కుప్పం, మార్చి 9: రాష్ట్రంలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ త్వరలోనే ఒక్కటవుతాయని నారా లోకేష్ జోష్యం చెప్పారు. కుప్పంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజైన శనివారం ఉదయం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహం నుంచి శెట్టిపల్లె, ఏడవమైలు, తుమ్మిసి, శాంతీపురం, రామకుప్పం, కల్క్భిగవాన్ ఆశ్రమం, కొంగనపల్లె, కొంగాటంలలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఒక్కటి అవుతాయని వాటిపట్ల ఎవరైనా ఆకర్షితులై ఉంటే వారు మోసపోవడం ఖాయమని స్పష్టం చేశారు. జైలులో ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్రంలో ఉన్న యువత గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. త్వరలోనే కుప్పం నియోజకవర్గంలో సోలార్ వాటర్ పంపిణీ సిస్టమ్‌ను మొట్టమొదటి సారిగా ప్రయోగాత్మకంగా చేపట్టనున్నామని అన్నారు. దీన్ని స్పూర్తిగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సోలార్ వాటర్ పంపిణీ సిస్టమ్‌ను అందచేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డ తీవ్ర నీటి ఎద్దడితోపాటు విద్యుత్ కోత కారణంగా పరిశ్రమలు ఏవీ రావడం లేదని, దీనికి తోడు ఎవరైనా పారిశ్రామిక వేత్తలు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే ఎవరికి ఎంత వాటా ఇవ్వాలన్న మంత్రుల మాటలకు భయపడి వెనుకడుగు వేస్తున్నారన్నారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలు పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామిక వేత్తలకు స్వాగతం పలుకుతున్నాయన్నారు. దీంతో రాష్ట్రంలో అవినీతితోపాటు నిరుద్యోగ సమస్య కూడా రోజురోజుకు పెరిగిపోతుందన్నారు. గత మూడు సంవత్సరాల్లో డ్రిప్ ఇరిగేషన్, గ్రీన్‌హౌస్ తదితర రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం చంద్రబాబునాయుడు 150కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారన్నారు. రైతుల గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి తన తండ్రేనని చెప్పారు. రాబోవు 12నెలలో కుప్పంలో పార్టీని బలోపేతం చేసేందుకు తాను కుప్పం వచ్చానని చెబుతూ ఈజిప్టు లాంటి పరిపాలన వచ్చేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్వచ్చమైన పరిపాలన, అర్ధరాత్రి మహిళలు తిరిగే అవకాశం కేవలం తెలుగుదేశంపార్టీ పరిపాలనలోనే ఉందని, రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 63 ఏళ్ల వయస్సులో తన తండ్రి పాదయాత్ర చేయడం ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి అని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం వచ్చిన వ్యక్తి కాంగ్రెస్‌పార్టీలో కలసిపోయాడని, అదే విధంగా రాష్ట్రాన్ని ఉద్దరిస్తామన్న ఓ వ్యక్తి పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే జైలుపాలయ్యారని విమర్శించారు. కల్కి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన యువకుల సమావేశంలో పలువురు గ్రామస్థులు రామకుప్పం మండల పరిధిలోని వీర్నమల గ్రామం నుంచి తమిళనాడు రాష్ట్ర సరిహద్దు వరకు ఉన్న గ్రామాలను ఏజెన్సీ ఏరియాగా ప్రకటించాలని నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఈ విషయాన్ని తనతండ్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈయన వెంట నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఇన్‌చార్జి పిఇఎస్ మునిరత్నం, చంద్రబాబునాయుడు వ్యక్తి కార్యదర్శి మనోహర్, సాంబశివం, సీతాపతి, శ్యామరాజు, కుమార్, చంద్రశేఖర్, గోపీనాథ్, వెంకటేశ్ ఉన్నారు.
అడుగడుగునా మహిళల నీరాజనాలు
నారా లోకేష్ మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజైన శుక్రవారం కుప్పం, గుడుపల్లె మండలాల్లో జరిగిన పర్యటనలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడాన్ని ఆయన గుర్తించారు. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందనన్న ముందు జాగ్రత్తతో ఇ.శ్రీనివాసులు శనివారం మొత్తం నారా లోకేష్ పర్యటన జయప్రదం చేసేందుకు శుక్రవారం రాత్రి నుంచే పలువురు కార్యకర్తలతో కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామ గ్రామాన నారా లోకేష్‌కు పలువురు మహిళలు హారతులు పట్టడమే కాకుండా నీరాజనాలు పలికారు. దీంతో ఒక్కసారిగా ఉప్పొంగిపోయిన నారాలోకేష్ రామకుప్పంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అక్కడే డప్పు వాయించారు. ఇదిలా ఉండగా కుప్పం నియోజకవర్గంలో యువతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సీనియర్లందరు నారాలోకేష్ పర్యటనకు దూరంగా ఉండడమే కాకుండా కనీసం మూడురోజులపాటు కుప్పంలో పర్యటిస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లకుండా మిన్నకుండిపోవడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. అదే విధంగా నారా లోకేష్ ప్రసంగం కూడా ప్రజలను ఆకట్టుకోలేకపోయిందని పార్టీ నాయకులే అక్కడక్కడ బహిరంగంగా విమర్శించుకోవడం కన్పించింది. అయితే ఆయన పర్యిటించిన పలు గ్రామాల్లో ఆయనతో ఫొటోలు దిగేందుకు జనం క్యూకట్టారు.
* యువత గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదు * నారా లోకేష్ ధ్వజం
english title:
t
Date:
Sunday, March 10, 2013