తిరుపతి,మార్చి 9: ప్రైవేటు కంపెనీలకు లాభాలను ఆర్జించిపెడుతూ అరకొర కరెంటు ఇస్తూ పేదలపై భారం మోపుతున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ శనివారం సిపిఐ ఎఐటియుసి ఆధ్వర్యంలో ఎస్‌పిడిసియల్ కార్పొరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్.వెంకయ్య, సిపిఐ సీనియర్ నాయకులు పాటూరి వెంకటరత్నం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ సర్కార్‌కు పేదల కష్టాలు పట్టడం లేదని ధ్వజమెత్తారు. ఒక వైపు కరెంటుకోతలు విధిస్తూ మరోవైపు పన్నులభారం మోపుతున్నారని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు లాభాలను గడించిపెట్టేందుకే పేదలపై కరెంటుచార్జీల భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 30వేల కోట్ల రూపాయలు కరెంటు చార్జీల రూపంలో దశలవారీగా ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. దీనిపై ప్రజలందరూ సంఘటితంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఎఐటియుసి జిల్లా నాయకులు హరికృష్ణ, సత్తార్ మాట్లాడుతూ 900 కోట్లు విద్యుత్‌చార్జీలు పెంచిన తెలుగుదేశం ప్రభుత్వం నేటికీ కోలుకోలేకుండా వుందన్నారు. 30వేల కోట్ల రూపాయల కరెంటుచార్జీ భారంమోపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక జీవితంలో కనిపించకుండా పోతుందని హెచ్చరించారు. వెంటనే పెంచిన విద్యుత్‌చార్జీలను తగ్గించకపోతే మరో బషీర్‌బాగ్ ఉద్యమాన్ని చవిచూడాల్సి వుంటుందని హెచ్చరించారు. విద్యుత్ ఉద్యమంలో కలిసివచ్చే పార్టీలతో పెద్దఎత్తున ఆందోళనలు చేయనున్నట్టు తెలిపారు. ఈ ముట్టడి కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య, ఎఐటియుసి నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.డి.రవి, పి.మురళి, కార్యవర్గ సభ్యులు కె.రాధాకృష్ణ, మాజీ ఎంపిటిసి లక్ష్మయ్య, ఎ.పి..ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రప్ప, మునీంద్ర, శరత్‌బాబు, తనికాచలం, సత్యవేలు, నాగరాజు, సుబ్రహ్మణ్యం, సారధి, గణేష్, విజయలక్ష్మి, రత్నమ్మ, సుశీల, మహాలక్ష్మి, జయమ్మ, ఆటో యూనియన్ నాయకులు మునస్వామి, చంద్రవౌళి, సాంబశివయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు
చంద్రగిరి, మార్చి 9: శ్రీనివాసమంగాపురంలో కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజావరోహణంతో వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో చివరిరోజున ఉదయం 9.30 నుంచి 10.40 గంటల వరకు పుష్కరిణి పక్కనున్న మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్దఎత్తున పాల్గొని పుణ్యస్నానాలాచరించారు. ఈ సందర్భంగా టిటిడి జెఇఓ వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగడానికి కృషిచేసిన అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ప్రతినిధులు కూడా తమకెంతో సహకరించారని ఆయన ప్రశంసించారు. కాగా సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు తిరుచ్చి ఉత్సవం కన్నులపండువగా నిర్వహించారు. 7.30 గంటల నుంచి 8.00 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహించారు. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.