మధిర, మార్చి 9: మధిర నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని డెప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శనివారం మధిర పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద శాసనసభ్యుల నిధులు 3లక్షల వ్యయంతో నిర్మించనున్న కల్వర్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మండల పరిధిలోని వంగవీడు గ్రామంలో 1.18కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అదే విధంగా ఆ గ్రామంలోని పాఠశాలలో 10లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షల మేరకు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా జాలిముడి ప్రాజెక్టు నిర్మాణం ద్వారా మధిర, బోనకల్ మండలాల్లోని అన్ని గ్రామాలకు సాగు, తాగునీటిని సమృద్ధిగా అందుతుందన్నారు. కార్యక్రమంలో ఐబి, పిఆర్‌డిఏలు సురేష్, కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, ఏ శ్రీనివాసరావు, ఉషారాణి, కాంగ్రెస్ నాయకులు మేళ శ్రీనివాస్ యాదవ్, రంగా హన్మంతరావు, సత్యంబాబు తదితరులు పాల్గొన్నారు.
పత్తి ధరకు రెక్కలు
ఖమ్మం(గాంధీచౌక్), మార్చి 9: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి క్వింటా గరిష్టంగా 4,610రూపాయలకు పెరగటంతో తెల్లబంగారం ధరకు రెక్కలొచ్చాయి. పత్తి ధర పెరుగుతుండటంతో ఇంత వరకు మార్కెట్‌లో అమ్ముకోని రైతులు ఆనందం వ్యక్తంచేశారు. గతంలో తక్కువ ధరకు అమ్ముకున్న రైతులు నిరాశ చెందుతున్నారు. 3వేల నుంచి 4,610రూపాయలకు పెరగటంపై రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సీజన్ చివరి దశలో పత్తి మార్కెట్‌కు 3వేల బస్తాల నుంచి 4వేల బస్తాలు వస్తున్నాయి. వ్యాపారులు ముందుగానే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి పత్తిని మార్కెట్‌కు తరలించి సిసిఐ ద్వారా అధిక ధరకు అమ్ముకుంటూ విక్రయిస్తూ సొమ్ము చేసుకోవటం బహిరంగ రహస్యం.