ఒంగోలు, మార్చి 6: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది నుండి 12 గంటల వరకు ఈ పరీక్షలు జరిగాయి. జిల్లాలో మొదటి సంవత్సరానికి 24,826 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 23,408 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఒకేషనల్ పరీక్షకు 1816 మంది విద్యార్థులు హాజరుకావల్సి ఉండగా 1303 మంది హాజరయ్యారు. తెలుగు పరీక్ష కావడంతో మాల్‌ప్రాక్టీస్ కేసులు ఏమీ నమోదు కాలేదు. ఇదిలావుండగా జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ ఒంగోలు నగరంలోని సెయింట్ జేవియర్స్, ప్రతిభా, హెచ్‌సిఎం పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అదేవిధంగా 66 సెంటర్లలో స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు. ఇదిలాఉండగా పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్‌పి కొల్లి రఘురామిరెడ్డి బందోబస్తు ఏర్పాటుచేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలుచేశారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూయించివేశారు. మొత్తంమీద తొలిరోజు జరిగిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
ఆధార్ కేంద్రంలో ప్రజల
పడిగాపులు
* దరఖాస్తుల కేంద్రం వద్ద తోపులాట
ఒంగోలు అర్బన్, మార్చి 6: నగరంలోని కలెక్టరేట్, నగరపాలక సంస్థ, తహశీల్దార్ కార్యాలయం, పివిఆర్ బాలుర స్కూల్, బాపూజీ మార్కెట్ సముదాయం ప్రాంతంలో బుధవారం నుండి ఆధార్ కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించినప్పటికి మిగతా నాలుగుచోట్ల బుధవారం ప్రారంభం కాలేదు. కేవలం తహశీల్దార్ కార్యాలయంలో మాత్రమే ఆధార్ సెంటర్ ప్రారంభం కావడంతో నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతోపాటు నగర ప్రజలు వందల సంఖ్యలో తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం ఆవరణలోని విలేజ్ రెవెన్యూ అధికారుల కార్యాలయం వద్ద ప్రజలకు ఆధార్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు ఇవ్వడం మొదలుపెట్టారు. వందల సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకోవడంతో దరఖాస్తుల కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట ప్రారంభమైంది. పోలీసులు రంగప్రవేశం చేసి ప్రజలను క్యూలో ఉంచేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పోలీసులు కూడా మఫ్టీలో రావడంతో ప్రజలకు పోలీసులెవరో అర్థంకాక పోలీసులను కూడా పక్కకు నెట్టారు. పరిస్థితి చేయిదాటిపోతుందని గమనించిన పోలీసులు పూర్తిస్థాయిలో ప్రజలను క్యూలో నిలుచోబెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయడంతో సమస్య సద్దుమణిగింది. అయితే నగరంలో ఒకే సెంటర్‌ను ప్రారంభించడంతో ప్రజలకు ఈ అవస్థలు ఏర్పడ్డాయి. గురువారం నుండైన నగరంలో మిగిలిన ఆధార్ కేంద్రాలను ప్రారంభించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అనధికార విద్యుత్ కోతలు
ఎండుతున్న పంటలు * అల్లాడుతున్న ప్రజలు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, మార్చి 6: జిల్లాలో అనధికార విద్యుత్ కోతలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాకు 7 లక్షల 50 వేల మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా కావల్సి ఉండగా కేవలం 5.50 లక్షల యూనిట్లు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. దీంతో ట్రాన్స్‌కో అధికారులు అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రాత్రివేళల్లో రైతాంగానికి 7 గంటలపాటు నిరాటంకంగా విద్యుత్‌ను సరఫరా చేయాల్సిన అధికారులు 4 నుండి 5 గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఈవిధంగా సరఫరా చేసే విద్యుత్ కూడా 3 నుండి నాలుగుసార్లు సరఫరా చేస్తుండటంతో రైతులు పొలాల్లోనే జాగరణ చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. వేసవి రాకముందే ఎండలు మండిపోతుండటంతో నీరు చాలక పంటలు ఎండుముఖం పట్టాయి. కొత్తపట్నం మండలంలో తమలపాకుల తోటలు వాడుముఖం పట్టాయి. దీనితో అరటి, ఆకుతోటలు సాగు చేసిన రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా వేరుశనగ పంట కాపుకొస్తుండడంతో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా పట్టణాలు, మండలాలు, గ్రామాలనే తేడా లేకుండా అనధికారికంగా విద్యుత్‌కోతలు విధిస్తున్నారు.ప్రధానంగా గ్రామాలలో పగటిపూట విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు చెప్పనలవి కాదు. విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో గ్రామాలలో విద్యుత్ సరఫరా లేక చదువుకొనేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో పెద్ద పరిశ్రమలకు టాటా, రిలయన్స్, ల్యాంకో సంస్థల నుండి విద్యుత్ 24 గంటలపాటు సరఫరా అవుతోంది. దీనికితోడు ప్రైవేటుగా పెద్ద పరిశ్రమలకు ప్రభుత్వ విద్యుత్ వైర్ల నుండి విద్యుత్ సరఫరా అవుతుండటంతో చిన్న పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ల నుండి ప్రైవేటుగా విద్యుత్‌ను సరఫరా చేస్తుంటే అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. చిన్నతరహా పరిశ్రమలకు ఆ సదుపాయాలు లేకపోవడంతో యజమానుల అవస్థలు వర్ణనాతీతం. ఇదేవిధంగా కొనసాగితే చిన్నతరహా పరిశ్రమలు మూతవేయక తప్పదని పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల సాగుకు విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. దీంతో రొయ్య రైతులపై ఆర్థికభారం పెరగనుంది.
త్వరలో ఇన్‌చార్జుల నియామకం
* జగన్‌ను కలసిన సుబ్బారెడ్డి, బాలినేని
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, మార్చి 6: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం రాష్ట్ర పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డిలు చంచల్‌గూడ జైలులో కలిశారు. ఉదయం పది నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు వారి ముగ్గురు జిల్లా రాజకీయాలపై చర్చించినట్లు పార్టీవర్గాల సమాచారం. ఈసమావేశంలో త్వరలో జిల్లాలోని 12 నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్‌చార్జులే రానున్న ఎన్నికల్లో కీలకం కానున్నారు. వారికే టిక్కెట్లు కూడా వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఇన్‌చార్జి పదవికోసం ఈపాటికే కొంతమంది నేతలు పావులు కదుపుతున్నారు. ఒంగోలు, వై పాలెం తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ఈపాటికే అద్దంకి నియోజకవర్గంలో రాజకీయ దుమారం రేగింది. ఈ విషయాలన్నింటిపై జగన్ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
వైభవంగా వెంకటేశ్వరుని కల్యాణం
గిద్దలూరు, మార్చి 6: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలోని షరాఫ్ బజారులో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామికి వైభవంగా కల్యాణాన్ని నిర్వహించారు. ఈ కల్యాణంలో పలువురు దంపతులు పాల్గొని కల్యాణాన్ని జరిపించారు. రామశాస్ర్తీ కుమారులు అనిల్‌శాస్ర్తీ తదితర రుత్వికులు శ్రీవారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఆలయ ధర్మకర్తల మండలి తీర్ధప్రసాదాలను పంపిణీ చేసింది.
తల్లీ కొడుకుకు జీవితఖైదు
హనుమంతునిపాడు, మార్చి 6 : మండల పరిధిలోని లింగంగుంట్ల గ్రామానికి చెందిన వేపతాటి వెంకటేశ్వర్లు, అతని తల్లి ఆదిలక్షమ్మకు ఒంగోలు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి వెంకటరమణారెడ్డి బుధవారం యావజ్జీవ కారాగార జైలుశిక్ష విధించినట్లు ఎస్సై ఎంఎస్ బేగ్ తెలిపారు. 2011 జులై 18న వెంకటేశ్వర్లు భార్య శివపార్వతిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కేసులో వీరిద్దరికి శిక్ష పడినట్లు ఆయన చెప్పారు. శివపార్వతి న్యాయమూర్తికి ఇచ్చిన మరణవాంగ్మూలం ఆధారంగా విచారణ చేసి బుధవారం తీర్పు వెలువరించారు. యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఐదువేల రూపాయల వంతున జరిమానా విధించినట్లు చెప్పారు. జరిమానా కట్టని పక్షంలో మరో మూడునెలలు జైలు శిక్ష పొడిగించాలని తీర్పునిచ్చినట్లు చెప్పారు. ఈ కేసు సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరిగిందని ఆయన చెప్పారు.
నేలపైనే పరీక్షలు
కనిగిరి, మార్చి 6: ఇంటర్ పరీక్షలు విద్యార్థులు నేలపైనే కూర్చొని రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు బెంచీలు ఏర్పాటు చేయకపోవడంతో నేలపైనే కూర్చొని పరీక్షలు రాశారు. మిగిలినచోట్ల బెంచీలను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక సెంటర్‌గా ప్రకటించిన ఎంఎన్‌ఎం జూనియర్ కళాశాలలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 1404 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 1317మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 89 మంది గైర్హాజరయ్యారు. ఎంఎస్‌ఆర్ జూనియర్ కళాశాల సెంటర్‌లో సహాయకుడు ప్రవీణ్‌తో అంధ విద్యార్థి ఐ ఓంకారం పరీక్ష రాశారు. ఈపరీక్షా కేంద్రాలలో చీఫ్ సూపరింటెండెంట్‌లు కె రాజశేఖర్, ఎస్ సత్యనారాయణ, సయ్యద్ జిలానీబాషా, విద్యాసాగర్, డిఓలు టి సుబ్బారావు, కేతనబోయిన తిరుపతయ్య, ఏ సూర్యనారాయణ, ఎస్‌కె రషీధ్ తదితరులు పరీక్షా కేంద్రాలని డిపార్ట్‌మెంటల్ అధికారులుగా వ్యవహరించారు.
ప్రారంభమైన విద్యుత్ పోరాట సందేశయాత్ర
ఒంగోలు అర్బన్, మార్చి 6: విద్యుత్ చార్జీలను తగ్గించాలని, సర్‌చార్జీలను రద్దు చేయాలని, విద్యుత్ కోతలు నివారించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని 25, 26, 27 వార్డులలో సిపిఎం సత్యనారాయణపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విద్యుత్ పోరాట సందేశయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను సిపిఎం నగర కార్యదర్శి జివి కొండారెడ్డి నల్లజెండా ఎగురవేసి ప్రారంభించారు. సిపిఎం సీనియర్ సభ్యులు వి మాలకొండయ్య జెండా ఊపారు. ఈ సందర్భంగా జివి కొండారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 33,987 కోట్ల రూపాయల విద్యుత్ భారాలను ప్రజలపై మోపిందన్నారు. ప్రజల జీవితంలో విద్యుత్ భాగమై లేకపోతే ఒక్కరోజైనా జీవించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి విద్యుత్ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ద చూపుతుందన్నారు. ప్రైవేటీ కరణ విధానాల మూలంగా 118 ప్రైవేటు సంస్థలకు అనుమతి ఇచ్చిన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరగలేదన్నారు. ప్రభుత్వం వద్ద రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీలు విద్యుత్ ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నాయన్నారు. కొన్ని కంపెనీలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలేదని ఆరోపించారు. అటువంటి కంపెనీల ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎపి జెన్‌కోను బలోపేతం చేసి జెన్‌కోకు ఉన్న బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించి విద్యుత్ ఉత్పత్తిని తయారు చేయాలని డిమాండ్ చేశారు. సర్ చార్జీలను రద్దు చేయాలని, విద్యుత్‌కోతలు వెంటనే ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలను అవలంభించాలని కోరారు. సిపియం జోన్‌కన్వీనర్ జి రమేష్ మాట్లాడుతూ ఇళ్ళులేని పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని, మంచినీటి సరఫరా, వృత్తి దారులకు రాయితీలో కూడిన విద్యుత్‌ను సప్లై చేయాలని, వంద యూనిట్లులోపువారికి సర్ చార్జీలు, పెనాల్టీలు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి 25వ వార్డు సిపిఎం శాఖా కార్యదర్శి పి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నగర కమిటి సభ్యులు కంకణాల రమాదేవి, టి భక్తసింగ్ రాజు, జి బాలకృష్ణ, శాఖా కార్యదర్శులు బి ముసలారెడ్డి, డి వెంకట సుబ్బయ్య, బి నాగరాజకుమారి, దారా వెంకటేశ్వర్లు, సిపిఎం నాయకులు జి వెంకటేశ్వర్లు, బి శ్రీనివాసులు, వేమూరి సుబ్బారావు, ఎ లక్ష్మీనారాయణ, జి ఆదిలక్ష్మి, ఎం శ్రీనివాసులు, టి అంజయ్య, ఎ రమాదేవి, పి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.