పెనుబల్లి, మార్చి 9: ఏప్రిల్ చివరి వారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు, జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపుతామని రాష్ట్ర ఉద్యానవన శాఖామంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం విఎంబంజర్‌లోని వంకాయలపాటి వెంకటేశ్వరరావు నివాసగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ చివరి వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఇందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండవన్నారు. ఇందుకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయిందన్నారు. కొత్తగా ఎన్నిక కాబోయే సర్పంచ్‌లకు విస్తృత అధికారాలు కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. పంచాయతీ పరిధిలో జరిగే సమావేశాలు సర్పంచ్ అధ్యక్షతనే నిర్వహించే విధంగా నిబంధన ఏర్పాటు చేశామన్నారు. సర్పంచ్, ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చూపుతామన్నారు. మంచి వ్యక్తులనే సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన కో ఆపరేటివ్ ఎన్నికల్లో ఖమ్మం, గుంటూరు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ గెలిచిందన్నారు. 1983నుంచి ఖమ్మం డిసిసిబి తెలుగుదేశం పార్టీకే వస్తోందన్నారు. జరిగిన డిసిసిబి ఎన్నికల్లో తమ పార్టీ నాయకులు అనుకున్నంత మేరకు పని చేయలేదని, దీంతో పార్టీకి విజయం దక్కలేదన్నారు. ఖమ్మం డిసిసిబి చైర్మన్ ఓ పెద్ద కాంట్రాక్టరని, లక్షల రూపాయలు గుమ్మరించి డిసిసిబిని దక్కించుకున్నారని మంత్రి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి మాస్ ఓటింగ్ అధికంగా ఉంటుందని, దానికి స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2004లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పార్టీలకు, కులాలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు నిర్వహించామన్నారు. ఫామాయిల్ ధర పడిపోవటంతో సత్తుపల్లి, అశ్వారావుపేట మండాల రైతులతో పాటు పశ్చిమ, తూర్పు గోదావరిల జిల్లాలకు చెందిన రైతులందరిని తీసుకొని సిఎంతో సమావేశమయ్యామని, గతంలో మాదిరిగానే పామాయిల్ ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి అదనంగా 2వేల ఇళ్ళు మంజూరు చేసినట్లు మంత్రి రాంరెడ్డి తెలిపారు.
పోస్టుల భర్తీకి కేబినెట్ నిర్ణయం
ఉద్యానవనశాఖలో 146 ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఉద్యోగాల భర్తీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. హెచ్‌ఓలు, ఎడి పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో వంగా గిరిజాపతిరావు, బుక్కా రామకృష్ణవేణి, చెక్కిలాల మోహన్‌రావు, వంగా దామోధర్, ఇనుగంటి పట్ట్భారామారావు, చెలికాని నీలాద్రిబాబు తదితరులు పాల్గొన్నారు.
* డిసిసిబి చైర్మన్ ఓ పెద్ద కాంట్రాక్టర్ * హార్టికల్చర్ ఉద్యోగాలు భర్తీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి
english title:
s
Date:
Sunday, March 10, 2013