రాజమండ్రి, మార్చి 8: రైళ్లలో దొంగతనాలను నిరోధించేందుకు ప్రత్యేక బలగాలతో గస్తీని నిర్వహిస్తున్నట్లు రైల్వే ఎస్పీ డాక్టర్ శ్యాంప్రసాద్ వెల్లడించారు. విజయవాడ రైల్వే జిల్లా పరిధిలో 6 ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయుధాలతో ఈదళాలు గస్తీ నిర్వహిస్తాయని, దొంగలు కనిపిస్తే కాల్చివేసే అధికారం కూడా వారికి ఇచ్చామన్నారు. శుక్రవారం జిఆర్‌పి స్టేషన్‌లో నెలవారీ క్రైం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడుతూ ముఖ్యంగా గుంటూరు, విజయవాడ, తెనాలి, చీరాల పరిధిలో ప్రత్యేక బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయన్నారు. గత రెండునెలలుగా ప్రతీ రైలుకు నలుగురు చొప్పున జిఆర్‌పి కానిస్టేబుళ్లను గస్తీ తిప్పుతున్నామన్నారు. ఈవిధానం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. నేరాల రేటు, మృతుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. రైళ్లలో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడే ముఠాలను గుర్తించామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని ఆయన చెప్పారు. హర్యానాకు చెందిన ముఠా ప్రయాణీకుల బ్యాగ్‌లలోని సొత్తును చాకచక్యంగా అపహరిస్తోందన్నారు. ఈముఠా సభ్యులు కొంతమందిని ఇప్పటికే చెన్నై పోలీసులు అరెస్టు చేశారని, వారిని పిటి వారెంట్‌పై తీసుకుని వచ్చి విచారిస్తామన్నారు. ఈముఠా రెండేళ్ల క్రితం విజయవాడ పరిధిలో పలు నేరాలకు పాల్పడిందని ఎస్పీ శ్యామ్‌ప్రసాద్ వివరించారు. సూట్‌కేసులను పగులగొట్టి చోరీలకు పాల్పడే బీహార్ ముఠాను ఇప్పటికే అరెస్టు చేశామన్నారు. ఈవేసవి కాలంలో పూర్తిస్థాయిలో చోరీలు, దొంగతనాల నిరోధానికి గట్టిగా కృషిచేస్తున్నామన్నారు. రాజమండ్రి పరిధిలోని రాజమండ్రి, కాకినాడ, సామర్లకోట, భీమవరంపై ప్రత్యేక దృష్టిని సారించామన్నారు. లగేజీని ఇతరులకు ఇవ్వరాదని విస్తృతస్థాయిలో ప్రచారం కల్పిస్తున్నామన్నారు. రైల్వేస్టేషన్ పరిసరాలు, రైళ్లలోని ఎసి బోగీల్లో కూడా సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని రైల్వేబోర్డుకు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. అనుమానాస్పద వస్తువులు, దొంగల జాడను కనిపెట్టే స్నిఫర్ డాగ్, బాంబుడిస్పోజల్ స్క్వాడ్‌ను కూడా జిఆర్‌పి విభాగానికి సమకూర్చుకునే ప్రయత్నాలో ఉన్నామన్నారు. అర్థరాత్రి, తెల్లవారుజామున రైళ్లను నిలిపివేసి దోపిడీకి పాల్పడి వారిని పట్టుకునేందుకు ప్రత్యేక దృష్టిసారించామన్నారు. ఇందుకోసం తమ సిబ్బందిని అనుమానాస్పద ప్రాంతాల్లో గస్తీ నియమిస్తామన్నారు. ఈసమావేశంలో జిఆర్‌పి డిఎస్పీ ప్రసాద్, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఆయుధాలతో ఆరు ప్రత్యేక దళాల గస్తీ : రైల్వే ఎస్పీ శ్యాంప్రసాద్
english title:
thefts
Date:
Saturday, March 9, 2013