ఏలూరు, మార్చి 8: రాజకీయంగా చోటుచేసుకునే పరిణామాలు ఎలాఉన్నా, జనం ఉత్తేజితమవటం సంగతి పక్కన పెట్టినా చంద్రబాబు వస్తున్నా...మీ కోసం పాదయాత్రపై పార్టీ శ్రేణులే భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఆ పార్టీ నేతలు అధికారానికి దూరమై దాదాపు దశాబ్దానికి చేరువవుతున్న తరుణంలో చంద్రబాబు పాదయాత్ర పార్టీకి టానిక్‌లా మారుతుందనే అభిప్రాయంలో ఉన్నారు. దీంతో రాజకీయంగా జాతకం మారిపోయి బాబు వస్తే...రాజకీయ జాబు వచ్చేస్తుందన్న నమ్మకంలో పార్టీ నాయకత్వం గట్టిగానే ఉంది. ఈనేపధ్యంలోనే శనివారం నుంచి జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు పాదయాత్ర అంగరంగవైభవంగా ప్రారంభం కానుంది. ఆకివీడు మండలం ఉప్పుటేరు వంతెన వద్ద చంద్రబాబు కృష్ణాజిల్లాలో పాదయాత్ర ముగించుకుని పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారు. దాదాపుగా శనివారం సాయంత్ర సమయంలో బాబు జిల్లాకు చేరుకుంటారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. దీంతో చంద్రబాబుకు అనూహ్యమైన రీతిలో స్వాగత సత్కారాలు అందించేందుకు పార్టీ శ్రేణులన్నీ సిద్ధమైపోయాయి. నాయకులు కూడా దాదాపు బలప్రదర్శన రీతిలోనే ప్రజలను భారీగా తరలిస్తూ చంద్రబాబు దృష్టిలో పడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు ఏర్పాట్లను పరిశీలిస్తే అర్ధమవుతుంది. రానున్న రోజుల్లో వైఎస్సార్‌సిపి అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్ర జిల్లాకు రానున్న నేపధ్యంలో చంద్రబాబు పాదయాత్రను ముందుగానే భారీగా విజయవంతం చేయాలన్న పట్టుదలతో పార్టీ నాయకులు ఉన్నట్లు కన్పిస్తోంది. ప్రధానంగా డెల్టా పరిధిలోనే చంద్రబాబు పాదయాత్ర సాగుతున్న పరిస్దితుల్లో మెట్ట ప్రాంత నాయకత్వం కూడా భారీగా ఆ ప్రాంతానికి తరలివెళ్లి తమ బలాబలాలను అధినేత ముందు ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం శనివారంనాటి స్వాగత కార్యక్రమాన్ని ప్రధాన వేదికగా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు చంద్రబాబు పాదయాత్రల సందర్భంగా నాయకులతో ఆంతరంగిక భేటీలు కొనసాగుతున్న పరిస్ధితుల్లో ఆ సందర్భంగానే తమ సమస్యలను చెప్పుకోవటంతోపాటు భవిష్యత్ అవకాశాలను కూడా బలపర్చుకునేందుకు వీటిని వేదికగా మార్చుకోవాలని కొందరు నాయకులు వ్యూహాలు పన్నుతున్నారు. ఏదీఏమైనా చంద్రబాబు పాదయాత్ర ద్వారా పూర్తిస్ధాయి మైలేజ్ సాధించటమే కాకుండా ఆ ఊపును ఎన్నికల వరకూ కొనసాగించాలన్న ఉద్దేశ్యంలోనే పార్టీ నాయకత్వం కన్పిస్తోంది. అయితే పార్టీ బాధ్యుల్లో మాత్రం కొంత ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. వరుసగా అపజయాలను మూటకట్టుకుంటూ అధికారపార్టీకి చాలాసార్లు కనీసపోటీ ఇవ్వలేని స్ధితికి చేరిపోవటమే కాకుండా ఒకదశలో వైఎస్సార్‌సిపికి ప్రత్యామ్నాయంగా కూడా నిలవగలుగుతుందా అన్న అనుమానాలకు దారితీస్తున్న జిల్లా రాజకీయాలను అధినేత సీరియస్‌గానే పరిగణనలోకి తీసుకున్నట్లే ఇంతకుముందే సంకేతాలు వెలువడ్డాయి. జిల్లా టిడిపి నేతలు అధినేతను కలిసిన సందర్భాల్లో గత వైభవం ఏదీ అంటూ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈకారణంగానే జిల్లాకు వచ్చిన సమయంలో పూర్తిస్దాయి సమీక్షలు నిర్వహిస్తానని కూడా చంద్రబాబు స్పష్టంగా చెప్పటంతో ఆ సమయంలో దేనికి ఏవిధమైన సమాదానం ఇవ్వాలన్న విషయంలో పార్టీ నేతలు దాదాపు తలలు పట్టుకున్నట్లే కన్పిస్తోంది. బహిరంగ ప్రకటనలు ఉన్నంత గంభీరంగా ఈ సమీక్షలు ఉండవని ఇప్పటికే ఇతర జిల్లాల పరిస్దితి చూస్తే అర్ధమవుతుంది. అందువల్ల రానున్నకాలంలో పార్టీ బలోపేతానికి అన్నివిధాలా సిద్ధమయ్యామన్న విధంగా నాయకత్వం అధినేత ముందు బలాన్ని ప్రదర్శించలేకపోతే కొంత ఇబ్బందేనన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏదీఏమైనా చంద్రబాబు పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి జిల్లాలో అధికారం దిశగా మంత్రదండాన్ని అందిస్తుందన్న నమ్మకంతోనే పార్టీ నాయకత్వం ఉంది. అయితే పాదయాత్ర ఏవిధంగా సాగుతుంది, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందన్న చర్చ మాత్రం అప్పుడే ప్రారంభం కావటం విశేషం.
*నేటినుంచి చంద్రబాబు వస్తున్నా...మీ కోసం *ఉప్పుటేరు వద్ద జిల్లాలో ప్రవేశం*పార్టీ నేతల్లో ఉత్సాహ తరంగాలు
english title:
babu
Date:
Saturday, March 9, 2013