ఏలూరు, మార్చి 8 : మహిళలపై దాడులు చేసే వారిని అరబ్బు దేశాల్లో మాదిరిగా కఠినంగా శిక్షించే చట్టాలు వచ్చినప్పుడే స్ర్తిలకు సమాజంలో సరైన రక్షణ ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ చెప్పారు. స్థానిక సెయింట్ ఆన్స్ డిగ్రీ కళాశాలలో మహిళా శిశు సంక్షేమ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు పూర్తి భద్రత కల్పించేందుకు ప్రభుత్వాలు మంచి చట్టాలు తీసుకువచ్చాయని, ప్రస్తుత పరిస్థితులను బట్టి వాటిలో కొన్ని సవరణలు తీసుకువచ్చి దోషులకు కఠినతరమైన శిక్షలు తీసుకురావాలని అన్నారు. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో సైతం మహిళలు ఎన్నో సమస్యలను చవిచూస్తున్నారన్నారు. ప్రపంచం ఎంతో నాగరికత సాధించినప్పటికీ ఇంకా మహిళల పట్ల వివక్షత కొనసాగడం విచారకరమన్నారు. కేవలం పది రూపాయల కోసం కూడా పిల్లలను అమ్మే పరిస్థితి చూస్తున్నామన్నారు. గర్భంలో ఉండగానే పిల్లలను అమ్మే నీచసంస్కృతి సమాజంలో కనపడుతోందన్నారు. ఇటువంటి సంఘటనలను పూర్తి స్థాయిలో నిరోధించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు పరిష్కారానికి సామాజిక పరిష్కార కమిటీలు ఏర్పాటయ్యాయన్నారు. ఈ విషయంలో రాష్ట్రంలో 40 వేల కేసులు పరిష్కరించబడగా పశ్చిమగోదావరి జిల్లాలో 5 వేల కేసులు పరిష్కరింపబడ్డాయన్నారు. జిల్లా ఎస్‌పి ఎం రమేష్ మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి స్ర్తిని గౌరవించవలసిన బాధ్యత పురుషుడిపై వుందన్నారు. జిల్లాలో నూటికి 40 శాతం సమస్యలు మహిళలపై రికార్డు అవుతున్నాయని ఎక్కువ సమస్యలు మహిలలపై రాకుండా పోలీసు యంత్రాంగం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. మహిళలను విద్యావంతులను చేస్తే కుటుంబం మొత్తం విద్యావంతులు అవుతారని ఆయన అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లక్ష్మీశారద మాట్లాడుతూ మహిళల రక్షణకు చట్టాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చట్టంలో ఉన్న విషయాలను అవగాహన చేసుకుని మహిళలు జీవితంలో రాణించాలని అన్నారు. విద్యాభివృద్ధిని సాధించి ప్రతీ మహిళ ఉన్నతస్థాయికి ఎదగాలని చెప్పారు. ఆశ్రం ఆసుపత్రి స్ర్తిల వైద్య నిపుణురాలు డాక్టర్ వందన మాట్లాడుతూ సమాజంలో స్ర్తిలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని స్ర్తిలకు బ్రస్ట్ కేన్సర్ రాకుండా ఆశ్రం ఆసుపత్రిలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నదని, ప్రతీ స్ర్తి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వరూపరాణి తదితరులు ప్రసంగించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ వివిధ శాఖల్లో విశేష కృషి చేసిన మహిళా ఉద్యోగిణిలను సత్కరించారు. స్వాతంత్య్ర సమరయోధురాలు జి రంగమ్మను కలెక్టర్, ఎస్‌పి సన్మానించారు. కె శ్రీలక్ష్మి సీనియర్ అసిస్టెంట్, కలెక్టరేట్, వి జెస్సీ సీనియర్ అసిస్టెంట్, డ్వామా కార్యాలయం, ఏ అనంతలక్ష్మి ఆఫీస్ సబార్డినేట్, డి ఆర్‌వో కార్యాలయం, మున్సిపల్ సిబ్బంది కె మధుమతి, కె లక్ష్మి, ఎం దుర్గ, వి దేవి, శనివారపుపేటలో పండ్ల వ్యాపారం చేసుకునే మేకా కనకదుర్గ, అమీనాపేటలో కొబ్బరిబొండాలు వ్యాపారం చేసుకునే ఈడు సామ్రాజ్యంలను కలెక్టర్ దుశ్శాలువాలతో సత్కరించి బహుమతులు ప్రదానం చేశారు. తొలుత రవీంధ్రభారతి పబ్లిక్ స్కూలు, బాలబాలికలు శాస్ర్తియ నృత్య ప్రదర్శన చేసి అందరినీ అలరించారు. కార్యక్రమంలో ఐసిడి ఎస్ ఆర్‌జెడి కె రాఘవరావు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ పిడి వసంతబాల, డి ఆర్‌డి ఎ పిడి వై రామకృష్ణ, డి ఎస్‌పి రజనీ, మెప్మా పిడి శేషారెడ్డి, డిసిహెచ్ ఎస్ డాక్టర్ కృష్ణప్రసాద్, సెయింట్ ఆన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ మెర్సీ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ డివి సుదర్శిని, స్ర్తినిధి బ్యాంకు ఛైర్మన్ జీవమణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమాజంలో స్ర్తిలను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించే విధానం, దాన్ని ఎలా ఎదుర్కోవాలని అనే అంశంపై సాంఘిక నాటికను ప్రదర్శించారు.
కలెక్టర్ వాణీమోహన్
english title:
womens' protection
Date:
Saturday, March 9, 2013