాడుతూ ఐసిడిపి ఆధ్వర్యంలో నిర్వహించే అవగాహన శిక్షణలో భాగంగా ఈనెల 8వ తేదీన పార్వతీపురంలోని లయన్స్ కల్యాణ మండపంలోను, 11న సీతానగరం మండల కేంద్రంలోను ఆయా ప్రాంతాల ప్రతినిధులకు అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. మిగిలిన తేదీలను కూడా ఖరారు చేసి సభ్యులకు సమాచారం తెలియజేస్తామని చెప్పారు. పాలక వర్గసమావేశాలు నిర్వహించే విధానాలు వాటి ఆవశ్యతతో పాటు సంఘంలో నూతనంగా సభ్యులను చేర్చుకునే విధానంపై వివరించామని తెలిపారు. నిధుల సేకరణతో పాటు వివిధ సేవలను సభ్యులకు అందించే విధానం, రుణాల వసూళ్లు, బకాయిదారులపై చట్టపరంగా చేపట్టాల్సిన చర్యలు, పుస్తకాల నిర్వహణపై అవగాహన కల్పిస్తామని డిసిసిబి చైర్‌పర్సన్ తెలిపారు. రైతులు, అనుబంధ వృత్తుల వారికి సంఘాల ద్వారా విస్తృత సేవలు అందించడానికి, వ్యాపారాభివృద్ధి ప్రణాళికలపై కూడా సలహాలు ఇస్తారన్నారు.
‘రూ. కోటి సెస్ వసూలు లక్ష్యం’
బొండపల్లి, మార్చి 6 : జిల్లా గ్రంథాలయ సంస్థకు రానున్న ఆర్ధిక సంవత్సరంలో కోటి రూపాయలు ఆదాయం సమకూర్చడానికి లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆసంస్థ చైర్మన్ రొంగలి పోతన్న చెప్పారు. బుధవారం స్థానిక గ్రంథాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ గ్రంథాలయాల నిర్వహణ ఖర్చు పెరుగుతున్నందున స్థానిక సంస్థల నుండి గ్రంథాలయ సంస్థకు సెస్‌లు పెంచనున్నట్లు చెప్పారు. పార్వతీపురం, బొబ్బిలి, పూసపాటిరేగ, గాజులరేగ గ్రంథాలయాల్లో ఇంటర్‌నెట్ సదుపాయం సమకూర్చనున్నట్లు చెప్పారు. గ్రంథాలయాలకు అవసరమైన పుస్తకాలు 20 లక్షల ఖర్చుతో కొనుగోలు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించామన్నారు. ఐదు లక్షల రూపాయలతో ఫర్నీచర్ కొనుగోలు చేయడానికి నిర్ణయించామన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో కొత్తగా 20 పుస్తక పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే జిల్లా గ్రంథాలయ సంస్థ గ్రామీణ ప్రాంతాలు, సబ్ జైళ్లు, జెడ్‌పి హైస్కూలల్లో 99 పుస్తక పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. విజయనగరంలో మరో రెండు శాఖా గ్రంథాలయాలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.కుమార్‌రాజా, గ్రంధాలయ అధికారి నాగేశ్వరరావు పాల్గొన్నారు.‘ఆర్థిక స్వావలంబన సాధించాలి’
పార్వతీపురం, మార్చి 6: మహిళలు టైలరింగ్‌లో వృత్తి నైపుణ్యాన్ని సాధించుకుని ఆర్థిక స్వావలంబన సాధించుకోవాలని పార్వతీపురం రూరల్ ఎస్‌ఐ డి దీనబంధు కోరారు. బుధవారం పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లిలో అమ్మఒడి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికస్వావలంబన సాధించినపుడే వారి కుటుంబానికి ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. అందువల్ల ఉచితంగా ఏర్పాటు చేసిన ఈ కుట్టుశిక్షణ కేంద్రంలో పాల్గొన్న మహిళలు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అయితే ఈ ఉచిత శిక్షణకు అవసరమయ్యే రూ.1000 విలువ చేసే మెటీరియల్ కొనుగోలు చేసి ఇస్తానని పేర్కొన్నారు. పార్వతీపురం ఐటిడిఎ జిసిడివో రెడ్డి పద్మావతి మాట్లాడుతూ మహిళలకు ఏర్పాటు చేసిన ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. అందువల్ల ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఒడి సంస్థ డైరక్టర్ తీళ్ల గౌరీశంకరరావు మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు ఇస్తున్న ఉచిత శిక్షణ వినియోగించుకోవాలన్నారు. ఇందుకు అవసరమయ్యే వసతి, మెటీరియల్, కుట్టుమిషన్లు అమ్మ ఒడి సంస్థ స్వంత నిధులతో సమకూర్చుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎఎంఒ చొక్కాపుశ్రీనివాసరావు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ తీసుకున్న చొరవకు ఆసరాగా శిక్షణ కోసం వినియోగించే ఒకనెల ఇంటి అద్దెను తను వంతు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి యాండ్రాపుచినరామినాయుడు, గ్రామపెద్దలు యాండ్రాపుశ్రీరాములు, చందాన శివాజీనాయుడు, మరడాన నాగభూషణతోపాటు గ్రామైక్య సంఘ అధ్యక్షులు చందాన భవాని, బొమ్మిలక్ష్మిలు పాల్గొన్నారు. టైలరింగ్ శిక్షకురాలు గౌరీశ్వరి, సఖిటైలర్సులు పాల్గొన్నారు.
‘వంగర గ్రామానికి
బస్సు సౌకర్యం పునరుద్ధరించాలి’
జియ్యమ్మవలస, మార్చి 6: గుమ్మలక్ష్మీపురం మండలం వంగర గిరిజన గ్రామానికి ఆర్టీసి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కురుపాం ఎమ్మెల్యే జనార్దన థాట్రాజ్ పార్వతీపురం ఆర్టీసి డిపో మేనేజర్ ఎన్‌విఎస్ వేణుగోపాల్‌ను కోరారు. బుధవారం డిపో మేనేజర్ చినమేరంగి గ్రామంలో గల శతృచర్ల కోటలో ఎమ్మెల్యే థాట్రాజ్‌ను కలిశారు. ఈ సందర్భంగా కురుపాం నియోజకవర్గం పరిధిలో ఆర్టీసీ బస్సుల సమస్యలపై మేనేజర్‌తో ఆయన చర్చించారు. ముఖ్యంగా పార్వతీపురం నుంచి చినమేరంగి గ్రామం మీదుగా గుమ్మలక్ష్మీపురానికి బస్సు వేయాలని కోరారు. కెమిశిల గిరిజన గ్రామానికి నూతనంగా తారు రోడ్డు నిర్మాణం జరిగిందని, ఈ గ్రామానికి కూడా బస్సు వేయాలని కోరారు.
గుంపు పుణ్యక్షేత్రానికి
15 ప్రత్యేక బస్సులు
మహాశివరాత్రి సందర్భంగా గుంప పుణ్యక్షేత్రానికి 15 ప్రత్యేక బస్సులను వేశామని పార్వతీపురం ఆర్టీసి డిపో మేనేజర్ ఎన్‌విఎస్ వేణుగోపాల్ తెలిపారు. పార్వతీపురం నుంచి గుంప పుణ్యక్షేత్రానికి 15 రూపాయల టిక్కెట్ ఉంటుందన్నారు. 3ముందడుగు2 కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం ఆర్టీసీ డిపో పరిధిలో కండక్టర్లకు, డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. డిపో పరిధిలో 9 మంది మహిళా కండక్టర్లకు 3నవరత్నాలు2 పేరుతో సన్మానిస్తామని చెప్పారు. డిపో పరిధిలో 52మంది మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారన్నారు. వీరిలో కండక్టర్ సర్వీసు ఎక్కువ చేసిన వాళ్లకు గుర్తించామని చెప్పారు. డిపో మేనేజర్‌తోపాటు సిబ్బంది సంగమేష్ పాల్గొన్నారు.