చంకన బిడ్డను పెట్టుకొని ఊరుఅంతా వెదికినట్లు జీవ వైవిధ్యం గురించి మనకు ఎవరు చెప్పనవసరం లేదు. జీవ వైవిధ్యం అనేది అనాదిగా మనం ఆచరిస్తూ వున్న భారతీయ జీవన విధానంలోనే ఉంది. ఇక్కడ మానవులనే కాదు సమస్త ప్రాణికోటి, చెట్టు చేమ అన్నింటిలో జీవాత్మను భారతీయులు దర్శిస్తారు. ఇక్కడ గంగా, యమునా, గోదావరి మొదలైనవి అన్ని నదులను పరమ పవిత్రంగా భావిస్తారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వేమ, మర్రి, తులసి మొదలైన చెట్లను సైతం పూజిస్తారు. గోవును గోమాతగా ఆరాధిస్తారు. పాముకు సైతం పాలుపోసి జీవకారుణ్యాన్ని భారతీయులు చాటుతారు. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లు పాశ్చాత్యులను గుడ్డిగా అనుకరించకుండా ఇప్పటికైనా భారతీయులు ఎందుకు మేల్కొని జీవ వైవిధ్యానికి మరోసారి పునరచకితం అవుదాం.
- చామంతి అనిల్, మిరుదొడ్డి
అల్‌ఖైదాకి గులాం అందామా!
అమెరికా మీద ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఆ దేశం తీసుకున్న చర్యల్ని, అఫ్జల్‌గురు ఉరిని మానవ హక్కుల సంఘం విమర్శించడం, నిరసనలు తెల్పడం సమంజసం కాదు. అమెరికా తీసుకున్న కఠిన చర్యలవల్లనే ‘ఆల్‌ఖైదా’ లాంటి ఉగ్రవాద మూకల అనాగరిక హత్యాకాండలు చాలావరకు కంట్రోల్ అయి తగ్గుముఖం పట్టాయి అన్నది యదార్థం కాదా! మానవ హక్కుల సంఘం చెప్పే ఆచరణ సాధ్యంకాని నీతులు పాటిస్తే మనం కాశ్మీర్‌ని కోల్పోవాల్సి వస్తుందేమో ఆలోచించాలి. ఏది ఏమైనా సిఐఏకి గులాం అనే వ్యాసంలో మోహన్‌గారు వ్రాసిన విషయాలు అద్దానికి ఒకవైపు చూపెట్టేవే. ఉగ్రవాదాన్ని అయితే అరికట్టడంలో కొందరు సామాన్య ప్రజలు హింసకు గురికాకుండా చూడటం కూడా ముఖ్యం.
- గూటూరు శ్రీహరిరావు, గంగవరం
తెలుగును నిర్వీర్యం చేసేది తల్లిదండ్రులే
తెలుగు భాషను మృత భాషగా చేస్తున్నది ముఖ్యంగా తల్లిదండ్రులు అన్నది నిజం. దీనికితోడు ప్రభుత్వ పాలకులు. ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని వ్యవహారాలు తెలుగులో జరపాలన్నది నామమాత్రంగా వున్నది. ఏ ఒక్క అధికారి ఈ విషయాన్ని పాటించడంలేదన్నది నగ్నసత్యం. ముఖ్యంగా తల్లి ఒడి ఒక విశ్వవిద్యాలయం అన్న ది మరువరాదు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ‘మమీ, డాడీ’ అనే నికృష్ట పదాలకు విలువ ఇస్తున్నారు. అమృత తుల్యమైన ‘అమ్మ, నాన్న, నాయనమ్మ’ అన్న పలుకులకు తిలోదకాలు ఇచ్చేశారు. ఆ పలుకుల్లోని తియ్యదనం తేనె కంటే ఎక్కువ. పర భాషను నేర్చుకొనుట తప్పుకాదు అన్ని భాషలు నేర్చుకోవాలి. కాని మాతృభాషను మరువరాదు. మనం అందరం చేస్తున్న పని ఇదే. అన్ని పాఠశాలల్లోను తెలుగు బోధనా భాషగా ఉండాలి. అప్పుడే సజీవంగా మన మాతృభాష ఉంటుంది.
- ఓలేటి నారాయణశాస్ర్తీ, కాకరపర్రు
పొరుగు దేశాల కుట్రలను తిప్పికొట్టాలి!
భారత్‌పై ద్వేషం పెంచుకొని, పైకి కపట ప్రేమతో స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి పొరుగు దేశాలు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను బయట ప్రపంచానికి చాటడానికి ప్రపంచ దేశాలు గుర్తించాలి. ముఖ్యంగా తమకు భారత్ అత్యంత మిత్రదేశమని చెప్పుకొనే అమెరికా, పాక్ కుట్రలను ఖండించాలి. ఇటీవల పూంచ్ సరిహద్దులు దాటి భారత్‌లో చొరబడి ఇద్దరు సైనికులను క్రూరంగా చంపి తల నరికి తీసికెళ్లడం క్షమించరాని విషయం. మన సైనికుల తలకు 5 లక్షల వెలగట్టి చంపించడం పరమ కిరాతకం. ఏవో నామమాత్ర నిరసనలకు భయపడే దేశం కాదు పాక్. చైనాతో రహస్య ఒప్పందంతో పాక్, భారతదేశాన్ని అస్థిరపర్చి, సరిహద్దు ప్రాంతాల్ని కబళించేందుకు కుట్రలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కేంద్రం పొరుగు దేశాల కుట్రలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలి.
- గర్నెపూడి వెంకట రత్నాకరరావు, వరంగల్
చంకన బిడ్డను పెట్టుకొని ఊరుఅంతా వెదికినట్లు జీవ వైవిధ్యం గురించి మనకు ఎవరు చెప్పనవసరం లేదు.
english title:
i
Date:
Monday, March 11, 2013