కాకినాడ, మార్చి 8: పబ్లిక్ పరీక్షల సీజన్ ప్రారంభం అయ్యిందో లేదో విద్యార్థుల సహనానికి కరెంట్ కోతల రూపంలో మరో పరీక్ష మొదలైంది. అప్రకటిత కరెంట్ కోత విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసినా ఈ కరెంట్ కోత గురించే ప్రతి ఒక్కరు చర్చించుకుంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో కొనసాగుతున్న విద్యుత్ కోతకు డిగ్రీ, ఇంటర్మీడియెట్ విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు లోనవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 6వ తేదీ నుండి ఇంటర్ మొదటి సంవత్సరం అలాగే గురువారం నుండి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అలాగే ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధిలో గల కళాశాలల్లో నాన్ సెమిస్టరైజ్డ్ పరీక్షలు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు అతి కీలకమైనవి కావడంతో ఈ పరీక్షల ఫలితాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనేక ఆశలు పెట్టుకుంటారు. ఇటీవలి కాలంలో విద్యుత్ కోతను వేళాపాళా లేకుండా విధిస్తుండగా కనీసం పరీక్షలకు కొన్ని రోజుల ముందైనా కరెంట్ కోత లేకుండా చూడాలని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేస్తూవచ్చాయి. అయితే విచిత్రంగా పరీక్షలు ప్రారంభమైన ఈనెల 6వ తేదీ నుండి రాత్రి వేళల్లో అప్రకటిత విద్యుత్ కోత విధిస్తుండటంతో యావత్ విద్యార్థి లోకాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేసినట్టయ్యింది. జిల్లా కేంద్రం కాకినాడలో ప్రస్తుతం సాయంత్రం 6.30 గంటల నుండి రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. ఆ తర్వాత రాత్రి ఏ సమయంలో కరెంట్ ఉంటుందో, పోతుందో తెలియని అయోమయ స్థితిలో ప్రజలుంటున్నారు. పుర పాలక సంఘాలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత మరింత దారుణంగా మారింది. విద్యార్థులు ఎక్కువగా పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయాల్లో (రాత్రి వేళల్లో) అప్రకటిత విద్యుత్ కోత విధిస్తూ తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చిలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల విద్యార్థులకే ఈ విధంగా విద్యుత్ సమస్య ఎదురైతే ఈనెల 22 నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన ఆయా వర్గాల నుండి వ్యక్తమవుతోంది.
చిత్రహింస పెడుతున్న రాత్రి విద్యుత్ కోతలు
english title:
power cut
Date:
Saturday, March 9, 2013