గుంటూరు (కార్పొరేషన్), మార్చి 9: పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ సహాయ మంత్రి పురంధ్రీశ్వరి తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తన తండ్రి పేరున ఏర్పాటు చేసిన కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం స్థానిక లక్ష్మీపురంలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన పురంధేశ్వరి జ్యోతి ప్రజ్వలన చేసి ట్రస్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ సేవతో పాటు పేద ప్రజలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రజలకు అవసరమైన తాగునీటి సరఫరా, స్ర్తి సాధికారతే లక్ష్యంగా కుట్టు మిషన్, కంప్యూటర్‌లలో ఉచితంగా శిక్షణనిచ్చి ఉపాధి కల్పించేలా కృషి చేయడం అభినందనీయమన్నారు. వంద మందికి సేవ చేయలేకపోతే కనీసం ఒక్కరికైనా సేవ చేయి అనే మదర్‌థెరిస్సా స్ఫూర్తితో ఈ చారిటబుల్ ట్రస్ట్ పని చేయాలని ఆకాంక్షించారు. దేశంలో ఆర్థిక అసమానతలను తొలగించడం ప్రభుత్వాల వల్ల సాధ్యం కాదని, నీతి నిజాయితీలతో పనిచేసే చారిటబుల్ ట్రస్ట్‌లే కృషి చేయాలన్నారు. పేదరిక నిర్మూలన సామాజిక బాధ్యతగా స్వీకరించిన కన్నా లక్ష్మీనారాయణ ఆశయ సాధనకు ప్రజలంతా సహకరించాలన్నారు. ఆయన స్వయం కృషితో ఎదిగినప్పటికీ తండ్రిపై గౌరవంతో తన పేరును గానీ, భార్యాపిల్లల పేర్లను గానీ పెట్టకుండా తండ్రి కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ప్రారంభించడం ఆయన సంస్కారానికి నిదర్శనమన్నారు. ప్రజల మనిషిగా అనేక సమస్యలను రాజకీయంగా పరిష్కరించిన కన్నా ప్రభుత్వాలు చేయలేని ఇలాంటి కార్యక్రమాలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసేందుకు సంకల్పించడం హర్షదాయకమన్నారు. భారతదేశంపై అనేక సంస్కృతులు దాడిచేసినా చెరగని మన దేశ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్య త ప్రతిఒక్కరిపై ఉందన్నారు. స్కంధ పురాణంలో తెలిపినట్లు నాకు స్వర్గ, రాగభోగాలు అక్కర్లేదు గానీ, దుఖంలో ఉన్న కన్నీటిని తుడిచే శక్తినివ్వమని దేవుని ప్రార్థించినట్లు ప్రజల కన్నీటిని తుడిచేందుకు ఈ ట్రస్ట్ సహాయ పడాలని ఆకాంక్షించారు. కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తాను విద్యార్థి దశ నుండే రాజకీయంగానే కాక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నానని, పేద విద్యార్థుల చదువు కొనసాగింపు కోసం స్కాలర్‌షిప్‌లను అందజేస్తామని తెలిపారు. 25 సంవత్సరాలుగా ప్రజల ఆశీస్సులతో తాను ప్రజా సేవ చేస్తున్నట్లు తెలిపారు. మొట్టమొదటి సారిగా తనపై నమ్మకముంచి ఏ ఆశయంతో ప్రజలు నన్ను పెదకూరపాడు ఎమ్మెల్యేగా గెలిపించారో వారి ఆశలను నూరుశాతం నెరవేర్చానని తెలిపారు. అలాగే ఏ ఆశయం కోసం ఈ ట్రస్ట్‌ను ప్రారంభించానో ఆ ఆశయాలను తప్పక నెరవేరుస్తానని వాగ్దానం చేశారు. తన చివరి రక్తపు బొట్టు వరకు ప్రజాసేవ చేస్తానని, పేదలను ఆదుకుంటానని మంత్రి కన్నా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ బ్రోచర్‌ను ముఖ్య అతిథి పురంధేశ్వరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావు, ఎమ్మెల్యే మస్తాన్‌వలి, ఆప్కాబ్ చైర్మన్ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ సింగం బసవపున్నయ్య, నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ పి శ్రీనివాసులు, డిసి అబ్దుల్ లతీఫ్, ఎస్‌ఇ పి ఆదిశేషు, మాజీ ఎమ్మెల్యే జయరాంబాబు, పి వెంకటేశ్వర్లు, మాజీ మేయర్ కన్నా నాగరాజు, కన్నా ఫణీంద్ర, పారిశ్రామిక వేత్తలు కళ్లం హరనాధరెడ్డి, మాణిక్యవేల్ తదితరులు పాల్గొన్నారు.
మోపిదేవికి బెయిల్ ఇప్పించాలి
* కేంద్ర మంత్రి పనబాకకు పార్టీ నేతల విజ్ఞప్తి
నిజాంపట్నం, మార్చి 9: మాజీ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే మోపిదేవి వెంకటరమణారావుకు బెయిల్ మంజూరు చేయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం నిజాంపట్నం వచ్చిన కేంద్ర పెట్రోలియం శాఖ సహాయంమంత్రి పనబాక లక్ష్మికి విజ్ఞప్తి చేశారు. మోపిదేవి 35సంవత్సరాలుగా ఎంపిపిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈప్రాంత అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఆనాడు ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే మోపిదేవి పనిచేశాడని, అందుకు ఫలితంగా ఆయనను అన్యాయంగా కేసులో ఇరికించారన్నారు. మోపిదేవికి ఒక న్యాయం... మిగిలిన మంత్రులకు ఒక న్యాయంగా విభజించి అరెస్టు చేయించారని పార్టీ నేతలు మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రేపల్లె నియోజకవర్గంలో మోపిదేవి లేని కారణంగా అభివృద్ధి కుంటుపడిందని వివరించారు. మత్స్యకార ప్రతినిధిగా రాష్ట్రంలోని మత్స్యకారులు ఆవేదన చెందేలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని తెలిపారు. ఈసంవత్సరం ఖరీఫ్‌సాగులో సకాలంలో నీరు అందక ఇబ్బందులు పడ్డారని, పట్టించుకున్ను నాథుడులేరని వివరించారు. అనంతరం మంత్రి స్పందిస్తూ మోపిదేవి లేకపోవటం తనకు బాధగానే ఉందన్నారు. నియోజకవర్గానికి వచ్చేందుకు తన మనస్సు అంగీకరించటం లేదన్నారు. అందుకోసమే రావటంలేదని మంత్రి పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్పారు. అనంతరం మంత్రి పనబాక లక్ష్మి మాజీ మంత్రి మోపిదేవి తల్లి నాగులమ్మను పరామర్శించారు. మంత్రిని చూడగానే నాగులమ్మ తమ కుమారుడును విడుదల చేయించాలని విలపించింది. తన పరిధిలో సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపిపి ప్రసాదం వాసుదేవ,మోపిదేవి హరినాథ్‌బాబు,తహశీల్దార్ పి నాగేశ్వరావు, ఎంపిడిఓ మత్స్యబాబు,ఎఓ శిరాజుద్దీన్,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరి
english title:
a
Date:
Sunday, March 10, 2013