Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మహాశివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు

$
0
0

రాజమండ్రి, మార్చి 8: మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు చెప్పారు. శుక్రవారం ఆంధ్రభూమి ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని దాదాపు అన్ని శైవక్షేత్రాల్లోని ఏర్పాట్లను స్వయంగా సమీక్షించామన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, ఆర్‌డబ్ల్యుఎస్ తదితర శాఖల అధికారులతో సమన్వయంతో వ్యవహరిస్తూ, దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మహాశివరాత్రి రోజున 24గంటలూ భక్తులకు తాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు అన్నదానం చేసేందుకు దాతలు అందించే విరాళాలు, దేవాలయాల నిధులను వినియోగిస్తున్నట్టు చెప్పారు. భక్తులకు ఉచితంగా ప్రసాదం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. పిఠాపురంలోని పాదగయలో పుణ్యస్నానాలు చేసే భక్తులకు ప్రమాదాలకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. పాదగయతో పాటు గోదావరిలో పుణ్యస్నానాలుచేసే భక్తులు ప్రమాదాలు గురికాకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటుచేసినట్టు ఏసి రమేష్‌బాబు చెప్పారు. తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం వరకు మైకుల్లో ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తంచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోని శైవక్షేత్రాల్లోకి భక్తులు తడి బట్టలతో వస్తున్నారని, దీనివల్ల భక్తులు జారిపడే ప్రమాదాలు సంభివిస్తున్నాయన్నారు. దీనిని సాధ్యమైనంత వరకు నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, భక్తులు ఈ సమస్యను గుర్తించి తడి బట్టలతో ఆలయంలోకి రాకుండా సహకరించాలని రమేష్‌బాబు కోరారు.

నేడు డిఆర్‌సి సమావేశం
-హాజరుకానున్న ఇన్‌ఛార్జి మంత్రి సబిత
కాకినాడ సిటీ, మార్చి 8: జిల్లా సమీక్ష కమిటీ(డిఆర్‌సి) సమావేశం శనివారం కలెక్టరేట్ ఆవరణలోని విధాన గౌతమీ సమావేశ మందిరంలో జరగనుంది. ఈ సమావేశానికి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హాజరుకానున్నారు. సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు విధాన గౌతమీ సమావేశ మందిరంలో నిర్వహించడానికి కలెక్టర్ నీతూప్రసాద్ తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశంలో జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు అమలు, సంక్షేమ పధకాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు సాగు నీటి సరఫరా, ఎరువుల పంపిణీ, విద్యుత్ కోతలు తదితర ప్రధాన అంశాలపై ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో అధికార యంత్రాంగం ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పి కొట్టేందుకు అవసరమైన సమాచారాన్ని ఇప్పటికే సన్నద్ధం చేస్తున్నారు. వాడివేడిగా ఈ సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నేటి నుండి వస్తవ్య్రాపారుల నిరవధిక బంద్
రాజమండ్రి, మార్చి 8: వస్త్రాలపై వ్యాట్ విధించటంతో పాటు సెన్సిటివ్ కమొడిటీస్ చట్టం పరిధిలోకి వస్త్రాలను తీసుకురావటాన్ని వ్యతిరేకిస్తూ వస్తవ్య్రాపారులు శనివారం నుండి తమ దుకాణాలను నిరవధికంగా బంద్ చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ టెక్స్‌టైల్స్ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా వస్తవ్య్రాపారుల సమాఖ్య ఆధ్వర్యంలో నిరవధిక బంద్‌కు అన్ని ఏర్పాట్లు జరిగాయి. జిల్లాలోని సుమారు ఆరువేల వస్తద్రుకాణాలు పాల్గొంటాయని, రెడీమేడ్ వస్తవ్య్రాపారులు కూడా బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించారని జిల్లా వస్తవ్య్రాపారుల సమాఖ్య కన్వీనర్ పోకల సీతయ్య చెప్పారు. వస్తవ్య్రాపారులతో పాటు, దుకాణాల్లో పనిచేసే గుమాస్తాలు, ఇతర సిబ్బంది కలిపి సుమారు 20వేల మంది బంద్‌లో పాల్గొననున్నారు.

నాణ్యతాలోపాన్ని సహించేది లేదు
పేదల గృహ నిర్మాణాలపై కలెక్టర్ నీతూప్రసాద్
కాట్రేనికోన, మార్చి 8: పేదలకు పక్కాగృహాల నిర్మాణంలో నాణ్యతాలోపం, జాప్యాన్ని సహించేదిలేదని జిల్లా కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్ హెచ్చరించారు. గత ఏడాది అగ్నిప్రమాదంలో సర్వంకోల్పోయిన పల్లం గ్రామంలో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా పక్కాగృహ నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. సకాలంలో గృహాలు నిర్మించకుండా జాప్యం చేయడంపై ఆమె హౌసింగ్ అధికారులపై మండిపడ్డారు. మత్స్యకార మహిళలు తమకు సకాలంలో ఇళ్లు నిర్మించి ఆశ్రయం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. తాము స్వయంగా ఇళ్ళు నిర్మించుకోలేమని, కాంట్రాక్టర్ల ద్వారా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని వారు కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ గృహాలు ఎవరికి వారే స్వయంగా నిర్మించుకోవాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను తాము సమర్ధించేది లేదన్నారు. హౌసింగ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులు కమిటీలు ఏర్పాటుచేసి స్థానిక అధికారుల పర్యవేక్షణలోనే పక్కాగృహాలను రెండు మూడు నెలల్లో నిర్మించి ఇస్తామని కలెక్టర్ హామీనిచ్చారు. ఒక్కో పక్కాగృహానికి రూ 68 వేలు ప్రభుత్వ ఆర్ధికసాయంతో పాటు చమురు సంస్థలు అందించే రూ 47 వేల సాయంతో నిర్మిస్తామని కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్ వెల్లడించారు. గ్రామంలో ఇళ్ళ నిర్మాణానికి స్థలం లేకుంటే బయట ఒక్కొక్కరికి సెంటున్నర స్థలాన్ని కేటాయించి అందులో గృహాలు నిర్మిస్తామన్నారు. స్థానికంగా మంచినీటి సమస్య తీర్చేందుకు, రోడ్లు నిర్మాణానికి నిధులు ఇస్తామని కలెక్టర్‌కు మత్స్యకారులకు హామీనిచ్చారు. కలెక్టర్ వెంట అమలాపురం ఆర్డీవో సంపత్ కుమార్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్, హౌసింగ్ పిడి సత్యనారాయణమూర్తి, ట్రైనీ కలెక్టర్ శే్వత మహంతీ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ఆర్ గోవిందరాజు, హౌసింగ్ డిఇ రవీంద్ర, ప్రత్యేకాధికారులు, నాయకులు పాల్గొన్నారు.

జిల్లా గ్రంథాలయ సంస్థకు 13.28 కోట్ల బడ్జెట్
అధ్యక్షుడు ప్రసాదరాజు
కాకినాడ సిటీ, మార్చి 8: జిల్లా గ్రంధాలయ సంస్థకు 2013-14 సంవత్సరానికి 13.28 కోట్ల రూపాయల బడ్జెట్‌ను అమోదించినట్లు సంస్ధ అధ్యక్షులు బైర్రాజు ప్రసాదరాజు తెలిపారు. జిల్లా కేంద్ర గ్రంధాలయం ఆవరణలో శుక్రవారం సంస్థ బడ్జెట్ సర్వ సభ్య సమావేశం ప్రసాదరాజు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఈ ఆర్ధిక సంవత్సరానికి 13. 28 కోట్ల రూపాయల బడ్జెట్ అంచనాలను సభ్యులు ఏకగ్రీవంగా అమోదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే వివిధ గ్రాంటులు, గ్రంధాలయ సంస్థకు వివిధ మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లు, పంచాయితీల నుండి రావాల్సిన గ్రంథాలయ పన్ను బకాయిలను పరిగణలోనికి తీసుకుని రానున్న ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలను రూపొందించామన్నారు. జిల్లాలో ఇప్పటికే 30 శాఖా గ్రంధాలయాలకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. అదే విధంగా ప్రజల నుండి వచ్చిన విజ్ఞాపనలను పరిగణలోకి తీసుకుని గ్రంధాలయాలకు దూరంగా ఉన్న చోట్ల జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 150 పుస్తక నిక్షిప్త కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రసాదరాజు పేర్కొన్నారు. జిల్లాలో వంద శాఖా గ్రంథాలయాలు, 48 గ్రామీణ గ్రంధాలయాలు ఉన్నాయని వాటన్నింటినీ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో నూతన భవనాలను నిర్మించేందుకు రానున్న బడ్జెట్‌లో 40 లక్షల రూపాయలను కేటాయించినట్లు ఆయన ప్రకటించారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లు, పంచాయితీల నుండి జిల్లా గ్రంధాల సంస్ధకు సుమారు 12 కోట్ల రూపాయల వరకు గ్రంధాలయ సెస్సు బకాయిలు వసూలు కావాల్సి ఉందని తెలిపారు. జిల్లా గ్రంధాలయ సంస్ధ సభ్యురాలు డాక్టర్ పి చిరంజీవినీకుమారి మాట్లాడుతూ తెలుగు భాషా పరిరక్షణలో ప్రజలందరిపై బాధ్యత ఉందన్నారు. దీని కోసం జిల్లా గ్రంధాలయ సంస్థ తెలుగు భాషపై ప్రత్యేక సదస్సును నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో సంస్థ సభ్యులు పి హనుమంతరావు, దాకే బాలకృష్ణంరాజు, ఎన్ మోహన్‌కుమార్, సంస్ధ కార్యదర్శి ఎన్ సక్కుబాయి, డిపిఆర్‌ఓ రామాంజనేయులు, వయోజన విద్యా శాఖ డిడి పి లక్ష్మీబాయి, విద్యాశాఖ, పంచాయితీ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

గిరిజన యువకుడికి తుపాకీ తూటా గాయం
కాకినాడ సిటీ, మార్చి 8: తుపాకీ తూటా తగిలి ఓ గిరిజన యువకుడు గాయపడి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలావున్నాయి....ఏజెన్సీ ప్రాంతం గంగవరం మండలం వేములోవ గ్రామానికి చెందిన మిర్తివాడ పరిమిరెడ్డి(24) అనే యువకుడు శివరాత్రి కావడంతో తమ ఇంటి మిద్దెను శుభ్రం చేస్తుండగా పురాతన నాటు తుపాకీ లభించింది. ఆ తుపాకీని మిద్దె నుండి కిందకు దించి శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా తూటా తగలడంతో గాయపడ్డాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం జరగగా, విషయం వెలుగులోకి వస్తే ప్రమాదం అని భావించి బాధితుడికి కుటుంబసభ్యులు చికిత్స అందజేయలేదు. అయితే శుక్రవారం గాయపడిన పరిమిరెడ్డి పరిస్థితి విషమించడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాసుపత్రికి శుక్రవారం సాయంత్రం తరలించారు. బాధితుడికి శస్త్ర చికిత్స చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. గంగవరం పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.

భర్త చేతిలో భార్య హతం!
రాజమండ్రి, మార్చి 8: రాజమండ్రిలో ఒక మహిళ భర్త చేతిలో దారుణ హత్యకు గురయ్యింది. శుక్రవారం రాత్రి తుమ్మలావ అడ్డవీధిలో ఈఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం గొలగాని నాగలక్ష్మి(30), శ్రీనివాస్ దంపతులకు నవ్యశ్రీ, కేశవ్ అనే ఇద్దరు పిల్లలున్నారు. పెయింటర్‌గా పనిచేసే శ్రీనివాస్ తరుచూ మద్యం సేవించి వచ్చి భార్యతో గొడవపడేవాడు. శుక్రవారం రాత్రి కూడా మద్యం సేవించి వచ్చిన శ్రీనివాస్ భోజనం వద్ద భార్య నాగలక్ష్మితో గొడవకు దిగాడు. ఆగ్రహంతో కత్తితో భార్యను ఇష్టానుసారం నరికివేశాడు. ఈసంఘటనలో నాగలక్ష్మి అక్కడికక్కడే మరణించింది. అనంతరం శ్రీనివాస్ కత్తితో పరారయ్యాడు. తల్లి మరణించడం, తండ్రి పరారు కావడంతో పిల్లలు దిక్కులేని వారిగా మిగిలారు. సంఘటనా స్థలాన్ని సెంట్రల్‌జోన్ డిఎస్పీ నామగిరి బాబ్జి, సిఐలు ఎస్ మురళీమోహన్, మధుసూదనరెడ్డి, ఎస్‌ఐలు పరమేష్ సందర్శించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. భార్యను హత్య చేసిన శ్రీనివాస్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు డిఎస్పీ తెలిపారు.

భీమేశ్వరాలయంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు
సామర్లకోట, మార్చి 8: మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా ఎస్‌పి శివశంకరరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం సామర్లకోట పంచారామక్షేత్రం చాళుక్య కుమారరామ భీమేశ్వరాలయంలో కాకినాడ నుండి విచ్చేసిన బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. పెద్దాపురం సిఐ పిట్టా సోమశేఖర్ ఆధ్వర్యంలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు గర్భగుడి, పూలకుండీలు, ఆలయ ఆవరణ, కోనేరు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో స్థానిక ఎస్‌ఐలు ఎండిఎంఆర్ ఆలీఖాన్, ఎస్‌ఎం రహీమ్‌తుల్లా, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఎవివి వర్మ, డి కృష్ణ, బివి గిరి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు
english title: 
shiv rathri

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>