చిత్తూరు, మార్చి 9: అవినీతిని అంతం చేయడం, కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి, జిల్లా పరిశీలకులు కోడెల శివప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం తెలుగుదేశంపార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లె శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాలు అయిన వెంటనే, స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు పార్లమెంటు, శాసన సభ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం యుపిఏ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయిందని, 2జీస్పెక్ట్రమ్ కుంభకోణం, ఒలంపిక్స్ క్రీడలు, హౌసింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని అవినీతి, అక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడిందన్నారు. రాష్ట్రం నుండి కేంద్రానికి 33మంది ఎంపిలను పంపినా వారు ఒరగబెడుతున్నది ఏమీలేదన్నారు. రాష్ట్రంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏలాంటి ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం పేరుకేనని, ఆయన సొంత జిల్లా చిత్తూరును కూడా అభివృద్ధి చేసుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు. ఇక జగన్ పిల్ల కాంగ్రెస్ అని, ఇవి రెండు కలసిపోవడం ఖాయమన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడడం, కాంగ్రెస్ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజలకు న్యాయం జరిగేలా చూడటమే టిడిపి ప్రధాన ధ్వేయమన్నారు. వైఎస్‌ఆర్‌సిపి అరాచకపార్టీ అని, జగన్ తాత రాజారెడ్డి నుండి అందరు ప్యాక్షనిస్టులే అన్నారు. ఇక కెసిఆర్ విషయానికొస్తే ఆయనకు ప్రత్యేక తెలంగాణా రావడం ఏమాత్రం ఇష్టంలేదన్నారు. పది రోజులు పామ్‌హౌస్‌లో ఉండి ఒక రోజు జనం మధ్యలోకి వచ్చి ప్రభుత్వాన్ని తిట్టివెళ్తున్నారు తప్ప ఆయన ఒరగబెడుతున్నదేమిటని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు గత 166 రోజులుగా ప్రజాసమస్యలు తెలుసుకొనేందుకు పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఆయన పాదయాత్రతో ఎంతోమంది ప్రజలు టిడిపి వైపు మొగ్గుచూపుతున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధంచాలంటే ప్రతి ఒక్కరిని కలుపుకుపోవాలన్నారు. చంద్రబాబునాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరుకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నారు. చిత్తూరు ఎంపి డాక్టర్ ఎన్.శివప్రసాద్ మాట్లాడుతూ అక్షరం ముక్క రాని బొత్స సత్యనారాయణ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నారా లోకేష్‌బాబు ఒక బుల్లెట్, విల్లు, రాకెట్ స్పీడ్‌లో ఉన్నారన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పాదయాత్ర పార్టీకి మంచి ఊపును తీసుకొచ్చిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరు కలసి కట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశానికి అధ్యక్షత వహించిన టిడిపి జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండడంవల్లే 18సింగిల్ విండో అధ్యక్ష పదవులను కైవసం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో సత్యవేడు ఎల్మెల్యే హేమలత, మాజీ ఎమ్మెల్యేలు ఎల్.లలితకుమారి, ఆర్.గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి గౌనివారి శ్రీనివాసులు, కార్యాలయ కార్యదర్శి ఎన్.మోహన్‌రాజ్, నాయకులు దొరబాబు, శ్రీ్ధర్‌వర్మ, డిష్‌సురేష్, పుష్పావతి, పర్వీన్‌తాజ్, విల్వనాధం పాల్గొన్నారు.
* మాజీ మంత్రి కోడెల స్పష్టం
english title:
a
Date:
Sunday, March 10, 2013