కాకినాడ, మార్చి 8: ఇంట్లో ఆర్ధిక అసమానతలు ఉన్నంత కాలం మహిళ ముందుకు సాగలేదని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. శుక్రవారం విధాన గౌతమీ సమావేశ హాలులో జిల్లా స్ర్తి, శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి సంస్ధ ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళ దినోత్సవం కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంట్లో మహిళ తల్లిగా, భార్యగా, చెల్లిగా ఎంతో ప్రేమ, అపాయ్యతలను చూపించి ఆదరిస్తుందని దీనిని మగవారు గుర్తించాలన్నారు. ఆడ, మగ పిల్లలకు ఇంటి నుండే సమాన అవకాశాలు ప్రారంభమైనప్పుడే మహిళ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళలు మంచి స్ఫూర్తితో పనిచేసి అన్ని రంగాల్లో సత్తా చూపిస్తూ అందరికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. ట్రైనీ కలెక్టర్ శే్వత మహంతి మాట్లాడుతూ చదువు, ఉద్యోగంలో ఆడపిల్లలకు తల్లిదండ్రులు పూర్తి సహకారం ఇస్తే మరింత ముందుకు వెళ్ళి విజయాలు సొంతం చేసుకుంటారని చెప్పారు. ఏజెసి బి రామారావు మాట్లాడుతూ సాధికారిక అంటే మహిళల ఉనికిని గుర్తించడమేనని అజ్ఞానం, అవిద్యా సమాజంలో తొలగనంత కాలం మహిళల జాగృతి రాదన్నారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ కామేశ్వరమ్మ అధ్యక్షత వహించగా డిఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మావతి, ఎడిఎంహెచ్‌ఒ డాక్టర్ ఎం పవన్‌కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ కె జయరాజ్, ఆలూరి విజయలక్ష్మి, సిడిపిఓలు, సూపర్‌వైజర్లు , కిషోర బాలికలు తదితరులు హాజరయ్యారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో కలెక్టర్
english title:
economic disparities
Date:
Saturday, March 9, 2013