జనంలో ఇమేజ్ ఉన్నా...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో సంస్థాగతంగా సున్నాగా మారింది. ఇటువంటి పరిస్థితులను చక్కదిద్దాలన్న సంకల్పంతో హైకమాండ్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించి జాబితాను విడుదల చేసింది.అయితే ఈ అంశంపై పార్టీలో అంతర్గతంగా దుమారం రేగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశయసాధనే లక్ష్యంగా జగన్‌కు అండగా నిలవాలన్న లక్ష్యంతో ఆదినుంచి కాయకష్టం చేసి జెండా మోసిన నేతలకు సమన్వయకర్తల జాబితాలో చోటుకల్పించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలుపార్టీలు మారి పదవుల కోసం జగన్ గూటికి చేరిన నాయకులకు అందలం ఎక్కించేలా సమన్వయకర్తల బాధ్యతలను అప్పగించారంటూ వై.ఎస్ అభిమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలోని పది నియోజకవర్గాలకు గాను తొమ్మిదింటికే పార్టీ సమన్వయకర్తలను నియమించిన అధిష్ఠానం శ్రీకాకుళం, ఆమదాలవలస, పాలకొండ నియోజకవర్గాలకు ఇద్దరేసి వంతున బాధ్యతలు అప్పగించడం గ్రూపులను ప్రోత్సహించేలా ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. అయితే సమన్వయకర్తలే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులని చాపకిందనీరులా ప్రచారం ఊపందుకోవడంతో గత కొన్నాళ్లుగా పార్టీని నమ్ముకుని జేబులకు చిల్లులుపడిన నేతలంతా ఒకింత నిరాశకు లోనవుతున్నారు. ఇటీవలే ఆ పార్టీ చెంతకు చేరిన టిడిపి ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌కు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించి ఎం.వి.కృష్ణారావును విస్మరించడం పట్ల కేడర్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో వర్గాలకు దిగిన వజ్జ బాబూరావుకు పలాస నియోజకవర్గం బాధ్యతలను అప్పగించి కణితి విశ్వనాధం వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదన్న బాధ అక్కడ నేతల్లో లేకపోలేదు. టెక్కలి నియోజకవర్గం విషయానికొస్తే..తొలుత నుంచి కోత మురళీ, మరికొంతమంది నాయకులు వైఎస్సార్‌సీపీలో సేవలందిస్తున్నప్పటికీ కొత్తగా వచ్చిన దువ్వాడ శ్రీనివాస్‌ను సమన్వయకర్తగా నియమించడం వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన వై.వి.సూర్యనారాయణ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదన్న విమర్శలున్నాయి. ఆదినుంచి వరుదు కల్యాణి ఈ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే కల్యాణికి బాధ్యతలు అప్పగించడం కేడర్ సంతృప్తివ్యక్తం చేస్తున్నా వై.వి.సూర్యనారాయణకు అదే బాధ్యతలు కట్టబెట్టడం సరికాదంటూ ఆ పార్టీలో చర్చ వాడివేడిగా సాగుతోంది. ఆమదాలవలస నియోజకవర్గంలో సీనియర్ పార్లమెంటేరియన్ దివంగత బొడ్డేపల్లి రాజగోపాలరావు కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలు వీడి వైఎస్సార్‌సీపీ చెంత చేరిన బొడ్డేపల్లి మాధురికి సమన్వయకర్తగా నియమించారు. అయితే కిల్లి రామ్మోహనరావుకు అదే నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించడం అలాగే బొడ్డేపల్లి పద్మజ, కూన మంగమ్మ వంటి ఆశావహులకు చుక్కెదురవ్వడం వారి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే మాదిరిగా పాలకొండ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే మినతి గుమాంగో, కళావతిలను సమన్వయకర్తలుగా నియమించడాన్ని కూడాకేడర్ తప్పుపడుతోంది. రాజాం నుంచి పి.ఎం.జె.బాబును సమన్వయకర్తగా నియమించడం అక్కడ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తవౌతున్నాయి. ఎచ్చెర్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ సభ్యుడు గొర్లె హరిబాబునాయుడు వంటి సీనియర్ నాయకున్ని కాదని, కిరణ్‌కుమార్‌కు నియోజకవర్గస్థాయి బాధ్యతలను అప్పగించడం సరికాదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎప్పటినుంచో ఆ పార్టీని నమ్ముకుని ఉన్న మాజీ ఎంపిపిలు బల్లాడ జనార్ధనరెడ్డి, బల్లాడ హేమమాలినిరెడ్డిలకు సముచిత స్థానం అధిష్టానం కల్పించలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా పాతపట్నం నియోజకవర్గానికి తానే ఇన్‌చార్జినంటూ కొమరాపు తిరుపతిరావు ప్రచారం సాగించడం..కాదు..కాదు నాదే బి-్ఫరమంటూ మాజీ జెడ్పీచైర్మన్ పాలవలస వారసుడు విక్రాంత్ కార్యాలయాన్ని ఆరంభించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలి కలమట తండ్రీతనయులు వైఎస్సార్‌సీపీ కండువా వేసుకోవడంతో ఇక్కడ ఎవరికి బాధ్యతలు అప్పగించాలని సందిగ్ధంలో హైకమాండ్ పడింది.
జనంలో ఇమేజ్ ఉన్నా...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో సంస్థాగతంగా సున్నాగా మారింది.
english title:
y
Date:
Thursday, March 7, 2013